సంపాదకీయం

తొలగని మతోన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌లోని ‘మత వర్గ జన నిష్పత్తి సంతులనం’- డెమొగ్రాఫిక్ బాలెన్స్-లో మార్పులుచేయడం తమ ప్రభుత్వ అభిమతం కాదని దేశ వ్యవహారాల మంత్రి అమిత్‌షా కొత్తగా ఏర్పడిన ‘అప్నీ పార్టీ’ ప్రతినిధులకు హామీఇవ్వడం అంతుపట్టని వ్యవహారం! ఇలాంటి హామీ ఇవ్వడంవల్ల జమ్మూలోను దేశంలోని ఇతర ప్రాంతాలలోను శరణార్థులై జీవిస్తున్న లక్షల మంది ఇస్లామేతర కశ్మీరీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లడంపై అనవసర అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ పరిఢవిల్లుతున్న మన దేశంలో అన్ని మతాల వారికి సమాన నివాస అవకాశాలున్నాయి. కానీ గత సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ, ముప్పయి ఐదవ -ఏ- అధికరణాలు రద్దయ్యేవరకు జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఈ ‘సమాన నివాస’పు హక్కులు లేవు, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు జమ్మూకశ్మీర్‌లో స్థిరనివాసం ఏర్పరచుకొనడానికి కాని ఆస్తులు కొనుగోలు చేయడానికి వీలుండేది కాదు. ఇది జాతీయ సమైక్య వ్యవస్థకు, సార్వభౌమ ప్రాదేశిక సమగ్రతకు విఘాతకరం పరిణమించి ఉండిన దశాబ్దుల వైపరీత్యం! అస్సాం ప్రజలు కేరళలోను, రాజస్థానీలు బెంగాల్‌లోను, ఉత్తరఖండ్ వాసులు తెలుగు ప్రాంతాలలోను స్థిరపడి శాశ్వతంగా నివసించడానికి ఆస్తులను సంపాదించుకొనడానికి వీలున్నప్పుడు ఇతర ప్రాంతాలవారు జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఎందుకు శాశ్వతంగా నివాస అధికారాన్ని, ఆస్తులను సంపాదించే హక్కును దశాబ్దుల తరబడి కోల్పోయారు?? అన్న ప్రశ్నకు సమాధానం- పై రెండు అధికరణాలు రద్దుకావడం! పై రెండు అధికరణాల పేరుతో లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని అడ్డుపెట్టుకొని జమ్మూకశ్మీర్‌లోని విచ్ఛిన్నవాదులు ఈ ‘మత వర్గ జన నిష్పత్తి సంతులనం’ గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ ‘ప్రత్యేకత’లేదు. కానీ జమ్మూకశ్మీర్‌లో నెలకొని ఉన్న ప్రశాంతిని సమన్వయాన్ని చెడగొట్టడానికై పొంచి ఉన్న అంతర్గత శత్రువులు అదనుదొరికితే చాలు అలజడి సృష్టించ యత్నిస్తున్నారు. ‘గోడ’కవతల పొంచి ఉన్న బీభత్సపు తోడేళ్లు మళ్లీ దూకడంకోసం ఉవ్విళ్లూరుతున్నారు. ‘కరోనా రోగక్రిముల’నిరోధంకోసం, నిర్మూలనకోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటుచేసిన ప్రాంతీయ సదస్సులో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ఈ తోడేళ్ల ‘ఉనికి’కి మరో ధ్రువీకరణ. ‘కరోనా’నిర్మూలనకోసం ‘దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య’- సౌత్ ఏషియన్ అసోసియేషన్ షార్ రీజినల్ కోఆపరేషన్- సార్క్- దేశాలు అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవాలని మోదీ ప్రతిపాదించాడు. ఈ నిధికి మన దేశం డెబ్బయి కోట్ల రూపాయల విరాళం కూడ ప్రకటించింది. ఇరవై ప్రముఖ దేశాల కూటమి- గ్రూప్ ఆఫ్ ట్వెంటీ- జి 20- కూడ ఇలాంటి కరోనా వ్యతిరేక నిధిని ఏర్పాటుచేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రతిపాదించాడట! అయితే ఈ ‘దృశ్యమాధ్యమ అనుసంధాన సదస్సు’- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి అవకాశం లభించిన పాకిస్తాన్ ప్రతినిధి జాఫర్ మీర్జా అనేవాడు ‘కరోనా’ను కాక ‘జమ్మూకశ్మీర్’ గురించి మాట్లాడాడట.
ఇలా జమ్మూకశ్మీర్‌లో అలజడిని మళ్లీమళ్లీ సృష్టించే పాకిస్తానీ పన్నాగం కొనసాగుతూనే ఉంది! అమిత్‌షా కొత్త ఢిల్లీలో ‘అప్నీపార్టీ’ ప్రతినిధులకు ‘మతవర్గ జన సంతులనం’ గురించి అక్కరలేని విచిత్రమైన హామీని ఇస్తుండిన సమయంలోనే కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జిహాదీ బీభత్సకారులు దాడులకు పాల్పడ్డారు. అప్రమత్తులైన మన భద్రతా దళాలవారు జరిపిన ఎదురుకాల్పులలో నలుగురు బీభత్సకారులు హతం కావడం వేఱే సంగతి. కానీ పాకిస్తాన్ నుంచి ‘గోడ’దూకి వచ్చిన లష్కర్ ఏ తయ్యబా ముష్కరులు, కశ్మీర్‌లోనే పుట్టపగిలిన ‘హిజ్‌బుల్’ ముజాహిదీన్ ముఠా హంతకులు కలసికట్టుగా దాడులుచేయడం అసలు కథ... పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్- ఐఎస్‌ఐ- ఇప్పటికీ ఈ ‘కలసికట్టుతనాన్ని’కాపాడుతుండడం అసలు కథ. జమ్మూకశ్మీర్‌లోను, మొత్తం మన దేశంలోను దశాబ్దుల తరబడి బీభత్సకృత్యాలను సాగించిన వివిధ జిహాదీ హంతక ముఠాల మధ్య సమన్వయకర్త ‘ఐఎస్‌ఐ’... అందువల్ల జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికీ వౌలిక ప్రమాదం జిహాదీ బీభత్సకాండ... దీన్ని సమూలంగా నిర్మూలించడం వౌలిక పరిష్కారం...
ఈ సంగతిని వదలిపెట్టి కొత్తగా ఏర్పడిన కశ్మీరీ ప్రాంతీయ పక్షం వారు ‘మత వర్గాల జన నిష్పత్తి’ గురించి ప్రస్తావించడం విచిత్రమైన వ్యవహారం. ఈ ‘నిష్పత్తి’సంతులనాన్ని మార్పుచేయడం తమ అభిమతం కాదని అమిత్‌షా హామీఇవ్వడం మరింత విచిత్రం...
జమ్మూకశ్మీర్‌లోని జనాభా ఇస్లాం మతస్థులు ఎక్కువగా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి ఇస్లాం మతేతరులు తమ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడ రాదన్నది ‘ప్రచ్ఛన్న విచ్ఛిన్నకారుల’కోరిక! ఇలా స్థిరపడినట్టయితే ఇస్లాం మతస్థుల సంఖ్యాధిక్యం తగ్గిపోతుందట! తగ్గిపోరాదన్నది ఈ ప్రచ్ఛన్న విచ్ఛిన్నవాదుల అభిమతం. ఈ పరోక్ష విచ్ఛిన్నవాదులు వివిధ నామాలతో చెలామణి అవుతున్న ప్రాంతీయ రాజకీయ పక్షాలవారు. ‘పిడిపి’, ‘నేషనల్ కాన్ఫరెన్స్’ తదితర పక్షాలు ఈ ‘ఇస్లాం జన సంఖ్యాధిక్యం’్భంగపడరాదని కోరుతున్నారు. ‘పిడిపి’నుంచి చీలినవారు కొత్తగా ఇప్పుడీ ‘అప్నీ’పక్షాన్ని ఏర్పాటుచేశారట! ఇలా జమ్మూకశ్మీర్‌లో మాత్రం ‘మతవర్గాల జన నిష్పత్తి’ యథాతథంగా కొనసాగాలని కోరుతున్నవారు ఇదే సూత్రాన్ని మొత్తం దేశానికి అన్వయించడానికి మాత్రం సిద్ధంగాలేరు!! జమ్మూకశ్మీర్‌లోని అధిక సంఖ్య మతంవారు శాశ్వతంగా అధిక సంఖ్యలోనే ఉండాలట! ఇది న్యాయమయినప్పుడు దేశంలోని ప్రతి ప్రాంతంలోను అధిక సంఖ్య మతాల ప్రజలు శాశ్వతంగా అధిక సంఖ్యలోనే ఉండాలని కోరడం కూడ న్యాయమే కదా!! అందువల్ల అధిక సంఖ్య మతాల ప్రజలను వంచన ద్వారాను, ప్రలోభాల ద్వారాను ఇతర మతాలలోకి మార్పడి చేస్తున్నవారి లక్ష్యం అన్యాయమని అంగీకరించాలి! దేశంలో తరతరాలు యుగాలుగా పుట్టిపెరిగిన అధిక సంఖ్య మతస్థులను క్రమంగా అల్పసంఖ్యలోకి మార్చడం మతంమార్పిడి ముఠాల లక్ష్యం. సర్వమత సమభావ స్ఫూర్తికి విఘాతకరమైన ఈ దుర్మార్గపు లక్ష్యాన్ని అందరూ నిరసించాలి!
జమ్మూకశ్మీర్‌లో నిజానికి ‘మతవర్గ జన నిష్పత్తి సంతులనం’ శతాబ్దుల తరబడి నష్టమైంది. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దినాటికి కశ్మీర్‌లో ఇస్లాం మతస్థులు లేరు. ప్రజలందరూ ఇస్లాం మతేతరులు, ఈ దేశంలో అనాదిగా వికసించిన మతాలవారు. కానీ శతాబ్దుల తరబడి ‘జిహాదీ’లు ఇస్లాం మతేతరులను చంపేశారు, బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు, స్వస్థలాలనుంచి తరిమేశారు. కశ్మీర్ ‘లోయ’లో 1990నాటికి వంద శాతం ఇస్లాం మతస్థులు కావడానికి ఈ బీభత్సం కారణం! పనె్నండవ శతాబ్దిలో ‘సున్న’ శాతం ఉండిన ‘ఇస్లాం’ మతస్థులు 1990నాటికి వంద శాతం అయిన విపరిణామక్రమం నిజానికి ‘‘మతవర్గాల నిష్పత్తి సంతులనాన్ని’’ భగ్నంచేసింది, ఇస్లామేతరులను సమూలంగా నిర్మూలించింది. ఇప్పుడైన లోయనుంచి నిర్మూలనకు గురిఅయిన ఇస్లాం మతేతరుల శరణార్థులు తమ స్వస్థలాలకు తిరిగి రాకూడదన్నదే జిహాదీల అభిమతం. అలా తిరిగి వచ్చినట్టయితే ‘సంతులనం’మారుతుందట! ఈ నేపథ్యంలో మార్పుచేయడం తమ అభిమతంకాదని దేశ వ్యవహారాల మంత్రి హామీఇవ్వడం విచిత్రం కాదా?? అన్ని మతాలవారికి సమానత్వం ఉన్న దేశంలో ఇలా మత నిష్పత్తి ధ్యాస ఎందుకు??