సంపాదకీయం
రాజధాని మీమాంస..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వికేంద్రీకరణ సర్వసమగ్ర ప్రగతికి దోహదం చేస్తుంది. బ్రిటన్ దురాక్రమణ నడికొనే వరకు- క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దివరకు- సహస్రాబ్దులపాటు మన దేశంలో వికేంద్రీకృత వ్యవస్థలు పరిఢవిల్లడం చరిత్ర. ‘స్వయం సమృద్ధ గ్రామం’ సువిశాల భారతదేశ సముత్కర్ష ప్రగతికి, సాంస్కృతిక సుగతికి ప్రాతిపదిక కావడం యుగయుగాల చరిత్ర. విదేశీయ బీభత్సకారులు, బీభత్స పాలకులు ఈ చరిత్రను చెఱచారు, వికేంద్రీకృత వ్యవస్థను ధ్వంసం చేశారు. కేంద్రీకృత విధానాలవల్ల గ్రామాలు వట్టిపోయిన ‘‘పాడి పశువులు’’కావడం బ్రిటన్ నుంచి వచ్చిన దోపిడీదారులు సాగించిన దుర్మార్గపు పాలన ఫలితం!! బంకించంద్రుడు, బాలగంగాధరుడు, వివేకానందుడు, గాంధీ మహాత్ముడు వంటివారు అందువల్లనే స్వయం సమృద్ధ గ్రామాలను పునరుద్ధరించాలని కోరి ఉన్నారు. బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర లక్ష్యం గ్రామ స్వరాజ్యం... వికేంద్రీకృత భారతీయ సురాజ్యం! రాజ్యాల రాజధానులు ‘కేంద్రీకరణ’కు ప్రాతిపదికలు కాకపోవడం తరతరాల భారతీయ చరిత్ర! బ్రిటన్‌వారు నిష్క్రమించిన తరువాత కూడ మన దేశంలోని కేంద్రీకృత వ్యవస్థలు వికసించకపోవడం బ్రిటన్‌వారు ప్రసాదించిపోయిన భావదాస్యం... ఈ భావదాస్యాన్ని వదిలించుకోవడానికి జరుగుతున్న ‘రాజ్యాంగ’ ప్రయత్నాలలో ఒకటి చిన్న రాష్ట్రాలు ఏర్పడడం. చిన్న రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రతీకలు, సమగ్ర ప్రగతికి ప్రాతిపదికలు. దేశంలోని పెద్ద రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరిగి మరిన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నది వికేంద్రీకృత ప్రగతి సూత్రం... చిన్నచిన్న రాజ్యాంగ విభాగాలుగా ‘ప్రగతి’ వికేంద్రీకృతం కావడం మాత్రమేకాదు చిన్న చిన్న ‘రాజధానులు’ ఏర్పడడం కూడ స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణ క్రమంలో అనివార్యమైన పరిణామం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజధానిని వికేంద్రీకృతం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన హర్షణీయ పరిణామం. పాలనా విభాగాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కావడం జనమంతా ఒకేచోట ‘‘కుప్పేసుకుని కూర్చోవడం’’ కాలుష్యం కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తుంది. అందువల్ల రాష్ట్ర రాజధానులు కాని దేశ రాజధాని కాని వాణిజ్య కేంద్రాలు కారాదు, పారిశ్రామిక కేంద్రాలు కారాదు, భావదుర్గంధ భరితమైన చలనచిత్ర వాటికలు కారాదు, విద్యా కేంద్రాలు, ధర్మక్షేత్రాలు తీర్థస్థలాలు కారాదు. రాజధాని కేవలం పాలనకు కేంద్రం కావాలి. మిగిలిన కేంద్రాలన్నీ రాజధానికి దూరంగా విలసిల్లడం వికేంద్రీకృత ప్రగతికి మాధ్యమం కాగలదు...
కానీ వికేంద్రీకరణ- డీసెంట్రలైజేషన్- వేఱు, విరూపం- డిస్‌ఫిగరింగ్- వేఱు... వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని ‘విరూపం’చేయడం అభిలషణీయం కాదు. ‘వికేంద్రీకరణ’లో ‘సమన్వయం’అంతస్సూత్రం! ఈ ‘సూత్రాన్ని’ తెంపి పారేయడంవల్ల వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణవల్ల రాజ్యాంగ వ్యవస్థ వికృతం కారాదు! పాలనావ్యవస్థ ఛిన్నాభిన్నం కారాదు. అమరావతిలో కేవలం శాసనసభను, శాసన మండలి భవనాలను నెలకొల్పి మిగిలిన రెండు రాజ్యాంగ విభాగాలను కర్నూలులోను, విశాఖ పట్టణంలోను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను అందువల్ల ‘సమన్వయం’ ప్రాతిపదికగా విశే్లషించుకోవడం మేలు. శాసన నిర్మాణం - సెజిస్లేచర్-, కార్యనిర్వహణ- మంత్రివర్గం- ఎగ్జిక్యూటివ్-, న్యాయస్థానాలు- జ్యుడిషియరీ- అన్నవి ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలోని మూడు విభాగాలు కావచ్చు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన నిర్మాణం, మంత్రివర్గం కలసిపోయి ఉన్నాయి, అధ్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశాలలో శాసన నిర్మాణం, కార్యనిర్వహణ - ఎగ్జిక్యూటివ్- విభాగాలు పరస్పరం ఇలా ముడివడి లేవు. అవి రెండూ పరస్పరం విడివడి ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రులు ‘విధాన సభల’లో సభ్యులుగా ఉన్నారు. చట్టసభలలో చర్చించి, ఆమోదించే అధికార ప్రతిపాదనల - అఫిషియల్ బిల్స్-ను మంత్రివర్గంవారు రూపొందించి సమర్పిస్తున్నారు. అందువల్ల శాసనసభ, శాసన మండలి సమావేశాల సందర్భంగా మంత్రివర్గం, సచివాలయం ‘విశాఖ’నుంచి ‘అమరావతి’కి తరలిరావాలి!! ఈ ‘తరలింపు’వల్ల పాలన విభాగం తాత్కాలికంగా విచ్ఛిన్నం అయిపోతుంది. సంవత్సరంలో మూడుసార్లు- కనీసం- ఈ విచ్ఛిన్నం- డిస్‌ఫిగర్‌మెంట్- పాలనావ్యవస్థలో ప్రస్ఫుటించక మానదు. అందువల్ల కార్యనిర్వహణ విభాగం- ఎగ్జిక్యూటివ్-, శాసన నిర్మాణ విభాగం- లెజిస్లేచర్ రెండూ కూడ ఒకేచోట- అమరావతిలోనే- కొనసాగించడం ‘రాజ్యాంగ సమన్వయం’!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమన్వయ సూత్రాన్ని గుర్తించడం మంచిది!!
ఇలా విధాన మండలి- శాసనసభ, శాసన మండలి-, ప్రభుత్వ సచివాలయం ‘రాజ్యపాల్’- గవర్నర్- అధికార నివాసం అమరావతిలోనే ఉండడం మంచిది. ప్రస్తుతం నెలకొని ఉన్న తాత్కాలిక రాజధాని భవనాలను శాశ్వత భవనాలుగా ప్రకటించడంవల్ల నిర్మాణ వ్యయం, అనవసర ఆర్భాటం తగ్గించవచ్చు. వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో కాని, విశాఖపట్టణంలో కాని ‘ఉన్నత న్యాయస్థానాన్ని’-హైకోర్ట్‌ను- నెలకొల్ప వచ్చు. విశాఖపట్టణంలో ‘హైకోర్టు’ను నెలకొల్పినట్టయితే మరో ‘హైకోర్ట్ బెంచ్’ని కర్నూలులో ఏర్పాటుచేయడంవల్ల ప్రజలకు న్యాయ సౌలభ్యం ఏర్పడగలదు. కర్నూలులో ‘ఉన్నత న్యాయస్థానం ప్రధాన ధర్మాసనం’ వెలసినట్టయితే అనుబంధ ధర్మాసనాన్ని విశాఖ పట్టణంలో నెలకొల్పవచ్చు! దీనివల్ల, కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ఏడు జిల్లాల వారికి ‘కర్నూలు’ ‘హైకోర్టు బెంచ్’ఉపయోగపడుతుంది. ‘కృష్ణ’కు ఉత్తరంగా ఉన్న ఆరు జిల్లాలవారు విశాఖ ‘హైకోర్టు బెంచ్’ను ఉపయోగించుకోవచ్చు!! దీనివల్ల సామాన్య ప్రజలు ‘ఉన్నత’ న్యాయంకోసం దూర దూర నగరాలకు పయనించవలసిన అసౌకర్యం ఏర్పడదు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే ఉంది, గవర్నర్ నివసించేచోటు రాజధాని!! హైకోర్టు రాజధానిలోనే నెలకొల్పవలసిన అవసరం లేదన్నది రాజ్యాంగ చరిత్ర ద్వారా ధ్రువపడిన అంశం! హైకోర్టు పరిధిలో ఒక ప్రధాన రాష్ట్రం మాత్రమేకాక రెండుమూడు రాష్ట్రాలు కూడ ఉండిన చరిత్ర మనకుంది. ఇప్పుడు కూడ మదరాసు, బొంబాయి, కలకత్తా ఉన్నత న్యాయస్థానాల పరిధి ఒకే రాష్ట్రానికి పరిమితమయి లేదు. అదే విధంగా ఒకే రాష్ట్రంలో రెండుమూడు ‘హైకోర్టు బెంచీ’లు ఉండడం వర్తమాన వాస్తవం. అందువల్ల కర్నూలులోను, ‘విశాఖ’లోను కూడ హైకోర్టు భవనాలను ఏర్పాటుచేసుకోవచ్చు!
ఇలా జరిగినప్పటికీ రాష్ట్రానికి రాజధాని మాత్రం ఒకటే! హైకోర్టు ఏర్పడిన నగరాలు రాజధానులు కాజాలవు! ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమైనది ‘అలహాబాద్ హైకోర్టు’. లక్నోలో ఉన్నది ‘అనుబంధ ఉన్నత న్యాయస్థాన పీఠం’మాత్రమే! కానీ ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ ‘న్యాయ రాజధాని’- జ్యుడిషియల్ కాపిటల్- అన్న పేరు లేదు!! అంతేకాదు, మధ్యప్రదేశ్ రాజధాని ‘్భపాల్’లోను, ఒరిస్సా రాజధాని భువనేశ్వరంలోను ఉన్నత న్యాయస్థానాలు నెలకొని లేవు. ఇండోర్‌ను మధ్యప్రదేశ్ ‘న్యాయ రాజధాని’ అని కానీ, కటక్‌ను ఒరిస్సా ‘న్యాయ రాజధాని’అని కాని పిలవడం లేదు. అందువల్ల ‘హైకోర్టు’ అనుబంధపు హైకోర్టు కర్నూలులోను, విశాఖపట్టణంలోను ఏర్పడినప్పటికీ ‘పాలన’ ప్రాంతమైన అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని కాగలదు. ఇదీ రాజ్యాంగ సంప్రదాయం. దేశంలో బహుశా ‘జమ్మూకశ్మీర్’కు మాత్రమే రెండు రాజధానులున్నాయి. జమ్మూ నగరం ‘హేమంత’ రాజధాని, శ్రీనగరం ‘వసంత’రాజధాని! చలికాలంలో రాజధానిని- దర్బార్‌ను- శ్రీనగరం నుంచి జమ్మూ నగరానికి, వేసవిలో రాజధానిని మళ్లీ శ్రీనగరానికి తరలించడం దశాబ్దుల ప్రహసనం. ఈ ‘ప్రహసనం’ ఇకపై రద్దయిపోవచ్చు కూడ!! ‘వికేంద్రీకృతం’అన్న సూత్రాన్ని రాజ్యాంగ విభాగాలకు వర్తింపచేసినా చేయకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ తొమ్మిది నగరాలుగా అమరావతిని నిర్మించాలన్న ‘‘ఆర్భాటపు అంతర్జాతీయ’’ ప్రహసనం ఆగిపోవడం హర్షణీయం! అలా తొమ్మిది నగరాలను ఒకేచోట నిర్మించడంవల్ల ‘కాలుష్యం’కేంద్రీకృతం కాగలదు. రాజధాని వాణిజ్య కేంద్రం కారాదు! క్రీడానగరం, చిత్రనగరం వంటివి అమరావతిలోకాక ఇతరచోట్ల ఏర్పడాలి! ఈ వికేంద్రీకరణవల్ల అమరావతి పరిసరాలు స్వచ్ఛంగా ఆకుపచ్చని శోభలతో అలరారగలవు!