సంపాదకీయం

అంతుపట్టని ‘నేపాల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో కొత్త రాజ్యాంగం ఆవిష్కృతమైన నాటినుంచి కొనసాగుతున్న సంక్షోభం నానాటికీ తీవ్రతరవౌతోంది. భారత్, నేపాల్ దేశాల మధ్య తరతరాలుగా నెలకొన్న స్నేహ సంబంధాలు క్షీణించిపోవడానికి ఈ రాజ్యాంగ సంక్షోభం దోహదం చేస్తుండడం అనూహ్య పరిణామం! మన దేశపు ‘సశస్తస్రీమాబల్’-ఎస్‌ఎస్‌బి-్భద్రతా విభాగానికి చెందిన పదమూడు మందిని నేపాల్ ప్రభుత్వం ఆదివారం నిర్బంధించడం విస్మయాన్ని కలిగించిన దుర్ఘటన! నేపాల్‌కూ మనకూ మధ్య తరతరాలుగా సరి హద్దుల గుండా నిర్నిరోధంగా రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధం విచిత్రమైన వ్యవహారం. నేపాల్ ప్రభుత్వం దుర్బుద్ధి పూర్వకంగానే మన భద్రతా దళాలను నిర్బంధించిందన్నది స్పష్టం. దొంగ రవాణా సాగిస్తున్న నేరస్థులను తరుముతుండిన ఇద్దరు సరిహద్దు రక్షకులు పొరపాటున నేపాల్‌లోకి ప్రవేశించడంతో ఆ ఇద్దరినీ నేపాల్ సాయుధ భద్రతా దళం-ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్-ఎపిఎఫ్ వారు నిర్బంధించారట! మన సరిహద్దు రక్షకుల వద్ద ఆయుధాలు లేకపోయినప్పటికీ వారిని నేపాల్ పోలీసులు నిర్బంధించడం కవ్వింపు చర్య మాత్రమే కాదు, నేపాల్ స్వీయ ప్రయోజనాలకు సైతం విఘాతకరమైన చర్య! ఉభయ దేశాల సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న నేరస్థులు, దొంగ వ్యాపారులు, జిహాదీ ఉగ్రవాదులు, మావోయిస్టు సాయుధులు ఉభయ దేశాలకూ ప్రమాదకరంగా పరిణమించారు. అందువల్ల నేరస్థులను తరిమిన మన దళాలకు సహకరించవలసిన నేపాల్ పోలీసులు వారిని నిర్బంధించడం మనపట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం. రాజ్యాంగం ఆవిష్కరణ జరిగినప్పటినుంచి ఈ వ్యతిరేకత తీవ్రతమైంది! నేపాల్ నిర్బంధించిన ఇద్దరు నిరాయుధ రక్షకులను విడిపించుకుని రావడానికై చర్చలకోసం వెళ్లిన మరో పదమూడు మందిని కూడ నేపాల్ పోలీసులు నిర్బంధించడం అపూర్వ విపరిణామం! గతంలో కూడ మావోయిస్టులను, జిహాదీ టెర్రరిస్టులను, దొంగలను, అక్రమంగా రవాణా చేస్తున్న వారిని తరుముతూ మన పోలీసులు నేపాల్‌లోకి, నేపాల్ పోలీసులు మన దేశంలోకి ప్రవేశించారు. కానీ ఇలా నిర్బంధించడం మాత్రం ఇదే మొదటిసారి! 2006లో మావోయిస్టులను తరిమిన మన దళాలవారు నేపాల్‌లోకి వెళ్లినప్పుడు ప్రజలు నిరసన తెలిపారన్న ప్రచారం జరిగింది! కానీ అలా నిరసన తెలిపినవారు మావోయిస్టుల సమర్ధకులు. సాధారణ నేపాల్ ప్రజలు కాదు! రాజ్యాంగ వ్యతిరేకత ఉద్యమకారులపై మన సరిహద్దులలో నవంబర్ రెండున నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులలో ఒక భారతీయుడు మరణించడంతో సరిహద్దు ప్రాంతాలలో గగ్గోలు పుట్టింది!
రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమకారులకు, నేపాల్‌లోని భారత వ్యతిరేకులకు మధ్య ఘర్షణలు మూడు నెలలుగా కొనసాగుతున్నాయి. కొత్త రాజ్యాంగంలో తెరాయ్ ప్రాంతంలోని మాధేశీ జన సముదాయం వారికి, మరికొన్ని తెగల వారికి అన్యాయం జరగడం ఈ ఘర్షణలకు కారణం. తెరాయ్ ప్రాంతం మన దేశపు సరిహద్దులకు ఆనుకుని ఉంది! తెరాయ్ ప్రాంతవాసులు బ్రిటిష్ దురాక్రమణ సమయంలో బిహార్ ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలనుంచి వెళ్లి నేపాల్‌లో స్థిరపడిన వారు. నేపాల్ ప్రజలు మొత్తం భారతీయ సంతతివారు, ఒకప్పుడు భారతీయులు. కానీ బ్రిటిష్ దురాక్రమణ సమయంలో నేపాల్ స్వతంత్ర దేశంగా అవతరించే నాటికి అక్కడ ఉన్నవారు బోటీ కుటుంబానికి చెందిన నేపాలీ భాషలను మాట్లాడుతున్నారు. తరువాత వెళ్లి స్థిరపడిన మాధేశీలు, ఇతరులు హిందీ తదితర దక్షిణ భాషలను మాట్లాడుతున్నారు. నేపాల్‌లో మావోయిస్టుల ప్రభావం పెరిగినకొద్దీ భారత వ్యతిరేకత కూడ పెరుగుతోంది! ఈ భారత వ్యతిరేకత మాధేశీల పట్ల వ్యతిరేకంగా మారడం నడుస్తున్న వైపరీత్యం! తెరాయ్ ప్రాంతంలోని వారిని ఒకే రాష్ట్రంలో ఉండనీయకుండా ఐదు రాష్ట్రాలలోకి చెల్లాచెదురు చేసిన సమాఖ్య-ఫెడరల్-రాజ్యాంగ వ్యవస్థ ప్రస్తుత సంక్షోభానికి కారణం. రాజ్యాంగం ఆవిష్కరణకు ముందే అందువల్ల వ్యతిరేక ఉద్యమం రాజుకుంది. ఈ ఉద్యమం రక్తసిక్తం కావడంతో ఇంతవరకూ ముప్పయి మందికి పైగా బలైపోయారు...
తెరాయ్ ప్రాంతం వారి మనోభావాలను మన్నించి వారికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలని మన ప్రభుత్వం సెప్టెంబర్‌లో సూచించిందట! మన ప్రతినిధులు నేపాల్‌కు వెళ్లడం, వారి ప్రతినిధులు ఢిల్లీకి రావడం గొప్ప సంచలనాన్ని సృష్టించింది!అయితే మార్పులు జరిగే వరకు నూతన రాజ్యాంగాన్ని ప్రకటించవద్దన్న మన ప్రభుత్వ సలహాలను నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాజ్యాంగం ప్రకటితమైన తరువాత మాధేశీ జన సముదాయం వారు తమ కోర్కెల సాధనకోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఈ ఉద్యమం రక్తసిక్తం కావడంవల్ల మన దేశంనుండి నేపాల్‌కు సరుకులను, ప్రధానంగా నిత్యావసర సరుకులను సరఫరా చేసే సీమాంతర వ్యవస్థ స్తంభించిపోయింది. లారీలమీద ట్రక్కులమీద దాడులు జరగడం ఇందుకు కారణం! ఈ దాడులను ఆపడంలోను, మన దేశపు వాహనాలకు రక్షణ కల్పించడంలోను నేపాల్ ప్రభు త్వం విఫలమైంది! అందువల్ల రాకపోకలు స్తంభించి ఉన్నాయి. ఇలా స్తంభించి పోవడానికి నేపాల్ ప్రభుత్వం మాత్రమే కారణం! సరిహద్దు మార్గాలను దిగ్బంధానికి గురి చేయడం లేదని రెండు నెలలుగా మన ప్రభుత్వం అనేకసార్లు స్పష్టం చేసింది! కానీ నేపాల్ ప్రభుత్వం మాత్రం మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కినట్టుగా ఊరబ్బనారబ్బ చేస్తోంది! మాధేశీల కోరికలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి పార్లమెంట్-రాజ్యాంగపరిషత్-ఆమోదాన్ని పొందుతామని ప్రధాన రాజకీయ పార్టీ ప్రకటించిన తరువాత పదిరోజులు గడిచిపోయాయి! తమ కోర్కెలను ఆమోదించినట్టు అధికారికంగా ప్రకటించే వరకూ ఆందోళనను నిలిపివేయబోమని మాధేశీ ఉద్యమకారులు ప్రకటించారు! అందువల్ల ప్రధాన పార్టీలు అంగీకరించిన వెంటనే ప్రభుత్వం పార్లమెంటులో ఈ సవరణలను ప్రతిపాదించి ఉండాలి. అది జరగలేదు! కానీ నేపాల్ ప్రభుత్వం దాదాపు ప్రతిరోజూ మన ప్రభుత్వాన్ని దుయ్యబడుతోంది!
మన ప్రభుత్వం దిగ్బంధాన్ని విధించిందన్న సాకుతో నేపాల్ ప్రభుత్వం చైనానుండి ఇంధన తైలం కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దిగ్బంధం చేయడం దురాక్రమణ కంటె అమానవీయమైన చర్య అని నేపాల్ ప్రధాని కె.పి.శర్మ స్వయంగా మన ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు! భారతీయ దృశ్యమాధ్యమాల ప్రసారాలు తమ దేశంలో నిలిపివేసినట్టు నేపాల్‌లోని కేబుల్ నిర్వాహకులు ప్రకటించడం మరో విపరిణామం! ఈ నేపాలీ ప్రభుత్వపు దుందుడుకు తనం వెనుకనుండి చైనా ప్రభుత్వం వికృతంగా తొంగిచూస్తోంది! మావోయిస్టులు ప్రజల ముసుగు వేసుకుని భారత వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు! మాల్‌దీవులవంటి సన్నిహిత మిత్రదేశాన్ని మనకు వ్యతిరేకంగా తీర్చిదిద్దడంలో చైనా రెండేళ్లపాటు చడీ చప్పుడుకాకుండా కుట్ర జరిపింది. ఆ కుట్ర విజయవంతమైంది. ఇప్పుడు చైనా నేపాల్ కూడ వ్యూహాత్మక దురాక్రమణను కొనసాగిస్తోంది!