సంపాదకీయం

సయోధ్య బాటలో కృష్ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వివాదం పరిష్కారం అయిపోయిందన్నది కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి బుధవారం కొత్త ఢిల్లీలో వ్యక్తం చేసిన విశ్వాసం. ఉభయ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదపు ఛాయలేవీ ఉన్నత మండలి-అపెక్స్ కౌన్సిల్- సమావేశం తరువాత మాధ్యమాల ప్రతినిధులతో ముచ్చటించిన ఉమాభారతి మాటలలో గోచరించలేదు. కృష్ణా జలవివాదం పరిష్కారం అయిపోయిందన్న ధీమా ఆమె సంక్షిప్త ప్రసంగంలో ధ్వనించింది. ఈ పరిష్కారం పట్ల సందేహాలను ఎవ్వరూ సంధించనూ లేదు, సమాధానాలను చెప్పవలసిన అవసరం ఉమాభారతికి కలుగనూ లేదు. రెండు సంవత్సరాల వివాదం అపెక్స్ కౌన్సిల్ జరిపిన రెండు గంటల సమావేశంలో పరిష్కారం అయిపోవడం ఆశ్చర్యకరం కావచ్చు. పూర్తి సయోధ్య ఉభయ రాష్ట్రాల మధ్య ఏర్పడిందా? అన్న విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాని, అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాని సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందజేయవలసి ఉంది. అంతవరకు ఉమాభారతక్క చెప్పిన మాటలు మాత్రమే సయోధ్య కుదిరిందనడానికి ప్రాతిపదిక. సమావేశంలో పాల్గొన్న ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదాన్ని వినిపించారన్నది ఉమాభారతి చెప్పిన మొదటి అంశం. చర్చలు, వివరణలు, వాదాలు, ప్రతివాదాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కూడ ఆమె చెప్పారు. ఇలా సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య, మంత్రుల మధ్య, అధికారుల మధ్య సయోధ్య ఏర్పడడం సమావేశ విజయానికి చిహ్నం. ఈ సయోధ్య జలవివాదం పరిష్కారానికి దోహదం చేస్తుందన్నది ఉమాభారతి చేసిన నిజమైన నిష్కర్ష. ఎందుకంటె రెండేళ్లుగా కొనసాగుతున్న కృష్ణానదీ జల వివాదం రెండు గంటలలో పరిసమాప్తి కాదు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చుని చర్చించడమే అసలు సయోధ్య. ఈ జలవివాదాన్ని ఉమ్మడి రాష్ట్రం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కృష్ణానదీ జల నిర్వహణ మండలి-కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డ్-పరిష్కరించలేకపోయింది. అంతర్‌రాష్ట్ర జలవివాద మండలి పరిష్కరించలేకపోయింది. ఇప్పుడు ఈ కొత్త ఉన్నత మండలిని ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత మండలి ఏర్పాటు చేయాలని 2014 నాటి పునర్ విభజన చట్టంలోనే నిర్దేశించారట. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం ఈ వివాద పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వంవారి అలసత్వ విధానానికి నిదర్శనం. ఇప్పుడైన సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి కేంద్ర మంత్రి అధ్యక్షతన ఉన్నత మండలి ఏర్పడింది. సర్వోన్నత న్యాయాదేశం తమకు లభించినందువల్ల మాత్రమే తామీ ఉన్నత మండలిని ఏర్పాటు చేశామని ఉమాభారతి స్పష్టంగా చెప్పారు కూడ. అందువల్ల అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావడమే జల సయోధ్యకు సూచకం..
పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకతను వ్యక్తం చేయడం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటునకు దారితీసిన ఒక ప్రధాన పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరినది నుంచి మళ్లించి కృష్ణానదిలో కలుపుతున్న నీటిలో తమకు వాటా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండడం మరో వివాదాంశం. ఈ రెండు వివాదాలు ఉభయ రాష్ట్రాలూ తమ వాటా నీటికంటె ఎక్కువ వాడుకున్నప్పుడు మాత్రమే వివాదాలు. అలా వాడుకోకుండా తమ వాటా పరిమితికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవి వివాదాలు కావు. కానీ పరస్పర విశ్వాస రాహిత్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నెలకొని ఉండడం వౌలికమైన వివాదం. తెలంగాణ, మహారాష్టల్ర మధ్య కుదిరిన జలసయోధ్య రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా సయోధ్య ఎందుకు కుదరలేదు? అలా కుదిరి ఉండినట్టయితే ఈ అపెక్స్ కౌన్సిల్ అనే వ్యవస్థ తెలుగు భాషను పరిపుష్టం చేయవలసిన అగత్యం ఏర్పడి ఉండేది కాదు. ఉన్నత జలమండలి అని వాడడం మాని అపెక్స్ కౌన్సిల్ అన్న పదం అచ్చతెలుగుదైనట్టుగా ప్రయోగ గౌరవాన్ని పొందడం ఈ జల వివాదం వల్ల మన భాషకు ఒనగూడిన గొప్ప లాభం. కానీ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లనవసరం లేకుండా హైదరాబాద్‌లోనే కూచుని చర్చించి ఉంటే వివాదం పరిష్కారం అయి ఉండేదేమో? ఉమాభారతి కూడ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభిప్రాయం పరిష్కారానికి ప్రధానమని చెప్పింది. కానీ వివాదం సుప్రీంకోర్టుకెక్కింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ అపెక్స్ కౌన్సిల్ అవతరించింది.
మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టు ప్రకటించిన ఉమాభారతి గోదావరి నీటి మళ్లింపు వాటా, డిండి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి పథకాలు సమావేశంలో చర్చకు వచ్చాయా? లేదా? అన్నది చెప్పలేదు. మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరవలసి ఉందని చెప్పిన ఆమె ఆ రెండు వివాదాశాంలేమిటో మాత్రం వెల్లడించలేదు. అందువల్ల కృష్ణాజల వివాదం పూర్తిగా సమసిపోలేదన్నది స్పష్టం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడ చర్చలు జరిపి సర్వసమగ్ర పరిష్కారం సాధించాలని మాత్రమే ఆమె సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గల జలవివాదం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణానదీ జలాల పరిధిలోనిది. మహారాష్టక్రు, కర్ణాటకకు ఈ వివాదంతో ప్రమేయం లేదు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ఉన్నత మండలి వ్యవస్థలో కర్ణాటకకు, మహారాష్టక్రు చోటులేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రాలతో కూడ తెలుగు రాష్ట్రాలకు జలవివాదం కొనసాగుతోంది. ఆ వివాదాన్ని కూడ పరిష్కరించుకోవడం మేలన్నది బహుశా ఉమాభారతి ఆకాంక్ష కావచ్చు. బుధవారం నాటి సమావేశంలో సయోధ్య కుదిరిన మూడంశాలు కూడా నీటి పంపిణీ ప్రక్రియకు సంబంధించినవి. అంతేకాని వౌలికంగా ఏ రాష్ట్రానికి ఎంత నీరు అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జరిగిన కేటాయింపుల గురించి విభిన్నమైన అవగాహనలు ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొని ఉండడం వివాదానికి వౌలిక ప్రాతిపదిక. ఈ విభేదం బుధవారం నాటి సమావేశంలో తొలగిన జాడలేదు...
ఉభయ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ ఇంజినీర్లతో అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేయడం గురించి సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సంఘం కృష్ణా పరీవాహక ప్రాంతంలో పర్యటించి నీటి లభ్యతను నిర్ణయిస్తుందట. ఈ కమిటీ నిర్ణయాల నివేదికను జలవనరుల వివాద పరిష్కార న్యాయమండలి-ట్రిబ్యునల్-కు నివేదిస్తుంది. ట్రిబ్యునల్ నీటి లభ్యత, దామాషా ప్రాతిపదికగా ఉభయ రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తుంది. ట్రిబ్యునల్ కేటాయింపులు, సూచనల ప్రాతిపదికగా మాత్రమే కొత్త పథకాలను నిర్మించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించాయన్నది ఉమాభారతి చెప్పిన మాట. కొత్త పథకాలు ఏవి? అన్నదానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదిరినట్టు లేదు. సంఘాలు, బృందాలు ఏర్పడవచ్చు. కాని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి కట్టుబడి ఉండడం ప్రధానం. పుష్కరాల సందర్భంగా కృష్ణానదీ జలాలను ఉభయ రాష్ట్రాలు తమతో సంప్రదించకుండానే వాడుకుంటున్నారని, కృష్ణాజల నిర్వహణ మండలి గత నెలలో ఆరోపించడం ఒక ఉదాహరణ..