సంపాదకీయం

‘విషం కక్కిన’ మమత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ధేశపు అంతర్గత వ్యవహారాలలో ‘ఐక్యరాజ్యసమితి’ అక్రమ ప్రమేయం కల్పించుకోవాలని పిలుపునివ్వడం దేశ విద్రోహకరమైన దుశ్చర్య. మమతాబెనర్జీ ఈ దుశ్చర్యకు పాలుపడింది! దేశ విద్రోహకర చర్యలకు పాలుపడినప్పటికీ తమకు ఎలాంటి హాని జరగదని అనేక దశాబ్దులపాటు ‘జమ్మూకశ్మీర్’లో కొందరు స్థానిక రాజకీయవేత్తలు విశ్వసించారు. ఇలాంటి రాజకీయ వేత్తలు గతంలో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం చరిత్ర... షేక్ అబ్దుల్లా క్రీస్తుశకం 1950వ దశకంలో ఇలాంటి ప్రకటనలను చేశాడు, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు, కారాగృహ నిర్బంధానికి గురిఅయ్యాడు. ఈ చరిత్రను పునరావృత్తం చేయడానికి బెంగాల్‌లో మమతాబెనర్జీ బహుశా ఇప్పుడు నడుం బిగించింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’ రాజ్యాంగ నిబద్ధత గురించి దేశంలో ‘జనాభిప్రాయ సేకరణ’- రెఫరెండం-జరగాలని మమతాబెనర్జీ పిలుపునిచ్చింది. అయితే ఈ ‘జనాభిప్రాయ సేకరణ’ ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో జరగాలని కూడ ఆమె కోరడం దేశద్రోహకరం... భారత రాజ్యాంగ గరిమకు అవమానకరం! పశ్చిమ బెంగాల్ ‘శాసనసభ’కు 2021లో జరుగనున్న ఎన్నికలలో తమ పార్టీ పరాజయం పాలుకాక తప్పదన్న ‘విశ్వాసం’ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘తృణమూల్ కాంగ్రెస్’ అధినేత్రి మమతాబెనర్జీకి ఏర్పడింది. ఈ ‘విశ్వాసం’ నిజానికి భయం, ఆందోళన! ‘అధికారచ్యుతి’ని తలచుకొని ఆమె హడలెత్తిపోతోంది!! ఆమె అంతరంగం కల్లోల తరంగమయం... ఈ ఏడాది మే నెలలో ముగిసిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ‘బెంగాల్ దీదీ’కి ఈ ‘పరాజయ విశ్వాసం’ దృఢపడింది. పరాజయాన్ని తప్పించుకొనడానికై ఆమె అమలు జరుపుతున్న వ్యూహంలో భాగం ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- సిఏఏ- పట్ల తీవ్ర వ్యతిరేకత!! ‘చట్టం’పట్ల వ్యతిరేకత ‘‘దేశం పట్ల విద్రోహం’’గా పరిణమించడం నిన్న నేడు జరుగుతున్న కథ. అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో సర్వమత సమభావ- సెక్యులర్- రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమైపోవడం ‘అఖండ భారత’ విభజనతో ముడివడిన పరిణామక్రమం. 1947లోను, అంతకు పూర్వం వివిధ సమయాలలోను అఖండ భారత విభజన జరిగింది. అనాదిగా ‘సర్వమత సమభావం’ జీవన స్వభావమైన స్వజాతీయులు- హిందువులు- ఈ మూడు ‘దేశాల’లోను ‘అల్పసంఖ్య’-మైనారిటీ- స్థాయికి దిగజారడం అఖండ భారత విభజనకు కారణం. ఇలా స్వజాతీయులైన హిందువుల సంఖ్య తగ్గి, విదేశాలనుంచి వచ్చిన ‘ఇస్లాం’లోకి మారిన వారి సంఖ్య పెరిగిన ఈ మూడు ప్రాంతాలు- అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- ‘అఖండ భారత్’నుంచి విడిపోయాయి. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దినాటికే ‘అఫ్ఘానిస్థాన్’ అఖండ భారత్ నుంచి విడిపోయింది. ఈ మూడు దేశాలలోను ఇస్లాం ఏకమత ‘రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడడంతో ‘అల్పసంఖ్య’లోని హిందువులు హత్యాకాండకు, లైంగిక అత్యాచారాలకు, మతం మార్పిడికి, తరిమివేతకు గురిఅవుతున్నారు, దశాబ్దులుగా గురిఅవుతున్నారు.
ఇలా తరిమివేతకు గురయి, ప్రాణావశిష్టులై శరణార్థులుగా మన దేశానికి వచ్చిన ఇస్లాం మతేతరులకు మానవీయ దృష్టితో ఆశ్రయం ఇవ్వడం మానవుల కర్తవ్యం. మానవులు కానివారు పైశాచిక ప్రవృత్తి కలవారు మాత్రమే ఈ నిస్సహాయ శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని’వ్యతిరేకిస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన వైపరీత్యం కాదు. ఎందుకంటె అనాదిగా అఖండ భారత్‌లోవలెనే 1947 తరువాత అవశేష భారత్‌లో- మన దేశంలో- కూడ సర్వమత సమభావ సామాజిక వ్యవస్థ కొనసాగుతోంది. మన దేశపు రాజ్యాంగం ఈ సనాతన వాస్తవానికి మరో ధ్రువీకరణ. అందువల్ల మన దేశంలో అల్పసంఖ్య మతస్థులైన ‘ఇస్లాం’, ‘క్రైస్తవ’, ‘పారశీక’, ‘యూదు’ వంటి జన సముదాయాల వారు తరిమివేతకు గురికాలేదు. కానీ ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’లు ఏర్పడిన పై మూడు దేశాలలోను ఇస్లామేతరులు- మైనారిటీలు- బీభత్సకాండకు, తరిమివేతకు గురిఅవుతున్నారు. సూర్యుని కాంతి స్పష్టంగా భాసిస్తున్నట్టుగా మన దేశంలోని సమాజానికీ, ఈ మూడు దేశాల సమాజాలకు మధ్య ఈ ‘అంతరం’ ప్రస్ఫుటిస్తోంది. వాస్తవాన్ని అంగీకరించనివారు సూర్యుని కాంతిని చూడలేని గుడ్లగూబలు!! అందువల్ల సవరణ చట్టం మన దేశంలో హాయిగా జీవిస్తున్న ఏ మతంవారికి కాని సంబంధించినది కాదు, ఏ మతం వారికీ వ్యతిరేకం కాదు!! కేవలం పై మూడు దేశాలనుంచి తరిమివేతకు గురిఅయిన ఆయా దేశాల ‘మైనారిటీ’లకు ప్రాణం నిలుపడానికి ఈ కొత్త చట్టం ఏర్పడింది. ఈ శరణార్థులు జీవించరాదా?? చట్టాన్ని వ్యితిరేకిస్తున్నవారు సమాధానం చెప్పాలి!
ఈ మూడు- అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- దేశాలలోను ఇస్లాం మతస్థులు ‘మైనారిటీ’లు కాదు, వారు ఎవరి వేధింపులకు గురికాలేదు, తరిమివేతకు గురికాలేదు, శరణార్థులై మన దేశానికి రాలేదు. అందువల్లనే మన దేశంలో లేని ‘‘శరణార్థులకు’’ ఈ మూడు దేశాల ఇస్లాం మతస్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలనడం అర్థంలేని కోరిక, మతిమాలిన వాంఛ! నిజమైన శరణార్థులకు మన దేశం మతంతో కాని జాతితో కాని సంబంధం లేకుండా అనాదిగా ఆశ్రయం కల్పిస్తోంది!! మహాకవి కరుణశ్రీ అన్నట్టు
‘‘అచ్చపు చీకటిండ్ల పొరలాడుచు
నుండ ప్రపంచమెల్ల ఈ
పచ్చని తల్లి గుమ్మములపై
వెలిగెన్ మణిదీపికల్, కనన్
వచ్చిన ఖండఖండముల వారికి
కోరిక తీరునట్టుగా
బిచ్చముపెట్టె భారత సవిత్రి
ప్రియంబున రెండు చేతులన్’’
పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా మన ప్రభుత్వం ఈ భారత జాతీయ ‘మానవీయ పరంపర’ను నిలబెట్టింది. పైగా ఇప్పుడు ‘సవరణ చట్టం’ద్వారా భారతీయ పౌరసత్వం పొందుతున్నవారు ఒకప్పటి అఖండ భారత్‌లో సహజమైనవారు. బ్రిటన్ దుర్జనులు, ముస్లింలీగ్ మతోన్మాదులు ‘అఖండ భారత్’ను ముక్కలుచెక్కలు చేయకపోయి ఉండినట్టయితే ఇప్పుడు ఈ సవరణ చట్టం అవసరం ఉండేది కాదు. పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను చిత్రహింసలకు గురయి, మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వస్తున్నవారికి న్యాయం చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడ హామీలనిచ్చింది! ‘‘పాకిస్తాన్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను జిహాదీలు అపహరించారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు! ఆ ముగ్గురినీ జిహాదీలు- అదివరకే పెళ్లయి భార్యలున్నవారు- బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టువారు ఆ దుండగులకు ఎలాంటి శిక్షనూ విధించలేదు. ఈ ముగ్గురు యువతులూ భర్తలతో కాపురం చేయవచ్చుననీ, ఇష్టం లేకపోతే పుట్టింటికి తిరిగి వెళ్లవచ్చునని పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది’’- ఈ దారుణ ఘటన గురించి 2012 మేలో ప్రచారమైంది. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బీభత్స ఘటనలు పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను ప్రతిరోజు జరుగుతున్నాయి. అందువల్లనే హిందువులు నిరంతరం ఈ దేశాలనుంచి నిష్క్రమించవలసి వస్తోంది!! ఇలాంటి దుస్థితికి పాకిస్తాన్‌లో కాని, బంగ్లాదేశ్‌లో కాని ఇస్లాం మతస్థులు గురికాలేదు, గురికావడం లేదు. అందువల్ల ఈ దేశాలనుంచి ఇస్లాం మతస్థులు శరణార్థులై మన దేశానికి రాలేదు. ‘‘లేని శరణార్థులకు’- మన దేశంలో లేని ముస్లిం శరణార్థులకు- మన దేశపు పౌరసత్వం ఎలా కల్పించగలం?? కానీ మమతాబెనర్జీ తక్షణ లక్ష్యం ఇది కాదు.
‘‘ఇలా దేశ విద్రోహకర ప్రకటనలను చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ కాలం సహించదు... అందువల్ల మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని రద్దుచేసి బెంగాల్‌లో రాష్టప్రతి పాలన విధించవచ్చు!’’ అలా జరగాలన్నదే బహుశా మమతాబెనర్జీ కోరిక!! ఇలా ‘‘కూలిపోతే’’ తదుపరి శాసనసభ ఎన్నికలలో తమ పార్టీకి ప్రజల సానుభూతి పెరుగుతుందన్నది ఆమె వ్యూహం...