సంపాదకీయం

అంతస్థుల కాలుష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాలు నిలువున పెరుగుతుండడం మన జాతీయ జీవన ప్రగతి రథప్రస్థానాన్ని నిలదీస్తున్న వైపరీత్యం! అంగారక గ్రహానికి అంతరిక్ష నౌకను పంపగల దేశంలో అంగార జ్వాలలు అంతస్థుల భవనాలను ఆహుతి కొంటుండడానికి కారణం ఈ ‘నిలువు’ వైపరీత్యం! పాత గోడలు వర్షాకాలంలో కూలిపోవచ్చు, కాని కొత్త కట్టడాలు ఎండల కాలంలో సైతం కూలిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఆర్భాటంగా అవతరించి ఉన్న ప్రభుత్వేతర రంగపు ‘మెట్రోరైలు’మార్గం స్తంభం నుంచి సిమెంటు గడ్డలు ఊడిపడడం, ప్రాణం తీయడం ఒక ఉదాహరణ మాత్రమే. దేశమంతటా ఇదే తీరు. వంతెనలు కూలిపోతున్నాయి. అంతస్థుల భవనాలు క్రుంగిపోతున్నాయి. మహానగరాలలోని ప్రధానమైన రహదారుల మధ్యలో భూమి అనేక ‘మీటర్’ల లోతునకు అకస్మాత్తుగా క్రుంగిపోయి పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. రహదారులు మోయలేనన్ని వాహనాలు గుమికూడి పరుగులు తీస్తుండడానికి కారణం నగరాలు నిలువున పెరుగుతుండడం. ఈ వాహన భారం మోయలేక రహదారులు పగిలిపోతున్నాయి, గోతులు ఏర్పడుతున్నాయి. నగరాలు నిలువున పెరుగుతున్నందువల్ల జనం కేంద్రీకృతం అవుతున్నారు. ఒక కుటుంబం భారాన్ని మోయగల స్థలంపై పది కుటుంబాలవారు ఎక్కి తొక్కుతున్నారు. బొగ్గుపులుసు వాయువు కేంద్రీకృతమైంది. ఇది గాలి కాలుష్యం! రసాయన విషాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కాలుష్యం అయ్యాయి. నగరాలలో కొన్నిచోట్ల గొట్టపు బావులనుంచి బయటికి వస్తున్న నీరు స్నానం చేయడానికి పనికిరాదు, బట్టలు ఉతకడానికి పనికిరాదు. కనీసం ముట్టుకోవడానికి సైతం పనికిరాదు. ఆ నీటి స్పర్శ తగిలిన శరీరంపై రకరకాల బొబ్బలు పుడుతున్నాయి, రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇది జల కాలుష్యం! అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే జనం తప్పించుకొని దూరంగా పరుగులు తీయలేని స్థితికి కారణం నగరాలు నిలువున పెరగడం. అంతస్థుమీద అంతస్థుగా ఇరుకు ‘గల్లీ’లలో సైతం ఆకాశపుసౌధాలు వెలసి ఉన్నాయి. నగరాలు నిలువున పెరగడం అంటే ఇదీ! ఇలా ఇరుకు వీధులలో గగన సౌధాలు వెలసిపోతున్న వైపరీత్యానికి ఢిల్లీలో ఆదివారం నలబయి ముగ్గురు ఆహుతి అయిపోవడం సరికొత్త ఘోరం! నాలుగు అంతస్థుల భవనంలో తెల్లవారుజామున చెలరేగిన మంటలు భయంకరంగా వ్యాపించి నిద్రపోతుండిన శ్రామికుల బతుకులను క్షణాలలో బుగ్గిచేశాయి. వివిధ నిర్మాణ నిబంధనలను నిర్భయంగా, నిర్లజ్జగా ఉల్లంఘించి ఆ భవనాన్ని నిర్మించడం యజమానుల క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. అలాంటి భవనాన్ని ఇంతకాలం కూల్చివేయకపోవడం అధికారుల ‘రాక్షస నిర్లక్ష్యం’! ఈ నిర్లక్ష్యానికి బలైపోయిన శ్రమజీవులు, ఇప్పుడు ఎన్ని సమీక్షలు జరిగినప్పటికీ, ఎన్ని కఠిన చర్యల అభినయం జరిగినప్పటికీ మళ్లీ బతికి రారు! అత్యంత ఇరుకైన వీధిలో ఆ భవనం ఏర్పడిందట! అందువల్ల ‘అగ్నిమాపక’వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఆ వీధిలోకి వెళ్లలేక పోయాయట! నిలువున పెరిగిన నగరాల నరకం తీరు ఇది... ఇలాంటి ఘోరాలు ప్రతిరోజు ఎక్కడోఅక్కడ జరిగిపోతున్నాయి! వౌలిక సమస్య పట్ల ప్రభుత్వాలకు ధ్యాస ఇప్పటికీ కలగడం లేదు!!
ఈ వౌలిక సమస్య నగరాలు నిలువున పెరుగుతుండడం... నిబంధనలను ఉల్లంఘించి అంతస్థుల భవనాలను నిర్మిస్తుండడం. ఈ అంతస్థుల భవనాలు వెలసినచోట వీధులు ఇరుకైపోతుండడం నగరీకరణ విపరిణామ క్రమం! బావులు, చెఱువులు, నదులు, కాలువలు, ఇతర జలాశయాలను పూడ్చివేసి ఆ స్థలాలలో భవనాలు కట్టినచోట నగరాలు మరింతగా ఇరుకయిపోయాయి! ‘‘అధికార రోగపూరిత బధిరాంధక’’ ప్రభుత్వ నిర్వాహకులు పట్టించుకోరు. స్థిరాస్థి వ్యాపారులు, అధికారులు, రాజకీయవేత్తలు కలసికట్టుగా ఈ అక్రమ నిర్మాణ కార్యక్రమాన్ని దశాబ్దుల తరబడి విజయవంతం చేశాయి. ‘ప్రపంచీకరణ’ ఫలితంగా చొఱబడిన విదేశీయ ‘దళారీ’లతో ‘దుష్టచతుష్టయం’ సర్వసమగ్రమై పోయింది. వ్యాపారులతో రాజకీయవేత్తలు ‘కుమ్మక్కు’ కావడం గడచిన కథ. ఇప్పుడు అధికాధిక అక్రమ వాణిజ్యవేత్తలు రాజకీయవేత్తలుగా చెలామణి అవుతున్నారు, ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఇదే తీరు! అందువల్లనే ‘క్రమబద్ధీకరణ’పేరుతో ‘అక్రమ నిర్మాణాలు’ అంతస్థుల భవంతులు ‘‘సక్రమ నిర్మాణాలు’’గా మారిపోయాయి! భవన నిర్మాణ రంగం అవినీతి వాటిక... భయంకర ఘోర తమాల వాటిక!! నిజాయితీగా ఇల్లుకట్టుకునే వారికి అడుగడుగునా అవరోధాలే...
నగరాలు, పట్టణాలు అడ్డంగా పెరగడం అందం... మానవులు నిలువున పెరగడం చందం! అడ్డంగా పెరగడానికి అవరోధం అంతస్థుల భవన సముదాయం. రెండువందల చదరపు గజాలలో ఇల్లు కట్టుకొనడం మధ్యతరగతి మహాజనం శతాబ్దులపాటు పాటించిన సంప్రదాయం. ఒకవేళ రెండస్థులు నిర్మించినప్పటికీ రెండు కుటుంబాలు ఈ స్థలంలో నివసిస్తాయి. దీనివల్ల ఇంటి ప్రాంగణంలో పచ్చదనపు పరిమళాలు కూడ వెల్లివిరుస్తాయి. రెండు కొబ్బరి చెట్లు, ఓ మామిడి చెట్టు, ఓ వేప చెట్టు గృహప్రాంగణంలో పెరిగి పెద్దవి కాగలవు. నగరాలలో ఈ నిర్మాణ సంప్రదాయం పాటించిన కాలంలో ప్రాకృతిక స్వచ్ఛత సహజంగానే సభలు తీరింది, భూగర్భజలాలు స్వచ్ఛంగానే ఉండేవి. వాయు కాలుష్యం కూడ చాల తక్కువగా ఉండేది. కానీ క్రమంగా ‘అంతస్థుల భవన’- అపార్ట్‌మెంట్- నాగరికత- అమెరికానుంచి, ఐరోపానుంచి- దిగుమతి అయిపోయింది. స్థిరాస్థి వ్యాపారులు రంగప్రవేశం చేస్తారు, ‘నిర్మాతల’-బిల్డర్స్-గా చెలామణి అవుతున్న ఈ వ్యాపారులు రెండిళ్లను కొనేస్తున్నారు. ఈ నాలుగువందల గజాలలో నాలుగు అంతస్థులతో పదహారు ఇళ్లు నిర్మించారు!! దీనివల్ల నగరం నిలువున పెరగడం మొదలైంది. ‘ప్రపంచీకరణ’తో ఈ ‘నిలువు’పెరుగుదల మరింత పైకి పోయింది. ‘నాలుగు అంతస్థుల’కు అనుమతి తీసుకుంటున్న వ్యాపారులు అక్రమంగా మరో రెండు అంతస్థులు నిర్మిస్తున్నారు. దీనితో గతంలో రెండు ఇళ్లు ఉండినచోట రెండు కుటుంబాలు నివసించినచోట ‘వర్తమానం’లో ఇరవై నాలుగు ఇళ్లు, ఇరవై నాలుగు కుటుంబాలవారు కేంద్రీకృతం కావడం నిలువున పెరుగుతున్న తీరునకు నిదర్శనం! రెండు వాహనాలు రహదారి మీదికి వచ్చినచోట కనీసం ఇరవై వాహనాలు రహదారి మీదికి వచ్చేస్తున్నాయి. రహదారులు క్రుంగిపోవడానికి, పగిలిపోవడానికి ఇదీ కారణం. వాహనాల రద్దీకి రాకపోకలు స్తంభించి పోవడానికి- ట్రాఫిక్‌జామ్- ఇదీ కారణం! జల వాయు కాలుష్యానికి అంతస్థుల భవనాలలో అగ్నిప్రమాదాలకు ఇదీ కారణం! ఇలా నగరాలు నిలువున పెరిగాయి, నిలువున పెరగవలసిన మనుషులు రకరకాల ‘జిడ్డు తిండి’ తిని అడ్డంగా పెరుగుతున్నారు. బలసిన నడుముల, ‘కుండ’కడుపుల, ‘బాన’కడుపుల యువజనులు వంగలేరు, లేవలేరు... సూర్యోదయ సమయంలో నిద్రపోతూ ఉన్నారు!! ఇదీ నాగరికం...
బృహదీశ్వర దేవాలయం, ‘కీర్తిస్తంభం’వంటి అంబరాన్ని చుంబించే కట్టడాలను నిర్మించిన ప్రాచీన భారతీయులు తమ నిర్మాణ నైపుణ్యాన్ని నిరూపించారు. కానీ నగరాలలో పట్టణాలలో పల్లెలలో వారు అంతస్థుల భవనాలను నిర్మించలేదు. ఎందుకంటె ‘అంతస్థుల’వల్ల కాలుష్యం కేంద్రీకృతం అవుతుందని వారికి తెలుసు! ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఇప్పటికైనా ఈ నిర్మాణ వాస్తవాలను ఆచరించగలగాలి!! అంతస్థుల భవనాలవల్ల జరుగుతున్న ‘ప్రాకృతిక విపత్తును గుర్తించాలి!! హైదరాబాద్‌ను కాని, అమరావతిని కాని, ముంబయిని కాని, ఢిల్లీని కాని అడ్డంగా విస్తరింపచేయండి!