సంపాదకీయం

ప్రకృతి విలాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి పరిరక్షణకు ‘వాణిజ్య ప్రపంచీకరణ’ ప్రబల శత్రువుగా పరిణమించడం ‘మాడ్రిడ్’ నగరంలో పదునాలుగు రోజులు జరిగిన ‘పర్యావరణ సదస్సు’లో ప్రస్ఫుటించిన వైపరీత్యం. ప్రాకృతీకరణను పాశవికంగా పరిమార్చి ‘పారిశ్రామికీకరణ’ను విస్తరింప చేస్తుండడం ‘ప్రపంచీకరణ’ స్వభావం! మన దేశంతో సహా వివిధ దేశాలలో ప్రధానంగా ప్రవర్ధమాన దేశాలలో ‘హరిత’- ఆకుపచ్చనితనం- పరిరక్షక ఉద్యమకారులు ‘ప్రపంచీకరణ’ను వ్యతిరేకిస్తుండడం ‘స్పెయిన్’ రాజధాని ‘మాడ్రిడ్’లో డిసెంబర్ రెండవ తేదీనుంచి పదహైదవ తేదీ వరకు జరిగిన పర్యావరణ సదస్సునకు నేపథ్యం. హరిత పరిరక్షణ గురించి ఆర్భాటిస్తున్న అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి సంపన్న దేశాలు ‘ఆచరణ’కు మాత్రం దూరమై ఉండడం ఈ నేపథ్యం. అందువల్ల ‘మాడ్రిడ్’ సదస్సులో ‘కాలుష్య కర్బన’ నిరోధం గురించి ఎలాంటి అంగీకారం కాని కుదరకపోవడం ఆశ్చర్యం కాలేదు. పనె్నండు రోజులు జరుగవలసిన ఈ సదస్సు పదునాలుగు రోజులకు విస్తరించినప్పటికీ అంతర్జాతీయ ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడకపోవడం ‘పారిస్’ ఒప్పందం అమలుజరుగుతున్న తీరునకు నిదర్శనం. ఫ్రాన్స్ రాజధాని ‘పారిస్’ నగరంలో 2015 డిసెంబర్ 12న ఆర్భాటంగా కుదిరిన ఒప్పందం పర్యావరణ చరిత్రలో ‘‘ఓ గొప్ప మైలురాయి’’అని అప్పుడు ప్రచారమైంది. 2050నాటికి 2015నాటి కంటె ‘‘మూడున్నర లేదా నాలుగు సెల్సియస్ డిగ్రీల’’ మేర ఉష్ణోగ్రత పెరిగిపోతుందన్నది ‘పారిస్ ఒప్పందానికి’ నేపథ్యం. ఈ పెరుగుదలను ‘‘ఒకటిన్నర డిగ్రీల సెల్సియస్’’కంటె మించనీయ రాదన్నది పారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఒకటిన్నర సెంటిగ్రేడ్ డిగ్రీలకు మించి ప్రపంచపు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్టయితే ఆ వేడిమికి సముద్రాలలోని ‘‘మంచు దిబ్బలు’’ ‘‘హిమ నదాలు’’ మరింత కరిగిపోతాయన్నది నిర్ధారణ. గత యాబయి ఏళ్లలో నిరంతరం సగటు ఉష్ణోగ్రత పెరుగుతున్న కారణంగా ఈ ‘‘సముద్రస్థ హిమఖండాలు’’ కరగిపోయాయి. ఇలా కరగిపోవడంవల్ల సముద్రాల నీటి మట్టం పెరిగి వివిధ దేశాలు సముద్ర తట జనావాసాలు శాశ్వతంగా ముంపునకు గురికాగలవు. సముద్ర జలాలలో నెలకొని ఉన్న ‘ద్వీపాలు’అనేకం జలమయం కాగలవు. ఉష్ణోగ్రత పెరుగుతుండడంవల్ల భూఉపరితలం ‘హిమ ఖండాలు’కూడ కరగిపోవడం మరో వైపరీత్యం. మంచు దిబ్బలు ఉన్నచోట ‘రాళ్లగుట్టలు’ బయట పడుతున్నాయి. హిమాలయ పర్వత ప్రాంగణంలోని మొత్తం ‘మంచు’లో యాబయి ఏళ్లలో పదమూడు శాతం కరగిపోవడం ‘ఉష్ణోగ్రత’ పెరుగుదలకు ప్రబల సూచిక! సముద్రచర జంతువులు ఉపరితల వన్యమృగాలు మాత్రమేకాదు, పిచ్చుకలు తదితర పక్షులు కూడ కాలుష్యం కాటుకు బలై అంతరించి పోతున్నాయి. పండ్లనిచ్చే అటవీ వృక్షాలు, లతలు, గుల్మాలు కనుమరుగయ్యాయి. ఫలితంగా పల్లెటూళ్లకు ప్రతీకలుగా అనాదిగా అలరారిన ‘ఉడుతలు’ ఊళ్లు వదలిపోయాయి! ఇదంతా 2015నాటి ‘పారిస్ ఒప్పందానికి’ నేపథ్యం...
పారిస్ ఒప్పందం స్ఫూర్తిని సంపన్న దేశాలవారు నీరుకార్చుతుండడం నడుస్తున్న వ్యథ. చైనా ఒకవైపున, అమెరికా మరోవైపున ఉష్ణోగ్రత పెరగడానికి దోహదం చేస్తున్నాయి. భూమిని ఇచ్చవచ్చినట్టు తవ్విపారేస్తుండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. ఈ తవ్వకాలను చైనా ప్రభుత్వంవారు టిబెట్ అంతటా అరవై ఏళ్లపాటు జరిపించారు. ఫలితంగా టిబెట్ ప్రాకృతిక సహజ స్వభావం మారిపోయింది. సహజమైన తటాకాలు తెగిపోయాయి, ఎండిపోయాయి. కృత్రిమ జలాశయాలు మన దేశపు సరిహద్దుల వెంబడి వెలశాయి. మన ‘ఉత్తరఖండ్’, ‘హిమాచల్‌ప్రదేశ్’ ప్రాంతాలకు గత ఇరవై ఏళ్లుగా అకాలపు వరదలు రావడానికి దురాక్రమిత టిబెట్‌లో 1959 నుంచి జరిపిన తవ్వకాలు కారణం... హిమాలయాలు కరిగిపోతుండడానికి ఈ ‘తవ్వకాల’తోపాటు ‘ప్లాస్టిక్’వ్యర్థాలు నిండిపోవడం మరో కారణం! ఇలా కాలుష్యం విస్తరించి ‘వేడిమి’ని పెంచుతోంది. రకరకాల కాలుష్యాలు వేడి పెరగడానికి కారణం... పారిశ్రామిక వ్యర్థాలు మొదలు యాంత్రిక పశువధశాలల వరకు, ‘ఆహార శుద్ధి’పేరుతో ‘డబ్బాల’ తిండిని తయారుచేయడం మొదలు, ‘ప్లాస్టిక్’ విస్తళ్లలో ఆరగించడం వరకు వివిధ జీవన రంగాలలో వెలువడుతున్న ‘కాలుష్యం’ ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఈ కాలుష్యం ప్రధానంగా అమెరికా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్‌లతోపాటు మన దేశంలో కూడ వెలువడుతోందన్నది జరిగిన నిర్ధారణ! ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ‘పారిస్’ ఒప్పందాన్ని ఆమోదించిన దేశాలు ప్రతిజ్ఞలు చేసి ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ‘పారిస్’ ఒప్పందాన్ని ఆమోదించాయి. ‘మాడ్రిడ్’ సదస్సులో ఈ దేశాల ప్రతినిధులు పాల్గొనడం పర్యావరణ పరిరక్షణకోసం జరుగుతున్న అంతర్జాతీయ కృషికి నిదర్శనం... కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘పారిస్’ ఒప్పందాన్ని తిరస్కరించాడు. ఈ ఒప్పందం రూపొందడానికి బరాక్ హుస్సేన్ ఒబామా అధ్యక్షుడుగా ఉండిన సమయంలో అమెరికా కృషిచేసింది. కానీ ఒబామా తరువాత 2017 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన ట్రంప్ ఒప్పందాన్ని తిరస్కరించాడు. ‘‘తోడేళ్లతో కలసి తరమడం, కుందేళ్లతో కలసి పారిపోవడం’’ విధానమైన చైనా కూడ గత నాలుగేళ్లలో కాలుష్య నిరోధానికి చేసింది సున్న!!
ప్రశాంత మహాసాగరంలో ఎనిమిది వందల పదిహేను చదరపు కిలోమీటర్ల వైశాల్యంకల ‘కిరివటి’అన్న చిట్టి దేశం నెలకొని ఉంది. దాదాపు లక్ష ఇరవై ఐదు వేల జనాభాకల ఈ ‘చిట్టి’దేశం ముప్పయిరెండు ద్వీపాల సమూహం. ఈ ద్వీపాలలో అత్యధికం సముద్రపు నీటిమట్టం కంటె కేవలం ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ప్రపంచ పర్యావరణ ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరిగినట్టయితే తమ దేశం సముద్రంలో మునిగిపోతుందని 2015 ఆగస్టులో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు తెలిపారు. ఇంధనం ఉపయోగించడంవల్ల కాలుష్యం వెలువడుతోంది. మిగిలిన ‘ఇంధనాల’కంటె బొగ్గువల్ల ఎక్కువ కాలుష్యం వెలువడుతున్న సంగతిని ‘కిరివటి’ అధ్యక్షుడు అనోట్ థాంగ్ 2015లో ప్రపంచ దేశాలకు వ్రాసిన ఉత్తరంలో ప్రస్తావించాడు. అందువల్ల బొగ్గు వాడకాన్ని తగ్గించి ఇతర సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధనాలను వాడాలని ఆయన సూచించాడు. బొగ్గు తవ్వకాలను నిలిపివేయాలని కనీసం బాగా తగ్గించాలని తద్వారా ‘కర్బన కాలుష్యం’ విస్తరించకుండా నిరోధించాలని ‘కిరివటి’ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి! ఇంతవరకు ‘కర్బన’ పదార్థాలను నియంత్రించడం గురించి వివిధ దేశాల మధ్య ఎలాంటి అంగీకారం కుదరలేదు. మాడ్రిడ్ సదస్సు వైఫల్యం సరికొత్త నిదర్శనం...
మన దేశం ‘పారిస్’ ఒప్పందానికి అనుగుణంగా కర్బన కాలుష్యాన్ని మాత్రమేకాక ఇతర కాలుష్యాలను సైతం నిరోధించడానికి చర్యలను తీసుకొంటోంది. 2016 సెప్టెంబర్‌లో మన ప్రభుత్వం పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. ‘స్వచ్ఛ భారత అభియాన్’ విజయవంతం కావడం కాలుష్యాన్ని తగ్గించి ఉండవచ్చు! ‘‘నమామి గంగే’’ కార్యక్రమంలో భాగంగా గంగానది నీటి స్వచ్ఛతను పెంపొందించడానికి జరుగుతున్న కృషి జలకాలుష్య నివారణకు ప్రతీక మాత్రమే! ఐరోపాలో ఒక్కొక్క నదిని పరిశుభ్రంగా మార్చడానికి ముప్పయి ఏళ్లు పట్టిందట! కానీ కేవలం ఐదేళ్లలో గంగానదిని ఉత్తరప్రదేశ్‌లోను, ఉత్తరఖండ్‌లోను స్వచ్ఛ జల వాహినిగా మార్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాన్పూర్ వద్ద ఈ ‘జల స్వచ్ఛత’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించాడు! బొగ్గు ఉపయోగాన్ని మాత్రమేకాక, కాలుష్యాన్ని పెంచే ఇతర ఇంధనాల వాడకాన్ని కూడ తగ్గించడానికి మన ప్రభుత్వం నడుం బిగించడం అంతర్జాతీయ పరిగణనను పొందింది... సౌరశక్తి దేశాల కూటమి మన దేశం నాయకత్వంలో ఏర్పడడం ఈ పరిగణన!! కానీ ‘ప్లాస్టిక్’ కాలుష్యాన్ని ‘ప్రపంచీకరణ’ వైపరీత్యాన్ని నిరోధించడంలో, నిర్మూలించడంలో మన ప్రభుత్వం కూడ వైఫల్యం చెందడం నిరాకరింప జాలని నిజం...