సంపాదకీయం

దిక్సూచి కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్మార్‌లో ఓ చారిత్రక ఘట్టానికి తెరలేచింది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రెండున్నర దశాబ్దాల పాటు అహరహం పాటుపడ్డ అంగ్‌సాన్ సూకీ కల నెరవేరింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది. ప్రతినిధులు ఎన్నుకున్న అధ్యక్షుడూ వచ్చాడు. సైనిక పాలనకు చరమగీతం పాడుతూ కొత్త అధ్యక్షుడిగా హితిన్ క్యా ఎన్నిక కావడం ప్రజాస్వామ్య పునరుద్ధరణ పరిణామాల్లో కీలక ఘట్టం. ఏ దేశ ఎన్నికల్లోనైనా అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీ అధినేత లేదా అధినేత్రే పాలనా పగ్గాలను లేదా కీలక పదవిని చేపట్టడం జరుగుతుంది. కానీ అంగ్‌సాన్ సూకీ విషయంలో కథ అడ్డం తిరిగింది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డు పడ్డాడన్నట్టుగా సూకీ సారధ్యంలోని ఎన్‌ఎల్‌డి పార్టీకి ప్రజలు పట్టం కట్టినా..తిరుగులేని అధికారాన్ని అప్పగించినా ఆమెకు అధ్యక్ష పీఠం దక్కలేదు. విదేశీ భర్త లేదా పిల్లలు కలిగిన ఎవరూ దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్ట కూడదంటూ నాటి సైనిక పాలకులు రాజ్యాంగాన్ని ముందు జాగ్రత్తగా సవరించడమే ఇందుకు కారణం. సూకీకి ఏ పదవీ లేకుండా చేయకపోతే తమ పుట్టి మునిగినట్టేనని ముందే ఊహించిన సైనిక పాలకులు అందుకు రాజ్యాంగ బద్ధమైన ఏర్పాటే చేశారు. ఆ విధంగా సూకీ అధికారానికి దరిదాపుల్లో లేకుండా చేయగలిగారు. ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి సాధించిన విజయం సైనిక పాలకులకే దిగ్భ్రాంతిని కలిగించింది. ఎవరూ ఊహించని విధంగానే సూకీ పార్టీ అందలం ఎక్కింది. అధికారం తనది కాకపోయినా..తనకు అధ్యక్ష పదవి దక్కే అవకాశమే లేకపోయినా..బెంగలేదని చెబుతూనే పరోక్షంగా అధికారం తనదేనన్నట్టుగా సూకీ చేసిన ప్రకటనలను ఈ నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటు ప్రభుత్వంపైనా..అటు అధ్యక్షుడిగా ఎవరున్నా సరే తనే పరోక్షంగా రాజ్యం చేస్తానన్న సంకేతాలను సూకీ అందించారు. దశాబ్దాల సైనిక పాలనలో మగ్గి నియంతృత్వం తప్ప మరో రకమైన పాలనా వ్యవస్థ ఉంటుందన్న విషయానే్న మరిచిపోయిన మైన్మార్ ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో..ప్రజలకు ఉండే హక్కులేమిటో..అన్నింటికీ మించి స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువేమిటో సూకీ నిరూపించారు. ఆమె కృషి, పట్టుదల, అప్రతిహత పోరు ఫలితమే నేటి మైన్మార్..
సైనిక పాలకుల్ని నెట్టేసి..ప్రజాస్వామ్య తీరాలను తాకిన నాటి బర్మా. సూకీకి అధ్యక్ష పగ్గాలు దక్కక పోవడం ఆమె అభిమానులకు, ఎన్‌ఎల్‌డి కార్యకర్తలకు తీవ్ర నిరాశ కలిగించేదే. ఎందుకంటే దేశాధ్యక్ష పదవిని చేపట్టే అర్హత, హక్కు మైన్మార్‌లో సూకీకి తప్ప మరెవరికీ లేవన్నదీ తిరుగులేని వాస్తవం. ఒకప్పుడు మైన్మార్ అంటే ఓ చిన్న దేశమనే తప్ప దాని గురించి గానీ, అక్కడ పాలనా విధానం గురించి గానీ ప్రపంచానికి తెలిసింది తక్కువే. ఎప్పుడైతే 1990 దశకం తొలి నాళ్లలో సూకీ ఎన్నికను సైనిక పాలకులు రద్దు చేసి ఆమెను పాతిక సంవత్సరాల పాటు గృహ నిర్బంధంలో ఉంచారో అప్పటి నుంచీ ఈ దేశం గురించిన వివరాలు వెలుగులోకి రావడం మొదలైంది. సూకీని విడుదల చేసిన తర్వాత భారత్ సహా ఆమె జరిపిన అనేక విదేశీ పర్యటనలు మైన్మార్ అంతర్గత పరిస్థితులు, పరిణామాల గురించి ప్రపంచ ప్రజలు తెలుసుకునే అవకాశం కలిగింది. ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సూకీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించేందుకు సైనిక పాలకులు పెద్ద మనసుతో ముందుకొస్తారన్న ఆశావహ పరిస్థితీ ఒక దశలో నెలకొంది. ఇందుకు సంబంధించి ఎన్‌ఎల్‌డి నేతలు సైనిక నాయకత్వంతో జరిపిన చర్చలు ఫలించలేదు. సూకీకి అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించేందుకు సైనికులు ససేమిరా అంగీకరించలేదు. ఎన్‌ఎల్‌డి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడం ద్వారా మైన్మార్‌లో రానున్న రోజుల్లో కూడా తమదే పెత్తనమన్న పరోక్ష సంకేతాలనే సైనికులు అందించారు. అంటే ప్రజా ప్రభుత్వం ఏర్పడినా..అధ్యక్ష పదవిలో ఎవరున్నా కూడా తమదే రాజ్యమన్న భావన సైనికుల చర్యల్లో కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో అధ్యక్ష పదవికి అభ్యర్థిగా తనకు అత్యంత విధేయుడైన వ్యక్తినే సూకీ నియమించాల్సి వచ్చింది. ఇప్పుడాయన సాధించిన విజయం అనేక కోణాల్లో సూకీ నిర్వహించబోయే పాత్ర ఏమిటన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూకీకి ఏ పదవీ లేకపోయినా ఆమె మాట జవదాటి ఇటు ప్రభుత్వం గానీ అటు దేశాధ్యక్షుడు గానీ పనిచేసే అవకాశం లేదన్నది వాస్తవం.
పవర్ లేకపోయినా పెత్తనం తనదేనంటూ గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో సూకీ చెప్పకనే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సూకీ జోక్యాన్ని లేదా ఆమె పరోక్ష ఆధిపత్యాన్ని ఎల్‌ఎల్‌డి ప్రభుత్వం అలాగే దేశాధ్యక్షుడు ఎంత మేరకు గౌరవించగలుగుతారన్నది చర్చనీయాంశమవుతోంది. ఎంత సూకీ విధేయుడైనా ఆమె అడుగులకు మడుగులొత్తే విధంగా కొత్త అధ్యక్షుడు హితిన్ క్యా నిరంతరం పని చేసే అవకాశం ఉండదు. అలాగే ఎన్‌ఎల్‌డి ప్రభుత్వం కూడా..పరోక్ష పెత్తనంలో ఏ ప్రభుత్వమూ దీర్ఘకాలం మనుగడ సాగించే పరిస్థితీ ఉండదు. ఈ పరిస్థితులు, పరిణామాలు ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్‌లోనైనా సరికొత్త సమస్యలకు ఆస్కారం ఇచ్చే అవకాశాలు కోకొల్లలుగానే ఉంటాయి. ప్రభుత్వం వారిది కాకపోయినా, అధ్యక్ష పదవి లేకపోయినా కూడా మైన్మార్ సైన్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా గణనీయమైన సంఖ్యలో ఇప్పటికే సీట్లను రిజర్వ్ చేసుకోవడమే కాకుండా కీలక మంత్రి పదవులూ తమకే దక్కేలా సకల ఏర్పాట్లు చేసుకున్న సైన్యానికి రాజకీయంగానైనా లేదా పాలనాపరంగానైనా ఏ చిన్న అవకాశం చేతికొచ్చినా పరిస్థితులు పూర్తి ప్రతికూలమవుతాయి. పాకిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం ఉన్నా సైన్యానిదే పరోక్ష పెత్తనమన్నట్టుగా మైన్మార్ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ మారిపోకూడదు. ప్రజా ప్రభుత్వాలు అన్ని విధాలుగా స్వతంత్య్రంగా పనిచేయకపోతే..అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వ్యక్తి రాజ్యాంగ పరంగా తనకు ఉన్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరించక పోతే ప్రజాస్వామ్యానికే విలువుండదు. ఈ వాస్తవం సూకీకి తెలియంది కాదు. పదవి లేకపోయినా మైన్మార్ ప్రజల ఆరాధ్యదైవం సూకీ. తనకు ఉన్న ఈ స్థాయిని, ప్రతిష్టను, ప్రజల్లో ఉన్న పట్టును మరోరకంగా ఉపయోగించుకుని దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. కేవలం అధికార రాజకీయాలే పరమావధిగా కాకుండా విచక్షణాయుతమైన నాయకత్వాన్ని సూకీ ప్రదర్శించాల్సిన తరుణమిది. అలాంటి సంఘటిత ప్రయత్నాల ద్వారానే సైనిక పట్టు నుంచి దేశ ప్రజలు బయట పడగలుగుతారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వం అన్ని విధాలుగా తమ ప్రయోజనాలను, హక్కులను కాపాడేదిగా చేసుకోగలుగుతారు. ఈ రకమైన సామాజిక, రాజకీయ పరివర్తన దిశగా మైన్మార్‌ను నడిపించే ఏకైక పెద్ద దిక్కు సూకీ. ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పిన సూకీ ఇప్పుడు దానికి మరింత వనె్నతెచ్చే నాయకత్వ పటిమను కనబరచాలి. సూకీకి పదవి కంటే ఆమె నాయకత్వమే మైన్మార్‌కు కీలకం.