సంపాదకీయం
రాజధాని రభస..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వికేంద్రీకరణ- డీసెంట్రలైజేషన్- అని అంటే విచ్ఛిత్తి- డిస్ ఫిగర్‌మెంట్- కాదు, కారాదు! అలాగే అభివృద్ధి అని అంటే ‘ఆర్భాటం’కాదు, కారాదు! ‘ఆడంబరత్వం’ సమృద్ధి కాజాలదు!! 2014వ సంవత్సరంనుంచి ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆర్భాటాన్ని ప్రస్ఫుటింప చేయడం చరిత్ర. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని ‘‘అమరావతి’’ కేంద్రంగా ఈ ఆడంబరత్వాన్ని ప్రదర్శించింది. ‘అంతర్జాతీయ స్థాయి’అన్నది ఈ ఆడంబరత్వం!! తెలుగువారి నిర్మాణ సంప్రదాయాలను, భారత జాతీయ కళారీతులను ఈ ‘అంతర్జాతీయ ఆడంబరత్వం’ దిగమింగడానికి యత్నించడం ఐదేళ్ల చరిత్ర! తొమ్మిది రంగాలకు చెందిన తొమ్మిది నగరాలను ‘అమరావతి’లో కుప్పేయడం, కూరేయడం ‘అంతర్జాతీయ స్థాయి’గా తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసింది!! ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు సగం జనాభా ‘అమరావతి’ ప్రాంగణంలోనే కేంద్రీకృతం కావడం ఖాయమన్న ‘్భవం’లేదా ‘భ్రాంతి’ కలగడం ఆ ఐదేళ్ల చరిత్ర. జన కేంద్రీకరణ కాలుష్య కేంద్రీకరణకు వాహనాల కేంద్రీకరణకు ‘‘రణగొణ’’ధ్వనుల కేంద్రీకరణకు దోహదం చేయడం మన నగరాలలోని వారికి ప్రత్యక్ష అనుభవం! అందువల్ల ‘కేంద్రీకరణ’ వైపుగా కాక ‘‘వికేంద్రీకరణ’’ వైపు ప్రగతి ప్రస్థానం జరగాలన్నది స్వచ్ఛ రాజధానిని, స్వచ్ఛ ప్రాంతాలను, స్వచ్ఛ భారత్‌ను అభిలషించేవారి అభిమతం! ‘వికేంద్రీకరణ’వల్ల కాలుష్యం తగ్గుతుంది, ప్రాకృతిక హరిత పరిమళాలు నగరాలలో, పట్టణాలలో, పల్లెలలో ప్రాంతాలలో దేశమంతటా సభలు తీరుతాయి!! అందువల్ల ‘వికేంద్రీకరణ’ అభిలషణీయమే!! వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిత్వంలోని ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ ప్రభుత్వం ‘వికేంద్రీకరణ’చేయగలిగితే అది హర్షణీయ పరిణామం కాగలదు. కానీ ‘వికేంద్రీకరణ’అంటే విడగొట్టడం కాదు, విచక్షణ రహితమైన వెదజల్లడం కాదు. నలుగురు వ్యక్తులు ‘‘ఒకేచోట ఒకే పని’’చేయడం కేంద్రీకరణ కావచ్చు. ఈ నలుగురూ అదే అదే పనిని నాలుగుచోట్ల చేయడం వికేంద్రీకరణ! నాలుగు నూనె గానుగలను ఒకే పల్లెలో నెలకొల్పడం ‘కేంద్రీకరణ’! నాలుగు పల్లెలలో వీటిని నెలకొల్పడం ‘వికేంద్రీకరణ’! కానీ ఒక వ్యక్తి అవయవాలను విడగొట్టి నాలుగు మూలలకూ విసిరివేయడం ‘వికేంద్రీకరణ కాదు’- అది విచ్ఛిత్తి మాత్రమే!! ‘నూనె గానుగ’ రోలును ఒకచోట, ‘రోకలి’ని మరోచోట, నడిపించే వృత్తికళాకారుడిని మరోచోట దూరదూరంగా ప్రతిష్ఠించడం ‘వికేంద్రీకరణ’ కాదు... అది వికృతమైన ఉన్మాదం మాత్రమే!! ‘కంప్యూటర్’ సిస్టమ్‌లోని ‘మదర్‌బోర్డు’ను ఒకచోట, ‘మానిటర్’ను మరోచోట, ‘కీబోర్డు’ను వేరొకచోట దూరదూరంగా నెలకొల్పడం వికేంద్రీకరణ కాదు... మహమ్మద్‌బిన్ తుగ్లక్ నాటి చరిత్రకు పునరావృత్తి మాత్రమే కాగలదు!! అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజధానిని సమన్వయ స్థితంగా వికేంద్రీకరించవచ్చు... కాని విచక్షణ రహితంగా విడగొట్టడం రాజకీయ విజ్ఞత కాజాలదు!!
దేశంలో ఏ ప్రాంతానికి కూడ రెండు మూడు రాజధానులు లేవు. జమ్మూకశ్మీర్‌కు మాత్రమే- వాతావరణంలో వచ్చే విపరీతమైన మార్పులు కారణంగా- రెండు రాజధానులున్నాయి. ‘హేమంత’ రాజధాని జమ్మూ నగరం, ‘వసంత’ రాజధాని శ్రీనగరం. చలికాలం-హేమంతం-లో శ్రీనగరంలో భరింపరాని చలి ఉండడంవల్ల ‘పాలనా యంత్రాంగాన్ని’- దర్బార్‌ను- జమ్మూకు తరలిస్తున్నారు. కానీ దీనివల్ల, ఈ తరలింపువల్ల రెండు వారాలపాటు పాలన వ్యవస్థ స్తంభించిపోతోందట. అందువల్ల ఈ ‘దర్బార్’ తరలింపునకు స్వస్తిచెప్పి, శ్రీనగర్‌నుంచే చలికాలంలో కూడ పాలన జరగాలన్న ‘కోరిక’ తరచు వినిపిస్తోంది! రాష్ట్ర సచివాలయం, విధానమండలి, మంత్రివర్గం, రాజ్యపాల్ నివాసమైన ‘రాజ్‌భవన్’ ఒకేచోట ఉండడం అన్ని రాష్ట్రాలలోను కొనసాగుతున్న రాజ్యాంగ వ్యవస్థ, ఇలా ఈ ‘విభాగాలు’ ఏర్పడిన నగరాన్ని మాత్రమే రాజధాని అంటున్నారు. శాసన నిర్మాణం- శాసనసభ లేదా శాసనసభ, శాసన మండలి కలసిన ఉభయ సభల విధానమండలి- ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలోని మొదటి విభాగం! రెండవ విభాగం కార్యనిర్వహణ విభాగం, ఇదే మంత్రివర్గం, సచివాలయం! అధ్యక్ష పాలన ఉన్న ప్రజాస్వామ్యంలో ఈ రెండు విభాగాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సర్వస్వతంత్రంగా ఏర్పడి ఉన్నాయి. అది వేఱు! కానీ మన దేశంలో కేంద్రీయ స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడిఉంది. కార్యనిర్వహణ విభాగం, శాసన నిర్మాణ విభాగం పరస్పరం ముడివడి ఉండడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణం! మంత్రివర్గం పార్లమెంటులోను, విధాన మండలిలోను సభ్యులుగా ఉండడం ఈ ‘ముడి’...శాసన నిర్మాణ విభాగం విశ్వాసం- మద్దతు- ఉన్నంతవరకే కార్యనిర్వహణ విభాగం అధికారంలో ఉంటుంది! శాసన నిర్మాణ విభాగం -చట్టసభలు- చర్చించి ఆమోదించే అధికార ‘ప్రతిపాదన’ల- అఫిషియల్ బిల్లుల-ను మంత్రివర్గం రూపొందిస్తున్నారు. చట్టసభలలో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి. చర్చలలో ప్రధాన పాత్రధారులు మంత్రులే. అందువల్ల ఈ రాజ్యాంగ ప్రక్రియ సజావుగా జరగాలంటే చట్టసభలు ఉన్నచోటనే, అదే నగరంలో, సచివాలయం కూడ ఉండాలి! సచివాలయం ఉన్నచోటనే మంత్రివర్గం అధికార నివాసాలు ఉండాలి! ఇది సహజమైన రాజ్యాంగ సమీకృతి!!
ఈ సమన్వయ సమీకృతికి విరుద్ధంగా సచివాలయాన్ని విశాఖ పట్టణంలోను, చట్టసభల భవనాలను అమరావతిలోను ఏర్పాటుచేయడం వికేంద్రీకరణ కాదు, రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం మాత్రమే కాగలదు. సచివాలయాన్ని రాజ్‌భవన్‌ను అమరావతిలో కట్టి, చట్టసభలను విశాఖపట్టణంలో కట్టినప్పటికీ ఇదే విఘాతం ఏర్పడుతుంది! బుద్ధి, హృదయం ఒకే దేహంలో ఉన్నట్టు శాసన నిర్మాణ విభాగం, కార్యనిర్వహణ విభాగం ఒకే ‘ఊరి’లో ఉండాలి! ఇలా అమరిన తరువాత రాజధానిలోకాక మరోచోట సంవత్సరానికోసారి శాసనసభ సమావేశాలు జరుపుకోవచ్చు. మహారాష్ట్ర రాజధాని ముంబయి, నాగపూర్‌లో కూడ ఏడాదికోసారి శాసనసభ సమావేశాలు జరుపుతున్నారు. అందువల్ల శాసనసభ, శాసన మండలి, సచివాలయం, మంత్రుల నివాసాలు, రాజ్‌భవన్‌లను ఒకేచోట అమరావతిలోనే ఏర్పాటుచేయాలి! అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది!! దక్షిణపు కొసన ఉన్న ప్రజలకూ ఉత్తరపు కొసన ఉన్న ప్రజలకూ కూడ ఇది జీవన సౌలభ్యం! విశాఖపట్టణంలో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటుచేయండి, దానికి అనుబంధంగా ‘ఉన్నత న్యాయపీఠాన్ని’ -హైకోర్ట్ బెంచ్‌ని- కర్నూలులో పెట్టండి. లేదా ఉన్నత న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటుచేసి ‘విశాఖ’లో ఉన్నత న్యాయ పీఠాన్ని పెట్టండి. రాజధాని నగరంలోనే ‘హైకోర్టు’ ఉండవలసిన అనివార్యం లేదు. కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రాంతానికి కర్నూలు ఉన్నత న్యాయస్థానం సౌలభ్యం... కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి ‘విశాఖ’ ఉన్నత న్యాయస్థానం సౌకర్యవంతం... ఏమయినప్పటికి ఉన్నత న్యాయస్థానం ఉన్న నగరం రాజధాని కాజాలదు. అది ఉన్నత న్యాయాలయ స్థానం- సీట్ ఆఫ్ హైకోర్ట్- మాత్రమే కాగలదు... దేశమంతటా ఇదే తీరు!!
ఇలా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించవచ్చు!! రాజధాని పరిపాలన నగరంగా చిన్న నగరంగా స్వచ్ఛ నగరంగా అడ్డంగా విస్తరించాలి! భవనానికీ భవనానికీ మధ్య తోటలు, చెట్లు, పొలాలు... తోటలకు మధ్యలో భవనాలు! ఇదీ ‘హరిత నగర’ నిర్మాణ వైఖరి. క్రీస్తుశకం పదునాలుగవ, పదహైదవ, పదహారవ శతాబ్దులనాటి ‘హంపీ విజయనగరం’ ఇలాంటి ‘హరిత’రాజధాని!!! భారతదేశపు చరిత్రను అధ్యయనం చేయాలి, ఆదర్శాలను స్వీకరించి ఆచరించాలి!! దక్షిణ ఆఫ్రికాను, ఉత్తర కొరియాను అనుకరించడం ‘హంస’కాకిని అనుసరించినట్టు కాగలదు!! వికేంద్రీకరణ అంటే ‘సమీకృతి’ని ‘రాజ్యాంగ ప్రక్రియ స్వరూపాన్ని’ చెడగొట్టడం కాదు!! వాణిజ్య నగరాన్ని, క్రీడా నగరాన్ని, విద్యానగరాన్ని, చిత్ర నగరాన్ని, రకరకాల విచిత్ర నగరాలను అమరావతిలో కట్టకండి... వివిధ నగరాలలో పట్టణాలలో కట్టండి!! వికేంద్రీకరణ అంటే ఇది... ప్రాచీన భారతంలో రాజధానులు విద్యాకేంద్రాలు, వాణిజ్య కేంద్రాలు, కళాకేంద్రాలు, తీర్థయాత్రా స్థలాలు కాలేదు!! ఈ వివిధ రంగాల కేంద్రాలు దేశమంతటా- రాజధానులకు దూరంగా- విస్తరించి ఉండేవి!! అదీ వికేంద్రీకరణ!!