కరీంనగర్

నేడు ముఖ్యమంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 30: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడిగడ్డ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి రాత్రి 8గంటల వరకు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని, రాత్రి ఇక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 6గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం 6:35గంటల వరకు చేరుకుని గోదావరి నదిలో సిఎం సతీసమేతంగా పవిత్ర స్నానాలాచరించి కాళేశ్వర-ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 6:45 నుంచి 7:00గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కనే్నపల్లి గ్రామానికి చేరుకుని ఉదయం 7:25 నుంచి 8 గంటల వరకు పంప్‌హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడి నుంచి 8గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి 8:10 గంటల వరకు కాళేశ్వరం చేరుకుని, ఇక్కడ బ్రేక్ పాస్ట్ చేస్తారు. అనంతరం 9:30 గంటలకు కాళేశ్వరం నుంచి బయలుదేరి 9:40గంటల వరకు అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ సైట్‌కు చేరుకుని 9:50గంటల వరకు భూమి పూజ, శంకుస్థాపనలు చేస్తారు. 10:35గంటలకు అంబట్‌పల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళతారు. సిఎం పర్యటన సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఎస్పీ జోయల్ డేవిస్ సిఎం పర్యటించే ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శంకుస్థాపనలతోపాటు ఇతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేయగా, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. సిఎంతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తానికి రాష్ట్ర సాగునీటి రంగానికి కీలకమైన కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టు శంకుస్థాపన కానుండగా, నేడు, రేపు ఆ ప్రాంతం విఐపిల రాకతో కళకళలాడబోతోంది.