కరీంనగర్

రగులుతున్న జిల్లాల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 19: జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు రగడ రగులుతోంది. ప్రాంతాలవారీగా తమకంటే తమకే ప్రాధాన్యమిచ్చి జిల్లాల ఏర్పాటుచేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. పలుచోట్ల నిత్యం ఆందోళనలు కూడా చేపడుతుండగా, తాజాగా ఈనెల 25లోపు జిల్లాల ప్రతిపాదనలు అందజేయాలంటూ భూపరిపాలన విభాగపు ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఆదేశాలు జారీ చేయటంతో జిల్లాల ప్రతిపాదనల్లో తమ ప్రాంతం పేరు ఖచ్చితంగా సూచించాలంటూ గురువారం నుంచి పలుచోట్ల ఉద్యమాలు తీవ్రతరం చేశారు. అధికార పార్టీ మినహా ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులంతా ఏకమవుతూ, దీక్షలు సైతం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనతో కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాలో చర్చ మొదలైంది. ఎన్నికల ముందు నుంచి జగిత్యాలను జిల్లాకేంద్రంగా మార్చుతామంటూ సిఎం పదేపదే చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రాంతవాసుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, ఆ జిల్లా పరిధిలో కలిపే నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, రామగుండం, హుస్నాబాద్ సెగ్మెంట్లలో జిల్లా ఏర్పాటుపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. కోరుట్ల సెగ్మెంట్ జిల్లా కేంద్రానికి 70 కిమీల దూరంలో ఉండగా, తమ ప్రాంతంలోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు గత ఏడాదినుంచే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అలాగే, కొత్తగా ఏర్పాటు కాబోయే మరోజిల్లా సిద్దిపేటలో సిరిసిల్లను, వేములవాడను జగిత్యాల జిల్లాలో కలుపుతారంటూ వచ్చిన చర్చ నేపథ్యంలో ఏ జిల్లాలో చేర్చకుండా సిరిసిల్లనే జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంను కొత్త జిల్లాగా అవతరించనున్న మంచిర్యాలలో చేర్చనున్నట్లు వచ్చిన వార్తలతో తమను గోదావరి ఆవలి జిల్లాలో చేర్చితే సహించేదిలేదంటూ, అవసరమైతే పరిసర నియోజకవర్గాలను కలుపుకుని రామగుండానే్న జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. మంథని సెగ్మెంట్ నుంచి కొంతభాగాన్ని ఆచార్య జయశంకర్ జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తుండగా, ఆ ప్రాంతవాసుల్లో కూడా వ్యతిరేకత పెల్లుబికుతోంది. జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కూడా సిద్దిపేట జిల్లాలో చేర్చుతారనే చర్చ కొనసాగుతుండగా, ఆదిలో గాఢ నిద్రలో ఉన్న అక్కడి నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇప్పుడిప్పుడే కళ్ళుతెరిచారు. బుధవారం నియోజకవర్గస్థాయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అధికారేతర పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి హుస్నాబాద్ జిల్లా సాధన సమితి ఆవిర్భావానికి అంకురార్పణ చేశారు. అయితే తమను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలి. లేదంటే.. మాకే ఓ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కదం తొక్కేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో జిల్లాల చిచ్చు రాజుకుంటుండగా, కొత్త జిల్లా ప్రతిపాదనలపై అధికార వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జిల్లాల ప్రకటన చేసేందుకు గడువుముంచుకొస్తున్న నేపథ్యంలో దినదినం పెరుగుతున్న ఆందోళనలు అధికార పార్టీలో గుబులు రేకెత్తిస్తున్నాయనటంలో సందేహం లేకపోగా, జూన్ 2న ఆందోళనల ప్రభావం తేలనుంది.