కరీంనగర్

భూముల ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 28: పెద్దపల్లి జిల్లాగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా జారీ చేసిన నేపథ్యంలో పెద్దపల్లి ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 10 రోజుల కిందట భూమి కొనడానికి ముందుకు రాని వారు ఇప్పుడు నచ్చితే అంత అయిన పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ వ్యాపారులు అందినంత దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అన్నింటికి కేంద్ర బిందువుగా ఉండటంతో పాటు రైల్వే జంక్షన్, రాజీవ్ రహదారిలో 24 గంటల రవాణా సదుపాయం ఉండటంతో పాటు జిల్లాగా ఏర్పాటు అవుతుండటంతో అందరి చూపు పెద్దపల్లిపైన పడుతుంది. అంతేకాక దగ్గరలోని బసంత్‌నగర్ సమీపంలో గతంలో ఉన్న విమానాశ్రయం పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఎన్టీపిసి, బొగ్గు గనుల కేంద్రం గోదావరిఖని, యూరియా ఉత్పత్తి కేంద్రం దగ్గరలోనే ఉన్నాయి. జిల్లాలో ఉన్న ఈ వ్యాణిజ్య కేంద్రాలు 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి. దీనికి తోడు ఇదే జిల్లాలో అవి ఉండటంతో పెద్దపల్లిలో ఏదో మూల కొంత భూమి కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దీనితో గత కొంత కాలంగా స్థబ్ధతగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి భూములకు ఒక్కసారిగా పెద్ద డిమాండ్ ఏర్పడుతోంది. మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ క్యాంపులో పెద్దపల్లి జిల్లా కలెక్టరెట్ ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఎస్సారెస్పీ క్యాంపు పరిసర ప్రాంతంలో భూములు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆశక్తి కనబరుస్తున్నారు. రాజీవ రహదారిని ఆనుకొని ఉన్న పెద్దకల్వల, పెద్దపల్లి, బంధంపల్లి, అప్పన్నపేట, రాఘవాపూర్, అందుగులపల్లి పరిసర ప్రాంతంలో భూములు కొంటే భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నైజాం పాలనలో ఉన్నప్పుడే పెద్దపల్లి పట్టణంగా విరాజిల్లింది. స్వాతంత్య్రం అనంతరం కూడా పెద్దపల్లి కొంత కాలం మన్సిపాల్‌గా కొనసాగినా, కొంత మంది స్వార్థ రాజకీయాల వల్ల గ్రామ పంచాయతీగా మార్చడం జరిగింది. అయినా పెద్దపల్లి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెవెన్యూ డివిజన్, పోలీసు డివిజన్ కేంద్రంగా కొనసాగింది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడేళ్ల కిందట నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. పెద్దపల్లి మున్సిపాల్ మారుతున్న దశలో ఇక్కడ రియల్ వ్యాపారం ఒక వెలుగు వెలిగి పోయింది. అప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న భూముల ధరలు ఇక్కడ ఉన్నాయంటే అతి శయోక్తి కాదు. అనంతర కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. కొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొంత మంది ఐపి పెట్టి అప్పులు ఎగవేసి పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఏర్పడటం మళ్లీ రియల్ వ్యాపారానికి ఊపిరి పోసినట్టయింది. ఇక్కడ చాలా భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ లేఅవుట్ అనుమతి తీసుకోలేదు. చాలా మంది వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. కొనుగోలు చేసే వారు అన్ని జాగ్రత్తగా గమనించాలి, లేని పక్షంలో ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదర్కోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అధికారులు కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.