సంపాదకీయం

అమ్మ సేవలో అమరుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రోజులపాటు హిమ గహ్వరంలో కూరుకునిపోయిన యుద్ధవీరుడు కొప్పడ హనుమంతప్ప బతికి బయటపడడం విధి విలాసం...మూడు రోజులు గడవక ముందే ఆ సమరుడు అమరుడుగా మారడం విధి విలాపం! దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తయిన సియాచిన్ హిమ ఖండం హఠాత్తుగా మృత్యు భాండంగా మారడం ఫిబ్రవరి మూడవ తేదీనాటి ఘటన. హిమప్రళయం సియాచిన్‌లోని సోనమ్ స్థావరాన్ని నుజ్జునుజ్జుగా నలిపి పారేసింది! కిలోమీటరు మేర విస్తరించిన ఎనిమిది వందల మీటర్ల ఎతె్తైన మంచుగడ్డ మీద పడడంతో, పడినంత మేర గిరి శిఖరం పగిలిపోయింది, కంపించి పోయింది, కల్లోల ప్రకంపనాలకు గురి అయింది. మంచుగడ్డ మీదపడిన స్థావరం కాని స్థావరంలోని సైనికులు కాని కనిపించలేదు. మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన మొత్తం పదిమంది హిమ శకల ఘట్టనకు గురి అయ్యారు. తొమ్మిదిమంది వీరులు మాతృభూమి సేవలో అమరులయ్యారు. స్థావరంలో ఉండిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప కూడ అమరుడయ్యాడన్నది తొలి వార్త..మృతదేహాలను వెలికి తీయడం కోసం మాత్రమే ఐదురోజులపాటు అహోరాత్రులు అనే్వషణ సాగింది. సైనిక దళాలవారు, వైమానికులు దాదాపు రెండు వందల సార్లు విమానాలలో సియాచిన్ పైకి వెళ్లారు ఎనిమిది వందల మీటర్ల ఎత్తయిన మృత్యు హిమ శకలాన్ని తవ్వారు, పెళ్లగించారు. మృతదేహాలను పసిగట్టగల యంత్రసామగ్రిని నెలకొల్పారు. కిలోమీటరు మేర విస్తరించిన భయంకర హిమశత్రువుపై మన సైనికులు ఐదురోజులపాటు యుద్ధం చేశారు! ఈ యుద్ధానికి ఫలితం హనుమంతప్ప బతికి ఉండడమన్న అద్భుతం! ముప్పయి ఐదు అడుగుల లోతున హిమ బంధితుడైన హనుమంతప్ప చుట్టూ ప్రాణవాయు మండలం ఏర్పడి ఉండడం అద్భుతం! మంచు గడ్డల మధ్యలో వాయుమండలాలు ఏర్పడడం ప్రాకృతికమైన రహస్యం! ఇలాంటి వాయుమండలాన్ని మంచులో కూరుకుపోయే సైనికులు స్వయంగా కూడా ఏర్పరుచుకోగలరట! ఇది మానవకృత అద్భుతం! ఏమయినప్పటికీ ఐదురోజులపాటు మంచు మధ్యలోని గాలిపొర హనుమంతప్పను బతికించడం విధి విలాసం! మరణించినట్టు ధ్రువపడిన హనుమంతప్ప బతికాడు, హిమకుడ్య బంధనంనుండి విముక్తుడయ్యాడు! ఆయన భార్య, కూతురు, కుటుంబ సభ్యులు ఆనంద ఆశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కర్నాటకలోని హుబ్లీ నగర సమీపంలోని ఆయన జన్మస్థలమైన బేతదూర్ గ్రామం సంభ్రమ సముద్రంగా మారింది! కానీ ఈ విలాసం మూడురోజులు తిరగకముందే విషాదంగా మారిపోవడం విధి విధాన క్రూరత్వానికి పరాకాష్ఠ! ఉదయించిన సూర్యుడు వెనుతిరిగిపోయాడు! ఒక అర్ధాంగి హృదయవనంలో మొగ్గ తొడిగిన విశ్వాసం వికసించలేదు, మొగ్గరాలిపోయింది! ఒక గ్రామంలో అంకురించిన ఆశలు అంతలోనే అంతరించాయి! ఆనంద గీతాన్ని ఆలపించబోయిన మాతృగళం విషాద రాగాన్ని వినిపిస్తోంది. హనుమంతప్ప అదృశ్యమయ్యాడు, అమర లోకాలకు కదలిపోయాడు...
ఇద్దరు మాత్రమే సూర్యమండలాన్ని ఛేదించుకుని విముక్తిమార్గంలో దూసుకుని వెళ్లగలరన్నది సనాతన సత్యం! ఒకరు యోగ సాధన చేసిన యతి, మరొకరు యుద్ధంలో వెన్ను చూపకుండా ముందుకు ముందుకు దూసుకునిపోగల వీరుడు, అమరుడు!- ‘పరివ్రాట్ యోగ యుక్తశ్చ, రణేచాభిముఖో హతః’! కార్గిల్ వీరులు, సియాచిన్ శూరులు, లడక్ యోధులు, సమరశీల స్వభావం చెరగని అసంఖ్యాక ధీరులు...మన సైనికులందరూ ఇలా వెనుదిరగని వెన్నుచూపని మాతృభూమి యశోరక్షకులు! వీరందరూ సూర్యమండలాన్ని ఛేదించగల వారు, దూసుకుని పోగలవారు! సియాచిన్‌లో రెండవ తేదీ రాత్రి మంచు దిబ్బ మీదపడడానికి పూర్వం నెలల తరబడి ఈ పదిమంది వీరులు పోరాడినారు! కనిపించని శత్రువులు పాకిస్తానీ దురాక్రమణ దారులు. కన్ను మూస్తే చాలు కార్గిల్‌లోకి చొరబడినట్టుగా సియాచిన్ హిమఖండంపైకి లంఘించడానికి పొంచి ఉన్న తోడేళ్లు ప్రచ్ఛన్న ఉగ్రవాదులైన పాకిస్తాన్ సైనికులు..ఊహించని రీతిలో మహోగ్రంగా దెబ్బ తీసే మరో శత్రువు ప్రాకృతిక వైపరీత్యం. ఇరవై వేల అడుగుల ఎత్తున ముప్పయి ఐదు డిగ్రీల శీతోగ్రత-మైనస్ ముప్పయి ఐదు డిగ్రీల చల్లదనం! స్వేచ్ఛగా గాలి సైతం పీల్చుకొనడానికి వీలు లేని ప్రదేశం సియాచిన్! మంచు తుపాను ఏ క్షణమైనా ముంచెత్తగలదన్నది మాత్రమే ఊహించగల నైసర్గిక వాస్తవం! అయినా హనుమంతప్ప, ఆయన వంటి వేలాది సైనికులు వెన్ను చూపలేదు. కనిపించని ఊహించని శత్రువులను నిలదీసారు, నిరోధించారు..ఎదిరిస్తూనే ఉంటారు....సమర విజేతలుగా, రణాభిముఖులుగా మాతృవిభవ సంరక్షణా యజ్ఞ జ్వాలలకు నిరంతర ఆజ్యధారలవుతున్నారు! కొప్పడ హనుమంతప్ప అలాంటి ఆజ్యధార, అసంఖ్యాక సైనిక వీరులకు తరగని ఆదర్శ అమృత ధార!
సియాచిన్ హిమశృంగం కంటె ఎత్తయిన శిఖరాలు పర్వతాలు హిమాలయ శ్రేణులలో నెలకొని ఉన్నాయి. కానీ వాటిని శత్రువుల దురాక్రమణనుండి రక్షించుకొనడానికి ఇంత ప్రయాస పడవలసిన పనిలేదు, ప్రయత్నం అక్కరలేదు. సియాచిన్ సమీపంలో పాకిస్తాన్, చైనా దురాక్రమణదారులు తిష్ఠవేసి ఉండడం ప్రమాద ప్రాధాన్యానికి ప్రాతిపదిక! సియాచిన్ హిమధామం జమ్ముకశ్మీర్ ఉత్తర భాగాన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు ఆనుకుని ఉంది. సియాచిన్‌కు పడమరగా వాయువ్యంగా పాకిస్తాన్ దురాక్రమించిన సీమలు నెలకొని ఉన్నాయి! ఈశాన్యంగా, ఉత్తరంగా కారాకోరమ్ కనుమ నెలకొని ఉంది. కారాకోరమ్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ 1947నకు పూర్వం వలె మన అధీనంలో ఉండినట్టయితే సియాచిన్‌ను రక్షించుకోవడానికి ప్రయత్నం అక్కరలేదు. సియాచిన్ చుట్టూ మన దేశమే ఉండేది. కానీ 1947 తర్వత మన ప్రభుత్వాన్ని నడిపిన వారి క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా సియాచిన్ రెండు వైపుల శత్రుదేశాల సైనికులు నెలకొన్న స్థితి ఏర్పడిపోయింది! జమ్ము కశ్మీర్‌పై దాడి చేసిన పాకిస్తాన్‌ను తిప్పికొట్టగల, జమ్ము కశ్మీర్‌ను సంపూర్ణంగా విముక్తం చేయగల స్థితిలో ఉండినప్పటికీ 1948లో మన ప్రభుత్వం ఆపని చేయలేదు! 1950వ దశకంలో చైనా లడక్‌ను ఆక్రమించినప్పుడు, కారాకోరమ్ గుండా రహదారిని నిర్మించినప్పుడు మన ప్రభుత్వం పట్టించుకోలేదు!
పట్టించుకోవడం అనివార్యం అయ్యేసరికి సగానికి పైగా జమ్ము కశ్మీర్ ఉభయ శత్రువుల ఉమ్మడి అధీనంలో ఉంది! హనుమంతప్ప వంటివారు నిరంతరం ఈ భౌతిక శత్రువుల దాడికి, ప్రాకృతిక శత్రువుల కాటుకు గురి అవుతుండడానికి ఏకైక కారణం 1950వ దశకం వరకు మన ప్రభుత్వం గడ్డిపోచ మొలవని ఈ కశ్మీర్ సీమలను పట్టించుకోక పోవడం...మంచు భూమి కూడ మాతృభూమి అన్న వాస్తవం హనుమంతప్ప వారి బలిదానాలకు స్ఫూర్తి!