సంపాదకీయం

అభ్యుదయ అరుణిమ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌలిక రంగాల ప్రగతి గురించి మోదీ ప్రధానమంత్రిత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని ఆవహించి వున్న తపన- 2017-2018వ ఆర్థిక సంవత్సరపు ఆదాయ వ్యయ పత్రంలోని వౌలిక ఇతివృత్తం! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు సమర్పించిన ఈ ఆదాయపు పత్రం-బడ్జెట్-లో ఈ వౌలిక అంశం గురించి సుదీర్ఘ వివరణ ఉంది! విన్నవారికి, కన్నవారికి జైట్లీ ప్రసంగంలోని విషయం పూర్తిగా అర్థం కాకపోవడం ఈ వౌలిక ప్రగతిలో నిహితమై ఉన్న సంక్లిష్టతకు నిదర్శనం! వౌ లిక ప్రగతిని ‘డిజిటల్ ఎకానమీ’-సాంకేతికాక్షర ఆర్థిక వ్యవస్థ-ఆవహించడం ఈ సంక్లిష్టతకు కారణం కావచ్చు! సాంకేతిక ఆర్థిక పరిభాష అర్థం కాని సామాన్యులకు మాత్రమే కాక, ఆర్థిక జిజ్ఞాసువులకు, ఆర్థిక నిపుణులకు, నోరు పారేసుకోవడం మాత్రమే తెలిసిన రాజకీయ వాదులకు సైతం జైట్లీ తలపెట్టిన సుదీర్ఘ కాలప్రగతి విప్లవ స్వభావం బోధపడి ఉండదు! ఆయన బడ్జెట్ ప్రసంగం కూడ సుదీర్ఘంగా సాగింది, ‘కల్పాంతం’ వరకు కొనసాగుతుందేమోనన్న అనుభూతి ఒక దశలో అలముకుంది కూడ! విసుగు పుట్టించలేదు కాని వివరాలు సమగ్రంగా వెల్లడి కాలేదన్న భావం మాత్రం ప్రసంగం పొడవునా కొనసాగింది! రైలు బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి వేయడం ఈ సుదీర్ఘ ‘సమర్పణ’కు కారణం కా వచ్చు. గత ఆర్థిక సంవత్స రం వరకు గంటన్నర సేపు రైలు బడ్జెట్ ప్రసంగం సా గింది. గంటన్నర సేపు సా ధారణ బడ్జెట్ ప్రసంగం సాగింది. 1924లో వలస పాలకులు ఆరంభించిన రై లు బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే విధానాన్ని రద్దు చేయడానికి స్వతంత్ర భారత పాలకులకు డెబ్బయి ఏళ్లు పట్టింది! ఏకీకృత బడ్జెట్‌ను సమర్పించే విధానానికి జైట్లీ శ్రీకారం చుట్టడం చారిత్రక పరిణామం! ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను విడివిడిగా చూపించే ప్రక్రియకు కూడ ఈ కొత్త బడ్జెట్ భరతవాక్యం ఆలపించింది. ప్రణాళికా వ్యయం దీర్ఘకాల ప్రగతికి సంబంధించింది. ప్రణాళితేకర వ్యయం సంక్షేమ కార్యక్రమాలకు, అనుత్పాదక కలాపాలకు, జీతభత్యాలకు సంబంధించినది! ప్రణాళికా వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉందన్న ‘విమర్శ’ ప్రతి బడ్జెట్ గురించి ఏళ్ల తరబడి వినిపిస్తోంది. రెండింటినీ విడివిడిగా చూపకుండా ఏకీకృతం చేయడంతో ఈ విమర్శకు అవకాశం లేకుండా పోయింది. ఇది, మరో చారిత్రక సంఘటన! బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున కాక ఫిబ్రవరి మొదటి రోజునే సమర్పించడం మరో చారిత్రక శుభారంభం! ఏమైనప్పటికీ ఏకీకృత బడ్జెట్ కారణంగా పార్లమెంటు సమయంలో ఒకరోజు ఆదా అయింది!
అన్నిరంగాలకు కేటాయింపులు పెరగడం, అన్నివర్గాల వారికి ఎంతో కొంత ప్రత్యక్ష లాభం కలిగిందన్న అనుభూతి కలగడం ఈ బడ్జెట్‌లోని ప్రధాన అంశం! ‘స్వచ్ఛ భారత’ పునర్ నిర్మాణం బడ్జెట్‌లో మరోసారి ప్రస్ఫుటించింది. ఈ స్వచ్ఛత కేవలం భౌతికమైనది కా దని జీవన స్వభావానికి సంబంధించినదని ఆర్థికమంత్రి వాచ్యంగానే చెప్పాడు! జీవన స్వచ్ఛతను నల్లడబ్బును, అవినీతిని నిరోధించడం ద్వారా సాధించగలమన్న ప్రభుత్వ విశ్వాసం బడ్జెట్‌లో నిహితం కావడం ‘ఆర్భాటం’ లేని ‘ఆచరణ’కు అద్దం పడుతోంది. ‘దీనదయాళ్ గ్రామ జ్యోతి’ కార్యక్రమం వౌలికమైన ‘వెలుగు’కు నిదర్శనం. 2018 నాటికి దేశంలోని అన్ని గ్రామాలలోను అన్ని తాండాలలోను అన్ని గూడెములలోను అన్ని ఇళ్లలోను మారుమూల వనసీమలలోను విద్యుత్ దీపాలు వెలగడం అంత్యోదయ పథ ప్రస్థానానికి వౌలిక బలం. ‘సబ్‌కే సాథ్ సబ్‌కా వికాస్’- అందరి తో కలిసి అన్యోన్య సహకారంతో అందరి ప్రగతి-అన్నది బడ్జెట్‌లో మరోసారి ధ్వనించిన ప్రభుత్వ విధానం. ఆర్భాటం లేదు.. అన్ని వివరాలు ఆవిష్కృతం కూడ కాలేదు! ఉత్పాదక రంగంలో మన దేశం అంతర్జాతీయ సమాజంలో తొమ్మిదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి ఎదిగిందన్న ఆర్థిక మంత్రి ఆవిష్కరణ ‘రొదలేని ప్రగతి గతి’కి ఒక ఉదాహరణ కావచ్చు! ‘కాలే ధన్ కో భీ బదల్‌నా పడేగా ఆజ్ అప్నా రంగ్...’ అన్న జైట్లీ అభిభాషణ ‘స్వచ్ఛత’ ఆర్థిక క్షేత్రంలో సభలు తీర్చనున్నదనడానికి మరో సూచిక! ‘నల్లడబ్బు కూడ తన రంగును మార్చుకోక తప్పదు..’ మరి! అలా మారి ‘నల్లధనం’ తెల్లదనమైతే అంతర్జాతీయ సమాజంలో భారత కీర్తిపతాక ధవళిమ ధవళతరం కావడం ఖాయం.. పారదర్శక భారతం బడ్జెట్ పత్రంలో దృశ్యమాననమైంది!
రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఆర్జించేవారు చెల్లించవలసిన పన్ను పది నుంచి ఐదు శాతానికి తగ్గించడం మధ్యతరగతికి లభించిన మంచి సమాచారం. ‘ఆన్‌లైన్’లో టిక్కెట్లను కొనుక్కునే రైలు ప్రయాణీకులకు ‘సేవా’ సుంకం నుంచి విముక్తి కల్గించడం అల్పసంతోషులకు అమృతపు జల్లు వంటిది. రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేయగలమన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించడం వ్యవసాయ ప్రధాన దేశ ప్రజలకు మరో తొలకరి జల్లు. కానీ, ఎలా చేయగలరన్నది మాత్రం వెల్లడి కాలేదు. సగటున ప్రతి రైతు పండించే పంట పరిమాణం కావచ్చు, లభించే విలువ కావచ్చు-ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయా? ద్రవ్యోల్బణం రెండంకెల స్థా యి నుంచి ఐదు శాతం స్థాయికి తగ్గినప్పటికీ, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం ప్రాతిపదికలుగా ప్రతి ఐదేళ్లలోను ధరలు రెట్టింపుకావడం, సంఘటిత రంగంలోని ఉద్యోగుల, కార్మికుల ఆదాయం రెట్టింపుకావడం చరిత్ర! వాస్తవ ‘విలువల’ ఆధారంగా వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు కాగలదా? అయినట్టయితే దేశ వౌలిక ప్రగతి ద్విగుణం అవుతుంది. వ్యవసాయ రంగంలో ప్రగతి రెండు శాతం చొప్పున మాత్రమే పెరుగుతోంది. స్థూల జాతీయ ఉత్పత్తి-జిడిపి-లో ‘సేవ’ల వాటా, పారిశ్రామిక వినియోగ వస్తువుల ఉత్పత్తి వాటా మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేది ఎప్పుడు?
వౌలిక సదుపాయాలను పెంపొందించడానికై దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం, ప్రధానమంత్రి ‘ముద్రా’ పథకానికి రెండున్నర లక్షల కోట్లు కేటాయించడం ప్రగతి, సంక్షేమం చెట్టపట్టాల్ పట్టుకుని నడుస్తున్న తీరుకు నిదర్శనమట. ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’-ఎఫ్‌డిఐ గురించి పెద్ద ఆర్భాటం లేకపోవడం ‘స్వదేశీయ స్ఫూర్తి’కి నిదర్శనం! ‘రైల్ సంరక్షా ఆయోగ్’ ఏర్పడడం, కాపలాలేని రైలు ద్వారాల పద్ధతిని పూర్తిగా తొలగించడం వంటివి ప్రయాణ భద్రతా నిష్ఠకు సంకేతాలు! ఇరవై ఒక్క లక్షల యాబయి వేల కోట్ల రూపాయల కొత్త బడ్జెట్‌లో- కేవలం రక్షణ రంగానికే రెండు లక్షల డెబ్బయి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. పెరుగుతున్న పాకిస్తాన్- చైనా ఉమ్మడి దురాక్రమణ ప్రమాదం దృష్ట్యా రక్షణకు మరిన్ని నిధులను కేటాయించి ఉండాలి! వర్తమాన- 2016-2017- సంవత్సరం బడ్జెట్ పరిమాణం పంతొమ్మిది లక్షల డెబ్బయి ఎనిమిది వేల కోట్లు! కొత్త ‘ఏకీకృత’ బడ్జెట్‌లో రైల్వే శాఖకు కేటాయింపులను మినహాయిస్తే- సాధారణ వార్షిక వ్యయం పెరిగిందా? తగ్గిందా? ఈ ప్రశ్నకు సమాధానం లభించడం లేదు. దిశ, లక్ష్యం మంచివైనప్పుడు ఫలితాలు మంచివి కాగలవన్నది మాత్రమే అరుణ్ జైట్లీ నిర్ధారణ. విశ్వాసం విజయానికి నిజమైన ‘బాట’!