సంపాదకీయం

‘బిటి’కి ప్రత్యామ్నాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వదేశీయ పరిజ్ఞానంతో బిటి పత్తి విత్తనాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పరిశోధన ప్రక్రియను వేగవంతం చేస్తోందట. మహికో మొన్‌సాంటో బయోటెక్ ఇండియా లిమిటెడ్-ఎమ్‌ఎమ్‌బి- వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల గుత్త్ధాపత్యం నుండి బిటి పరిజ్ఞానాన్ని విముక్తం చేయడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నట్టు ప్రచారం అవుతోంది. బిటి పరిజ్ఞానంతో విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా భయంకరమైన ధరలకు మొన్‌సాంటో సంస్థవారు మన రైతులకు ఈ విత్తనాలను అమ్మారు. దశాబ్దిన్నరకు పైగా భారీగా దోచుకున్నారు. ప్రభుత్వాల జోక్యం వల్ల న్యాయస్థానాల ప్రమేయం వల్ల బిటి పత్తి విత్తనాల ధరలు బాగా తగ్గినట్టు ప్రచారమైంది. ఈ తగ్గిన ధరలు కూడ రైతులను మొన్‌సాంటో వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కొల్లగొట్టడానికి మాత్రమే దోహదం చేస్తున్నాయి. పెద్దపెద్ద వాణిజ్య సంస్థల పెత్తనం కింద భారతీయ కర్షకులు బిటి పత్తివిత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వాణిజ్య సంస్థలను పరిజ్ఞాన ప్రధాన ప్రక్రియ ద్వారా మొన్‌సాంటో నియంత్రిస్తోంది. అందువల్ల పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఉత్పాదక సంస్థలు మొన్‌సాంటోకు భారీగా పారితోషికం -రాయల్టీ- ముట్టచెప్పవలసి వస్తోంది. ఉత్పత్తి చేసే రైతులు, ఉత్పాదక వాణిజ్య సంస్థలు, పరిజ్ఞానాన్ని సమకూర్చుతున్న మొన్‌సాంటో-ఇలా వివిధ దశల వారి లాభాలు బిటి పత్తివిత్తనాల ధరలను పెంచుతున్నాయి. ఉత్పత్తి చేస్తున్న రైతులకు బిటి పత్తి విత్తనాలపై లభిం చే ధరలకంటే కొనుగోలు చేస్తు న్న రైతులు, నాలుగైదు రెట్లు అధికంగా చెల్లించడం నడచిపోతున్న దోపిడీ ప్రక్రియలో భాగం. ప్రపంచీకరణలో భాగంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ల వాణిజ్య ప్రాబల్యాన్ని సార్వభౌమ అధికారం కల ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి. ఇందుకు కొనసాగుతున్న సాక్ష్యం బిటి పత్తి విత్తనాల ద్వారా మొన్‌సాంటో చేస్తున్న దోపిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టలేకపోవడం. పరిజ్ఞాన ముద్రాధికారం -పేటెంట్స్- చట్టం సృష్టించిన వైపరీత్యం ఇది. అందువల్ల మొన్‌సాంటో వారి బిటి పరిజ్ఞానానికి దీటుగా స్వదేశీయ బిటి పరిజ్ఞానాన్ని రూపొందించడానికి వ్యవసాయ పరిశోధన భారతీయ మండలివారు శాస్ర్తియ, పారిశ్రామిక పరిశోధన మండలి వారు కేంద్ర ప్రభుత్వం జీవరసాయన సాంకేతిక విజ్ఞాన విభాగం వారు ఉమ్మడిగా పరిశోధన కొనసాగిస్తున్నారట. ఈ పరిశోధన ఫలితంగా కొత్త బిటి జన్యు జీవకణాలను రూపొందించగలిగినట్లయితే అది జన్యు పరివర్తక-జీఎం- పరిజ్ఞాన రంగంలో మరో విప్లవం కాగలదు...
కొత్తరకం బిటి జన్యుకణాలను ఉపయోగించి కొత్తరకం బిటి పత్తి విత్తనాలను రూపొందించడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థల గుత్త్ధాపత్యం నుండి మన వ్యవసాయ రంగాన్ని విముక్తం చేయడానికి అంకురార్పణ-స్టార్టప్- కాగలదు. ‘్భరత్‌లో నిర్మించండి’-మేక్ ఇన్ ఇంయా- స్ఫూర్తి కూడ ఈ పరిశోధన ఫలితాలు పెంపొందించగలవు. ఈ స్వదేశీయ జీఎం బిటి జీవ జన్యు కణాలను ఈ మహాసంకర జాతి విత్తనాల రూపకల్పనకోసం ఉపయోగించడం మాత్రమే కాక సంప్రదాయ బీజాంకురాలలో సైతం వాటిని సమీకృతం చేయవచ్చునట. తద్వారా పరివర్తన ప్రక్రియ ద్వారా మాత్రమే కాక సంప్రదాయ వ్యవసాయానికి ప్రాతిపదిక అయిన సహజ జీవ జన్యు వికాసం ద్వారా అధిక దిగుబడులనిచ్చే విత్తనాలను రూపొందించుకోవచ్చునట. ఈ పరిశోధన విజయవంతం అయినట్టేయితే జన్యు పరివర్తన వల్ల సంభవిస్తున్న వైపరీత్యాలను నిరోధించవచ్చు. జన్యు పరివర్తక వ్యవసాయానికి దీటైన రీతిలో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడ దిగుబడులను పెంచవచ్చు. బిటి విత్తనాల వల్ల పంటల వల్ల దిగుబడులు పెరుగుతున్నాయన్నది ప్రచారం. కానీ బిటి రసాయనం విష ప్రభావం వల్ల క్రమంగా భూసారం నష్టమైపోతుందని, వ్యవసాయానికి భూమి పనికి రాకుండా పోతుందని, పరిసరాలు కాలుష్యమయం అవుతాయని, మానవులు చిత్రవిచిత్ర వ్యాధులకు గురి అవుతారని కూడా సమాంతర ప్రచారం జరుగుతోంది. పాత క్రిముల దాడిని నిరోధించగల బిటి పత్తి కొత్త రకం క్రిముల ఉత్పత్తిని మిక్కిలి దోహదం చేస్తుండడం దేశమంతటా ఆవిష్కృతమైన, అవుతున్న దృశ్యాలు...
ఈ కొత్తరకం ఈగలు, పురుగులు కీటకాలు తెల్లగాను, గులాబీ రంగులోను వివిధ ఆకృతులలో అవతరిస్తున్నాయి. పత్తి కాయలను మాత్రమే కాక రైతుల జీవితాలను సైతం నమిలి మింగేస్తున్నాయి. గత ఏడాది పంజాబ్‌లో తెల్ల ఈగల దాడికి మొత్తం బిటి పత్తిపంటలో మూడింట రెండువంతులు ధ్వంసమైంది. పనె్నండు లక్షల ఎకరాలలో పంట పాడయిన కారణంగా నాలుగువేల రెండువందల కోట్ల రూపాయల అధికారిక నష్టం వాటిల్లింది. నష్టం ఇంకా ఎక్కువేనన్నది అనధికార నిర్ధారణ. పదిహేను మంది బిటి పత్తి రైతులు అత్మహత్య చేసుకున్నారు. బిటి పంటల వల్లనే అధికాధిక వ్యవసాయ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నది, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం. అందుకు పంజాబ్ ఘటన ఒక సాదృశ్యం మాత్రమే. వరంగల్లు జిల్లా, కర్నూలు జిల్లాలో తెలుగు రాష్ట్రాలలోని ఇతర చోట్ల పత్తి కాయలలో గూడుకట్టుకున్న గులాబి పురుగులు జిఎమ్ సృష్టించిన అనేక వైపరీత్యాలకు సజీవ ప్రతీకలు. జీవ జన్యు కణాలను ఒక మొక్క నుంచి మరో మొక్కకు పరివర్తన చేయడం ద్వారా సంకరజాతి విత్తనాలను వంగడాలను సృష్టించారు. ఈ పరివర్తన మొక్కలలోని ఆయా జాతులకు మాత్రం పరిమితం. కానీ జిఎమ్ ప్రక్రియ జరుగుతున్న మహా సాంకర్యం చాలా విస్తృతమైంది. ఉమ్మెత్తకాయ జీవజన్యు కణాలను వరిగింజలలో ప్రవేశపెట్టి జన్యుపరివర్తన సాధించవచ్చునట. తద్వారా విత్తనంలోను మొక్కలోను ఉత్పత్తి అయ్యే బాసిలస్ తురింజెన్సిస్-బిటి అన్న రసాయనం ఉమ్మెత్తలు మాత్రమే పెరిగే ఊసర క్షేత్రాలలో సైతం వరి పండటానికి దోహదం చేస్తుందట, దిగుబడులను భారీగా పెంచుతుందట. పంటలను తెగులు ఆశించకుండా నిరోధిస్తుందట. ఇదంతా అసత్య ప్రచారమని క్రమంగా ధ్రువపడుతోంది. బిటి పంటలకు విచిత్రమైన కీటకాల బెడద దాపురించింది. బిటి పత్తిని నాలుగైదు ఏళ్లు పండించిన భూమి మరో పంటకు పనికిరాదని తేలిపోయింది. క్రమంగా ఏ పంటకూ పనికిరాని రీతిలో భూమి రూపొందుతుందట..
అందువల్ల బహుళ జాతీయ సంస్థలవారు వాణిజ్య దురాక్రమణను నిరోధించడం సమస్యకు పరిష్కారంలో సగం మాత్రమే. స్వదేశీయ పరిజ్ఞానంలో మొన్‌సాంటో వారి విత్తనాలకు పోటీగా మరో రకం బిటి విత్తనాలను వెలయించవచ్చు. దీనివల్ల మొన్‌సాంటో దోపిడీ తగ్గినప్పటికీ బిటి రసాయన విష ప్రభావం తగ్గదు. మొన్‌సాంటో పరిజ్ఞానంతో రూపొందిన విత్తనాలు గులాబీ కీటకాలను సృష్టిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందే బిటి విత్తనాలు ఆకుపచ్చని పురుగులనో పసుపు పచ్చని ఈగలనో సృష్టించవచ్చు. తేడా ఇంతే.. .క్రమంగా పంటలను పురుగులు చప్పరించి పారేయడం మాత్రమే సమానం. అందువల్ల వేలకోట్ల రూపాయలను వెచ్చించి బిటి పరిశోధనలు జరగడం వ్యర్ధం- నిధులను సేంద్రియ వ్యవసాయ ప్రగతికి ఉపయోగించాలి. సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా సిక్కిం రూపొందింది. మొత్తం దేశం ఎందుకని రూపొందరాదు?