సంపాదకీయం
సస్య సమృద్ధి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వ్యవసాయ రంగం సస్య సమృద్ధం అవుతుండడం, స్వదేశీయ గోసంతతి అభివృద్ధికి పథకాలు రూపొందుతుండడం సమాంతర శుభ పరిణామాలు... నడుస్తున్న వ్యవసాయ సంవత్సరం- 2019, 2020-లో దేశంలో ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయట! ఇంత భారీ పరిమాణంలో ఆహార ధాన్యాలు ఉత్పత్తికావడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఇరవై ఎనిమిది కోట్ల యాబయి మూడు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తికాగా ఈ ఏడాది ఉత్పత్తి అరవై ఏడు లక్షల టన్నుల మేర పెరగడం వ్యవసాయ ప్రగతికి నిదర్శనం, వ్యవసాయదారుల ఆర్థిక సౌష్టవ విస్తరణకు నిదర్శనం. తెలంగాణలో ఈ ఏడాది కోటి ముప్పయి లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తికావడం కూడ అభూత పూర్వ పరిణామం. గత ఏడాది తెలంగాణ ప్రాంతంలో తొంబయి మూడు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తికాగా ఈ ఏడాది మరో ముప్పయి ఏడు లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెరగడం అద్భుతం. దేశం మొత్తంమీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం ‘కాకతీయ’ జల ఉద్యమ విజయానికి ప్రబల నిదర్శనం. దేశం మొత్తంమీద గత ఏడాది కంటె ఈఏడు మూడు శాతం మేర ఆహార ధాన్య ఉత్పత్తి పెరిగింది. తెలంగాణలో మాత్రం నలబయి రెండు శాతం మేర ఆహార ఉత్పత్తి పెరగడం ఆశ్చర్యకరం, ఆనందకరం. చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల బహుముఖ ప్రగతి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉందన్నది ధ్రువపడిన వాస్తవం. అయితే దేశవ్యాప్తంగా పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల ఉత్పాదక రంగంలో నిర్దేశిత లక్ష్యాలు ఈ ఏడాది నెరవేరలేదన్నది నిర్ధారిత నిజం. పప్పుల ఉత్పత్తి గత ఏడాది కంటె పెరిగినప్పటికీ వరి, గోధుమ ధాన్యాల స్థాయిలో పెరగలేదట. పసుపు ఉత్పత్తి తగ్గిపోవడం మరో సమాంతర విపరిణామం! వ్యవసాయ ప్రగతి నిజమైన ప్రగతి. వ్యవసాయ ప్రగతి కేంద్రీకృతం కావడం లేదు, వ్యవసాయ భూమి సహజంగానే దేశమంతటా విస్తరించడం శాశ్వత వికేంద్రీకరణ. అందువల్లనే భారీ పరిశ్రమల, సేవల ప్రగతికి భిన్నంగా వ్యవసాయ ఫలితాలు ప్రజలలో అత్యధికులకు లభిస్తున్నాయి. ప్రాచీన భారతదేశంలో పరిశ్రమలు కూడ వికేంద్రీకృతమయి ఉండేవి! అందువల్ల పాడి పంటలు, పారిశ్రామిక ఉత్పత్తుల ఫలితాలు సర్వజన- ఆల్ ఇన్‌క్లూసివ్- ప్రగతిని సాధించాయి! పాశ్చాత్యీకరణ ఈ పాడి పంటల ప్రాధాన్యాన్ని ధ్వంసం చేయడం చరిత్ర. పాశ్చాత్యీకరణకు కొనసాగింపు ప్రపంచీకరణ! ప్రపంచీకరణ ఫలితంగా చొఱబడిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ వ్యవసాయ రంగాన్ని కూడ కేంద్రీకరణకు గురిచేస్తున్నాయి. వేల ఎకరాల వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటుచేయడం ద్వారా యజమానులైన చిన్న రైతులను వ్యవసాయ శ్రామికులుగా మార్చడం బహుళ జాతీయ సంస్థలు సాధించదలచిన కేంద్రీకరణ...
కేంద్రీకరణ వల్ల ప్రగతి ఫలితాలు కొందరికి మాత్రమే దక్కడం చరిత్ర. మిగిలిన ఎందరో పేదరికానికి బలి అవుతారు. ఈ చరిత్ర బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన కాలం నాటిది!
‘‘పనె్నండు దేశాలు
పండుచున్నా కానీ
పట్టెడన్నము లోపమండీ,
ఉప్పు ముట్టుకుంటె
దోషమండీ, అయ్యో
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
మాకొద్దీ తెల్లదొరతనము..’’
అని బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమకారులు గళమెత్తడానికి ఇదీ కారణం! గ్రామీణ పరిశ్రమలు ధ్వంసం కావడం, గోసంతతి హత్యలకు గురికావడం ఈ బ్రిటన్ ‘పాలన’నాటి చరిత్ర. బ్రిటన్ దురాక్రమణ సమయంలో సైతం వ్యవసాయం ధ్వంసం కాలేదు, అయితే కుటీర గ్రామీణ పరిశ్రమలు ధ్వంసం కావడం, గోసంతతి నిర్మూలన జరగడం, వ్యవసాయ విధ్వంసానికి పూర్వరంగం! ‘ప్రపంచీకరణ’ వ్యవసాయాన్ని సైతం కొల్లగొట్టి కేంద్రీకృతం చేస్తోంది! ఇలా కేంద్రీకరణ పెరగడం అంతర్జాతీయ వాణిజ్యంలో మన ప్రాధాన్యం తగ్గిపోవడం ఒకదానితో మరి ఒకటి ముడివడిన విపరిణామాలు! బ్రిటన్ దురాక్రమణ ఆరంభమయ్యేనాటికి అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశం వాటా నలబయి శాతానికి పైగా ఉండేది. అమిత సంపన్న దేశం అప్పుడు మన దేశం... ఈ సమృద్ధికి కారణం వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు! ఆధునిక పరిభాషలోని ‘స్థూల జాతీయ ఉత్పత్తుల’లో ఆనాడు ఎనబయి ఐదు శాతం గ్రామీణ క్షేత్రంనుంచి లభించిన సమయం అది! ప్రస్తుతం మన స్థూల జాతీయ ఉత్పత్తి వ్యవసాయం వాటా కేవలం పదునాలుగు శాతం... డెబ్బయి శాతం జనాభాకు ఆలవాలమైన గ్రామీణ రంగం ‘‘ఉత్పత్తి’’వాటా ఇరవై నాలుగు శాతం!! అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం మన దేశం వాటా నాలుగు శాతం కంటె తక్కువ!!
ఈ క్రమానుగత ఆర్థిక పతనానికి కారణం గ్రామీణ ఉత్పాదక కేంద్రాలు క్రమంగా నశించిపోవడం. బ్రిటన్ విముక్త భారత్‌లో 1947నాటికి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల దేశవాళీ ఆవులు, ఎద్దులు, దూడలు ఉండేవన్నది చరిత్ర. ప్రస్తుతం మొత్తం గోసంతతి సంఖ్య దాదాపు పదహైదు కోట్లు మాత్రమేనట! ఈ గోసంతతిలో ఎన్ని దేశవాళీ ‘తెగలు’, ఎన్ని ‘జర్సీ’ తదితర కృత్రిమ సంకర పశువులు?? ఆ లెక్కలు లేవు! గోసంతతి నశించిపోవడం వల్ల మనం భారీగా రసాయనపు ఎఱువులను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది! మన విదేశీయ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడడానికి ఇదో ప్రధాన కారణం! దీనికంటె ఎక్కువ నష్టం కృత్రిమ రసాయన విషాలను ఎఱువులుగాను, క్రిమినాశకాలుగాను వాడడంవల్ల భూమి, ప్రకృతి దారుణంగా గాయపడుతుండడం. అందువల్ల సస్యసమృద్ధిని మాత్రమేకాక ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాల సమృద్ధిని సాధించడం మన దీర్ఘకాల విధానం కావాలి! ఇందుకు సేంద్రియ, ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను క్రమంగా విస్తరింపచేయాలి! సేంద్రియ వ్యవసాయానికి ప్రాతిపదిక దేశవాళీ ఆవు. ఒకప్పుడు దేశంలో రెండు వందలకు పైగా ‘తెగల’దేశవాళీ ఆవులు జీవించాయి. దశాబ్దులపాటు గోసంతతిని హత్యచేసి, ఆవు మాంసాన్ని డబ్బాలకు ఓడలకు ఎత్తి విదేశాలకు పంపిన కారణంగా ఈ ‘తెగ’ల సంఖ్య ఇరవై తొమ్మిదికి పడిపోయింది. ఉన్న ‘తెగల’ ఆవులను రక్షించడానికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం పూనుకొంటోంది. ‘‘పరిశోధక ప్రగతి ద్వారా శాస్ర్తియ వినియోగం, దేశవాళీ ఆవుల ప్రధాన ఉత్పత్తులు’’- ‘సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగుమెంటేషన్, ప్రైమ్ ప్రాడక్ట్స్ ఫ్రమ్ ఇండిజీనియస్ కౌస్’- ‘సూత్ర, పిక్’-అన్న పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుజరుపనున్నదట. దేశవాళీ ఆవుల సంఖ్యను పెంచడానికి, స్వదేశీయ గవ్యాల- ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి-ను వ్యవసాయానికి, మానవ వినియోగానికి ఉపయోగించే పద్ధతులను ప్రోత్సహించడానికి ఈ పరిశోధనలు దోహదం చేయవచ్చు!!
దేశంలో ఆహార వ్యవసాయ ఉత్పత్తుల సమృద్ధి గురించి పదే పదే ప్రస్తావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ‘‘సజ్జలు, జొన్నలు, రాగులు, అరికెలు, సామలు, కొర్రలు, ఊదరులు వంటి తృణ ధాన్యాలను ప్రజలు విరివిగా భోంచేయాలని’’ సూచించి ఉన్నాడు. కానీ ఈ ఏడాది ఈ తృణ ధాన్యాల ఉత్పత్తి ఆశించిన స్థాయికి పెరగలేదట! ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేసే ఈ తృణ ధాన్యాలను కూడ విరివిగా పండించడం ప్రస్తుత కర్తవ్యం..