సంపాదకీయం

‘ఉత్తర’ మీమాంస...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి పాలన విధించడంవల్ల ఉత్తరఖండ్‌లో కొనసాగుతున్న అవకాశ వాద రాజకీయ కాండ పరిసమాప్తి కావడం లేదన్నది స్పష్టం! ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్టప్రతి పాలన విధించడానికి దోహదం చేసిన ప్రహసనం ఎవరిది న్యాయమన్నది కూడ జటిలమైన ప్రశ్న! న్యాయాన్యాయాలను నిర్ధారించడానికి సర్వోన్నత న్యాయస్థానం వారి ప్రమేయం అనివార్యమన్నది కూడ మరింత స్పష్టమైపోయింది. ఎందుకంటే రాష్టప్రతి పాలన విధించడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ వాదిస్తోంది, కేంద్ర ప్రభుత్వ చర్యను సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కూడ కాంగ్రెస్ బెదిరిస్తోంది! అందువల్ల రాష్టప్రతి పాలన విధింపుపై సర్వోన్నత న్యాయసమీక్ష మరోసారి జరగనుంది! రాష్టప్రతి పాలన మాత్రమే కాదు, తొమ్మిదిమంది శాసనసభ్యుల సభ్యత్వాన్ని స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజవాల్ రద్దు చేయడం కూడ మరో న్యాయ వివాదం కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ప్రభుత్వానికి శాసనసభలో అధిక సంఖ్యాకుల మద్దతు ఉన్నట్టు నిరూపించడానికే స్పీకర్ ఈ తొమ్మిదిమంది సభ్యత్వాలను రద్దు చేశాడన్నది భాజపా ఆరోపణ! ఈ తొమ్మిదిమంది సభ్యులు కాంగ్రెస్‌నుండి ఫిరాయించి భారతీయ జనతాపార్టీకి బాసటగా నిలబడడంవల్ల మొదలైన సంక్షోభ ప్రక్రియ రాష్టప్రతి విధింపుతో కొత్త మలుపు తిరిగింది! హరీశ్ రావత్ సాగిస్తున్న దుష్పరిపాలననుండి ఉత్తరఖండ్ ప్రజలను పరిరక్షించాలన్న మహదాశయంతోనే ఈ తొమ్మిదిమంది సభ్యులు తిరుగుబాటు చేసి ఉండవచ్చు! కానీ పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టానికి ఫిరాయించేవారి ఆశయాలతో, ఆదర్శాలతో అవినీతితో అనైతికతతో సంబంధం ఉన్నట్టు లేదు. ఒక పార్టీనుంచి ఫిరాయించే శాసనసభ్యుల సంఖ్య ఆ పార్టీకి శాసనసభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో మూడవవంతు లేదా ఎక్కువ ఉందా? లేదా? అన్నవి మాత్రమే ఈ చట్టం పరిగణించే ప్రశ్నలు! అలాంటప్పుడు ఈ తొమ్మిదిమంది ఉత్తరఖండ్ కాంగ్రెస్ శాసనసభాపక్షంలో మూడవ వంతు అవునా? కాదా? అన్నది తేల్చడం కష్టం కాదు! ఇది కూడ వివాదగ్రస్తం ఎలా అవుతోందన్నది అంతుపట్టని రాజకీయ ప్రహేళిక...ఇలా ఫిరాయించిన తొమ్మిది మందిలో ముగ్గురిని హరీశ్ రావత్ మళ్లీ తన వైపునకు తిప్పుకొనడానికి యత్నించాడన్న ఆరోపణ చిన్న రాష్ట్రాన్ని కుదుపుతున్న అవినీతి ప్రహసనం! ఈ తొమ్మిది మందిలో ముగ్గురికి డబ్బిస్తానని, ఈ ముడుపు పుచ్చుకుని మళ్లీ తన వైపునకు రావాలని రావత్ వారిని బుజ్జగించిన ఘట్టాన్ని దృశ్యమాధ్యమాల వారు రహస్యంగా-స్టింగ్ ఆపరేషన్- ద్వారా చిత్రీకరించి ఆవిష్కరించారట! ఈ ఆవిష్కరణ తరువాత ఈ అవినీతి గురించి తనకేమీ తెలియదని హరీశ్ రావత్ చెప్పడం ఈ మొత్తం నాటకంలోని రసవత్తర ఘట్టం...
ఉత్తరఖండ్ శాసనసభకు 2012లో ఎన్నికలు జరిగినప్పటినుంచి హరీశ్‌రావత్‌కు విజయ బహుగుణకు మధ్య కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ప్రాబల్య సమరానికి ఫలితం ప్రస్తుత సంక్షోభం. 2012 మార్చిలో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉండిన హరీశ్‌రావత్ అప్పుడు ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్లూరాడు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం అప్పుడు విజయబహుగుణను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. విజయ బహుగుణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తరువాత రాజకీయాలలోకి ప్రవేశించాడు! అందువల్ల ఆయన ప్రాధాన్యం అప్పుడు పెరిగింది. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా హరీశ్ రావత్ అప్పుడు కేంద్ర సహాయమంత్రిగా పదవికి రాజీనామా కూడ చేసినట్టు ప్రచారమైంది. రాజీనామాలు చేయడం ఆ తరువాత బుజ్జగింపునకు గురై ఉపసంహరించుకోవడం రాజకీయవేత్తలకు సహజ స్వభావం! ఆతరువాత రావత్ ముఖ్యమంత్రి కావడం వేరే కథ! ఇప్పుడు హరీశ్ రావత్‌ను గద్దె దింపడానికి విజయ బహుగుణ వర్గీయులు యత్నించడం ఈ ప్రాబల్య సమరంలో సరికొత్త ఘట్టం. తొమ్మిదిమంది తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ బలం 36న ఉంచి 27కు పడిపోయింది. భాజపా బలం 29 నుంచి 37కు పెరిగిందన్నది జరిగిన ప్రచారం. ఉత్తరఖండ్ శాసనసభ మొత్తం బలం 71 స్థానాలు!
అందువల్ల ఉత్తరఖండ్ సంక్షోభం ప్రధానంగా కాంగ్రెస్ అంతర్గత కలహం! ఈ అంతర్గత కలహాన్ని ఉపయోగించుకుని అర్ధాంతరంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భాజపా భావించడం అవకాశవాదం! నైతికత పట్ల దాదాపు అన్ని రాజకీయ పక్షాలకు నిష్ఠ లేదన్నది దీనివల్ల తేటతెల్లమైన వ్యావహారిక సత్యం. ఏమయినప్పటికీ మంత్రివర్గాల బలాలు తేలవలసింది శాసనసభల సమావేశాలలో మాత్రమేనన్నది అన్ని రాజకీయ పక్షాలవారు అంగీకరించిన ప్రజాస్వామ్య సూత్రం! కానీ ఎప్పుడో అప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడ ఈ ఆదర్శ సూత్రాన్ని ఉల్లంఘించడం చరిత్ర. అందువల్ల ఈ సూత్రానికి ఇప్పుడు భాజపా నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కల్పించిన విఘాతం లేదు, విఘాతం కల్పించిందని విమర్శించే నైతిక అధికారం కాంగ్రెస్‌కు లేదు! ఈ నెల 18వ తేదీన విజయబహుగుణ వర్గంవారు తిరుగుబాటు చేసిన తరువాత గవర్నర్ కృష్ణకుమార్ పాల్ తన బలాన్ని సభలో నిరూపించుకోవాల్సిందిగా హరీశ్‌రావత్‌ను కోరడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణమైన పరిణామం. పదిరోజులలోగా అంటే మార్చి 28వ తేదీలోగా రావత్ సభ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ 19వ తేదీన నిర్దేశించారు. ఈలోగా తిరుగుబాటు చేసిన శాసనసభ్యులను బుజ్జగించవచ్చునన్నది కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహమైంది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యులెవ్వరినీ బహిష్కరించలేదు. బహిష్కరించి ఉన్నట్టయితే వారి పదవులు పదిలమైపోతాయి. విజయ బహుగుణ కుమారుడిని, శాసనసభ్యుడు కాని సాకేత బహుగుణను మరి కొందరిని మాత్రమే కాంగ్రెస్ పార్టీనుంచి వెళ్లగొట్టింది.
బలపరీక్ష రెండురోజులుందనగా 26వ తేదీన తొమ్మిది మంది తిరుగుబాటు దారులను అనర్హులుగా ప్రకటింప చేయడం కాంగ్రెస్ ఎత్తుగడ. తద్వారా శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోవచ్చునని రావత్ ఊహించాడు! భాజపా వారు రాష్టప్రతి పాలనాస్త్రాన్ని సంధించారు! నైతికత మాటలు ఎలా ఉన్నప్పటికీ శాసనసభ రద్దు కాలేదు కనుక తొమ్మిదిమంది సభ్యుల అనర్హత వివాదం మాత్రం కొనసాగుతునే ఉంటుంది! శాసనసభ పునరుద్ధరణ జరిగి రాష్టప్రతి పాలన తొలగినప్పుడు ఈ అనర్హత మళ్లీ కల్లోలం సృష్టించనుంది! ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాల ప్రమేయం అందువల్ల మరోసారి తప్పదు! రావత్ లంచం ఇవ్వచూపాడా లేదా అన్నది కూడ న్యాయ ప్రక్రియ ద్వారా స్పష్టం కావాలి!