సంపాదకీయం

సుస్థిర టర్కీ కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలు గెలిచారు. ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజాగళానికి మరింతగా విలువ పెరిగింది. నియంతలు, నియంతృత్వాలకు ఇది కాలం కాదు. సమస్యల పరిష్కారానికి తిరుగుబాట్లు శరణ్యం కాదన్న వాస్తవం మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం కోసం కొనే్నళ్ల క్రితం అరబ్బు దేశాల ప్రజలు తిరగబడి ‘నియంతా..నువ్వెంత,,’అన్న రీతిలో తరిమికొట్టిన చారిత్రక క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలు కూలుతాయన్నదే ఇప్పటి వరకూ చూశాం. కానీ టర్కీ ప్రజలు ఈ విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దేశాధ్యక్షుడిపై విమర్శలున్నా, ఆయన పాలనా విధానం సరైనది కాకపోయినా..సమస్యల పరిష్కారానికి చర్చలే పరిష్కారమని తేల్చిచెప్పారు. సైనిక తిరుగుబాటుతో అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుత్సిత ప్రయత్నాన్ని సుతరామూ అంగీకరించలేదు. తామే అపర సైనికులుగా మారి తిరుగుబాటుదారుల్ని మట్టుబెట్టారు. దేశమేదైనా, పాలనా విధానం ఎలాంటిదైనా శాంతి సామరస్యాలు, సంయమనానికి ప్రజాస్వామ్యమే మూలకందమన్న నిజమూ నికార్సుగా రుజువైంది. మొదటి నుంచీ ప్రజాస్వామ్యమే పెట్టని కోటగా ఉన్నా..టర్కీలో సైన్యానికి విశేషమైన పట్టు, ప్రాధాన్యత ఉంది. తనంతట తానుగా ఏకపక్షంగా వ్యవహరించే స్వతంత్రతా దానికి ఉంది. గతంలో పౌర ప్రభుత్వాలకు, సైనికులకు మధ్య ఘర్షణలు జరగడం..నాలుగుసార్లు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కూలిపోవడమూ టర్కీ ప్రజలు కళ్లారా చూశారు. వాటి ఫలితాలనూ, పర్యవసానాలనూ అనుభవించారు కూడా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో పనిచేసే సైన్యానికి మధ్య అనునిత్యం సామరస్య పూర్వ క సంబంధాలు ఉండే అవకాశం ఉండదన్నది ఎంతైనా వాస్తవం. ఇలాంటి పరిస్థితే టర్కీలో అనేకసార్లు తలెత్తడం, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావడం తప్ప తమకు ఏ మేలూ జరుగకపోవడం కూడా తాజా తిరుగుబాటును ప్రజలు సుతరామూ అంగీకరించక పోవడానికి..తామే తిరగబడి కుట్ర దారుల్ని మట్టుబెట్టడానికి ప్రధాన కారణమని భావించడంలో అతిశయోక్తి ఏమీ కాదు. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ రాణించాలం టే..ప్రజా హక్కులకు రక్షణ, విలువల పరిరక్షణ జరగాలంటే పాలనాపరమైన సుస్థిరత కీలకం.
ఇలాంటి సుస్థిరతను అధ్యక్షుడు ఎర్డోగన్ అందించారు. 2002లో ఎర్డోగన్ సారథ్యంలోని జస్టిస్, డెవలప్‌మెంట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైనిక తిరుగుబాట్లకు ఆస్కారం లేకపోయింది. అధికార పార్టీ విధానాల పట్ల అసంతృప్తి ఉన్నా..దాన్ని కుప్పకూల్చాలన్న తీవ్రస్థాయి వ్యతిరేకత మాత్రం ప్రజల్లో కలుగలేదు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు ఎవరూ అరాచకాన్ని కోరుకోరు. లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుని సంక్షోభ కుంపట్లను రాజేసేందుకు ప్రయత్నించరు. తాజా సైనిక తిరుగుబాటును ప్రజలే సైనికులై అణచివేయడానికీ కారణమిదే! అంతా సక్రమంగా ఉన్నా..ఎర్డోగన్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కుట్రదారులు భావించారు. తాము తొలి అడుగేస్తే..ఎర్డోగన్ వ్యతిరేకత వెల్లువెత్తుతుందని, అన్ని వర్గాలూ తమకే బాసటగా నిలుస్తాయనీ ఆశించారు. అందుకు కారణం..మూడేళ్ల క్రితం ఆయన ప్రభుత్వం పాల్పడ్డ అమానుషమైన పోలీసు చర్యే. అప్పట్లో ఎర్డోగన్ సర్కార్ అన్ని రకాలుగానూ అణచివేత విధానాలకు పాల్పడింది. ఉదారవాదులు, మీడియా, ప్రతిపక్ష నేతలూ ఇలా ఎవర్నీ వదలకుండా ఉక్కుపాదంతో అణచివేసింది. ఆ ఉదంతం అంతర్జాతీయంగా కూడా ఎర్డోగన్ విధానాలపై ప్రజాస్వామ్యవాదులు కనె్నర్ర చేసేలా చేసింది! అప్పటినుంచి ఇప్పటి వరకూ ఎర్డోగన్ వ్యతిరేక ఉద్యమాలు ఎప్పుడు జరిగినా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడమూ ఆనవాయితీనే. ఇదే రకమైన మద్దతును తాజా తిరగుబాటు కుట్రదారులు ఆశించారు. అక్కడే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎర్డోగన్ విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామే తప్ప ఆయన సర్కార్‌ను సైనిక తిరుగుబాటు ద్వారా కూల్చాలన్న ఆలోచన తమకు ఈషణ్మాత్రమైనా లేదని తెగేసి చెప్పారు. అందుకే తిరుగుబాటును పసిగట్టిన మరుక్షణమే వేలాదిగా వీధుల్లోకి వచ్చి తామెన్నుకున్న ఎర్డోగన్ సర్కార్‌కు వెన్నుదన్నుగా నిలిచి ప్రజాగళానిదే..వారి అభిమతానిదే అంతిమ విజయమని రుజువుచేశారు. ప్రజలే ప్రజాస్వామ్య పరిరక్షకులైతే..ఎలాంటి తిరుగుబాట్లు చెల్లవు. ప్రజాగ్రహ వెల్లువలో అవి బుద్బుదప్రాయంగా కొట్టుకు పోతాయన్నది టర్కీ పరిణామం జగతికి చాటిచెప్పిన వాస్తవం.
కుట్ర భగ్నమైంది. కుట్రదారులు చేజిక్కారు. ఇంతటితో టర్కీ అంకం ముగిసినట్టేనా..? తదుపరి పరిణామాలు ఎలా ఉండాలి..ఎలా ఉండబోతున్నాయన్నదీ అత్యంత కీలకం. ముఖ్యంగా ఐసిస్ ఉగ్రవాదం వెర్రితలలు వేస్తున్న తరుణంలో..దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కూటమి దేశాల్లో ఒకటైన టర్కీలో సుస్థిర శాంతి పరిస్థితులు పశ్చిమ దేశాలకు ఎంత ముఖ్యమో..తాము నిలబెట్టుకున్న ఎర్డోగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రజాస్వామ్య పరిస్థితుల్ని, సుస్థిర పాలనను పాదుగొల్పడం దేశ ప్రజలకు అం తే అవసరం. తాజా తిరుగుబాటును పశ్చిమ దేశాల అవసరాల కోణంలో కా కుండా టర్కీ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకునే పరికించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజ్యాంగమే అత్యున్నతమైన, నిరుపమానమైన వేదికగా భావించే దేశ ప్రజలు ఈ విషయంలో తమ నిబద్ధతను మరింతగా చాటుకోవాలి. తిరుగుబాటులో పాల్గొన్న వేలాదిమంది సైనికాధికారులు, న్యాయమూర్తులు, కుట్రదారుల్ని అరెస్టు చేసిన ప్రభుత్వం వారిపై తీసుకునే చర్యలు దేశంలో అశాంతికి కారణం కాకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. కుట్రను భగ్నం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారమైనట్టు కాదు. ఇది మరిన్ని విపరిణామాలకు తావివ్వకుండా ఆచితూచి అడుగేయాలి. ఇందుకు ప్రధానంగా కావాల్సింది శాంతియుత పరిస్థితుల పరిరక్షణ. ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో తనకున్న విలువను పరిరక్షించుకునే విధంగా పాలకులు వ్యవహరించడం..ఉగ్రవాదం, తీవ్రవాదం పేట్రేగుతున్న సమయంలో, ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో..టర్కీ వెనుకబడి పోవడానికి వీల్లేదు. తాజా విజయంతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందడుగేయాలి. ముఖ్యంగా టర్కీ ప్రధాన భూమిక పోషించకుండా మధ్యప్రాచ్యంలో సుస్థిర శాంతికి ఆస్కారం ఉండదన్న నిజాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఎంత త్వరిత గతిన ప్రస్తుత అనిశ్చితి నుంచి టర్కీ బయట పడగలిగితే అంతగానూ పశ్చిమాసియా కొలిమిని ఆర్పే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టర్కీ భవితవ్యం ఏమిటి? అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది పశ్చిమ దేశాలు నిర్వహించే పాత్రపైనా..అవి అనుసరించే విధానంపైనే ఆధారపడి ఉంటాయి. పాలకుల విధానాల్లో నియంతృత్వ పోకడలున్నా..వాటివల్ల మేలు జరిగితే..సమాజానికి ప్రయోజనం కలిగితే అలాంటి పాలకుల్నీ ప్రజలు రక్షిస్తారు. ఇందుకు టర్కీ ప్రజోద్యమం నిదర్శనం!