కరీంనగర్

మధ్యమానేరు పనుల అడ్డగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, డిసెంబర్ 11: మండలంలోని కందికట్కూర్, మానువాడ మధ్యలో నిర్మిస్తున్న మధ్యమానేరు నిర్మాణం పనులను ఆదివారం కందికట్కూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. కట్కూర్ పంచాయతీ పరిధిలోని గుర్రంవానిపల్లె మాత్రమే ముంపు గ్రామంగా తీసుకొని వారికి పరిహారం చెల్లించారని, కట్కూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ముంపు గ్రామంగా ప్రకటించనట్లయితే పనులను జరుగనిచ్చే ప్రసక్తేలేదని గ్రామస్థులు హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్న గ్రామస్థులతో చర్చలు జరిపారు. తదనంతరం ఉన్నతాధికారులతో సమాచారాన్ని తెలుపడం వల్ల గ్రామస్థులు శాంతించారు. ఇటీవల ముఖ్యమంత్రికి, మంత్రికి విన్నపం చేసినా ముంపు గ్రామంగా ప్రకటించకపోవడం విచారకరమని గ్రామస్థులు పేర్కొన్నారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చడంలో విఫలమయ్యారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి యాస తిరుపతి, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసిలతో పాటు దాదాపు 50 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతకు నిరసనగా
బిల్ కలెక్టర్ నిర్బంధం
* రోడ్డుపై బైఠాయించిన రైతులు

ఇల్లంతకుంట, డిసెంబర్ 11: మండలంలోని అనంతారంలో లో-వోల్టేజి సమస్యతో పాటు అప్రకటిత విద్యుత్ కోతకు నిరసనగా అనంతారం రైతులు ఆదివారం బిల్ కలెక్టర్‌ను గ్రామ పంచాయతీలో నిర్బంధించారు. తదనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వెలిబుచ్చారు. తమ సమస్య పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి వెళ్లమని రైతులు భీష్మించుకుని కూర్చోవడంతో సెస్ విద్యుత్ అధికారి ఎఇ గ్రామానికి వచ్చి రైతులకు లో-వోల్టేజీ సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైతులు ఇచ్చే తొమ్మిది గంటల విద్యుత్‌ను సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని ఎఇపై ధ్వజమెత్తారు. తమ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు బిల్ కలెక్టర్‌ను వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బి.వెంకటేశం, ఆకుల శ్రీనివాస్, పర్శరాములు, శ్రీనివాస్, మల్లయ్యలతో దాదాపు 40 మంది రైతులు పాల్గొన్నారు.
హరిహర క్షేత్రంలో భక్తజన ప్రభంజనం
ధర్మపురి, డిసెంబర్ 11: ధర్మపురి క్షేత్రం ఆదివారం భక్తజన ప్రభంజనంగా మారింది. మార్గశిర శుక్ల పక్ష ద్వాదశి యుక్త ఆదివారం, సుబ్రహ్మణ్య షష్ఠివార రోజుల సందర్భంగా క్షేత్రంలో గోదావరి నదీ స్నానాలకై వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మహారాష్టల్రోని పలు ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. గోదావరి నదిలో మంగళస్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, సంకల్పాది సత్కర్మలను ఆచరించి, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాంతర్గత ప్రధానాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ప్రధానంగా గొల్లపెల్లి మండలం మల్లన్నపేటకు మల్లన్న జాతరకు వెళ్ళే భక్తులు, అయ్యప్ప దీక్షాపరులైన భక్తుల రాకపోకలతో క్షేత్రం జనసంద్రమైంది.
యమ ధర్మరాజుకు భరణీ నక్షత్ర విశేష పూజలు
ధర్మపురిలో ఆదివారం యమ ధర్మరాజుకు విశేష అర్చనలు, పూజాదులు నిర్వహించారు. ఆదివారం భరణీ నక్షత్రంతో కూడిన మార్గశీర్ష శుక్ల పక్ష ద్వాదశి పర్వదిన సందర్భంగా మహా సంకల్పయుక్త అభిషేకం, ఆయుష్యసూక్తం, యమ సూక్తమంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్త పఠనాది ప్రత్యేక పూజాదికాలను, అనంతరం జ్వరహర స్తోత్రం, రోగ నివారణ సూక్తములచే పంచామృత అభిషేక యమాష్టక పఠనం, హారతి, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వితరణాది ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం పక్షాన నిర్వహించారు. వందలాదిమంది భక్తులు విశేష పూజాదికాలలో పాల్గొని తరించారు. అపమృత్యు, పీడ నివారణకై యమ గండాదీపానికి నూనె పోశారు.

వైభవంగా ఆరట్టు మహోత్సవం

అశ్వవాహనంపై స్వామివారి ఊరేగింపు

వేములవాడ, డిసెంబర్ 11: వేములవాడ పట్టణ శివారులో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో ఆదివారం ఆరట్టు ఉత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది.
ఆలయ చైర్మన్ కొండ దేవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు వందలాది మంది అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం స్వామివారికి అభ్యంగన స్నానం ఆచరించిన అనంతరం ఆలయంలో గౌరీపూజ చేశారు. అనంతరం స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగించారు. అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు మహాలక్ష్మీ దేవాలయానికి చేరుకున్న అక్కడ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు.అనంతరం ఊరేగింపు గాంధీనగర్, సుభాష్‌నగర్, బద్దిపోచమ్మ దేవాలయం మీదుగా రాజన్న ఆలయంలోకి చేరుకుంది. ధర్మగుండంలో స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. అక్కడ నుంచి అయ్యప్ప దేవాలయానికి చేరుకున్న స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఊరేగింపు ఎదురేగి మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు.
ఆరట్టు ముగిసాక అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ దేవయ్య, ఆర్గనైజర్ కొండ నర్సయ్య, ప్రధాన అర్చకులు దేవరాజు, గురుస్వాములు నమిలికొండ లక్ష్మీరాజం, రాములు, మహేశ్, రవి, ఆంజనేయగౌడ్, మహేశ్, అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన రాజన్న కోవెల

స్వామివారి సేవలో 40వేల మంది భక్తులు

వేములవాడ,డిసెంబర్ 11: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోడానికి నిర్దేశించిన క్యూలైన్లో బారులు తీరారు. ధర్మదర్శనం క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసాయి. కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు అంతరాలయంలోని శ్రీలక్ష్మిగణపతిస్వామివారిని, శ్రీ రాజరాజేశ్వరస్వామిని, శ్రీ రాజరాజేశ్వరదేవి అమ్మవారిని దర్శించుకుని తరించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి ధర్మదర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఇవో రాజేశ్వర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. భక్తులకు స్వామివారి ధర్మదర్శనం త్వరగా జరిగేందుకు భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లను క్రమబద్ధీకరించారు.

పుట్టిన ప్రాంతాన్ని విస్మరించడం ఆత్మద్రోహం
* సిసాస కవుల సమావేశంలో సినీ, గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ

సిరిసిల్ల, డిసెంబర్ 11: పుట్టిన ప్రాంతాన్ని విస్మరిస్తే దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం, ఆత్మ ద్రోహమని సినీ గేయ రచయిత, అమెరికా ప్రభుత్వ సత్కార గ్రహీత డా.వడ్డేపల్లి కృష్ణ అన్నారు. ఆదివారం సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల వాస్తవ్యుడైన వడ్డెపల్లి కృష్ణ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దె రాములు పురస్కార గ్రహీతలు కళాభూషణ పోరండ్ల మురళీధర్, కవిరత్న మేన అంబాజీలను సత్కరించారు. స్థానిక గాంధీనగర్ హన్మాన్ దేవాలయంలో సిసాస అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డా.జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో డా.వడ్డేపల్లిని సత్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాలెన్ని తిరిగినా, స్వస్థలాన్ని, స్వజనాన్ని మరువరాదన్నారు. మనకు ప్రోత్సాహం లభించడం లేదన్న చింత వద్దని, నిరంతరం కృషి సాగిస్తే, గుర్తింపు అదే వస్తుందన్నారు. పుట్టిన మట్టిని మరువవద్దని, గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ‘కాంతి జనితం మన కరీంనగరం’ అని పాట రాసిన నేను, ఇపుడు కొత్త జిల్లా ‘రాజిల్లు రాజన్న జిల్లా, రమణీయ జిల్లా రాజన్న జిల్లా’ అని కూడా పాట రాసినట్టు తెలిపారు. వడ్డేపల్లి కృష్ణ అమెరికా ప్రభుత్వ సత్కారం అందుకుని ప్రపంచ దేశాలకు సిరిసిల్ల ఖ్యాతిని అందించడం అభినందనీయమని సిసాస అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్యలు అన్నారు. సిసాస గౌరవ అధ్యక్షుడు గరిపెల్లి ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో కవులు, కళాకారుల కోసం ఒక వేదిక ‘విజ్ఞాన కళా కేంద్రం’ నిర్మించాలని, ఇందు కోసం 50 శాతం నిధిని తాను సమీకరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసరవేని పరుశరాం, న్యూఢిల్లీ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉప సంపాదకుడు డా.పత్తిపాక మోహన్, సిసాస కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవులు గూడూరి బాలరాజు, ఆర్.వెంకట్రాజం, కోడం నారాయణ, పిస్క సత్యనారాయణ, ఫణి లక్ష్మణ్, కొక్కుల రాజేశం, కట్ట వేణు, తుమ్మనపెల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

రబీ సీజన్‌లో ప్రతీ రైతుకు సాగు నీరందేలా చూస్తా
మంథని ఎమ్మెల్యే పుట్ట మధు

కమాన్‌పూర్, డిసెంబర్ 11: ఈ రబీ సీజన్‌లో ప్రతీ రైతుకు ఎస్ ఆర్ ఎస్ పి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ల ద్వారా సాగు నీరందేలా చూస్తానని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రాజెక్ట్‌ల్లో నిండుగా నీరుందని, ఈ క్రమంలో యాసంగిలో రైతులకు సాగునీరు అందించి పంటలు సుబిక్షంగా ఉండేలా చూస్తానని అన్నారు. చాలా వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల్లో చెత్తాచెదారంతో పేరుకుపోయిందని, దీనిని ప్రొక్లైయిన్ల ద్వారా తొలగిస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 15 నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల ద్వారా నీరు విడుదల చేస్తామని అన్నారు. డి-83 ద్వారా గుండారం రిజర్వాయర్‌లో నుంచి, ఆర్‌ఎస్‌బి ద్వారా మంథని, ముత్తారం మండలాల్లోని టేలాండ్ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. అలాగే సబితం వద్ద గల ఎల్-31 ద్వారా సాగునీటిని కమాన్‌పూర్ మండలానికి అందజేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ ఎంపిపి కొట్టె భూమయ్య, సర్పంచ్ కొంతం సత్యం, మాజీ జడ్పీటిసి గంట వెంకట రమణారెడ్డి, టిఆర్‌ఎస్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి పిన్ రెడ్డి కిషన్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఖలీం, నాయకులు నీలం శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

బడుగు, బలహీనులకు దేవుడు అంబేద్కర్
* అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఈటల, కెప్టెన్
మానకొండూర్, డిసెంబర్ 11: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు దేవుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పచ్చునూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావుతోపాటు ఎంపి వినోద్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ప్రభుత్వ విప్ అరెపల్లి మోహన్, టిడిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని విష్కరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ముఖ్యఅతిదిలకు అంబేద్కర్ సంఘం, గ్రామస్థుల ఆధ్వర్యంలో దప్పుచప్పులతో నృత్యాలు చేస్తూ పటాకాయాలు పేల్చి మహిళల కోలాటాల మధ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి నాంది అంబేద్కర్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. యువత, విద్యార్థులు అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో పయణించాలని సూచించారు. అంబేద్కర్ చాలా గొప్ప మేధావి అని, విద్యతోనే ఆయనకు ప్రపంచంలోనే మంచి పేరువచ్చిందన్నారు. తపన ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యం పర్నిచర్ కోసం రూ. 15 కోట్లు, విద్యుత్ లూజు లైన్ తీగల మరమత్తుల కోసం రూ. 38 కోట్లు రూపాయలను ప్రభుత్వం మంజురు చేసిందన్నారు. పదేళ్లుగా ముసుగులోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం పచ్చునూర్ ప్రజల సహకారంతో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జివి రామక్రిష్ణరావు, సర్పంచ్ గోపు నర్సింహారెడ్డి, ఎంపిపి లింగయ్య, జడ్పీటిసి సుగుణాకర్, వైస్ ఎంపిపి దేవ సతీష్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ మల్లగల నగేష్, పారునంది కిషన్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పాముల రమణ, శాతరాజు యాదగిరి, మాజీ సర్పంచ్ భైక రాజవౌళి, అంబేద్కర్ సంఘం సభ్యులు, గ్రామస్థులు, వివిధ గ్రామల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇంటిలో బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు
వేములవాడరూరల్, డిసెంబర్ 11: ఎమ్మెల్యే ఇంటిని పేల్చివేస్తామని ఇంటర్ నెట్‌కాల్ ద్వారా ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు బెదిరింపుకాల్ రావడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందం ఆదివారం రమేశ్‌బాబు ఇంటికి, ఆలయానికి చేరుకొని ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆలయం లోపల, ఆవరణ, లాకర్స్ రూం, కళ్యాణ కట్ట, కళాభవన్‌లలో బాంబ్ స్క్వాడ్ బృందం అణువనువూ పరిశీలించి తనిఖీ చేసింది. భక్తుల వెంట తీసుకువచ్చిన బ్యాగులను సైతం బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. రాత్రి ఎమ్మెల్యే నివాసం పరిసర ప్రాంతంలో పోలీసుల గస్తీని మరింత పెంచారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే నివాసమైన సంగీత నిలయాన్ని పేల్చివేస్తామని జనశక్తి, మావోయిస్టు గ్రూపులు హెచ్చరికలు చేశాయి. తెరాస అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపిలు తరచూ ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఇంటికి వస్తుండడంతో... పోలీసులు నివాసం వద్ద మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.