సంపాదకీయం
జిహాదీల ‘నీడ’లో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారి క్వామర్ జావీద్ బజవా పట్ల అక్కడి సైనిక దళాలలో వ్యతిరేకత పెరుగుతుండడం పెద్దగా ప్రచారం కాని పరిణామం. పదవీ కాలవ్యవధి ముగిసిన తరువాత మరో మూ డేళ్లు పదవిలో కొనసాగాలన్న బజవా వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ‘బెడిసికొట్టుడు’కు కారణం సైనిక దళాలలో బజవాకు తగ్గిపోయిన పలుకుబడి. ఇలా ‘పలుకుబడి’- సైనికుల మద్దతు- తగ్గిపోయిన కారణంగానే బజవాను మరో మూడేళ్లు సైనిక దళాల ప్రధాన అధికార పదవిలో నియమిస్తూ పాకిస్తాన్ పౌర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ‘సర్వోన్నత న్యాయస్థానం’ సవరించగలిగింది! కేవలం ఆరునెలలు మాత్రమే బజవా పదవీ కాలాన్ని పొడిగించాలన్నది నవంబరు 28వ తేదీన పాకిస్తాన్ ‘సర్వోన్నత న్యాయస్థానం’ చెప్పిన తీర్పు! పదవీకాలం ముగిసిన తరువాత సైనిక దళాల ప్రధాన అధికారిని మళ్లీ అదే పదవిలో నియమించాలంటే అందుకోసం కొత్త చట్టాన్ని రూపొందించాలని పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిందట. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం అదే పనిలో ఉందట. కొత్త చట్టాన్ని రూపొందించడానికి వీలుగా ముగ్గురు ఉన్నత అధికారులతో కూడిన ఉప సంఘాన్ని కూడ పాకిస్తాన్ ప్రభుత్వం నియమించిందట. ఇలా పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారికి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘న్యాయ యాచిక’ దాఖలుకావడమే గొప్ప ‘విప్లవ ఘటన..’. సర్వోన్నత న్యాయస్థానం సైనిక దళాల అధిపతికి లభించిన మూడేళ్ల పొడిగింపును ఆరునెలలకు పరిమితం చేయడం మరింత సాహసవంతమైన చర్య! పాకిస్తాన్ ‘పరిపాలన’ చరిత్ర తెలిసిన వారికి ఈ రెండు పరిణామాలు కూడ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటె పాకిస్తాన్‌లో ఏడు దశాబ్దులకు పైగా ‘సైనిక అధికారం’ పరమోన్నతమన్నది ఈ ‘పరిపాలన’ చరిత్ర. సైనిక దళాధిపతిని నిలదీయగల, నిరోధించగల, నియంత్రించగల ధైర్యం సర్యోన్నత న్యాయస్థానం వారికి ఎలా కలిగిందన్నది విస్మయ చకితులు అవుతున్నవారికి కలిగిన సందేహం! సైనిక దళాల అధినాయకత్వం అంగీరించిన వారు ప్రధానమంత్రి, దేశాధ్యక్షుడు వంటి పదవులను నిర్వహించడం సైనిక దళాల అధి నాయకత్వానికి నచ్చనివారు ఈ పదవులనుంచి తొలగిపోవడం, ఈ పదవులకు-ప్రజల మద్దతు ఉన్నప్పటికీ- ఎన్నిక కాలేకపోవడం పాకిస్తాన్‌లో నడుస్తున్న ‘పరిపాలన’ చరిత్ర! న్యాయస్థానాలు సైతం పాకిస్తాన్ సైనిక అధికారుల ‘అంతరంగ అభీష్టాల’కు అనుగుణంగా తీర్పులను ఇస్తుండడం కూడ నడుస్తున్న చరిత్ర. సైనిక దళాలకు నచ్చిన నవాజ్ షరీఫ్ ప్రధాని కాగలిగాడు. వారి అనుగ్రహం తొలగిన వెంటనే నవాజ్ షరీఫ్ పదవీచ్యుతుడయ్యాడు. నవాజ్ షరీఫ్‌ను అవినీతిపరుడిగా నిర్ధారించడం, అతగాడిని ఎన్నికలలో పోటీచేయడానికి అనర్హుడిగా ప్రకటించడం వంటి చర్యలన్నీ సర్వోన్నత న్యాయస్థానం వారు సైనిక దళాల అధిపతి మనోభీష్టానికి అనుగుణంగానే చేపట్టారు. నవాజ్ షరీఫ్ మాత్రమే కాదు, అసఫ్ అలీ జర్దారీ వంటి మాజీ అధ్యక్షుడు, పరవేజ్ ముషారఫ్ వంటి మాజీ సైనిక అధిపతులు సైతం న్యాయస్థానాల అభిశంసనకు గురికావడం సైనికదళాల అభీష్టానికి అనుగుణంగా జరిగిన పరిణామక్రమం! అందువల్ల ఇప్పుడు సైనిక దళ అధిపతి క్వామర్ జావీద్ బజవాను నియంత్రించడానికి సర్వోన్నత న్యాయస్థానం ఎలా సాహసించిందన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ‘బజవా’ సైనిక దళాలలో ‘పలుకుబడి’ని కోల్పోవడం! ప్రజాస్వామ్య దేశాలలో ‘జనాదేశం’ పాలకుల ఉత్థాన పతనాలను నిర్ధారిస్తోంది. పాకిస్తాన్‌లోని విచిత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘సైనిక ఆదేశం’పాలకుల, నియంతల ఉత్థాన పతనాలను నిర్ధారిస్తోంది!!’ ఇదీ తేడా..
పాకిస్తాన్‌లో రెండు వ్యవస్థలు పనిచేస్తున్నాయి, రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మొదటిది ‘సైనిక స్వామ్యం’, సైనిక ప్రభుత్వం... రెండవది ‘సైనిక స్వామ్యం’ అదుపాజ్ఞలలో పనిచేస్తున్న ‘తథాకథిత’- సోకాల్డ్- ప్రజాస్వామ్య వ్యవస్థ. సైనిక దళాల అధిపతి నియంత్రణకు లోబడి ఉన్న పౌర ప్రభుత్వం! ఈ విచిత్ర స్థితి పాకిస్తాన్‌లో క్రీస్తుశకం 1950వ దశకం నుంచి కొనసాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలలో మూడు రాజ్యాంగ విభాగాలున్నాయి. శాసన నిర్మాణ విభాగం- పార్లమెంటు-, కార్యనిర్వాహక విభాగం- మంత్రివర్గం-, న్యాయ విభాగం- న్యాయస్థానాలు- రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉండడం ప్రజాస్వామ్య స్వభావం! ఈ మూడు విభాగాలు ‘‘పరస్పర నియంత్రణ- పరస్పర సమన్వయం’’- చెక్స్ అండ్ బాలెనె్సస్-అన్న పాలనా సూత్రబద్ధమై ఉన్నాయి. సైనిక దళాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే ప్రభుత్వ విభాగం కావడం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ స్వభావం! ప్రజాస్వామ్యం లేని రాజరిక, వైయక్తిక నియంతృత్వ, సైనిక నియంతృత్వ వ్యవస్థలలో ‘సైనిక దళాలు’ సర్వాధికారం చెలాయిస్తుండడం అంతర్జాతీయ వాస్తవం. కానీ పాకిస్తాన్‌లో, ‘ప్రజాస్వామ్యం’లో కేవలం అభినయం.. నిజమైన ప్రభుత్వం సైనిక శాసనం!! సర్వాధికారం చెలాయిస్తున్న సైనిక దళాలు కొంతకాలం స్వయంగా పాలన సాగిస్తున్నాయి, మరి కొంతకాలం తమ అదుపాజ్ఞలలో పనిచేసే ‘పౌర ప్రభుత్వం’ కొనసాగడానికి అనుమతిస్తున్నాయి! పాకిస్తాన్‌లోని ‘ప్రజాస్వామ్యం’ నిజానికి ‘సైనిక స్వామ్యం’.. సైనిక దళాల అధిపతి నిరంతరం ప్రధానమంత్రిని నియంత్రిస్తుండడం ‘జగమెరిగిన రహస్యం’! ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సైనిక అధికారులలో అత్యధికులు, సైనికులలో అధికాధికులు క్వామర్ జావేద్ బజవాను వ్యతిరేకిస్తున్నారు. ఇదీ సర్వోన్నత న్యాయస్థానం వారి ధైర్యం...
కొంతమంది మంత్రులను పదవుల నుంచి తొలగించ వలసిందిగా 2010 అక్టోబర్‌లో పాకిస్తాన్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీని అప్పటి సైనిక దళాల అధిపతి అష్‌పాక్ పర్వేజ్ ఖయానీ ఆదేశించాడు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన జర్దారీకి ఆ తరువాత ‘ఎంత కావలెనో అంతా అయింది..’. రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుని అధికారాలను కుదించడం ప్రారంభం... జర్దారీ అవినీతిపరుడని న్యాయస్థానాలు నిర్ధారించడం పరాకాష్ఠ. 2013 జనవరిలో ప్రధానమంత్రి యూసఫ్ రజా జిలానీ మంత్రివర్గం పాకిస్తాన్ శాసనసభలో అవిశ్వాసంపాలు కావడం ఖాయమైంది. కానీ ‘ప్రభుత్వాన్ని పడగొడితే మేము జోక్యం చేసుకుంటాము..’ అని కయానీ ప్రతిపక్షాలను హెచ్చరించాడు. అవిశ్వాసం వీగిపోయింది.. ‘మీరు పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదు.. మాతో నేరుగా సంప్రదింపులు జరపండి!’ అని కయానీ ప్రతినిధులు ఇస్లామాబాద్‌లోని భారత రాయబారి- హైకమిషనర్-కి అనేకసార్లు స్పష్టం చేయడం కూడ చరిత్ర! ‘పాకిస్తాన్ ఇరాక్ వంటిది కాదు, అఫ్ఘానిస్థాన్ కాదు..’ అని 2011 అక్టోబర్‌లో కయానీ అమెరికా అధ్యక్షుడికి ‘హెచ్చరిక’ను పంపడం పాకిస్తాన్ ప్రభుత్వ స్వభావానికి నిదర్శనం. పాకిస్తాన్ సైనిక దళాల అండతోనే నవాజ్ షరీఫ్ 2013లో మళ్లీ పాకిస్తాన్ ప్రధాని కాగలిగాడు!! 1999లో అప్పుడు ప్రధానిగా ఉండిన షరీఫ్‌ను సైనిక దళాల అధిపతి పరవేజ్ ముషారఫ్ తొలగించడం చరిత్ర! ‘్భరత్‌తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకునే విషయంలో అతి ఉత్సాహాన్ని చూపవద్దు..’ అని నవాజ్ షరీఫ్‌ను పదవీ స్వీకరణకు ముందు 2013 మే నెలలో కయానీ హెచ్చరించాడు. అనేక ఉదాహరణలలో ఇవి కొన్ని మాత్రమే!!
ఇలా సైనిక దళాల ప్రభుత్వం పౌర ప్రభుత్వాన్ని నియంత్రిస్తుండడం పాకిస్తాన్ ‘పరిపాలన’ కథ. సైనిక దళాలను జిహాదీలు నియంత్రిస్తున్నారు. ‘జిహాదీ’లు ప్రత్యక్ష బీభత్సకారులు. సైనిక దళాలవారు ప్రచ్ఛన్న బీభత్సకారులు! పాకిస్తాన్‌లో ఇలాంటి విచిత్ర వ్యవస్థ డెబ్బయి ఏళ్లుగా కొనసాగుతుండడానికి ఏకైక కారణం పాకిస్తాన్ ‘సమాజ సమష్టి స్వభావం’, ‘ప్రజల సమష్టి ప్రవృత్తి’.. మతోన్మాద చిత్తవృత్తి ఈ సమష్టి స్వభావం! ఇస్లాం ఏకైక అధికార మతంగా ఏర్పడడానికి ఈ చిత్తవృత్తి కారణం. ఈ జిహాదీ మతోన్మాదం సైనిక దళాలను ఆవహించి ఉంది, పౌర ప్రభుత్వాన్ని ఆవహించి ఉంది. పాకిస్తాన్‌లో ఇస్లాం మతేతర ప్రజలు నిరంతరం నిర్మూలనకు గురి అవుతుండడానికి ఇదీ కారణం! కయానీ, బజావా వంటి సైనిక అధిపతులకు సైనిక దళాలలో పలుకుబడి పెరగడం, తగ్గడం కూడ ‘జిహాదీ’ నిష్ఠ ప్రాతిపదికగా కొనసాగుతున్న దుష్పరిణామ క్రమం...