సంపాదకీయం

‘సమన్వయ’ స్ఫూర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అం తర్గత భద్రతకు అవరోధాలు ఏర్పడుతుండడం శనివారంనాడు న్యూఢిల్లీలో, రాష్టప్రతి భవనం ప్రాంగణంలో జరిగిన ‘అంతర్ రాష్ట్ర మండలి’ సమావేశానికి నేపథ్య వైపరీత్యం! ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాల మధ్య నిఘా విభాగాల మధ్య సమన్వయం పెంపొందాలన్నది ఆయన ప్రసంగంలోని ప్రధాన ఇతివృత్తం! దేశమంతటా జిహాదీ ఉగ్రవాదులు పట్టుబడుతుండడం, జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ అనుకూల విద్రోహ శక్తులు మరోసారి పేట్రేగిపోతుండడం ప్రధాని ప్రసంగంలో ధ్వనించిన ప్రధాన సమస్యలు! ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు సమావేశానికి హాజరు కావలసి ఉన్నప్పటికీ కొంతమంది ఈ ప్రాంతీయ అధినేతలు ‘ముఖం చాటేయడం’ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న విపరిణామం. ఇలా ‘‘ముఖం చాటేసిన’’ ప్రాంతీయ ప్రభుత్వ అధినేతలలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి కూడా ఉండడం గొప్ప విశేషం. అంతర్గత భద్రతకు ప్రధానంగా ప్రమాదాలు ఎదురౌతున్నది జమ్మూకశ్మీర్‌లోనే! ఆమె విచ్చేసి సమావేశంలో భద్రతను గురించి వివరించి ఉండినట్టయితే మిగిలిన ప్రాంతాల ముఖ్యమంత్రులకు కూడ సమైక్య స్ఫూర్తి పెంపొంది ఉండేది. అనారోగ్యంవల్ల తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత అత్యవసర ఇతరేతర కార్యకలాపాలలో మునిగితేలుతుండడంవల్ల కర్నాటక సిద్ధరామయ్య, ఉత్తరప్రదేశ్ అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేకపోయారట! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, ఎన్.చంద్రబాబునాయుడు సమావేశంలో పాల్గొనడం వారి సమన్వయ నిష్ఠకు, సమాఖ్య స్ఫూర్తి పట్ల వారికున్న శ్రద్ధకు నిదర్శనం. అంతర్ రాష్ట్ర మండలి- ఇంటర్ స్టేట్ కౌన్సిల్- సహకార సమాఖ్య స్ఫూర్తి- కోఆపరేటివ్ ఫెడరలిజమ్-కి సజీవ స్వరూపం! పదేళ్లుగా ఈ ‘వ్యవస్థ’ మూలపడి నిద్రాణంగా ఉండడం రాజ్యాంగ వైపరీత్యం. సమావేశంలో ప్రసంగించిన దేశ వ్యవహారాల శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నుడివినట్టు ఇరవై ఆరేళ్ల చరిత్ర కల అంతర్ రాష్ట్ర మండలి ఇంతవరకు కేవలం పదిసార్లు సమావేశం కావడం ‘సమన్వయం’పట్ల కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నిరాసక్తతకు నిదర్శనం. అందువల్ల ప్రస్తుతం జరిగిన ఏకాదశ సమావేశం ఏమి సాధించిందన్నది ప్రధానం కాదు, సమావేశం ఇన్ని ఏళ్ల తరువాత జరగడమే రాజ్యాంగ సమాఖ్య సమన్వయ సంస్కృతికి విజయం... ఇక పై నియతంగా ఈ ‘మండలి’ సమావేశాలు జరిగినట్టయితే కేంద్ర రాష్ట్రాల మధ్య మాత్రమేకాక వివిధ రాష్ట్రాల మధ్య కూడ విభేదాలు సమసిపోయి సమన్వయం వికసించడానికి మార్గం ఏర్పడగలదు.
సమగ్ర ప్రగతి, సర్వప్రాంత సకల జన భాగస్వామ్య పురోగతి సాధించడానికి వీలుగా 1990లో ఈ ‘అంతర్ రాష్ట్ర మండలి’ని ఏర్పాటుచేశారు- ఏడాదికి ఒకటి రెండుసార్లైనా ఈ ‘మండలి’ వేదికపై అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సారధులు కలసి కూర్చోవడంవల్ల సమాఖ్య సమన్వయం పెంపొందుతుందన్నది ఆకాంక్ష! 1956నాటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అంతర్ రాష్ట్ర మండలికి అనుబంధంగా ‘క్షేత్రీయ మండలు’లు- జోనల్ కౌన్సిల్స్- కూడ ఏర్పాటయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి - పుదుచ్చేరి- తోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దక్షిణ ‘క్షేత్రీయ మండలి’లోని వివిధ ప్రాంతాలు. ‘అంతర్ రాష్ట్ర మండలి’ పదేళ్లుగా మూలపడి ఉండినప్పటికీ ఈ క్షేత్రీయ మండలుల సమావేశాలు మాత్రం యథావిధిగా జరుగుతున్నట్టు స్పష్టమైంది. ఈ క్షేత్రీయ మండలులన్నింటికీ దేశవ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షుడుగా ఉంటున్నాడు. రక్షణ క్షేత్రీయ మండలి ఇంతవరకు 26 పర్యాయాలు సమావేశమైంది!
గత డిసెంబర్‌లో విజయవాడలో జరిగిన సమావేశానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొన్నారు! ఈ సమావేశానికి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత వహించాడు. వివిధ రాష్ట్రాలకు ‘పేదరికం నిర్మూలన, గ్రామీణ వికాసం’ పథకాలకై లభిస్తున్న కేంద్ర నిధులను పెంచాలన్నది డిసెంబర్ నాటి ఈ క్షేత్రీయ సమావేశంలో వ్యక్తమైన ఆకాంక్ష! ఈ ఆకాంక్షకు అనుగుణంగానే రాష్ట్రాలకు లభిస్తున్న నిధులను పెంచినట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారంనాటి ‘మండలి’ సమావేశంలో ప్రకటించాడు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2015-2016 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇరవై ఒక్క శాతం అధికంగా నిధులు లభించిన విషయం నరేంద్రమోదీ ప్రస్తావించాడు.
పదునాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులమేరకు కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి పన్నులలో రాష్ట్రాల వాటాను 32 శాతానికి పెంచిన సంగతి కూడ నరేంద్రమోదీ ప్రస్తావించాడు. ‘ఆధార్’ గుర్తింపు పత్రాలను దేశంలోని ప్రజలందరికీ సమకూర్చడంవల్ల దారిద్య్ర నిర్మూలన పథకాల అమలులో అవినీతికి తావులేకుండా పోగలదన్నది ప్రధాని ప్రస్తావించిన మరో ప్రముఖమైన అంశం. ఇప్పటికే దేశంలోని 79 శాతం మందికి ‘ఆధార్’ గుర్తింపు పత్రాలను జారీచేసిన సంగతి ప్రధాని ప్రస్తావించాడు. ఈ సంవత్సరం పూర్తయ్యేలోగా వంద శాతం ప్రజలకు ఈ గుర్తింపు పత్రాలు లభించనున్నట్టు ఆయన చెప్పారు. వ్యవస్థలో పేరుకొనిపోయిన అధికార, రాజకీయ అవినీతి నిర్మూలనకు ‘ఆధార్’ పత్రం ఆధారం అవుతోంది. లబ్ధిని పొందుతున్నవారికి బ్యాంకు ఖాతాలలో సహాయానికి సంబంధించిన ‘నగదు’ను నేరుగా జమకట్టడంవల్ల ‘దళారీ’లు సహాయాన్ని దారి మళ్లించడానికి అవకాశం ఉండనే ఉండదు. కొత్తగా ఐదు కోట్లు నిరుపేద కుటుంబాలకు ‘వంట ఇంధనం’ సరఫరా చేయనున్నట్టు కూడ నరేంద్రమోదీ ప్రకటించాడు. దీనివల్ల ‘కిరోసిన్’- గ్యాస్ నూనె- వాడడం పూర్తిగా తగ్గిపోతుందట. వంట ఇళ్లలో వాయుకాలుష్యం కూడ తగ్గిపోతుంది. ఇలా శనివారంనాటి ‘అంతర్ రాష్ట్ర మండలి’ సమావేశం దేశంలో అమలు జరుగుతున్న ప్రగతి సంక్షేమ పథకాల ‘సమీక్ష’కు మరోసారి అవకాశం కల్పించింది. విద్యారంగంలో సంస్కరణలలో భాగంగా దేశమంతటా ఏకీకృత విద్యాప్రణాళికను అమలుజరుపుతున్నట్టు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకొనడానికి శనివారంనాటి సమావేశం దోహదం చేసింది.
ఈ ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను దేశంలో పెచ్చుపెరుగుతున్న బీభత్స కలాపాలు నిలదీస్తుండడం నిరాకరించలేని నిజం! పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదులు, చైనా ఉసిగొల్పుతున్న మావోయిస్టులు నిరంతరం విస్తరించిపోతున్నారు. ఐఎస్‌ఐఎస్- ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం- పేరుతో కొత్తగా ఏర్పడిన ముఠాకు చెందిన జిహాదీలు దేశమంతటా పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘జాతీయ బీభత్స వ్యతిరేక అనుసంధాన వ్యవస్థ’- నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్- ఎన్‌సిటిసి- తరహాలో సమన్వయ విభాగం ఏర్పాటుకావడం అనివార్యం అవుతోంది. కేంద్ర రాష్ట్రాల నిఘా భద్రతా విభాగాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయ వ్యవస్థ నెలకొనడంవల్ల మాత్రమే ఈ రెండు పొరుగు దేశాలు ఉసిగొల్పుతున్న ‘ఉగ్రమృగాల’ కోరలను ఊడబెరకడానికి వీలు కలుగుతుంది. ‘ఎన్‌సిటిసి’ని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన 2012లోనే చర్చకు వచ్చినప్పటికీ దీనివల్ల వివిధ రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందన్న ప్రచారం జరిగింది. అనేక రాష్ట్రాలు వ్యతిరేకించిన కారణంగా ఈ ‘వ్యవస్థ’ ఏర్పడలేదు. శనివారంనాటి సమావేశం స్ఫూర్తితోనైనా ఈ సమన్వయ వ్యవస్థ ఏర్పాటు దిశగా కృషి జరగాలి...