సంపాదకీయం

కొన్న నీటికి కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచినీరు దొరకని నోళ్లు ఎండిపోతున్నాయి. నీటిచుక్క మిగలని భూగర్భం బీటలు పారిపోతోంది. కేరళ నుంచి కశ్మీర్ వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ వరకూ దేశమంతటా ఇదే కథ నడుస్తోంది. ఇదే వ్యథ కనబడుతోంది. ఖాళీ కుండలు, మండే గుండెలు మరుభూమిగా మారిన ఒకప్పటి హరిత ప్రాంతాలు ...ఇది తక్షణ సమస్య, పరిష్కారానికి నోచని దీర్ఘకాల సమస్య కూడ! మహారాష్టల్రో మంచినీటి సమస్య మహా విషాదంగా మారింది. పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ఇతర ఘరానా సంస్థలు నీటి సమస్య పరిష్కారం కోసం నిధులెందుకు ప్రదానం చేయరాదన్నది ఈ మహావివాదం. నీటికోసం నిధులిస్తారా లేదా? అని ‘క్రికెట్ ఆటల’ ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపిఎల్-ను జనం మహారాష్టల్రో నిలదీస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోను నీటి సమస్య ఇలాంటి పరిణామాలకు దారితీస్తోంది. గోదావరి జలాలు తరలి వచ్చినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో అందరి దప్పిక తీరడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం విస్తృతమైన ఎడారిలో చిట్టి జలాశయం -ఒయాసిస్- వంటిది. కరవు పీడిత ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిధుల కొరతను నివారించడానికై కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఈ ఎనిమిది వందల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచిపెట్టినట్టయితే ఒ క్కొక్క రాష్ట్రానికి యాబయి కోట్లు లభిస్తే ఎక్కువ. ఈ నిధులు మంచినీటి కొరతను తీర్చడానికి సరిపోతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి కాబోలు. ఈ నిధులలో కనీసం పదిశాతం ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయించడానికి గొట్టపు బావులను మరింత లోతు చేయడానికి, కొత్త గొట్టపుబావులను తవ్వడానికి ఉపయోగించాలట. మిగిలిన నిధులను జలాశయాలను నిర్మించడం, నదులనుంచి, వాగులనుంచి గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయడం వంటి దీర్ఘకాల పథకాలకు ఉపయోగిస్తారు. దప్పికయినప్పుడు బావులు తవ్వడం కాక భవిష్యత్తులో ఏర్పడే ఎద్దడిని తీర్చడానికి ముందుగానే పథకాలను ఎందుకని అమలు పరచరు? ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించవలసిన పనిలేదు. కానీ దీర్ఘకాల పథకాల వల్ల దప్పిక తీరడం లేదు. తీరడంలేదన్నదానికి జంటనగరాలే సాక్ష్యం. కృష్టా గోదావరి నదీ జలాలు తరలి వచ్చినప్పటికీ భాగ్యనగరిలో జల సమృద్ధి ఏర్పడలేదు.
ఈ ఎనిమిది వందల ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం మంచినీటి సరఫరాకోసం బడ్జెట్‌లో కేటాయంచిన నిధులలో భాగం. మొదటి విడతగా ఈ మొత్తాన్ని విడుదల చేశారు. అందువల్ల దుర్భిక్షం ఏర్పడినందున తీవ్రతరమైన మంచినీటి సమస్య పరిష్కారానికి ఈ నిధులు చాలవు. సాధారణ వర్షపాతం సంభవించి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసి ఉండేది. అయితే ఈ ఏడాది తీవ్రతరమైన నీటి ఎద్దడి నివారించడం కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఇప్పటికే రెండువేల నాలుగు వందల కోట్ల రూపాయలను సమకూర్చుకున్నాయట. ఇందులో పదమూడు కరవు రాష్ట్రాలకు పదిహేడు వందల కోట్లను కేటాయించారట. మహారాష్టల్రోని లాతూర్ జిల్లాలో దేశం మొత్తంమీద నీటి సమస్య తీవ్రంగా ఉందట. ప్రత్యేక రైళ్లలో మంచినీటిని తరలిస్తున్నారట. అయితే ఈ మంచినీరు స్థానికుల అవసరాలలో ఐదుశాతం కూడ తీర్చలేకపోవడం విచిత్ర విధానాలకు నిదర్శనం. లాతూర్ జిల్లాలో నీటి ఎద్దడి నివారించడంకోసం ఈ ఏడాది 1500కు పైగా పథకాలను అమలు జరుపుతున్నారట. జనం ఇలా నీటి చుక్కలకోసం నోళ్లు తెరచుకొని ఉన్న మహారాష్టల్రో సేద్యపు నీటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పడమటి కనుమలకు పశ్చిమంగా ఉన్న మహారాష్టల్రో వర్షం చాల ఎక్కువ కురుస్తుంది. సముద్రతీర ప్రాంతంలో రోజుల తరబడి ఎడతెరిపి లేని వర్షం కురవడం, కుండలతో గంగాళాలలో కుమ్మరించినట్టు వర్ష బీభత్సం సృష్టించడం ఆ ప్రాంతంలో సర్వసాధారణం. పడమటి కనుమలలో పడిన వర్షం మహాప్రవాహాల రూపమెత్తి తూర్పుగా తరలి రావడం సహజ పరిణామం. కానీ మహారాష్టల్రోను ప్రత్యేకించి ముంబయి, పూణె, నాగపూర్ నగరాలలోను నీటికి కటకట ఏర్పడి పోయింది.
నీరు దొరకని జనం విలవిలలాడుతున్న సమయంలో మహారాష్టల్రోని పై మూడు నగరాలలోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముంబయి, పూణె, నాగపూర్ నగరాలలో మొత్తం అరవై లక్షల లీటర్ల నీరు ఈ క్రికెట్ పోటీల నిర్వహణ కోసం ఖర్చవుతోందట. నీరు తాగడానికి దొరకని సమయంలో వినోదాల పేరుతో ఇలా నీటిని వృధా చేయరాదని, నిరోధించాలని కోరుతూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైందట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వారు ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించి నీటిని కొనుగోలు చేయగలరు. సామాన్యులకు ఉచితంగా తక్కువ ధరలలో లభించవలసిన నీరు ఇలా భారీ ధరలకు అమ్ముడు పోతోంది. ఇలా అమ్ముడు పోవడానికి ఇది మొదలు కాదు. ప్రపంచీకరణ మొదలైన నాటినుంచి నీరు అమ్మడం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాలలో ఈత కొట్టడానికి బావులు లేవు. అవన్నీ మట్టి దిబ్బలుగా మారుతున్నాయి. డబ్బున్నవారు వేలాది అడుగుల వరకు గొట్టపు బావులను తవ్వడం వల్ల అన్ని వైపులనుంచి భూగర్భలోకి నీటి ఊటలు ఆ వైపునకు మళ్లాయి. ఫలితంగా పల్లెలలోని చేద బావులు ఎండిపోయాయి. గ్రామాలకు సమీపంలో చిన్నచిన్న ఏరులు ప్రవహించేవి. స్వచ్ఛమైన ఈ ప్రవాహ జలాన్ని గ్రామీణులు బిందెలలో, కడవలలో ముంచుకొని పోయేవారు. ‘‘ఎప్పుడు ఎడతెగక పారు ఏరు’’ ఉన్న ఊరిలోనే నివసించాలని సుమతీశతక కారుడు చెప్పిన హితవునకు ఇదంతా, ఈ జలసమృద్ధి, నేపథ్యం.
ఉచితంగా లభించే జలాలకు కొరత ఏర్పడింది. కానీ డబ్బు పెట్టి కొనే వారికి ప్యాకెట్లలో, పీపాలలో, సీసాలలో, డబ్బాలలో,లారీలలో మంచినీరు, మామూలు నీరుసమృద్ధిగా లభిస్తోంది. అంటే పట్టణాలలో నగరాలలో పల్లెలలో సైతం కృత్రిమంగా నీటి కొరతను సృష్టించారు. ఇలా సృష్టించడానికి వీలుగా రకరకాల అక్రమ ప్రయోజనాలకోసం బహుళ జాతీయ వాణిజ్య ప్రయోజన సంస్థలు వాటి దళారీలు భూమిని ఇచ్చవచ్చినట్టు తవ్వి భూగర్భాన్ని ఎండకట్టేశారు. సీసాలలో నీరు నింపే సంస్థలు, శీతల పానీయాల సంస్థలు, రకరకాల పరిశ్రమలు, నదీ తీరాలలో తవ్వి నదులను ఎండ కట్టారు. లావాసా అనే సంస్థ మహారాష్టల్రోని పడమటి కనుమలను పోస్కో, వేదాంత, సంస్థలు ఒరిస్సా లోని నియాంగిరి, మహేంద్రగిరి అరణ్యాలను నిర్జలం చేయడం పదేళ్లకు ఇటీవల జరిగిన పరిణామాలు. నీటిని నూనె వలె, నేయి వలె, శీతల పానీయాల వలె అమ్ముతుండటం ప్రపంచీకరణ వల్ల మనకు కలిగిన లాభం..