సంపాదకీయం

నిర్లక్ష్యానికి మూల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాలు రాలేదన్న ఆందోళన ఎంత తీవ్రంగా యావద్భారతాన్ని కుదిపేస్తుందో..తీరా వర్షాలు పడితే దాని బీభత్సం కూడా అంతగానూ కకావికలం చేస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడైపోయే రాష్ట్రాల్లో ప్రథమస్థానం ఉత్తరాఖండ్‌ది. ఇప్పుడా చిరు రాష్ట్రం తల్లడిల్లిపోతోంది. వర్షాలు లేక కాదు, కురిసిన వాన కుంభవృష్టిని తలపించడం వల్ల.. ఇలాంటి పరిస్థితి సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు అందినా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం వల్ల..! మూడేళ్లుగా నాలుగు ధామాల పుణ్యక్షేత్రాల పర్యాటక ప్రాంతమైన ఉత్తరాఖండ్ వరదల బీభత్సానికి కకావికలమైపోతోంది. 2013లో వరదలు సృష్టించిన విలయం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రాన్ని శ్మశాన సదృశంగా మార్చేస్తున్నాయి. గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని చిన్న రాష్ట్రం విలవిల్లాడిపోతోంది. చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. కేదార్‌నాథ్, రుద్రప్రయాగ్ సహా పలు ప్రాంతాల్లో తెలుగువారితో సహా వేలమంది యాత్రికులు చిక్కుకుపోయిన దయనీయస్థితిలో ఉత్తరాఖండ్ పిట్టలా వణికిపోతోంది. ఇది అలాంటిలాంటి విపత్తు కాదు.. మేఘం బద్దలైపోయి గంటల తరబడి మిల్లీమీటర్లు సెంటీమీటర్ల లెక్కలకు కూడా తెలియనంత స్థాయిలో ఆకాశంలో ఉన్న నీరంతా ఒకేసారి వచ్చిమీద పడితే ఆ భయానక పరిస్థితిని అంచనా వేసేదెట్లా? ఇది కేవలం వరదలతో సరిపెడితే నీరు ఏ అలకనంద నదీ ప్రవాహంలో కలిసి పల్లంలోకి వెళ్లిపోతుందని భావించవచ్చు. కానీ, ఈ వరదలు ఒక్కసారిగా కొండల్ని ముక్కలు చేసి.. రాళ్లను, మట్టిని ఏకం చేసి టన్నుల కొద్దీ బురద మహా ప్రవాహమై గ్రామాలకు గ్రామాలనే తనలో కలుపుకుని పోయే పరిస్థితి. 2013నాటి పరిస్థితితో పోలిస్తే ఈ సారి దీని తీవ్రత తక్కువే కావచ్చు. కేదార్‌నాథ్ ఆలయానే్న తనలో కలిపేసుకున్న తీవ్రమైంది నాటి బురద వరద.. వేలమందిని జాడ కూడా లేకుండా గల్లంతు చేసిన దారుణమైన విపత్తు ఆనాటిది. ఇవాళ్టికి కూడా వేలమంది ఏమైపోయారో తెలియని పరిస్థితి. కేదార్‌నాథ్ సమీపంలో రెండు గ్లేసియర్‌ల మధ్య జరిగిన రాపిడి ఆనాటి వరద బీభత్సానికి కారణమని శాస్తక్రారులు తేల్చారు.
మరి ఇప్పుడు వారం రోజులుగా నిరంతరంగా పడుతున్న వర్షాలు, విరిగి పడుతున్న కొండ చరియలు, లావాలా వెల్లువెత్తుతున్న బురదకూ కారణాలేమిటి? ఇప్పటికే 30మందికి పైగా చనిపోయారని అధికారికంగా వచ్చిన ప్రకటన. కానీ టన్నుల కొద్దీ పేరుకుపోయిన బురద కింద విగతజీవులైన వారి సంఖ్య ఇప్పటికైతే ఎవరూ లెక్క వేయలేరు. 2013లో సరిగా జూన్ 15-30ల మధ్య ఉత్తరాఖండ్ శవాల దిబ్బగా మారింది. సరిగా మూడేళ్ల తరువాత 2016 జూన్ 30 నుంచి వరద రాకాసి ఉత్తరాఖండ్‌ను కబళించింది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం జూలై 1న ఒక్కరోజే 54 ఇంచుల బురద ప్రవాహం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ ప్రాంతాన్ని కప్పేసింది. సైన్యం, జాతీయ విపత్తు సహాయక బృందాలు బురదను తొలగించి దాని కింద కూరుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు ఎక్కువ వచ్చే ప్రాంతంగా ఉత్తరాఖండ్‌ను గుర్తించినా, అక్కడ భారీ వర్షాలను, కుంభవృష్టిని సూచించగల రాడార్లను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఎండీఏ) ఏర్పాటు చేయలేకపోయింది. కేదార్‌నాథ్ విలయం సంభవించి మూడేళ్లు కావొస్తోంది. మళ్లీ అదే ప్రాంతంలో.. అదే రీతిలో విపత్తు ముంచుకొచ్చింది. మూడు నుంచి ఆరు గంటల ముందు భారీ వర్షాలను, కుంభవృష్టిని సూచించేందుకు డ్రాఫ్లర్ రాడార్లను ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్‌డిఎంఎ ఆ పని చేయలేకపోయింది. నిజానికి ఎన్‌డిఎంఎ దగ్గర విపత్తు వచ్చినప్పుడు అప్పటికప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనటం తప్ప శాశ్వతంగా విపత్తు నివారణకు చర్యలు తీసుకునే సాధన సంపత్తి లేనే లేదు. భారీ వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతుల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవు. ఒకవేళ అరకొర ఉన్నప్పటికీ వాటిని పాటించే నాథుడే లేడు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చినప్పుడు ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను పట్టించుకున్న వారు లేరు. ఉత్తరాఖండ్ వంటి హిమాలయ శ్రేణిలో ఉన్న రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నా ఎన్‌డిఎంఎ నోరు విప్పే సాహసం చేయటం లేదు. ముందు జాగ్రత్త అన్న పదం అధికారుల నిఘంటువులో లేనే లేదు. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. వానలో, బురదలో, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైన్యం, పారా మిలటరీ బలగాలు వీళ్ల నిర్లక్ష్యానికి కనాకష్టం పడుతున్నాయి.
ఇక్కడ నిర్మించిన అనేక పవర్ ప్రాజెక్టుల్లో తెలుగువారికీ భాగస్వామ్యం ఉంది. ఈ పవర్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి కారణంగా ఇక్కడి కొండచరియల్లో ఉష్ణోగ్రత శాతం పెరిగి హిమాలయ పర్వత శ్రేణి క్రమంగా కరిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని గుర్తించినా నియంత్రించే పరిస్థితులు లేవు. దేశంలో దాదాపు అయిదు వేల ప్రాజెక్టులు ఉన్నా, కేవలం 150కి మాత్రమే విపత్కర పరిస్థితులను ఎదుర్కోగల వ్యవస్థ ఏర్పాటై ఉంది. మిగతావన్నీ అరకొర వ్యవస్థలతో ఉండటం అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో పవర్ ప్రాజెక్టులకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటం, ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను పాటించకపోవటం క్షంతవ్యం కాదు. విపత్తు వచ్చినప్పుడు ఎన్‌డిఎంఎ చురుకుగానే స్పందించవచ్చు. ఈ చర్యల్లో సైన్యం, పారా మిలటరీ బలగాల పాత్ర ఎక్కువగా ఉంటోంది. కానీ, విపత్తు రావటానికి ముందే శాశ్వత నివారణ చర్యలకు పూనుకోవలసిన బాధ్యత ఈ ఎన్‌డిఎంఎదే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే ఈ వ్యవస్థ బలోపేతమై జాతీయ విపత్తు నివారణ నెట్‌వర్క్‌ను దేశంలోని అన్ని ప్రాంతాలకు శాశ్వత ప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉంది. వరదలు, తుపానుల వంటి అనేక ప్రకృతి పరమైన విపత్తులను సమర్థంగా ఎదుర్కునేందుకు సాధన సంపత్తిని ఈ వ్యవస్థకు అందించాలి. తాత్కాలిక, దీర్ఘకాలిక సహాయ పునరావాస చర్యలకు అనువైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. ప్రధానంగా ఉత్తరాఖండ్ లాంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో డ్యాములు, ప్రాజెక్టులు, భవనాల నిర్మాణాలకు అనుమతులను పూర్తిస్థాయిలో నియంత్రించాలి. కొండలు, పర్వతాలు, వాటి శకలాల మధ్య తరచూ ఏర్పడే ఒరిపిడులను ఎప్పటికప్పుడు గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలగాలి. వరదలను ముందుగా గుర్తించే డ్రాఫ్లర్ రాడార్లను తక్షణం ఏర్పాటు చేయాలి. లేకపోతే జూన్ వస్తే చాలు ఉత్తరాఖండ్ హిమ పర్వత ప్రాంతం ప్రకృతి ప్రకోపానికి బలి కాక తప్పదు.