సంపాదకీయం
వ్యూహాత్మక మైత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన దేశానికీ అమెరికాకు మధ్య జరిగిన ‘ఇద్దరు, మరో ఇద్దరు’ మంత్రుల స్థాయి చర్చలకు చైనావారి ‘షాణ్‌డోంగ్’ ‘సముద్ర ప్రవేశం’ చేయడం విచిత్రమైన నేపథ్యం. చైనా నౌకాదళం రెండు దశాబ్దులుగా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణ మన సముద్ర భద్రతకు విఘాతకరంగా పరిణమించి ఉండడం ఈ నేపథ్య వైచిత్రి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో మన రక్షణ మంత్రి రాజ్‌నాథసింగ్, విదేశ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యమ్ జయశంకర్ అమెరికా ప్రతినిధులతో చర్చలు జరుపుతుండిన సమయంలోనే ‘షాణ్‌డోంగ్’ చైనా నౌకాదళంలో ఆధికారికంగా చేరడం గురించి ప్రచారమైంది. ‘షాణ్‌డోంగ్’ చైనా నిర్మించుకున్న ‘విమాన వాహక యుద్ధనౌక’. ఇంతవరకు చైనా నౌకాదళంలో ఒకే ఒక ‘విమాన వాహక యుద్ధనౌక’ ఉండేదట. ‘లియాఓనింగ్’ అన్న ఈ ‘విమాన వాహక యుద్ధ నౌక’- ఎయిర్ క్రాఫ్టు కారియర్-ను ఉక్రెయిన్ దేశంనుంచి చైనా కొనుగోలు చేసింది. ఈ ‘లియాఓనింగ్’ను ‘ఉక్రెయిన్’ కొన్నాళ్లు వాడిన తరువాత చైనాకు అమ్మింది. ఇప్పుడు తొలిసారిగా చైనా పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో ‘షాణ్‌డోంగ్’ను నిర్మించుకొంది. ఇలా చైనా నౌకాదళ విస్తరణ జరుగుతుండడం మన సముద్ర భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన విపరిణామం! రాజనాథసింగ్ అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్‌తోను, జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతోను బుధ గురువారాలలో జరిపిన చర్చలకు ఈ విపరిణామం నేపథ్యం... చైనా ‘విస్తరణ’ భారత అమెరికాల మైత్రిని మరింత అనివార్యం చేస్తున్న విపరిణామం. హిందూ మహాసముద్ర జలాలలోను, ప్రశాంత మహాసాగర ప్రాంతంలోను చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి జరుపుతున్న ప్రయత్నాలలో ‘షాణ్‌డోంగ్’ నిర్మాణం భాగం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్య దేశాలు. ఈ దేశాలకు ‘మండలి’లో ‘నిర్ణాయక నిరోధక’- వీటో- అధికారం ఉంది. అంటే ఈ ఐదు దేశాలూ అంగీకరించినప్పుడు మాత్రమే ఏ తీర్మానమైనా ‘మండలి’లో నెగ్గుతుంది. ఈ ఐదింటిలో ఏ ఒక్క దేశం అంగీకరించక పోయినప్పటికీ తీర్మానం వీగిపోతుంది. ‘మండలి’లోని మిగిలిన పది స్థానాలను ఖండాల వారీగా ఇతర దేశాలకు ఎన్నికల ద్వారా కేటాయిస్తున్నారు. ఇలా ఎన్నికయిన సభ్యత్వం కాలవ్యవధి రెండేళ్లు మాత్రమే. మొత్తం పదిహేను మంది ప్రతినిధులలో- పది మంది సాధారణ సభ్యులు, ఐదుగురు శాశ్వత సభ్యులు- పదునాలుగు మంది అంగీకరించినప్పటికీ ఒక్క శాశ్వత సభ్యదేశం అంగీకరించక పోయినప్పటికీ ‘తీర్మానం’ లేదా ‘నిర్ణయం’ వీగిపోతుంది. ఇదీ శాశ్వత సభ్య దేశాలకున్న ‘ఆధిపత్యం’. ‘జమ్మూకశ్మీర్’గురించి చర్చించడానికై ఐదుగురు శాశ్వత ప్రతినిధులు ప్రత్యేక సమావేశం జరపాలని చైనా ప్రతిపాదించడం మన అంతర్గత వ్యవహారాలలో ‘‘వికృత ముఖాన్ని దూర్చడం’’... ఇలాంటి శత్రుత్వ వైఖరికి చైనా ఒడిగట్టడం నిర్లజ్జకు నిదర్శనం. గత మంగళవారం ఈ ప్రత్యేక సమావేశం జరగాలని చైనా ప్రతిపాదించింది. అయితే అమెరికా తదితర శాశ్వత సభ్య దేశాలు అంగీకరించక పోవడంవల్ల ఈ అనవసర ప్రత్యేక సమావేశం జరుగలేదు. అమెరికాతో మన వ్యూహాత్మక బంధం బలపడడం అనివార్యం కావడానికి ఈ చైనా దౌత్యదౌర్జన్యం ప్రధాన కారణం!!
రాజనాథసింగ్ మార్క్ ఎస్పర్‌తో జరిపిన చర్చలలో ఉభయ దేశాల మధ్య ఈ ‘వ్యూహాత్మక రక్షణ సహకారం’ పెంపొందించుకొనడానికి అంగీకారం కుదిరిందట! చైనా ఉభయ దేశాలకు ప్రధాన ప్రత్యర్థిగా పరిణమించడం ఈ వ్యూహాత్మక రక్షణ సహకారానికి ప్రాతిపదిక! ప్రశాంత-పసిఫిక్- మహాసాగర ప్రాంతంలో చైనా ఆధిపత్య విస్తరణకు యత్నిస్తుండడం పట్ల ఈ ప్రాంతంలోని అనేక దేశాలు నిరసనలను నిగిడిస్తున్నాయి. వియత్నాంకు తూర్పుగాను, చైనాకు దక్షిణంగాను విస్తరించిన సముద్ర జలాలలో చమురు, ఇంధన వాయు నిక్షేపాలకోసం ఇతర దేశాలు అనే్వషణలు జరుపరాదని చైనా నిర్దేశిస్తోంది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఈ సముద్ర ప్రాంతంలోని అనేక ద్వీపాల విషయంలో చైనాకు వియత్నాంకు మధ్య మాత్రమేకాక, అనేక ఆగ్నేయ, పూర్వ ఆసియా దేశాలకు చైనాకు మధ్య కూడ విభేదాలు కొనసాగుతున్నాయి. వియత్నాంకు తూర్పుగా విస్తరించిన వియత్నాం ‘ప్రత్యేక ఆర్థిక సముద్ర మండలం’- ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్-లో వియత్నాం సమ్మతితో మన దేశం చమురు అనే్వషణ జరపడాన్ని పదేళ్ల క్రితం చైనా నిరోధించింది. మన దేశంలో వ్యూహాత్మక రక్షణ సంబంధాలను ఏర్పరచుకోవాలని వియత్నాం తదితర ఆగ్నేయ పూర్వ ఆసియా దేశాలు పదేళ్లకు పైగా కోరుతున్నాయి. ఈ వియత్నాంకు తూర్పుగా విస్తరించి ఉన్న ‘‘దక్షిణ చైనా సముద్ర’’తీరంలో చైనా ఇప్పుడు ఈ కొత్త ‘విమాన వాహక యుద్ధనౌక’ను నెలకొల్పిందట. అందువల్ల చైనా విస్తరణను నిరోధించడం పట్ల ఆగ్నేయ ఆసియా దేశాలు మరింత శ్రద్ధచూపవలసి వస్తోంది. ఈ ప్రాంతంలో చైనాను నిరోధించడానికి మన వ్యూహాత్మక సహకారం అనివార్యం అని అమెరికా భావిస్తోంది!! శ్రీలంక, మాల్‌దీవులు, పాకిస్తాన్‌లలో చైనా ‘నౌకాదళం’ కదలికలు పెరుగుతుండడంవల్ల అమెరికాతో వ్యూహాత్మక రక్షణ సహకారం మన దేశానికి కూడ అనివార్యం...
సుబ్రహ్మణ్యం జయశంకర్ మైక్ పాంపియో జరిపిన చర్చలలో ఉభయ దేశాలు కలసికట్టుగా అంతర్జాతీయ బీభత్సకాండను నిరోధించడం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందట! మన ప్రభుత్వం గత ఐదేళ్లలో అమలుజరుపుతున్న పటిష్ఠమైన భద్రతా వ్యూహం కారణంగా అంతర్గతంగా జిహాదీ బీభత్సకాండ తగ్గుముఖం పట్టింది. జమ్మూకశ్మీర్‌లో సైతం, రాజ్యాంగపు మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిన తరువాత, బీభత్స కలాపాలు తగ్గుముఖం పట్టాయి. పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’లు ‘అధీనరేఖ’వద్ద ఇప్పటికే పొంచి ఉన్నప్పటికీ వారు దాడులు చేయడానికి వీలులేని స్థితి ఏర్పడింది. ఈ ‘మారిన పరిస్థితి’ పాకిస్తాన్ పాలకులకు నచ్చడం లేదు, చైనాకు నచ్చడం లేదు. అందువల్లనే ‘జమ్మూకశ్మీర్’లో ఏర్పడిన ప్రశాంతిని భంగపరచాలని చైనా యత్నిస్తోంది. ‘మండలి’లో చర్చ జరిగినట్టయితే తీర్మానాలు నెగ్గవు... అయినప్పటికీ చర్చ సందర్భంగా పాకిస్తాన్‌లో ‘్భరత వ్యతిరేక ధ్యాస’ మరింత పెరగడానికి అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి చర్చలు దోహదం చేయగలవు. ఇదీ చైనా వ్యూహం! ఈ వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని రచించడం ‘్భరత అమెరికా’ బీభత్స వ్యతిరేక సహకారానికి లక్ష్యం కావాలి! జమ్మూకశ్మీర్‌లో ‘‘జరుగని దమనకాండ’’ను మన ప్రభుత్వం జరిపిస్తున్నట్టు చైనా ప్రచారం చేస్తోంది! కానీ ‘హాంగ్‌కాంగ్’లో ప్రజాస్వామ్య ఉద్యమకారులను చైనా ప్రభుత్వం అత్యంత పాశవికంగా, పైశాచికంగా అణచివేస్తోంది!! కానీ ఈ చైనా దమనకాండ గురించి ఐక్యరాజ్యసమితిలో చర్చ జరగడం లేదు. జరిపించ గలిగినప్పుడు ‘్భరత అమెరికా’ల వ్యూహాత్మక సహకారానికి సార్ధకత ఏర్పడుతుంది...
జిహాదీ బీభత్సకాండను నిర్మూలించడంలో మన ప్రభుత్వానికి ఉన్నంత చిత్తశుద్ధి అమెరికాకు లేదు. జిహాదీ బీభత్సకాండను నడిపిస్తున్న ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియావంటి ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ’లతో అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్తాన్‌ను సమర్ధిస్తోంది. అమెరికా విధానంలో నిహితమై ఉన్న ఇలాంటి వైరుధ్యాలు అంతర్జాతీయ బీభత్సకాండను నిర్మూలించడానికి అవరోధాలు... పాకిస్తాన్‌ను సైతం అమెరికా తనంతతానుగా దూరం చేసుకోలేదు. చైనా చంకనెక్కిన పాకిస్తాన్ అమెరికాను వెక్కిరించింది. ప్రస్తుతం మలేసియాలో జరుగుతున్న కొన్ని ‘ఇస్లాం దేశాల’ ప్రత్యేక సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని హాజరుకాకుండానే సౌదీ అరేబియా నిరోధించింది. ఇలా పాకిస్తాన్‌ను వదలలేని సౌదీ అరేబియాను అమెరికా ఇప్పటికీ వదలుకోవడం లేదు. అంతర్జాతీయ బీభత్సకాండ నిర్మూలనలో అమెరికా ద్వంద్వ వైఖరి ఇది! మాన్పించడం మన ప్రభుత్వానికి సాధ్యమా?