సంపాదకీయం

గజిబిజి గాంధారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లోల ‘గాంధారం’ కుదుట పడుతుందా? అన్నది మళ్లీ వినిపిస్తున్న ప్రశ్న... ప్రాచీన ‘గాంధారం’ నేటి అఫ్ఘానిస్థాన్! ఈ గాంధారం చరిత్ర క్రీస్తుశకం ఏడవ శతాబ్ది చివరినుంచి రక్తసిక్తం అవుతూనే ఉంది. ఈ కల్లోల చరిత్రలో వర్తమాన ఘట్టం పద్దెనిమిదేళ్లుగా అమెరికా నాయకత్వంలోని ‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’-నాటో- దళాలు అఫ్ఘానిస్థాన్‌లో ‘శాంతి’ని నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నం! ‘అల్‌ఖాయిదా’, ‘తాలిబన్’ జిహాదీ మూకలతో ఈ దళాలు పద్దెనిమిది ఏళ్లుగా పోరాటం సాగించాయి. గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన అమెరికాకు, ‘తాలిబన్’ జిహాదీ బీభత్స మతోన్మాద ‘తండా’కు మధ్య ‘ఖతార్’ రాజధాని ‘దోహా’లో ‘యుద్ధ విరమణ’ ఒప్పందం కుదిరింది. ఈ ‘అంతర్జాతీయ అవగాహన’ ప్రాతిపదికగా అఫ్ఘానిస్థాన్ పౌర ప్రభుత్వానికి, తాలిబన్ ముఠాకు మధ్య ఈనెల పదవ తేదీనుంచి చర్చలు జరుగవలసి ఉంది. చర్చలు సఫలమయినట్టయితే ‘అంతర్గత అవగాహన’- ఇంటర్నల్ అగ్రిమెంట్- ఏర్పడుతుంది! అయితే పదవ తేదీన చర్చలు మొదలయ్యే అవకాశాలకు అప్పుడే అంతరాయం ఏర్పడి ఉంది! అమెరికాకు ‘తాలిబన్ల’కు మధ్య కుదిరిన ఒప్పందంలోని ప్రధాన నిబంధనను అఫ్ఘానిస్థాన్ పౌర ప్రభుత్వం తిరస్కరించడం ఈ అవరోధం... ఈ నిబంధనను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అంగీకరిస్తే తప్ప తాము పదవ తేదీ నుంచి మొదలుకావలసిన అంతర్గత చర్చలకు హాజరుకాబోమని ‘తాలిబన్’ ముఠావారు ప్రకటించారు. దోహాలో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం తమ నిర్బంధ గృహాలలో ఉన్న ఐదువేల మంది ‘తాలిబన్ జిహాదీ బీభత్సకారుల’ను ఈనెల పదవ తేదీలోగా నిర్బంధంనుంచి విడుదల చేయవలసి ఉంది. అలాగే ఏళ్లతరబడి తమ ‘చెఱ’లో ఉన్న దాదాపు వెయ్యి మంది ప్రభుత్వ దళాలవారిని, పౌరులను ‘తాలిబన్’ ముఠావారు కూడ మార్చి పదవ తేదీలోగా విడుదల చేయాలి! కానీ ప్రభుత్వ నిర్బంధ గృహాలలోని ‘తాలిబన్’ బీభత్సకారులను విడుదలచేసే ప్రసక్తిలేదని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అషఫ్‌ఘ్రనీ ఈనెల ఒకటవ తేదీన స్పష్టం చేశాడు. దోహా ఒప్పందం కుదిరిన మరుసటి రోజుననే అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వ అధినేత ఇలా ప్రకటించడం అమెరికా ప్రభుత్వం ఊహించని పరిణామం!
ఇలా అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు ఘనీ తిరస్కరించడానికి కారణం అమెరికా ప్రభుత్వం అవలంభిస్తున్న ఆధిపత్య విధానం! 2001 అక్టోబర్‌లో అమెరికా ఆధ్వర్యవంలోని ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’- ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి- నాటో- దళాలు అఫ్ఘానిస్థాన్‌లోని ‘అల్‌ఖాయిదా-తాలిబన్’ జిహాదీ మూకలపై యుద్ధం ప్రకటించిన నాటినుంచి అమెరికా ప్రభుత్వం ఈ ఆధిపత్యాన్ని వహిస్తోంది! అమెరికాలోని న్యూయార్క్ ‘ప్రపంచ వాణిజ్య కేంద్రం’- వరల్డ్ ట్రేడ్ సెంటర్- బృహత్ భవనాన్ని ‘అల్‌ఖాయిదా’ ‘తాలిబన్’ మూకలు 2001 సెప్టెంబర్‌లో విమానంతో ఢీకొట్టి కూల్చివేయడం, ఈ యుద్ధానికి కారణం! తాలిబన్ అల్‌ఖాయిదా మూకలను శిక్షించడం అమెరికా ప్రకటించిన యుద్ధానికి లక్ష్యం! 2002లో ‘తాలిబన్ల’ బీభత్స ప్రభుత్వం కూలిపోయింది. ‘అల్ ఖాయిదా’ జిహాదీ అఫ్ఘానిస్థాన్ నుంచి పలాయనం చిత్తగించి ‘యెమెన్’లోను, ఇతర దేశాలలోను స్థావరాలను ఏర్పరచుకున్నారు, కొన్ని వేల మంది ‘నేపాల్’లోకి ‘బంగ్లాదేశ్’లోని చిట్టగాంగ్ అడవులలోకి చొఱబడి పోయారు! ఇలా ‘తాలిబన్లు’ ‘‘ప్రభుత్వం’’నుంచి ‘అల్‌ఖాయిదా’ బీభత్సంనుంచి అఫ్ఘానిస్థాన్ విముక్తం అయినప్పటికీ ‘తాలిబన్’ ముష్కరులు మాత్రం వేల సంఖ్యలో అఫ్ఘానిస్థాన్ అంతటా తిష్ఠవేసి ఉన్నారు! బీభత్స కృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ‘‘ఈ బీభత్సకాండను ప్రతిఘటించడం అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి సాధ్యంకాని పని’’-అన్నది జరుగుతున్న ప్రచారం! అఫ్ఘానిస్థాన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిని పార్లమెంటును ప్రజలు ఎన్నుకుంటున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని మన దేశం నిర్మించి అఫ్ఘానిస్థాన్‌కు బహూకరించింది! కానీ ‘తాలిబన్’ మూకలు నిరంతరం బీభత్సకాండను కొనసాగిస్తుండడం ఈ పద్దెనిమిది ఏళ్ల చరిత్ర...
అందువల్ల యుద్ధం ముగిసినప్పటికీ ‘నాటో’దళాలు మాత్రం అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దళాలు నిష్క్రమించినట్టయితే అఫ్ఘానిస్థాన్ మరోసారి ‘తాలిబన్ల’ హస్తగతం కావడం ఖాయమన్నది కొనసాగుతున్న భయం! ‘నాటో’ సేనలు పూర్తిగా నిష్క్రమించిన తరువాత మన దేశం వంటి ఆసియా దేశాల సైనిక సహాయంతో ‘తాలిబన్ల’ను నిరోధించాలన్నది ‘అఫ్ఘానీ’ ప్రభుత్వం అంతరంగం! అయితే అఫ్ఘానిస్థాన్ పునర్ నిర్మాణంకోసం అనేక లక్షల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిన మన ప్రభుత్వం మన సైనికులను అఫ్ఘానిస్థాన్‌లో నెలకొల్పడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఇలా మన సైనికులు అఫ్ఘానిస్థాన్‌లో నెలకొనాలన్న కోరికను గతంలో అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హుస్సేన్ ఒబామా కూడ వ్యక్తపరచి ఉన్నాడు! మన ప్రభుత్వం అంగీకరించలేదు. అందువల్ల అమెరికా దళాలు, నాటో దళాలు శాశ్వతంగా అఫ్ఘానిస్థాన్ తిష్ఠవేసి ఉండడానికి ‘్భమిక’ కొనసాగుతోంది. కానీ ఇలా తమ సైనికులు విదేశాలలో యుద్ధాలు చేసి ప్రాణాలను పణంగా పెట్టడాన్ని అమెరికా పౌరులు వ్యతిరేకిస్తున్నారు! ఈ వ్యతిరేకత కారణంగానే అఫ్ఘానిస్థాన్ నుంచి తమ సైనికులను పూర్తిగా ఉపసంహరించుకొంటున్నామని అమెరికా అధ్యక్షులు పదే పదే ప్రకటిస్తున్నారు! అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే సంవత్సరంలో ఈ ఉపసంహరణ ప్రక్రియ గురించి మరింత ఆర్భాటం జరుగుతోంది! 2011 నాటికే తమ దళాలను అఫ్ఘానిస్థాన్ నుంచి పూర్తిగా ఉపసంహరిస్తామని గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. 2012వ సంవత్సరంలో అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నికయ్యాడు. 2011లో ఉపసంహరణ జరుగకపోవడానికి కారణం ‘తాలిబన్ల’ భయం... అందువల్ల ఉపసంహరణ గడువు 2014కు పొడిగింది! కానీ ఆ తరువాత కూడ ఇప్పటివరకు పదమూడు వేల మంది అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్నారు. ఇది అమెరికా ‘మత ప్రదాత’-వోటర్-లకు నచ్చని విషయం. అందువల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ‘అమెరికా-తాలిబన్’ ఒప్పందం ప్రకారం పదమూడు నెలలలో మొత్తం అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్ నుంచి వెళ్లిపోతారట! జూన్ నాటికే ఐదువేల నాలుగువందల అమెరికా సైనికులు స్వదేశానికి వెళ్లిపోతారు. నవంబర్‌లో జరుగనున్న ఎన్నికలో మళ్లీ ఎన్నిక కావడానికి వీలుగా ట్రంప్ ఈ ‘ఉపసంహరణ’ను ఉద్ఘోషించాడు! కానీ తాలిబన్లు ఆయుధ విసర్జన చేసినప్పుడు మాత్రమే ‘విషాద గాంధారం’ ‘ప్రశాంత గాంధారం’ కాగలదు. అందువల్లనే ఒబామా తాలిబన్లతో చర్చల ప్రక్రియను ఆరంభించాడు, ట్రంప్ కొనసాగించాడు!
కానీ తోడేళ్ల వంటి తాలిబన్లను అణచివేసినప్పుడు మాత్రమే వారు బీభత్సకాండను మానుకుంటారు. చర్చలవల్ల, ఒప్పందాలవల్ల బీభత్స జిహాదీ మూకలు తమ స్వభావాన్ని, లక్ష్యాన్ని మార్చుకోవు. మహాకవి కాళిదాసు చెప్పినట్టు ‘‘దుర్జనుడు ఉపకారం పొందినప్పటికీ దుర్మార్గాన్ని వదలడు, అపకారం పొందినప్పుడు మాత్రమే వాడు అణగిపోతాడు’’- ‘‘శామ్యేత్ ప్రతి అపకారేణ, న ఉపకారేణ దుర్జనః’’- అందువల్ల తాలిబన్లు మంచి మార్గానికి రాకపోవచ్చు! ఈ భయంవల్లనే అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ఈ ఐదువేల మంది తాలిబన్ బీభత్సకారులను ‘జైళ్ల’నుంచి వదలిపెట్టడానికి సంశయిస్తోంది! గతంలో అఫ్ఘానిస్థాన్ నుంచి పలాయనం చిత్తగించిన ‘తాలిబన్లు’ సోమాలియా తీరంలోని ఓడ దొంగలలో చేరిపోయారు. వీరి లక్ష్యం భారత వ్యతిరేక బీభత్సకాండ! బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో హిందువులపై దాడులు పెరగడానికి కారణం కూడ అల్‌ఖాయిదా మూకలు అక్కడ చేరిపోవడం! ఇప్పుడు ఐదువేల మంది జిహాదీ తోడేళ్లు నిర్బంధ గృహాలనుంచి బయటపడితే వాటిలో కనీసం కొన్ని వందలు మన దేశంలోకి దూకే ప్రమాదం లేకపోలేదు! గాంధారం, యోన దేశాలు ఒకప్పుడు అఖండ భారత్‌లో భాగం! అవే ఆ తరువాత అఫ్ఘానిస్థాన్‌గా ఏర్పడినాయి. ఈ మార్పునకు కారణం శతాబ్దులు సాగిన జిహాదీ బీభత్సకాండ...