సంపాదకీయం

రక్షణ సమీకృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిధ రక్షణ దళాల సమీకృత వ్యవస్థ ఏర్పడడం ప్రహర్షణీయ పరిణామం. మన సరిహద్దుల భద్రతకు చైనా దురాక్రమణ ప్రమాదం పెరుగుతుండడం ఈ హర్షణీయ పరిణామానికి నేపథ్యం... గత ఇరవై ఏళ్లలో చైనా సైనిక వ్యయం ఎనిమిది వందల యాబయి శాతం పెరగడం మన భద్రతకు విఘాతకరంగా పరిణమించిన వైపరీత్యం. ఈ ఇరవై ఏళ్ల కాలవ్యవధిలో చైనాతో మన సరిహద్దు వివాదం పరిష్కారానికి నోచుకోకపోవడం సమాంతర వైపరీత్యం. చైనా క్రీస్తుశకం 1962లో మన దేశంపై భౌతిక దురాక్రమణ సాగించింది, అప్పటినుంచి ఇప్పటివరకు ‘వాస్తవ అధీనరేఖ’- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసి-ను చైనా ప్రభుత్వ దళాలు పదే పదే అతిక్రమించి మన వైపునకు చొఱబడుతుండడం ఈ భౌతిక దురాక్రమణకు కొనసాగింపు! ‘ఒక వలయం, ఒక దారి’- ఒన్ బెల్ట్ ఒన్ రోడ్- ఓబిఓఆర్- పేరుతో ప్రాచీనమైన ‘పట్టు బాట’- సిల్క్‌రోడ్-పై పెత్తనం వహించడానికి చైనా చేస్తున్న ప్రయత్నం ‘వ్యూహాత్మక’ దురాక్రమణ. ప్రాచీన కాలంలో ‘పట్టుబాట’ ప్రధానంగా మన ఉత్తరపు సరిహద్దు సమీపంలో టిబెట్ గుండా కొనసాగింది. మధ్య ఆసియానుంచి, ఐరోపా నుంచి పశ్చిమ ఆసియాలోని డమాస్కస్ నుంచి చైనా వరకు సాగిన ఈ పట్టుదారి వెంట భారతీయ వస్తువుల వినిమయం ప్రధానంగా జరిగింది. టిబెట్, చైనా, మధ్య ఆసియా వస్తు సామగ్రి కూడ ఈ బాట వెంట పయనించింది. ఈ ఉపరితల వ్యాపార పథంపై చైనా పెత్తనం పెరగడానికి కారణం టిబెట్‌ను చైనా దురాక్రమించడం, మన లడక్, జమ్మూకశ్మీర్ గుండా ఈ పట్టుబాట ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ మన భూభాగాలు చైనా అక్రమ అధీనంలో ఉన్నాయి. ఇదంతా వ్యూహాత్మక దురాక్రమణ.
సముద్ర మార్గాన్ని కూడ ‘పట్టుబాట’గా మార్చడం ద్వారా ‘ఒకే వలయం, ఒకే దారి’ సమగ్రం కాగలదు. కానీ ఈ ఒకే ‘వలయం’ మన దేశానికి నలువైపులా విస్తరించడం చైనా వ్యూహాత్మక దురాక్రమణ. ‘పసిఫిక్’నుంచి హిందూ మహాసాగరానికి, అక్కడనుంచి అట్లాంటిక్ సముద్రం గుండా మళ్లీ ప్రశాంత-పసిఫిక్- మహాసాగరానికి అంతర్జాతీయ జలమార్గం ఏర్పడి ఉంది. ఈ అంతర్జాతీయ జలమార్గం మన అండమాన్ ద్వీపాలకూ ఇండోనేసియా- సుమత్రా- ద్వీపానికి మధ్య ఏర్పడిన ఇరుకైన సముద్రం గుండా మన దేశానికి అత్యంత సమీపంగా కొనసాగుతోంది, శ్రీలంకను చుట్టి మళ్లీ మన లక్ష ద్వీపాలకు, మాల్‌దీవులకు మధ్యగల ఇరుకైన సముద్రంగుండా కొనసాగుతోంది!! సహస్రాబ్దుల తరబడి ప్రశాంత వాణిజ్య మార్గంగా ఉన్న ఈ ‘జల పథం’పై ‘పట్టుబాట’ పేరుతో అక్రమంగా ‘పట్టు’ను సాధించడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇలా ఈ ‘ఒకే వలయం’, ‘ఒకే బాట’ కార్యక్రమం మన దేశంచుట్టూ చైనా నిర్మిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ వలయం! ‘అఖండ భారత్’ వివిధ కాలాలలో విభజనకు గురికాకుండా ఉండినట్టయితే ఈ ‘అంతర్జాతీయ జలమార్గం’ మన సార్వభౌమ జలాలలో ఉండేది... అది వేఱుకథ. కానీ చైనావారి భౌతిక, వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడం మన దేశానికి అనివార్యం... ఈ అనివార్య కార్యనిర్వహణకు త్రివిధ రక్షణ దళాల సమీకృత వ్యవస్థ దోహదం చేయగలదు.
చైనా భౌతిక దురాక్రమణను వ్యూహాత్మక దురాక్రమణను మాత్రమేకాదు, వాణిజ్య దురాక్రమణను, దౌత్య దురాక్రమణను సైతం కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై మనకు వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేస్తుండడం చైనావారి దౌత్య దురాక్రమణ! పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ఆర్థిక ప్రాంగణాన్ని నిర్మిస్తుండడం చైనా చేస్తున్న పరోక్ష వాణిజ్య దురాక్రమణ. మన దేశాన్ని నాసిరకం వస్తువులతో ముంచెత్తుతుండడం చైనావారి ప్రత్యక్ష వాణిజ్య దురాక్రమణ. శత్రు దేశమైన చైనా మన దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామికావడం మన ప్రభుత్వం దాదాపు మూడు దశాబ్దులుగా పాటిస్తున్న ఆత్మహత్యాసదృశ విధానం. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చైనాకు వెళ్లి వచ్చిన తరువాత ఈ విధాన వైపరీత్యం మొదలైంది! ‘సరిహద్దు వివాదం’ పరిష్కారంతో నిమిత్తంలేకుండా చైనాతో వాణిజ్య, దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవాలన్న ‘పథభగ్న’- పాత్ బ్రేకింగ్- విధానం రూపొందడం ఈ వైపరీత్యం. ముప్పయి ఏళ్లు అమలుజరుగుతున్న ఈ విధానం వల్ల ‘‘సరిహద్దు వివాదం’’మూలపడింది! ఇలా మూలపడాలన్నదే చైనా వ్యూహం! సరిహద్దు వివాదం పరిష్కారం అయినట్టయితే చైనా ప్రభుత్వం తన దురాక్రమణలో ఉన్న మన భూభాగాలను తిరిగి మనకు అప్పగించవలసి ఉంటుంది. అందువల్ల ‘‘సరిహద్దు సమస్య’’ను చర్చల ద్వారా పరిష్కరించుకొనే నెపంతో చైనా సాగదీస్తోంది. చైనాను మన ప్రస్తుతం యుద్ధంలో ఓడించలేకపోవచ్చు, కానీ చైనాకూడ మన దేశాన్ని యుద్ధంలో ఓడించజాలదు. అందువల్ల చర్చల పేరుతో ‘సరిహద్దు’ సమస్యను కొనసాగించడం ద్వారా తన సైనిక ఆయుధ పాటవాలను పెంచుకొనడం చైనా లక్ష్యం!!
అందువల్ల మన ప్రభుత్వం మంగళవారం ఆమోదించిన ‘త్రివిధ రక్షణ దళాల సమీకృత వ్యవస్థ’వల్ల మన స్థల, జల సరిహద్దుల భద్రత నిర్వహణలో మరింత సమన్వయం పెరగవచ్చు! ఇంతవరకు సమన్వయం లేదని కాదు... త్రివిధ దళాల సమీకృతివల్ల భద్రతా నిర్ణయాలను తీసుకొనడంలోను అమలుజరపడంలోను వేగం పెరగవచ్చు. ఇంతవరకు ‘స్థల సేన’-ఆర్మీ-కు, నౌకాదళానికి, వైమానిక దళానికి విడివిడిగా అధిపతులు ఉన్నారు. ఈ ‘అధిపతులు’ వరిష్ఠత-సీనియారిటీ- ప్రాతిపదికగా ఇంతవరకు మూడు దళాల ఉమ్మడి వ్యవస్థకు అధ్యక్షత వహిస్తున్నారు. ముగ్గురిలో ‘వరిష్ఠుడు’- సీనియర్- త్రివిధ దళాల అధిపతుల సంఘానికి- ఛీఫ్స్ ఆఫ్ స్ట్ఫా కమిటీ- సిఓఎస్‌సి- అధ్యక్షత వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురినీ సమన్వయం చేయగల ఉన్నతోన్నత అధికారి నియుక్తుడు కానున్నాడు. ఈ కొత్త ‘‘రక్షణ దళాల అధిపతి’’- ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా- సిడిఎస్- మూడు రక్షణదళాల విభాగాలను పర్యవేక్షించనున్నాడు. అందువల్ల త్రివిధ రక్షణ బలాలమధ్య సమన్వయం పెరుగుతుంది. రక్షణ మంత్రిత్వశాఖలో ‘సైనిక కలాపాల విభాగం’- డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్- డిఎమ్‌ఏ- కొత్తగా ఏర్పడనుందట. ‘రక్షణ దళాల అధిపతి’ ఈ విభాగానికి అధ్యక్షుడుగాను, రక్షణశాఖ మంత్రి ప్రధాన సలహాదారుడుగాను కూడ వ్యవహరించనున్నాడట!! ఈ మార్పులు చేసినంత మాత్రాన మన రక్షణ సామర్థ్యం పెరగబోదు. మన రక్షణ వ్యయం కూడ గణనీయంగా పెరగడం అనివార్యం. ‘చైనా పాకిస్తాన్’ల ఉమ్మడి ప్రమాదం ముంచుకొస్తుండడం ఇందుకు కారణం. ఈ ‘ప్రమాదం’ ధ్యాసను తగ్గించి తన రక్షణ పాటవాన్ని పెంచుకొనడం చైనా వ్యూహం!! ముప్పయి ఏళ్లుగా జరుగుతున్న సరిహద్దు చర్చలు ఈ చైనా వ్యూహంలో భాగం... 1990 దశకం ఈ సరిహద్దు వివాద పరిష్కార చర్చలను విదేశ వ్యవహారాల మంత్రులు జరిపేవారు! దాదాపు ఇరవై సార్లు ఈ చర్చలు జరిగాయి. ఫలితం శూన్యం. ఆ తరువాత ఉభయ దేశాల ప్రత్యేక అధికారులు ఈ చర్చలను జరుపుతున్నారు. సంవత్సరానికోసారి ‘మొక్కుబడి’గా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో మన ప్రత్యేక ప్రతినిధి అజిత్‌దోవల్, చైనా ప్రతినిధి వాంగ్ ఛీ ఈ సరిహద్దు చర్చలు జరిపారు. ఈ ప్రత్యేక చర్చలు ఇప్పటివరకు ఇరవై రెండుసార్లు జరిగాయి!
అందువల్ల చర్చలద్వారా కాక చర్యలద్వారా మాత్రమే చైనా దురాక్రమిత భూమిని మనం తిరిగి స్వాధీనం చేసుకోగలం... అది ఎప్పుడన్నది ఇప్పుడు తేలకపోవచ్చు. కానీ 2018లో పనె్నండు లక్షల కోట్ల రూపాయల సైనిక వ్యయం చేసింది. మన రక్షణ వ్యయం ఇందులో నాలుగువ వంతు కూడ లేదు. అందువల్ల వచ్చే వార్షిక ఆదాయ వ్యయప్రణాళికలో మన రక్షణ వ్యయాన్ని కనీసం రెట్టింపుచేయాలి. అప్పుడు మాత్రమే చైనా దీటుగా మన రక్షణ పాటవం పెరుగుతుంది.