కరీంనగర్

ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల కోటాలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 9వరకు నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన, 12న నామినేషన్ల ఉపసంహరణ, 27న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. మొదటిరోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ధరావత్తు చెల్లించాల్సి ఉండగా, ఇందులో జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన (జెసి) చాంబర్‌లో నామినేషన్లను స్వీకరిస్తారు. జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్వో) టి.వీరబ్రహ్మయ్య సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాలో ప్రాదేశిక, పురపాలిక (ప్రజాప్రతినిధులు)లు కలుపుకుని మొత్తం 1,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరితోపాటు కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు ఓటర్లుగా ఉన్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ తెరాసలో టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, తానిపర్తి భానుప్రసాద్‌రావు, చెన్నాడి సుధాకర్‌రావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డితో పాటు నాయకులు వీర్ల వెంకటేశ్వర్ రావు, వెలిచాల రాజేందర్ రావు, ఓరుగంటి ఆనంద్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే, ఇందులో లక్ష్మణ్‌రావు, ప్రసాదరావులకు టికెట్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే బిజెపి, టిడిపి పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుండగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని రంగంలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. అటు నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, జిల్లాలో ఎన్నికల వేడి షురూ అయింది.

కార్యాచరణ ప్రణాళికలు పంపండి
* ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 2: జిల్లాలో ఇరిగేషన్ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి డిసెంబర్ లోగా పంపించాలని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల భూసేకరణపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన, మైక్రో ఇరిగేషన్, ఇతర శాఖల సమన్వయంతో జిల్లా ఇరిగేషన్ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి పంపాలని, వీటిని క్రోడీకరించి జనవరి 15 లోగా కేంద్రానికి పంపిస్తామని అన్నారు. మిషన్ కాకతీయ పథకం క్రింద మొదటి విడతలో మంజూరైన చెరువుల పునరుద్ధరణ పనులన్నీ వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. మిషన్ కాకతీయ రెండవ విడత పనులకు చెరువులను గుర్తించి అంచనాలు తయారు చేసి మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. సేకరించిన భూమిని ఇరిగేషన్ శాఖకు రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రైవేటు లైసెన్స్ సర్వేయర్లను తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, ఎస్‌ఇలు వెంకటేశ్వర్లు, నర్సింహారావు, వ్యవసాయ జెడి ఛత్రు నాయక్, ఇరిగేషన్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

కరవు జిల్లాగా ప్రకటించండి
* నివారణ చర్యలు చేపట్టండి
* కలెక్టర్‌కు కాంగ్రెస్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 2: జిల్లాలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 57 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితి ఏర్పడితే, కేవలం ప్రభుత్వం 19 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిందని, వెంటనే జిల్లాలోని 57 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాయకులు కర్ర రాజశేఖర్, విజయలక్ష్మి, జయశ్రీ, వెంకటరమణ, పొన్నం సత్యం, శేఖర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కటకం మృత్యుంజయం మాట్లాడుతూ జిల్లా అంతటా తీవ్ర కరవుతో అల్లాడుతుంటే, కేవలం 19 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. మిగితా 38 మండలాల రైతులు దిక్కుతోచని స్థితికి లోనవుతున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహించే మెదక్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిద్యం వహించే నిజామాబాద్ జిల్లాల్లోని మొత్తం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, కరీంనగర్‌లో కమాండ్ ఏరియా పేరుతో 19మండలాలను మాత్రమే ప్రకటించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడిందని, ఫలితంగా రైతులు పంట వేయడానికి వెనుకాముందు ఆలోచించే పరిస్థితి నెలకొందని, కనీసం తాగు నీరు లేక అనేక గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడిందని, రబీ సీజన్ మొదలైనా వ్యవసాయ చేసేందుకు రైతుల వద్ద పెట్టుబడులు లేకపోవడం, రుణమాఫీ జిల్లాలో సక్రమంగా జరగకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రబీ సీజన్‌లో వ్యవసాయం చేసే రైతాంగానికి విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూసి, రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజీకి చేరిందని, ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడిందని, ప్రభుత్వం తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, మిగితా 38 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని, ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరినట్లు మృత్యుంజయం తెలిపారు.

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి తాగునీటి ఎద్దడి తీర్చాలి
* జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 2:పట్టణంలోని ధర్మసముద్రం చెరువులోని తాగునీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేనందున ఎస్సారెస్పీ నీరు విడుదల చేసి ప్రజల దాహర్తి తీర్చాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు లేఖ రాసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక విలేఖరులతో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీలో తక్కువ నీటి సామర్థ్యం ఉన్నప్పటికీ కొంత మేరకు తాగు నీటికి విడుదల చేసి ప్రజల దాహర్తి తీర్చాలన్నారు. ధర్మసముద్రం నీరు 10రోజుల వరకే సరిపోయే అవకాశాలు ఉన్నాయని దీంతో వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎస్సారెస్పీ నీటి ద్వారా ధర్మసముద్రంను నింపాలని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు లేఖరాసినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వెల్లడించారు. ఈసమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నేరాల అదుపునకు ప్రజలు సహకరించాలి
* ఎఎస్పీ విష్ణు ఎస్ వరియార్
గోదావరిఖని, డిసెంబర్ 2: ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టగలమని ఇందుకోసం గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు నేరాల అదుపునకు సహకరించాలని గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్ వరియార్ అన్నారు. సబ్ డివిజనల్ ఎఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన ఎఎస్పీ విష్ణు ఎస్ వరియార్ బుధవారం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ఫైనాన్స్‌లు నిర్వహించేవారిపై కూడా చర్యలను చేపడతామని అన్నారు. గోదావరిఖని పారిశ్రామిక పట్టణ పరిధిలో నేరాలను అరి కట్టేందుకు వ్యాపార కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రధాన సెంటర్లలో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న అనేక రకాల నేరాలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వాటిని అరికట్టేందుకు స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నేరుగా సంప్రదిస్తే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. గోదావరిఖని పారిశ్రామిక పట్టణ పరిదిలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలు, బొగ్గు, డిజిల్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీస్‌లు కూడా బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

హామీలకే పరిమితమైన సిఎం
* కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయ

గోదావరిఖని, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలకే మాత్రమే పరిమితమవుతున్నారని ఆచరణలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా విఫలం చెందుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయ ఆరోపించారు. బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ ఎన్‌టిపిసిలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రజలను మభ్యపెడుతూ అనేక హామీలను ఇస్తున్నారని ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని అన్నారు. డబుల్ బెడ్‌రూం అర్హులందరికీ అందజేస్తామని తెలిపి సంవత్సరంన్నర గడిచినా అమలు చేయలేకపోయారని, ఎస్సీలకు 3 ఎకరాల భూమిని ఇస్తామని తెలిపి ఇప్పటివరకు అమలు చేయలేకపోయారని అన్నారు. మరో 6నెలల కాలంలో విద్యుత్ కోత తీవ్రంగా రాబోతున్నదని వాటిపై కూడా ఎలాంటి ప్రత్యేక దృష్టి చేపట్టడంలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరుపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారని, 4వ డివిజన్‌లో కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ దాసరి సావిత్రిని స్థానిక ప్రజలు గెలిపించాలని కోరారు. కార్పొరేషన్‌లో ప్రతి పక్ష అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు ఉంటేనే అభివృద్ధి పనులపై నిలదీసి సాధించగలుగుతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విలేఖరుల సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు బొంతల రాజేష్, తానిపర్తి గోపాల్ రావు, బద్రి రజిత, అభిషేక్ రావు, నస్రిన్ బేగంలతో పాటు కాంగ్రెస్ నాయకులు బాబర్ సలీం పాషా, కత్తెర మల్ల రమేష్, వెంగల బాపు తదితరులు పాల్గొన్నారు.

రామగుండంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యటన
* వాటర్ గ్రిడ్ కోసం స్థల పరిశీలన
* ఎల్లంపల్లి నుండి నీటి సరఫరా!

రామగుండం, డిసెంబర్ 2: రామగుండం కార్పొరేషన్ ప్రజానికం దాహార్తిని తీర్చేందుకు పాలక వర్గం వాటర్ గ్రిడ్ నిర్మాణం కోసం పూనుకుంది. సుమారు 100కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏరియా తాగునీటి సౌకర్యార్ధకోసం వాటర్ గ్రిడ్ నిర్మాణానికి ఇటీవల్లే రామగుండం కార్పొరేషన్ ప్రభుత్వానికి ప్రతి పాదించిన నేపథ్యంలో స్థలాన్ని పరిశీలించేందుకు బుధవారం నాడు రాష్ట్ర మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ రామగుండం పట్టణంలో పర్యటించారు. రామగుండం బి పవర్‌హౌస్ క్రాస్ రోడ్డు ప్రాంతంలోని గుట్ట వద్ద వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు స్థలాన్ని కూడా ఎంపిక చేసుకోగా దీనిని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ స్వయంగా పరిశీలించారు. ఎంపిక చేయబడ్డ గుట్ట ప్రాంతంలోని స్థలం వరకు తీసుకోవాల్సిన పైప్‌లైన్ ప్రాంతాలను కూడా ఆయన పర్యావేక్షించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి రామగుండం కార్పొరేషన్ పరిదిలోని అన్ని డివిజన్‌ల ప్రజలకు గోదావరి నుండి తాగునీటి సరఫరా చేపట్టేందుకు ఈ మధ్యనే రామగుండం కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ 87కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించారు. తాగునీటి సరఫరా కోసం రామగుండం కార్పోరేషన్‌కు లక్షల్లో కరెంటు బిల్లు వస్తుండగా రామగుండం బి పవర్‌హౌస్ గడ్డ వద్ద వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేసినట్లయితే నీటి పంపిణీ సులువుగా జరుగుతుండగా కరెంటు బిల్లుల భారాన్ని కూడా తగ్గుతుండడంతో ఈ దిశగా కార్పొరేషన్ పాలక పక్షం ఆలోచనలు చేసి ప్రతిపాదనలను పంపింది. ఎల్లంపల్లి పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకొని ఇక్కడి నుండి గోదావరిఖనిలోని శారదనగర్ ప్రాంతం ప్రధాన ట్యాంక్‌కు పైప్‌లైన్ ద్వారా నీరు సరఫరా చేసుకోగలిగితే కరెంటు బిల్లుల మోత సమస్యను చాలావరకు తగ్గుతుంది. రామగుండం మండలంలోని కుందనపల్లి ప్రాంతంలో ఉన్న ఎల్లంపల్లి పైప్‌లైన్ ఎన్‌టిపిసి డెలివరి చాంబార్ నుండి పైప్‌లైన్ ద్వారా బి పవర్‌హౌస్ గడ్డ వద్ద ఎంపిక చేయబడ్డ స్థలం వరకు నీటి సరఫరాను చేసుకునేందుకు కూడా ప్రతిపాదించిన విషయాలను కూడా ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యటన సందర్భంగా పర్యావేక్షించినట్లు తెలిసింది. కుందనపల్లి డెలివరి చాంబర్ నుండి కాకుండా రామగుండం రైల్వే ట్రాక్‌లైన్ అవతలి వైపు ఉన్న పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను చేసుకునేందుకు వీలుంటుందా అన్న విషయాన్ని కూడా పబ్లిక్ హెల్త్ విభాగం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయతే ఎల్లంపల్లి పైప్‌లైన్ సంబందించి ఎక్కడి మార్గం నుండైతే నీటి సరఫరా కోసం పైప్‌లైన్ వేసుకుంటే అనుకూలంగా ఉంటుందో అలాగే ఆయా ప్రాంతంలో పైప్‌లైన్ ఏర్పాటుకు ప్రధాన రోడ్డు మార్గాల గుండా కూడా ఎలాంటి అవంతరాలు రాకుండా కూడా స్థలం ఉందా, పైప్‌లైన్‌కు సులువైన స్థల మార్గాలను ఇంజినీర్ ఇన్ చీఫ్ స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది. వాటర్ గ్రిడ్ కోసం ఎంపిక చేసిన స్థలం వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చెందిన దగ్గరగా ఉన్న పైప్‌లైన్ మార్గాలన్నింటిని కూడా అధికారులు ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు సూచించినట్లు తెలిసింది.

14న జాతీయ ఫైలేరియా నివారణ దినోత్సవం
* కలెక్టర్ నీతూప్రసాద్

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 2: జిల్లాలో ఈ నెల 14న జాతీయ ఫైలేరియా నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమా

మోగిన ‘ఎమ్మెల్సీ’ నగారా..!
తొలిరోజు నామినేషన్లు నిల్ * అభ్యర్థి ఎంపికకు టిఆర్‌ఎస్‌లో మల్లగుల్లాలు

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయ పార్టీల్లో సందడి వాతావరణం మొదలైంది. ఓవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై యంత్రాంగం అవసరమైన కసరత్తు సాగిస్తుండగా మరోవైపు అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. అయితే నోటిఫికేషన్ జారీ తేదీ నుండే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా తొలి రోజు బుధవారం జిల్లాలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నోటిఫికేషన్ షెడ్యుల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఈనెల 9వ తేదీ ఖరారు చేయగా, 10న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు 12గా నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనుండగా, ఓట్ల లెక్కింపు 30న నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కోడ్ అమల్లోకి రావడంతో జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ప్రచారంపై, రాజకీయ నేతల హామీలపై కమిషన్ ప్రత్యేక నిఘా వేయడంతో నేతలు ఆచితూచిగా వ్యవహరిస్తూ కోడ్‌పై జాగ్రత్తగా మసులుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా మొత్తం 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత పురపాలక చైర్మెన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణం చేసిన ఎంపి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు. పెద్దపల్లి ఎంపి సుమన్‌కు కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు ఉండగా, ఆదిలాబాద్ ఎంపి గెడం నగేష్‌కు ఆదిలాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా పది మంది ఎమ్మెల్యేలలో జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మున్సిపల్ ఎక్స్ అఫిషియో సభ్యులైనందునా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో 52 జడ్పీటిసిలు, 635 ఎంపిటిసి లు, 188 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆదిలాబాద్‌లో 170 మంది, నిర్మల్ డివిజన్ కేంద్రంలో 238 మంది, మంచిర్యాలలో 236 మంది, ఉట్నూరులో 95 మంది, ఆసిఫాబాద్ కేంద్రంలో 144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో జిల్లాలో ప్రతి మండలానికి నాలుగు బృందాల చొప్పున అధికారులను నియమించి, పర్యవేక్షణ కొనసాగిస్తున్నరు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే సభలు, సమావేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
అభ్యర్థుల ఎంపికే అసలు సమస్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైన మేజార్టీ లేని టిడిపి, కాంగ్రేస్, బిజెపి, వామపక్ష పార్టీలు పోటీకి ఆసక్తికనబర్చడం లేదు. అధికార పార్టీకి భారీ సంఖ్యబలం ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఏకపక్షంగానే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార టీ ఆర్ ఎస్ పార్టీలో ఎన్నికలకు ముందే విజయోత్సవం తొనికిసలాడుతుండగా, అభ్యర్థి ఎంపికపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ సీట్లు ఉండగా సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఎవరిని పోటికి దింపుతారోనన్నది ఉత్కంఠగా మారింది. మంగళవారం తూర్పు జిల్లాకు చెందిన శాసన సభ్యులు అభివృద్ది సమీక్ష పేరిట సిఎంను కలిసి పనిలోపనిగా తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ పేరును సిఎం ముందు ప్రతిపాదించినట్లు తెలిసింది. మరోవైపు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ తన అభ్యర్థిత్వం గురించి సిఎం దృష్టికి, మంత్రులు హరీష్, జోగురామన్న, ఐకెరెడ్డిల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మరోవైపు బిసి సామాజిక కోటాలో కావేటి సమ్మయ్య, వేణుగోపాల చారి తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
* రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
ఉట్నూరు, డిసెంబర్ 2: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల కోసం రచించిన రాజ్యంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రథమ సభలు ఈనెల 12న జరగనుండగా దానిపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా భూసంరక్షణ, విద్యా, వైద్యం వంటి అంశాలపై సెమినార్ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలను ప్రజల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతన్న చూసి చూడన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆశా కార్యకర్తలు 92 రోజులుగా తమ హక్కుల కోసం అందోళన బాట చేపట్టినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కెసి ఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కార్మికులు, కర్షకులు, ఆశా కార్యకర్తలంతా ఐక్య పోరాటాలు చేసి తమ సమస్యలను పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పాలనను విస్మరించి అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేయడానికి కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా ఐక్యమై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 12న జరిగే గిరిజన సంఘం రాష్ట్ర ప్రథమ సభలను ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బండి దత్తాత్రి, నైనాల గోవర్ధన్, మల్లేశం, పోతు శంకర్, తొడసం భీంరావు, రాజన్నతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

వాటర్ గ్రిడ్‌తో కౌటాల, బెజ్జూరు దాహార్తి దూరం
* కౌటాల కంకాలమ్మ గుట్టపై ట్యాంకులు * వాటర్ గ్రిడ్ డిఈ నాగేశ్వర్‌రావు
కౌటాల, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ద్వారా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, బెజ్జూరు మండల ప్రజల దాహార్తి తీరనుందని వాటర్ గ్రిడ్ డిప్యూటీ ఇంజినీర్ నాగేశ్వర్‌రావు అన్నారు. ఇటీవల కౌటాల, బెజ్జూరు మండలాల్లో తాగునీరందించే పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టు పొందిన ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులతో కలసి బుధవారం సర్వే పనులను నిర్వహించారు. వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టను ఎంపిక చేశామన్నారు. ఆసిఫాబాద్ సమీపంలోని అడ వద్ద నిర్మించిన కొమురం బీం ప్రాజెక్టు ద్వారా కంకాలమ్మ గుట్టపై నిర్మించే ట్యాంకులకు మళ్లించి అక్కడి నుండి కౌటాల, బెజ్జూరు మండలాల్లోని 147 గ్రామాల్లో 1,00,222 మందికి తాగునీరు అందించనున్నట్లు వివరించారు. కౌటాలలో నిర్మించే ట్యాంకు ద్వారా గ్రావిటీ రూపంలోని ఆయా గ్రామాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని మళ్లించి అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఒక్కో ట్యాంకు ద్వారా ప్రతీ మనిషికి 40లీటర్లు మాత్రమే నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉండగా, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ నీటి సామార్థ్యాన్ని ఒక్కో కుటుంబానికి 100 లీటర్లకు పెంచారని తెలిపారు. కౌటాలలోని కంకాలమ్మ గుట్టపై 250 మీటర్ల ఎత్తు ప్రదేశంలో ట్యాంకు ప్రదేశాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ స్థలంలో 30 మీటర్ల ఎత్తులో ట్యాంకు నిర్మించి నీటిని తీసుకురానున్నట్లు డిఈ నాగేశ్వర్‌రావు వివరించారు. మొత్తం 350 కిలో లీటర్ల నీటిని కౌటాల, బెజ్జూరు మండలాల ప్రజలకు అందించడం వాటర్‌గ్రిడ్ లక్ష్యమని వెల్లడించారు. బెజ్జూరు మండలంలోని కమ్మర్‌గాంలో సంప్‌ను నిర్మించి గ్రామానికి సమీపంలోని ఎత్తు ప్రదేశాలైన మురళీగూడ, జిల్లెడ, నందిగామలకు నీరు సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. అనంతరం ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ రెండు రోజుల్లో వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించి సర్వే ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో సాధ్యమైనంత త్వరగా గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కంకాలమ్మ గుట్టపైకి వచ్చిన డిఈతో పాటు ఎల్ లండ్ టి ప్రతినిధులు కంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఆలయ కమిటీ చైర్మన్ సులువ కనకయ్య, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు నక్క శంకర్, సత్యనారాయణ, లింగయ్య, శ్రీనివాస్ ఉన్నారు.

31 వరకు పోలీస్ యాక్ట్
* ఎస్పీ తరుణ్ జోషి
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 2: జిల్లాలో డిసెంబర్ 31 వరకు 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీసు యాక్ట్‌ను అమలు చేయాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ముందస్తుగా సంబంధిత డిఎస్పీల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. డివిజన్ స్థాయిలో డిఎస్పీ అనుమతి, జిల్లావ్యాప్తంగా ఎస్పీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు, ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజాశాంతికి భంగం కల్గకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహించి, ప్రజాశాంతికి భంగం కల్గించినట్లయితే వారిపై చట్టరీత్య కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఖాళీ పోస్టుల భర్తీకి టెండర్ల ఆహ్వానం
ఆదిలాబాద్ రూరల్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్వీపర్, స్కావెంజర్ పోస్టుల భర్తీకి అర్హులైన ఏజెన్సీల నుండి కోటేషన్లు, టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ తరుణ్ జోషి తెలిపారు. జిల్లాలోని పోలీసు స్టేషన్‌లో, పోలీసు కార్యాలయాల్లో స్వీపర్లుగా, స్కావెంజర్లుగా పనిచేయుటకు కాంట్రాక్ట్ ప్రతిపాదిక మీదా నెలకు ఒకొక్కరికి రూ.770 చొప్పున వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టులకు అభ్యర్థులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన ప్రైవేట్ ఏజెన్సీలు ఎస్పీ పేరిట ఈనెల 10 లోపు కొటేషన్లు, టెండర్లు పంపాలన్నారు. పూర్తి వివరాలకు పోలీసు కార్యాలయం సెక్షన్ అధికారి దయాకర్ ఫోన్ నెంబర్ 7702883879 సంప్రదించాలన్నారు.

జమాబందీ పకడ్బందీగా నిర్వహించాలి
* సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
బెజ్జూరు, డిసెంబర్ 2: జమాబందీని పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులన ఆదేశించారు. బుధవారం ఆయన బెజ్జూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జమాబందీ రికార్డులను పరిశీలించారు. బెజ్జూరులో పట్టేదారు పాసు పుస్తకాల కొరత ఉన్నది వాస్తవమేనన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సూర్యనారాయణ, ఆసిఫాబాద్ డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హరిదాస్, విఆర్‌వోలు సిబ్బంది ఉన్నారు.
అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్
* ఆసుపత్రి పాలైన 8 మంది చిన్నారులు
కుభీర్, డిసెంబర్ 2: మండలంలోని చోండి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కస్రాతాండ మినీ అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ జరిగి చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో పిల్లల తల్లితండ్రులు భయాందోళనలకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుండి చిన్నారులు దావు, అభయ్, నిఖిల్, విశాల్, స్వప్న, అశ్వినిలతోపాటు మరో ఇద్దరు చిన్నారులకు వాంతులు కావడంతో పిల్లలను హుటాహుటిన చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ప్రాణానికి ప్రమాదం లేదనడంతో తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

భూసేకరణ పనులు వేగవంతం

* సాగునీటి ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 2: జిల్లా ఇరిగేషన్ ప్రణాళికను తయారు చేసుకొని దానికనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణాలకై భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సాగునీటి ముఖ్య కార్యదర్శి ఎస్ కె జోషి అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రాజెక్టుల నిర్మాణ పనులు, భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయో కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ వివరణ ఇస్తూ భూసేకరణ కింద 1191.53 ఎకరాల భూమిని ప్రోక్సూర్ చేసి రిజిస్ట్రేషన్ చేశామని చెప్పారు. జిల్లాకు కేటాయించిన నిధుల నుండి 42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా 1500 ఎకరాల భూమి రిజిస్టేషన్ చేసేందుకు వివిధ దశలలో ఉందని తెలిపారు. త్వరలో రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పిఎంకెఎస్‌వై పథకం కింద సమావేశం ఏర్పాటు చేసి హర్టికల్చర్, వ్యవసాయ శాఖల నుండి జిల్లా ఇరిగేషన్ ప్లాన్ కొరకు సమాచారం సేకరించామని, రెండు వారాల్లో డిపిఆర్ సమర్పిస్తామని కలెక్టర్ వివరించారు. రెండో విడత కాకతీయ మిషన్ కింద 476 చెరువులను గుర్తించామని, వాటిలో 201 సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు. ఫేస్1లో మంజూరు చేసిన అన్ని చెరువుల గ్రౌడింగ్ ఈనెల చివరిలోగా పూర్తిచేసి, మార్చిలోపు పూర్తిచేస్తామని అన్నారు. కొమురం బీం ప్రాజెక్టు కొరకు కేటాయించిన 15 కోట్లలో 5 కోట్లు మాత్రమే ఖర్చు కాగా 273 ఎకరాలు రిజిస్టర్ అయ్యాయని, మిగిలిన భూమిని త్వరలో సేకరించి రిజిస్టర్ చేస్తామన్నారు. త్వరితగతిన భూసేకరణ పనులు పూర్తిచేయాలని, ఇందుకు కలెక్టర్ ఖాతాలో ఉన్న నిధులను వాడుకోవాలని కార్యదర్శి జోషి సూచించారు. ఇరిగేషన్ ఎస్‌ఇ భగవంత్‌రావు, ఇరిగేషన్, వ్యవసాయశాఖ, హర్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

గణితంపై పట్టు సాధిస్తేనే విజయం
* ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య
నిర్మల్, నవంబర్ 2: ఆధునిక యుగంలో గణితానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, విద్యార్థులు గణితంపై పూర్తిగా పట్టుసాధిస్తే అనేక విజయాలను సొంతం చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ చుక్కారామయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పాఠశాల విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గణితంలోని అంకెలు, సంకేతాలు ఏవిధంగా ఏర్పడ్డాయో విద్యార్థులకు బ్లాక్ బోర్డుపై ప్రత్యక్షంగా చూపించారు. విద్యార్థులను అడిగిన ప్రశ్నలకు వారు ధీటుగా సమాధానాలు చెప్పడంతో ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తోందని, ముఖ్యంగా విద్యలో యువత దూసుకుపోతున్నారన్నారు. సున్నను కనుగొన్నది కూడా భారతీయులేనని విద్యార్థులకు తెలియజేశారు. దేశంలో ప్రస్తుతం ఉన్న యువత ఎంతో సృజనాత్మకతను కలిగి ఉన్నారన్నారు. విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చే శక్తి ఒక్క పాఠశాలలకు మాత్రమే ఉందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో వాసవి ఉన్నత పాఠశాల డైరెక్టర్ లింగారెడ్డి, కార్యదర్శి జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్‌లు రాందాస్, సుహాసిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
* కలెక్టర్ జగన్మోహన్
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 2: జిల్లాలో గుడుంబా తయారీని అరికట్టడానికి అబ్కారీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి, జిల్లాను గుడుంబారహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎం జగన్మోహన్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పోలీసు, అబ్కారీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, మహిళా సమైఖ్య అధికారులతో కల్తీసార నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ విషపూరితమైన పదార్థాలతో తయారు చేసే గుడుంబా, కల్తీ కల్లు తాగడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కల్తీ కల్లును అరికట్టడంలో నిర్లక్ష్యం వహించే అబ్కారీ అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళ సంఘాలు గుడుంబాను విక్రయిస్తున్న వారి సమాచారాన్ని తెలుపుతూ అబ్కారీ అధికారులకు సహకరించాలని కోరారు. అదనపు ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ కల్తీ కల్లును అరికట్టడానికి పోలీసు యం త్రాంగం తరుపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అబ్కారీ అధికారులు దాడులు నిర్వర్తించేటప్పుడు పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. అబ్కారీ డిప్యూటీ కమిషన్ శివరాజ్ మాట్లాడుతూ మూడు నెలలుగా జిల్లాలో పెద్ద ఎత్తున గుడుంబా విక్రయాలపై దాడులు జరిపామన్నారు. 133 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 346 కేసులు నమోదు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ పనసారెడ్డి, డిఆర్‌డిఏ పిడి అరుణకుమారి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, అబ్కారీ అధికారి అనిత, ఎంవిఐ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.