సంపాదకీయం

విదేశీయ ప్రమేయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం గు రించి ‘పరపతి అంచనాల సంస్థ’- మూడీస్- నిర్ధారణలను చేస్తుండడం మన అంతర్గత వ్యవహారాలలో విదేశీయుల జోక్యానికి మరో నిదర్శనం. వెయ్యి రూపాయల, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసిన తరువాత రూపాయి విలువ మరింతగా పడిపోతుంది. దానికి ప్రధాన కారణం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ అమలు చేస్తున్న ఆర్థిక బీభత్స వ్యూహం! పెద్దనోట్ల రద్దు వల్ల నగదు చెలామణి తాత్కాలికంగా తగ్గింది. అందువల్ల ‘రూపాయి’కి అంతర్గతంగా గిరాకీ పెరిగింది. ఫలితంగా వస్తువుల, సేవల ధరలు కూడా తాత్కాలికంగానైనా తగ్గి ఉండాలి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి ఉండాలి. కానీ ధరలు, ద్రవ్యోల్బణం తగ్గలేదు. ఇందుకు కారణం మన ఆర్థిక వ్యవస్థ ‘ప్రపంచీకరణ’లో భాగంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థతో అనుసంధానమై ఉండడం. అందువల్ల మన అంతర్గత వాణిజ్య వ్యవస్థలోని ధరలను, వస్తువుల లభ్యతను, కొరతలను, కొనుగోళ్లను బహుళ జాతీయ వాణిజ్య సంస్థల దళారీలు నియంత్రిస్తున్నారు, నిర్దేశిస్తున్నారు.. ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటి ‘పరపతి నిర్ధారణ సంస్థలు’ ఇలాంటి దళారీలు! అంతర్జాతీయమైన ‘హోదా’ను వెలగబెడుతూ ‘స్వచ్ఛంద’ సంస్థలుగా చెలామణి అవుతున్న ఈ ‘పరపతి నిర్ధారణ సంస్థలు’- సావరిన్ రేటింగ్ ఏజెన్సీస్- నిజానికి అమలు జరుపుతున్న కార్యక్రమం మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలోను, బడుగుదేశాలలోను సంపన్న దేశాల ‘వాణిజ్య సం స్థల’ విస్తరణకు మా ర్గాన్ని మరింత సు గమం చేయడం! ఇ దంతా ‘ఆర్థిక అనుసంధానం’ పేరుతో జరుగుతున్న అక్రమ ప్ర మేయం! ‘ప్రపంచీకరణ’ను మన దేశంలో వ్యవస్థీకరించడం ద్వారా ఈ అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానాన్ని సాధించిన వ్యక్తి మన్‌మోహన్ సింగ్. అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్తగా అమెరికా, ఐరోపా ప్రభుత్వాధినేతల ప్రశంసలు అందుకొన్న మన్‌మోహన్ సింగ్‌కు ‘సంకుచిత’ జాతీయ ప్రయోజనాల కంటె ‘విస్తృత’ అంతర్జాతీయ ప్రయోజనాలు ప్రధానమయ్యాయి. అందువల్లనే ఆయన సంపన్న విదేశీయ ప్రభుత్వ అధినేతల ప్రశంసలు అందుకోగలిగాడు. అంతర్జాతీయ విస్తృత ప్రయోజనమంటే అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియా వంటి సంపన్న దేశాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రయోజనాలు! ఆర్థికమంత్రిగా క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్ది చివరి దశకంలో మనదేశంలో ప్రపంచీకరణకు శ్రీకారం చుట్టిన మన్‌మోహన్ సింగ్, ఇరవై ఒకటవ శతాబ్దిలో ప్రధానమంత్రిగా అంతర్జాతీయ అనుసంధానాన్ని సాధించాడు. ఈ అంతర్జాతీయ అనుసంధానం విదేశీయుల అక్రమ ప్రమేయం మన దేశంలో మరింతగా పెరగడానికి దోహదం చేసింది. ‘మూడీస్’ సంస్థ ఈ నెల 24న చేసిన వ్యాఖ్యలు ఈ అక్రమ ప్రమేయానికి సరికొత్త సాక్ష్యాలు..
ఈ ‘అంతర్జాతీయ అనుసంధానం’ వల్ల మన రూపాయి విలువను నిర్ధారించే ప్రక్రియ మరింతగా బహుళ జాతీయ వాణిజ్యగ్రస్తమై పోయింది. అందువల్లనే పెద్దనోట్ల రద్దు వల్ల, నల్లడబ్బు వెలికి వస్తుండడం వల్ల పెరగవలసిన మన రూపాయి విలువ కనీసం నిలకడగా కూడా ఉండడం లేదు. నోట్లరద్దుకు పూర్వం అరవై ఆరు రూపాయలకు ఒక అమెరికా డాలర్ లభిస్తుండగా గురువారం డాలర్ ధర అరవై ఎనిమిది రూపాయలు దాటిపోయింది. డెబ్బయి రూపాయల స్థాయికి డాలర్ ధర పెరిగిపోతుందన్న ప్రచారం కూడా జరిగిపోతోంది. ఇదంతా మన్‌మోహన్ సింగ్ మొదట ఆర్థికమంత్రిగా, తరువాత ప్రధానమంత్రిగా సాధించిన ‘వాణిజ్య అంతర్జాతీయ అనుసంధానం’ ఫలితం! ధరలను, ద్రవ్యోల్బణాన్ని, వినిమయ ద్రవ్యం విలువను కేవలం వాణిజ్య సంస్థలు నిర్ధారించడం ‘స్వేచ్ఛా విపణి’ వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ-! ఈ మార్కెట్ ఎకానమీలో ధరలు, ద్రవ్యోల్బణం, వినిమయ ద్రవ్యం విలువ వంటి వ్యవహారాలలో ప్రభుత్వపు జోక్యం ఉండరాదన్నది ప్రపంచీకరణ సూత్రం! అందువల్ల మన ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసి నకిలీ ధనాన్ని నిర్మూలించినప్పటికీ, నల్లధనాన్ని వెలికి తీస్తున్నప్పటికీ అంతర్జాతీయ కబంధ వాణిజ్య బంధం నుంచి అంతర్గత ఆర్థిక వ్యవస్థను విముక్తం చేయలేకపోతోంది. ఈ కబంధ బంధం ఏర్పడడానికి ప్రధాన కారణం 2014 మే 26 వరకూ పదేళ్లు సాగిన మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం..
ఈ అంతర్జాతీయ అనుసంధానం కారణంగానే మన దేశంలో కందిపప్పు, బియ్యం మొదలుకొని పెట్రోలియం, డీజిల్ నూనెల వరకూ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. నోట్ల రద్దు తరువాత కృత్రిమంగా ఉప్పు కొరతను సైతం సృష్టించి అధికధరలకు ఉప్పును అమ్మడం ‘ప్రపంచీకరణ’ పేరుతో, ‘స్వేచ్ఛా విపణి’ పేరుతో, ‘అంతర్జాతీయ అనుసంధానం’ పేరుతో మనదేశంలో పెరిగిపోయిన బహుళ జాతీయ వాణిజ్యపు దళారీల ప్రమేయానికి నిదర్శనం. ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటివి ఇలాంటి దళారీ సంస్థలు. వందలాది విదేశీయ సం స్థలు వ్యవస్థీకృతమైన దోపిడీ- ఆర్గనైజ్‌డ్ లూట్-ని కొనసాగించడానికి, చట్టబద్ధంగా కొల్లగొట్టడానికి- లీగలైజ్డ్ ప్లండరింగ్- మన్‌మోహన్ సింగ్ ప్ర భుత్వం ఏర్పాటు చేసిన ‘అంతర్జాతీయ అనుసంధానం’ దోహదం చేస్తోంది. ‘అమెరికా ప్రయోజనాల గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ హస్సేన్ ఒబామాకు బాగా తెలుసు.. భారత ప్రధాని మన్‌మోహన్ సింగ్‌కు కూడా అమెరికా ప్రయోజనాల గురించి బాగా తెలుసు’- అన్నది 2012-13 సంవత్సరాల్లో అంతర్జాతీయంగా జరిగిన ప్రచారం! ఇది చతురోక్తి కావచ్చు. కానీ మన విధానాలపై విదేశీయుల ప్రభావం నిరంతరం పెరగడం మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం సాధించిన వైపరీత్యం! ‘వాల్‌మార్ట్’ దోపిడీ సంస్థ మనదేశంలో చిల్లర దుకాణాలను ఆరంభించడం ఈ వైపరీత్య పరాకాష్ఠ! ఇలా విదేశీయులు మన దేశాన్ని దోపిడీ చేయడానికి, చట్టబద్ధంగా కొల్లగొట్టడానికి ద్వారాలు తెరిచిన మన్‌మోహన్ సింగ్ రాజ్యసభలో గురువారం- ‘నోట్లరద్దు వల్ల దోపిడీ వ్యవస్థీకృతమైందని, కొల్లగొట్టడం చట్టబద్ధమైంద’ని వ్యాఖ్యానించడం విచిత్రమైన పరిణామం!
‘మూడీస్’ వంటి అంతర్జాతీయ సంస్థలు మన ఆర్థిక వ్యవహారాల్లో నిరంతరం జోక్యం చేసుకుంటున్నాయడానికి ఈ అంతర్జాతీయ అనుసంధానం కారణం, స్వేచ్ఛా విపణి కారణం, ప్రపంచీకరణ మూలం.. నోట్లరద్దు వల్ల మన ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా విచ్ఛిన్నమైపోతుందన్నది- ‘మూడీస్’ చేసిన వ్యాఖ్య! ఆ తరువాత కోలుకుంటుందట! చైనా అంతర్గత విధానాలపై ‘మూడీస్’ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎందుకంటే అలా చేస్తే చైనా ప్రభుత్వం ‘మూడీస్’ ప్రతినిధుల మాడు పగులగొట్టి, తమ దేశం నుంచి వెళ్లగొడుతుంది! పెద్దనోట్ల రద్దు మాత్రమే చాలదు.. ‘ప్రపంచీకరణ’ విష ప్రభావం నుంచి దేశానికి విముక్తి కావాలి!!