సంపాదకీయం

తమిళ ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికలు భారతీయ జనతాపార్టీ ప్రాబల్య ప్రభావాల పటిమను నిగ్గు తేల్చనున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో లభించిన పరిమిత విజయం భాజపా శ్రేణులలో విశ్వాసాన్ని పెంచాయి. కానీ తమిళనాడు పార్టీ ప్రాధాన్యం మాత్రం పెరగలేదు. పెరగలేదనడానికి అన్నాడిఎమ్‌కె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత భాజపాను దూరంగా వుంచడం ఒక ఉదాహరణ మాత్రమే! లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపాతో జట్టుకట్టిన ద్రవిడపక్షాలు కొన్ని భాజపా కూటమినుంచి నిష్క్రమించడం మరో ఉదాహరణ! తమిళనాడులో జాతీయ రాజకీయ పక్షాల ప్రాబల్యం అనేక దశాబ్దులుగా సున్న! మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని ద్రవిడ మునే్నత్ర కజగం-డిఎమ్‌కె- ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని అన్నాద్రవిడ మునే్నత్ర కజగం-ఎఐఏడిఎమ్‌కె- వంతుల వారీగా తమిళనాడును పరిపాలిస్తుండడం దశాబ్దుల చరిత్ర! 2001లో అధికార డిఎమ్‌కెను ఓడించి అన్నాడిఎమ్‌కె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2006లో డిఎమ్‌కె మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. 2011లో జరిగిన శాసనసభ ఎన్నికలు 2001 నాటి జయలలిత ఘనవిజయానికి పునరావృత్తి! అందువల్ల ప్రస్తుతం జరుగనున్న ఎన్నికలలో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టనున్నట్టు కరుణానిధి నాయకత్వంలోని డిఎమ్‌కె వారు కలలుగంటున్నారు! అందువల్లనే మూడేళ్లుగా ఎడమొగం పెడమొగంగా ఉంటున్న కాంగ్రెస్ డిఎమ్‌కెలు మళ్లీ చేరువయ్యాయి! కానీ గతంలో వలె ప్రస్తుతం తమిళ రాజకీయ సమాజం- ద్విధా-రెండుగా విభక్తమయి లేదు, త్రిధా-మూడుగా-విభక్తమై ఉంది. ఈ మూడవ కూటమి ఏర్పడడానికి కేంద్ర బిందువు భాజపా! 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో భాజపా ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కాంత్ అధ్యక్షతన కల దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం-డిఎమ్‌డికె-తో జట్టుకట్టింది. ఇలా జట్టు కట్టడం ద్వారా డిఎమ్‌డికెను భాజపావారు జయలలిత కూటమినుంచి విడగొట్టగలిగారు! లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా, డిఎమ్‌డికె, వైగో నాయకత్వంలోని మురుములార్చి ద్రవిడ మునే్నత్ర కజగం-ఎమ్‌డిఎమ్‌కె-అంబుమణి రామదాస నాయకత్వంలోని పట్టల్ మక్కల్ కచ్చి-పిఎమ్‌కె- కలిసి మహా సంఘటనగా ఏర్పడినాయి! ఈ మహా సంఘటన కారణంగా డిఎమ్‌కె తుడిచిపెట్టుకుపోయింది. అన్నాడిఎమ్‌కె ఘనవిజయం సాధించింది, తమిళనాడులోని ముప్పయి తొమ్మిది లోక్‌సభ స్థానాలలో ముప్పయి ఏడు జయలలిత పార్టీకి దక్కాయి. మిగిలిన రెండు చోట్లు మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో భాజపా కూటమిలో విశ్వాసం అంకురించింది! కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పి.రాధాకృష్ణన్, ధర్మపురి నియోజకవర్గంలో పిఎమ్‌కె నాయకుడు అంబుమణి రామదాస్ జయకేతనం ఎగురవేశారు...
అంకురించిన ఈ విజయ విశ్వాసం పల్లవించి పరిమళించే సూచనలు గత ఇరవై నెలలుగా ప్రస్ఫుటించకపోవడం తమిళ రాజకీయాలలో భాజపా ప్రాధాన్యం పెరగలేదన్నదానికి నిదర్శనం..లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపాతో జతకట్టిన పిఎమ్‌కె ప్రస్తుతం ఒంటరిగా ఎన్నికల పోరు జరపడానికి నిర్ణయించుకుందట! ఎమ్‌డిఎమ్‌కె అధినేత వైగో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోను ఇతర చిల్లర పార్టీలతోను కలిసి నాలుగవ కూటమిని ఏర్పాటు చేస్తున్నాడట! విజయకాంత్ నాయకత్వంలోని డిఎమ్‌డికె సైతం ఇంతకాలం భాజపాతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. దీనికంతటికీ ప్రధాన కారణం భాజపావారు జయలలితతో జట్టు కట్టడానికి చేసిన విఫలయత్నం! తాము జయలలిత కూటమిలో చేరిపోతున్నట్టు భాజపా తమిళనాడు శాఖవారు బహిరంగంగానే ప్రచారం చేసుకున్నారు! ఇదంతా విజయకాంత్ బృందానికి ఆగ్రహం కలిగించిన ప్రహసనం! జయలలిత 2011లో శాసనసభా సమరంలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన నరేంద్ర మోదీ ఆ ఉత్సవానికి హాజరయ్యారు. అప్పటినుంచి కూడ భాజపా వారు అన్నాడిఎమ్‌కెతో పొత్తుకోసం తహతహలాడడం చరిత్ర. కాగా జయలలిత మాత్రం 2009 నాటి లోక్‌సభ ఎన్నికలలోను 2011నాటి శాసనసభ ఎన్నికల సమయంలోను కాంగ్రెస్ పొత్తుకోసం ప్రయత్నించింది! డిఎమ్‌కె కూటమిని వదిలి తమిళ కూటమిలో చేరవలసిందిగా ఆమె బహిరంగంగానే కాంగ్రెస్‌ను ఆహ్వానించింది. ఆ తరువాతి కథ వేరు! రెండవ శ్రేణి దూరవాణి తరంగాల కేటాయింపుల అవినీతి పుట్ట పగిలిన తరువాత తమిళనాడులో కాంగ్రెస్, డిఎంకె రెండూ అప్రతిష్ఠ పాలైపోయాయి! అందువల్ల 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి డిఎమ్‌కె బహిష్కరణకు గురి అయినప్పటికీ జయలలిత మాత్రం కాంగ్రెస్‌ను తమ పంచన చేరనివ్వలేదు. ఇదంతా భాజపాకు అనుకూలమైన పరిణామక్రమం. అయినప్పటికీ 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో జయలలిత భాజపాను తమ కూటమిలో చేర్చుకోలేదు...
విసుగుచెందని విక్రమార్కునిలా భాజపా అన్నా డిఎమ్‌కెతో చెలిమికి ప్రాకులాడిందన్న అభిప్రాయం 2014లోక్‌సభ ఎన్నికల తరవాత కూడ వ్యాపించింది! గతంలో 1998లో భాజపాతో జట్టుకట్టిన జయలలిత 1999లో ఏడాది తిరగక ముందే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసింది. అన్నాడిఎంకె మద్దతును ఉపసంహరించుకున్న తరువాత లోక్‌సభలో జరిగిన బలపరీక్షలో వాజపేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది! 1999 నాటి మధ్యంతర లోక్‌సభ ఎన్నికలకు అదీ నేపథ్యం! అయినప్పటికీ రాజకీయాలలో శత్రుత్వం మిత్రత్వం శాశ్వతం కాదన్నది అవకాశవాద సూత్రం! కానీ ఈ సూత్రాన్ని భాజపా తమిళనాట అమలు జరపడానికి ప్రారంభించిన నాటికి జయలలిత కూడ అప్రతిష్ఠపాలై ఉంది! 2014 సెప్టెంబర్‌లో ఆమె జైలుపాలైంది. ఆదాయాన్ని మించి ఆమె ఆస్తులను సంపాదించినట్టు ఋజువైంది! ఇలా మూడు ప్రధాన శక్తులూ-డిఎమ్‌కె, అన్నాడిఎమ్‌కె, కాంగెస్- అవినీతి ఆరోపణగ్రస్తమైన తమిళనాడులో భాజపా తృతీయ శక్తిగా ఎదగలేకపోవడానికి కారణం అంకురించిన విజయ విశ్వాసం విస్తరించకపోవడమే! కర్నాటక హైకోర్టు జయలలిత నిర్దోషిత్వాన్ని ధ్రువపరిచిన తరువాత 2015 మే 23న ఆమె మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా వరిష్ఠ భాజపా నేతలు జయలలితపై ప్రశంసల జల్లులు కురిపించారు! ఇదంతా జయలలిత భాజపా నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో చేరుతుందన్న భ్రాంతిని కల్పించింది!
భారతీయ జనతాపార్టీ వరిష్ఠ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ తమిళనాడు ప్రభుత్వాన్ని చెన్నయ్‌లో దుయ్యబెట్టడం అందువల్ల ఊహించని పరిణామం! ఫిబ్రవరి 28న డిఎమ్‌డికె అధ్యక్షుడు విజయ్‌కాంత్‌తో చర్చలు జరిపిన తరువాత జావదేకర్ జయలలిత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం మారిన భాజపా నీతికి నిదర్శనం! 2011 నాటి శాసనసభ ఎన్నికలలో జయలలితతో జట్టు కట్టిన విజయకాంత్ ఎన్నికల తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావడం విచిత్ర చరిత్ర! ఆయన పార్టీలోని శాసనసభ్యులు అనేకమంది ఇటీవల అన్నాడిఎమ్‌కెలో చేరిపోవడంతో విజయకాంత్ ఇటీవల ప్రతిపక్ష నాయకుని హోదాను కోల్పోయాడు! అందువల్ల రానున్న ఎన్నికలు విజయకాంత్ పలుకుబడికి సైతం పరీక్షల వంటిది!