మహబూబ్‌నగర్

గద్వాల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 28: అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మూడురోజుల బంద్ నడిగడ్డలో విజయవంతమైంది. మూడవ రోజు ఆదివారం ఉదయం నుంచే అఖిలపక్షం నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసి డిపో ఎదుట ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా పెద్దఎత్తున పోలీసులు మోహరించి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నిరసన జ్వాలలు వెల్లువడడంతో ఆర్టీసి అధికారులు బస్సులను నిలిపివేశారు. ప్రతిగ్రామాన పెద్దసంఖ్యలో యువకులు అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి గద్వాలను జిల్లా చేయాలని నినదించారు. గద్వాల జిల్లా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ఎన్నో ఆంక్షలు విధించినప్పటికి ప్రజల ఆకాంక్ష ముందు అవి నిలవడలేక పోయాయి. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసిన నడిగడ్డ ప్రజలు మరోసారి జిల్లా ఉద్యమాన్ని నెత్తినవేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. టిఎన్‌జిఓ భవన్‌లో ఉదయం పెద్దసంఖ్యలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి ఉద్యమకార్యచరణను రచించారు. గద్వాలను జిల్లా చేసేంత వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు తమ ఫిర్యాదులను చేయాలని సూచించారు. ఉదయం నుంచి విడతల వారిగా అఖిలపక్షం నేతలు పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీని నిర్వహించారు. గతంలో ఎన్నడూలేనివిధంగా గద్వాలలో బంద్ విజయవంతం కావడం పట్ల జిల్లా ఆకాంక్ష ప్రజల్లో ఏవిధంగా ఉందో తెలిసొచ్చింది. పెద్దసంఖ్యలో యువకులు, విద్యార్థులు సైతం జిల్లా ఉద్యమానికి కలిసి రావడంతో పోలీసులకు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మూడు రోజుల బంద్‌కు పిలుపునివ్వడంతో గద్వాలకు పెద్దసంఖ్యలో పోలీసుల బలగాలు మోహరించాయి. కృష్ణవేణి చౌరస్తాలో అఖిలపక్షం నేతలు రోడ్లపై కబడ్డి ఆడి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో నాయకులు వీరభద్రప్ప, వెంకట్రాజారెడ్డి, నాగర్‌దొడ్డి వెంకట్రామలు, మధుసూధన్‌బాబు, గడ్డంకృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, శంకర్, అతికూర్ రహెమాన్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, రామలింగేశ్వర్‌కాంమ్లే, బాలగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మనసు మారాలని ఆదివారం పట్టణంలోని ఎంబి మిస్పా, ఎంబి సియోన్ చర్చిలలో టిఆర్‌ఎస్ నేతలు ప్రత్యేక ప్రార్థలను జరిపారు. ఈ సందర్భంగా జడ్పిచైర్మన్ బండారి భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు హాజరై ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల్లో అన్ని అర్హతలు ఉన్న గద్వాలను చేయాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి గుర్తించి న్యాయం చేస్తారని వారు అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ నేతల చర్చిలలో ప్రార్థనలకు అఖిలపక్షం నేతలు సంఘీభావం తెలిపారు.
మల్దకల్‌లో...
మల్దకల్: గద్వాల జిల్లా కోసం, వర్షాలు సకాలంలో కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు బాగా పండాలని కోరుతూ ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలోని ఎంబి చర్చిలో తెరాస నేతలు మధ్యాహ్నం 1గంటకు చర్చిలోని తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపిపి సవారమ్మ, జడ్పిటిసి భాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు శేషంపల్లి నర్సింహులు, ఉపాధ్యక్షులు రాజారెడ్డిలు చర్చిలలో ప్రార్థనలు చేశారు. గద్వా జిల్లా చేయాలని, వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యేసుప్రభు దయవల్ల గద్వాల జిల్లాను ప్రకటించాలని ముఖ్యమంత్రి రుణపడి ఉంటారన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ నుంచి గాంధీచౌక్, సంతబజార్, దేవాలయం మీదుగా మోటార్ సైకిల్ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు తిమ్మారెడ్డి, దామనాగరాజు, ధర్మారెడ్డి, వెంకటన్న, ఆంజనేయులు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎల్లప్ప, కమల్, నర్సింహులు తదితరులు ఉన్నారు.
ధరూరులో...
ధరూరు: నడిగడ్డ జిల్లా సాధనకై అఖిలపక్ష పిలుపు మేరకు 72గంటల బంద్‌లో భాగంగా ఆదివారం ధరూరు మండల కేంద్రంలోని వ్యాపార దుకాణాలు, హోటళ్లను స్వచ్చందంగా బంద్ చేశారు. గద్వాల-రాయిచూరు రహదారిపై అఖిలపక్షం నాయకులు బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఉద్యమకారులకు నచ్చచెప్పేప్రయత్నం చేయగా అఖిలపక్షం, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బస్సులను తిప్పి గద్వాల డిపోకు పంపడం జరిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం జెఎసి నాయకులు సంజీవ్‌భరద్వాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, పెద్దకిష్టన్న, శ్రీకాంత్‌రెడ్డి, జయసింహారెడ్డి, రాజారెడ్డి, ఎల్కూర్ లక్ష్మన్న, వేమారెడ్డి, శేఖర్‌రెడ్డి, యువరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ధరూరు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు...
కొత్త జిల్లాల ఏర్పాటులో గద్వాల జిల్లా ప్రకటనలో లేకపోవడంతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలంటూ టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్లకృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఎంబి చర్చి, మరనాథ చర్చిలలో కెసిఆర్ మనసుమారి గద్వాలను నూతన జిల్లాగా ఏర్పాటు చేసేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, జాకిర్, వెంకటన్న, రాజు, బడుగన్న, శ్రీనివాసులు, దేవదాస్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.