సంపాదకీయం

కాలుష్యంపై ‘కొరడా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదు మహానగరంలోని శాస్ర్తిపురం ప్రాంతంలో నెలకొని ఉన్న నూట తొంబయి ఐదు కాలుష్య పారిశ్రామిక వాటికలను నిర్మూలించాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం ప్రభుత్వ యంత్రాంగంవారి పనితీరునకు తీవ్రమైన అభిశంసన! 2012నుంచి ఈ శాస్ర్తిపురం ప్రాంతంలో దాదాపు రెండువందల పరిశ్రమలు అక్రమంగా పుట్టలు పెరిగినట్టు నిర్ధారణ జరగడం ‘‘అంతర్జాతీయ స్థాయి’’ మహానగరాల సిద్ధాంతానికి గొప్ప అవమానం! ఇలా భాగ్యనగరంలోని ‘రాజేంద్రనగర్’ సమీపంలోని ‘కాటేదాన్’ పరిధిలోని ఈ శాస్ర్తినగర్ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలు ఇన్ని నెలకొని ఉండడం గురించి ఇంత కాలం తమకు తెలియదని ‘బృహత్ హైదరాబాదు మహానగర పాలిక’- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్- జిహెచ్‌ఎమ్‌సి-వారు అభినయించడం మరో వైపరీత్యం! ఈ అభినయ విన్యాసాల గుట్టుకూడ ఉన్నత న్యాయస్థానం వారు బుధవారం జారీచేసిన ఆదేశంతో రట్టయిపోయింది. ఈ ‘శాస్ర్తిపురం’ప్రాంతంలో కేవలం మూడు పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నట్టు మహానగర పాలిక తరఫున ఇంతకుముందు ప్రమాణ పత్రం దాఖలయిందట! ‘జిహెచ్‌ఎమ్‌సి’ సహాయ నిర్వాహకుని- డిప్యూటీ కమిషనర్ తరఫున దాఖలయిన ఈ ప్రమాణ పత్రం- అఫిడవిట్- ‘పచ్చి అబద్ధాల పత్రం’- బ్లేటెంట్‌లై- అని ప్రధాన ఉన్నత న్యాయమూర్తి రాఘవేంద్ర సింహ చౌహాన్, ఉన్నత న్యాయమూర్తి ఏ.అభిషేక్‌రెడ్డి నిర్ధారించడం అధికార యంత్రాంగానికి ‘చెంపపెట్టు’... డిప్యూటీ కమిషన్ ‘ప్రతీక’మాత్రమే. తెలంగాణలోనే కాదు, తెలుగు ప్రాంతాలలోనే కాదు, దేశమంతటా అన్ని ప్రాంతాలలోను ప్రభుత్వ యంత్రాంగంలోని అత్యధికులను అలసత్వం, నిర్లక్ష్యం, ప్రజల పట్ల క్రూరత్వం, లంచగొండితనం, అక్రమ ప్రవృత్తి ఆవహించి ఉందన్నది నిరంతరం ఆవిష్కృతం అవుతున్న దృశ్యం! ఉన్నత న్యాయస్థానంవారు తరచి తరచి నిజనిర్ధారణ చేసిన తరువాత, ‘జిహెచ్‌ఎమ్‌సి’వారు మరో ‘ప్రమాణ పత్రం’ దాఖలుచేశారట. ‘‘ఈ ప్రాంతంలో కాలుష్య కారకమైన దాదాపు మూడువందల పారిశ్రామిక సంస్థలకు హెచ్చరిక పత్రాలను జారీచేసినట్టు ‘‘నగరపాలిక’ నిర్వాహకుడు-కమిషనర్- దాఖలుచేసిన ప్రమాణ పత్రంలో పేర్కొనడం ప్రభుత్వ యంత్రాంగపు నిర్లక్ష్యానికి, అంతర్గత సమన్వయ రాహిత్యానికి నిదర్శనం... మూడు ఎక్కడ? మూడువందలు ఎక్కడ? మొదటి ప్రమాణ పత్రంలో బహుశా రెండు సున్నలను యంత్రాంగంలోని వారు ‘‘మింగేశారు’’ కాబోలు!
హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయి ఆదర్శనగరంగాను, నమూనా నగరం- మోడల్ సిటీ- గాను అవతరించినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు 1999వ, 2004వ సంవత్సరాల మధ్య భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయేలాగ ప్రచారం చేయడం చరిత్ర. అంటే 2004 నాటికే హైదరాబాదు జీవన సౌలభ్య సముత్కర్ష స్థితికి ‘పతాకం’ వంటిదన్న మాట! 2004వ 2014వ సంవత్సరాల మధ్య ఈ సౌలభ్యం, ఈ స్వచ్ఛత, మహానగర ప్రాంగణంలోని జీవ వైవిధ్య పరిరక్షణ మరింత పెరిగి ఉండాలి, కనీసం 2004వ సంవత్సరం నాటికి ‘గొప్ప స్థితి’ యథాతథంగా కొలువుతీరి ఉండాలి! చిన్న రాష్ట్రాల ఏర్పాటువల్ల పెద్ద రాష్ట్రాలలోకంటే పాలన సౌలభ్యం, జీవన సౌలభ్యం, ప్రగతి వికేంద్రీకరణ, పర్యావరణ స్వచ్ఛత విస్తరించడమన్నది అందరూ విశ్వసిస్తున్న వాస్తవం! తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడం జాతీయ స్థాయిలో ‘స్వచ్ఛ్ భారత్’ మహోద్యమం ఆరంభంకావడం సమాంతర శుభ పరిణామాలు! కానీ 2014 తరువాత కూడ ‘్భగ్యనగర’ స్వచ్ఛ సుగంధి సౌభాగ్యం పెరగలేదన్నది, కాలుష్యం తొలగలేదన్నది ఉన్నత న్యాయస్థానం వారి నిర్ధారణ ద్వారా బుధవారం మరోసారి ధ్రువపడిన వాస్తవం!
హైదరాబాద్ మహానగరంలోని ఒక చిన్న ప్రాంతంలోనే మూడువందల కాలుష్య కారక పరిశ్రమలు ఇన్నాళ్లుగా పనిచేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా ఈ కాలుష్యం కొనసాగడానికి కారణభూతులైన వివిధ అధికార విభాగాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నది ఉన్నత న్యాయస్థానం వారు ప్రభుత్వానికి జారీచేసిన నిర్దేశం. కాలుష్య కారకమైన పరిశ్రమలు విస్తరిస్తున్నప్పటికీ కళ్లుమూసుకొని తెలియనట్టు అభినయించిన ‘బృహత్ హైదరాబాదు మహానగర పాలిక’, ‘కాలుష్య నియంత్రణ మండలి’- పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- పిసిబి-, విద్యుత్ శాఖల ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలను తీసుకోవాలన్నది, హైకోర్టువారు చేసిన నిర్ధారణ! ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చర్యలకు ఉపక్రమించక తప్పనిస్థితి... కానీ హైదరాబాద్ బృహత్ ప్రాంగణంలో నియమ నిబంధనలను ఉల్లంఘించి స్వచ్ఛతకు భంగం కలిగిస్తున్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి? అన్నది ప్రభుత్వం తేల్చవలసిన వ్యవహారం. తెలంగాణ ప్రభుత్వం మాత్రమేకాదు, దాదాపు అన్ని ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడ న్యాయస్థానాలు, హరిత న్యాయ మండలులు అదలించినప్పుడు మాత్రమే ఉలికిపడి లేస్తున్నాయి, మిగిలిన సమయంలో నిద్రను అభినయిస్తుండడం ప్రజలకు ఎదురౌతున్న అనుభవం... ఒక ప్రాంతంలోని కాలుష్య పరిశ్రమలను మూసివేయాలని న్యాయస్థానాలు నిర్దేశించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ‘‘నడుములను బిగిస్తున్నాయి’’. మిగిలిన ప్రాంతాలలోని కాలుష్య జనక పరిశ్రమలు యథావిధిగా నడుస్తూనే ఉంటాయి! నడుస్తూనే ఉన్నాయి! కానీ స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణానికి నడుములను బిగించి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమంత తాముగా దేశంలోని అన్ని కాలుష్య పరిశ్రమలను ఎందుకని మూయించరాదు?? మూయించలేక పోవడానికి ఏకైక కారణం ప్రభుత్వ యంత్రాంగాలు అట్టడుగు స్థాయినుంచి అత్యున్నత స్థాయివరకు ఈ వైపరీత్యాన్ని ‘‘పట్టించుకొనక పోవడం!’’ వ్యాపార పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయవేత్తలు, దళారీల ‘‘దుష్టచతుష్టయం’’ కలసికట్టుగా మొత్తం దేశాన్ని అవినీతి సౌధంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు ‘అవిరళ’ కృషిచేస్తుండడం ఈ ‘‘పట్టించుకొనక పోవడానికి కారణం! ఇప్పుడు ఈ ‘శాస్ర్తిపురం’ ప్రాంతంలోని కాలుష్యపు ‘బట్టీల’ను ప్రధానంగా ‘ప్లాస్టిక్’ బట్టీలను మూసివేస్తున్న ప్రభుత్వం తనంతతానుగా హైదరాబాద్ ప్రాంగణంలోని, తెలంగాణ ప్రాంగణంలోని అన్ని కాలుష్యకారక పరిశ్రమలను తక్షణం ఎందుకని మూసివేయరాదు?? అలా చేసినట్టయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో ఒక శుభముహూర్తాన తమ ప్రాంతాలలోని అన్ని కాలుష్య పరిశ్రమలను నిర్మూలించినట్టయితే ‘స్వచ్ఛ్భారత’ పునర్ నిర్మాణం వేగవంతం అవుతుంది! ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ వాస్తవాన్ని ఎప్పుడు గుర్తిస్తారు??
గంగానది కాలుష్యగ్రస్తం కావడం ముచికుంద సుజల ప్రవాహం ‘మూసీ మురుగు’గా మారడానికి కాని దశాబ్దుల పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర రసాయనాలు ఈ నదులలో కలసిపోవడం... ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా గంగానది ప్రక్షాళితవౌతోంది. ‘మూసీ’ మళ్లీ అవిరళ సుజల వాహినిగా మార్చనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా చెబుతూనే ఉంది. కానీ ప్రక్షాళిత వాహినులు మళ్లీ మురికి నీటి వాగులుగా మారకుండా నిరోధించాలంటే పరిశ్రమల కాలుష్యాన్ని నిర్మూలించడం ప్రాథమిక అనివార్యం! హరిత నియమాలను నిరంతరం నీరుకార్చుతున్నవారు, విదేశాల పెట్టుబడులకోసం దేబిరిస్తున్నవారు ఉన్నత న్యాయస్థానం తీర్పునుంచి నేర్చుకోవలసిన పాఠం ఇది...