సంపాదకీయం

మూడేళ్ల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడు కొత్తవాడు కాదు.. కానీ ప్రతిదినం కొ త్తగా ఉదయిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తెలుగుగడ్డపై సూర్యుడు మరింత కొత్తగా ఉదయించాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అది శుభోదయం, మరో ‘కొత్త రాష్ట్రం’గా ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అది మరో వినూతన శుభారంభం! 1956 నుంచి కొనసాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడటం మూడేళ్లనాడు జరిగిన చారిత్రక, రాజ్యాంగ మహా పరిణామం. తెలుగునేల అనాదిగా ఉంది, తెలుగు ప్రజలు అనాదిగా జీవన ప్రస్థానం సాగిస్తున్నారు. ఈ విలక్షణ, విశిష్ట జీవన ప్రస్థానంలో ఒకే రాష్ట్రంలో ఉండిన, ఒకే భాషను మాట్లాడే జన సముదాయం రెండు భౌగోళిక రాజ్యాంగ విభాగాలుగా ఏర్పడటం సరికొత్త మజిలీ వంటిది. ఈ మజిలీ ఈ అనాది ప్రగతి ప్రస్థానంలో కొత్త మలుపునకు ప్రతీక, కొనసాగింపునకు పతాక. తెలుగువారు రెండు రాష్ట్రాలలో కొనసాగడం కొత్తకాదు. 1956నకు పూర్వం శతాబ్దులపాటు తెలుగువారు విభిన్న రాష్ట్రాలలో కొనసాగడం చరిత్ర. అలా కొనసాగడానికి కారణం విదేశీయ దురాక్రమణదారుల దుస్తంత్రం. ‘దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు’ తెలుగునేలను ఐరోపా వారు, అరబ్బుల వారసులు శతాబ్దుల తరబడి పంచుకున్నారు, కొల్లగొట్టారు. ఆంధ్ర రాజ్యం లేదా తెలుగు రాజ్యం వేలాది ఏళ్లుగా అఖండ భారత దేశం రాజకీయ సాంస్కృతిక వైశిష్ట్యాన్ని సాధించుకుంది. మొత్తం భారతదేశాన్ని ఆంధ్ర శాతవాహనులు పాలించడం చరిత్ర. క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జిహాదీ బీభత్సకారులు ధ్వంసం చేసిననాటి నుంచి తెలుగులు లేదా ఆంధ్రులు భిన్నభిన్న భూఖండాలలో వి డిపోయారు. విదేశీయ దురాక్రమణదారులు వి డగొట్టారు. కొంతమంది తెలుగువారికి మిగిలిన దేశంతోపాటు 1947 ఆ గస్టు 15న స్వాతంత్య్రం లభించడానికి, మ రికొంతమంది తెలుగువారికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం సిద్ధించడానికి కారణం ఈ విదేశీయ దుర్మార్గం. 1956లో ఒకేరాష్ట్రంగా ఏర్పడిన తెలుగువారు 2014 జూన్‌లో రెండు రాష్ట్రాలుగా ఏర్పడటం ఈ సుదీర్ఘ భారత చారిత్రక క్రమంలో భాగం. తెలుగువారి ఉత్థాన పతనాలు ఈ చరిత్రలో భాగం. విదేశీయుల పెత్తనం పతనం, స్వాతంత్య్రం ఉత్థానం. మన నేలను విదేశీయులు విభజించడం దాస్యానికి చిహ్నం. మన నేలను మనం పునర్ వ్యవస్థీకరించడం మన స్వాతంత్య్ర స్వభావం. పాలనా సౌలభ్యం కోసం, ప్రగతిని వికేంద్రీకరించడానికి తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడటం అభిలషణీయం. చిన్న రాష్ట్రాల వల్ల ప్రగతి వేగం పెరుగుతుందన్నది మూడేళ్ల ధ్రువీకరణ. ఒకే తెలుగు, రెండు వెలుగులు.. తెలుగుతల్లికి రెండు కళ్లు.. రెండు రాష్ట్రాలు. ఒకే తెలుగుప్రజకు రెండు భౌగోళిక రూపాలు.
చిన్న రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత మూడేళ్లలో తెలుగువారి ప్రగతి వేగం పెరగడం ధ్రువపడిన వాస్తవం. దేశంలో ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జిడిపి-పెరుగుదల కంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయ అవినీతి అంటకపోవడం పరిపాలన స్వభావ సమానత్వానికి నిదర్శనం. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పుట్టలు నిరంతరం పగులుతుండటం రెండు రాష్ట్రాలలో సంభవిస్తున్న విపరిణామాలు. తెలంగాణలో భూముల క్రయవిక్రయాలలో సబ్ రిజిస్ట్రార్‌లు నిర్వహించిన బీభత్స అవినీతి భూమిక బద్దలుకావడం పరాకాష్ఠ. రెండు రాష్ట్రాలలోను అధికారపక్షాలకు ప్రజలలో పలుకుబడి పెరిగిందనడానికి గత మూడేళ్లుగా జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనమండలుల ఎన్నికలు నిదర్శనం. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష ‘విధానకర్తల’ను తమ పార్టీలోకి చేర్చుకొనడానికి తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కృషిచేయడం కూడా ఈ మూడేళ్ల కథ.
హరితప్రగతి తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన కార్యక్రమం అయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రగతి కలాపాలకు ప్రధాన ఇతివృత్తం ‘అమరావతి’. ఉభయ ప్రభుత్వాల ‘ప్రగతి’కి ‘్భమి’ ప్రధానం కావడం నడుస్తున్న చరిత్ర. 2013 నాటి భూమి సేకరణ చట్టాన్ని కేంద్రప్రభుత్వం అధ్యాదేశం ద్వారా సవరించడం వివాదగ్రస్తమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి వద్ద రాజధాని నిర్మాణం కోసం భూమిని సమీకరించడానికి ఈ ‘సవరణ’ సులభతరమైంది. ఆ తరువాత ఈ ‘సవరణలు’ రద్దయిపోయాయి. అందువల్ల నీటి పథకాల కోసం భూమిని సేకరించడం తెలంగాణ ప్రభుత్వానికి సులభం కాలేదు. కేంద్ర చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించడం రాష్ట్రావతరణ తృతీయ వార్షికోత్సవానికి సమీప నేపథ్యం. ‘హరిత హారం’, ‘్భగీరథ’, ‘కాకతీయ’ పథకాలు మాత్రమే గాక ఎనబయి లక్షలకు పైగా గొర్రెలను గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా పెంచడానికి నిర్ణయించడం భూమి పరిరక్షణకు దోహదం చేయగల తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. మహారాష్టత్రో నదీజలాల వివాదాన్ని పరిష్కరించుకోవడం తెలంగాణ సా ధించిన మరో విజయం. దీర్ఘకాల వివాదం ముగిసిపోవడంతో కోటి ఎకరాలకు కొత్తగా నీరు సమకూర్చగల కార్యక్ర మం విజయవంతం కావచ్చు. గోదావరిని కృష్ణానదితో అనుసంధానం చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ‘జల విజయం’. పట్టిసీమ కాలువ ఈ అనుసంధానానికి ప్రతీక. అనుసంధానం ద్వారా కొత్తగా 2 కోట్ల ఎకరాలకు నీరు వదలనున్నట్లు 2015 మే 6వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నాడు. విదేశాల పెట్టుబడులపై భారీగా ఆధారపడుతుండటం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల విధానాల్లో ప్రస్ఫుటిస్తున్న సమాన వైపరీత్యం. అమరావతి నిర్మాణానికి భారతీయ సంస్థలు పనికిరావని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతీయతను అవమానించింది, దేశ ప్రజలను కించపరచింది. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు పోటీపడి విదేశాలలో పర్యటించి ‘తమ రాష్ట్రాన్ని దోచుకొనడానికి రావలసింది’గా బహుళ జాతీయ సంస్థలను ఆహ్వానించడం మూడేళ్ల ప్రగతి గీతంలో ప్రధాన అపశ్రుతి! ‘వాల్‌మార్ట్’ తెలంగాణలోని ‘పెప్సీ’ ‘శ్రీ నగరం’-సిరిసిటీ-లోకి చొరబడిపోవడం జనం మెచ్చని పరిణామం. మతం పేరుతో రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వం మొండిపట్టు జనాదేశానికి వ్యతిరేకం.
ఉభయ రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని సందర్శించిన సందర్భంగా ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే స్ఫూర్తిని ప్రకటిస్తున్నాడు. సంపూర్ణ సయోధ్య నెలకొనడం తెలుగువారి ఆకాంక్ష.