Others

మనసున కురిసిన వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటికొచ్చిన వర్షం
-పాలపర్తి ఇంద్రాణి
వెల: రూ.40.. పుటలు: 72
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
జ్యోతి వలబోజు
8096310140
*
భావ కవిత్వమైనా, అభ్యుదయ కవిత్వమైనా, విప్లవ కవిత్వమైనా, స్ర్తివాద కవిత్వమైనా, ఏదైనా మనసుకు హత్తుకోవాలి. గుండెల్లో గుచ్చుకోవాలి. ఏ కవిత్వానికైనా వస్తు రూపాలు ముఖ్యం. వస్తువు ఏ వాదానికి చెందినదైనా రూపం ముఖ్యం. ఆ కవితను చెప్పిన విధానం ప్రధానం. అలాంటి కవిత్వం పాఠకుల హృదయాల్లో నిలచి ఉంటుంది. పాలపర్తి ఇంద్రాణి గారు రచించిన ‘ఇంటికొచ్చిన వర్షం’ అలాంటి కవితా సంపుటి.
ఉడుతల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఆ ఉడుత చిత్రాన్ని మన కళ్లకు కట్టేలా ‘గడ్డిపూల నదిలో/ చిత్తరువులా/ నిలబడి/ కుంచెతోక/ ఉడుత!’ అని చిత్రిస్తారు. ఉడుత కదలకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. అటు ఇటు గెంతుతూ ఉంటుంది. దానే్న ‘అంతలోనే కంగారు పండొకటి/ ఎండ మీదకు విసిరి/ గుబురు కొమ్మల్లోకి/ గెంతిపోతుంటే దాని/ నిడుపుచారల/ వీపును రాసుకుంటూ/ వెనకాలే / వెర్రి పరుగుల/ రికామీ గాలి!’ అని పాఠకుల మనసు కాన్వాసులపై బొమ్మ గీస్తారు తన కలం కుంచెతో.
‘అల్లరి పిచుకలు’ కవితలో కవయిత్రి తన స్వీయ జ్ఞాపకాల చిత్రాలతోపాటు పిచుకల కదలికలకు ప్రాణం పోస్తారు. ‘జన సమ్మర్థంలో/ నా కళ్ల చెరువుల్లోకి/ మెరుపుల్లా దూకిన/ నీ చూపుల చేపపిల్లల దండెం మీద ఎగిరిన/ తడి నూలు చీరల వెనక/ రెపరెప/ నా పట్టుచీర మీద రాలిపడ్డ నీ కొంటె నవ్వుల/ మత్తు మల్లెపువ్వుల/ నీ మీసాల గరుకు/ గిలిగింతల/ తడి ముద్దుల/ కలల సొగసుల/ లాంటివి/ అలాంటివి/ ఏవో’ అంటూ/ నే లేచి వెళ్లిందొక/ కిచకిచలాడుతూ/ కిటికీ అద్దాన్ని/ ముక్కులతో పొడవడం ఆపవు’ అని మనకు ఇష్టమైన అల్లరి పిచ్చుకల అల్లరిని అక్షరబద్ధం చేశారు.
కవయిత్రికి పరిశీలనా దృష్టి ఎక్కువ. ప్రకృతి చిత్రాలతోపాటు ఆధునిక మానవ జీవితంలో వచ్చిన మార్పుని తన కవిత్వంలో ప్రతిఫలింపజేశారు. ఇప్పటి నాగరిక జీవనంలో వేగం ముఖ్యం. గమ్యాన్ని వేగంగా చేర్చే ఆటోలు ప్రయాణంలో ముఖ్య భాగమయ్యాయి. కూరగాయలమ్ముకొనేవాళ్లు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఆటో ఎక్కుతారు. పల్లెటూరు నుంచి పట్నం వెళ్లే సెవెన్ సీటర్ ఆటోలో ప్రయాణాన్ని ‘సద్దుకో సద్దుకోమ్మని/ పద్నాలుగో శాల్తీనీ తోసి/ నేల మీద నల్లమబ్బులు/ పుట్టాస్తాదిది డుగుడుగు/ ఆటోలో పెట్టిన కూరగాయల గంపల్లో కూరలు కదులుతుంటాయి. స్పీడుబ్రేకర్లు వచ్చినపుడు ఎత్తెత్తి కుదేస్తాయి. దీనే్న ‘బుట్టలో బుగ్గా/ బుగ్గా రాస్కునే దోసకాయలకు చెళ్లంతా గొడితే’ అని చమత్కరిస్తారు. ‘ఈ డాపాలాపాలన్న కేకల్ని నమలుకుంటా/ ఎత్తెత్తి కుదేస్తాడు/ యనకమాల టైర్లకాడ/ కోరల దిష్టిబొమ్మగాడు’ అని పల్లెటూర్ టు పట్నం: ది సెవెన్ సీటర్’ కవితలో ఆటో ప్రయాణాన్ని మనమే ఆటో ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి కలిగిస్తారు.
ఎండాకాలంలో మండుతున్న ఎండలే కాదు మనసు దోచుకొనే మల్లెపూలు వస్తాయి. చాలామందికి ఉపాధినీ కల్పిస్తాయి. పొట్టకూటి కోసం మల్లెపూలమ్ముకొనే అబ్బాయి గురించి ‘మల్లేపూల్ మల్లేపూల్’ కవితలో ‘సాయంకాలమైనా/ చల్ల మిరపకాయలను/ మండిస్తోంది ఎండ’ అంటూ గడప దిండు మీద/ కునుకు తీస్తున్న అమ్మ/ చలివేంద్రం దప్పికమ్మ/ గిరుక్కున తిరిగి చూస్తారు/ ఎందుకంటే ‘వీధి మలుపు/ తిరుగుతోంది/ తోపుడుబండి/ ఆ వెనకే/ వడగండ్ల వానలా/ మల్లేపూల్/ మల్లేపూల్/ అన్న కేక’ అని మండుటెండల్లో మల్లెపూలబ్బాయి కేకలను వినిపిస్తారు కవయిత్రి.
మామూలుగా ఎండాకాలాన్ని నిప్పుల జెండాలు ఎగురుతున్నాయని, రోళ్లు పగులుతున్నాయని వర్ణిస్తారు. కానీ ఈవిడ చల్ల మిరపకాయలను మండిస్తోంది అని కొత్త పోలిక తెస్తారు. మజ్జిగ చల్లగా ఉంటుంది. చలవ చేస్తుంది. చల్ల మిరపకాయలు మజ్జిగలో నానతాయి. మజ్జిగ స్వభావాన్ని అందిపుచ్చుకొంటాయి. ఈ ఎండ వాటిని గూడ మండిస్తుంది అంటారు.
శోకం నుండి శ్లోకం వచ్చింది అంటారు. ‘కొడుకు లేడు’లో కొడుకు లేని వారి దుఃఖాన్ని ‘మండుతోన్న/ గచ్చుమీద/ చేపలా/ కొట్టుకులాడుతూ/ మనసు/ గమ్యం లేని/ రైలెక్కేసి/ వాడు/ ఖాళీచేసి/ వెళ్లిపోయిన/ ఇల్లు/ కొడుకు వెళ్లిపోయాక దుఃఖంతో మాట్లాడుకోరు/ వట్టిపోయిన/ గిలకబావి/ గొంతుక/ ఊరదు/ మాట/ కళ్లల్లో నుండి కన్నీటి ప్రవాహం ఆగదు/ కంటి దోనెల/ పొంగే నీరు/ ఆనదే చూపు/ దుఃఖం/ దుఃఖించలేనంత/ దుఃఖాలు’ అని కొడుకులేని వేదనను చిత్రిస్తారు.
ముఖపత్ర కవిత ‘ఇంటికొచ్చిన వర్షం’లో ‘అప్పుడే బయటకీ/ వచ్చి స్నానం చేస్తున్న/ వానపాముల్ని/ తార్రోడ్డుకి/ అటూ ఇటూ పారే/ ఎర్రమట్టి నీళ్లూ/ ‘పూల అంచుగా/ ఒకటొకటిగా/ జారి/ ఇసుకలో/ తీరుబడిగా/ కన్నాలు/ పెడుతున్న/ వానచినుకులూ/ చూడొచ్చులే/ కిటికీలోంచి’ అని వాన అందాలను వర్ణిస్తారు. పై నుంచి వాన చినుకులు పడుతున్నపుడు చినుకు చుట్టూ వృత్తం గీచినట్లు గుండ్రంగా, వలయంలా కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని ఒడుపుగా పట్టుకొన్నారు కవయిత్రి.
సూక్ష్మ పరిశీలన కవయిత్రి సొత్తు. ‘కళాకారుడి ప్రేయసి’లో కళాకారుడి కీర్తి వ్యామోహాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తారు. ‘ఇతడు కళాకారుడు అలవిమాలిన ప్రేమతో/ అల్లుకుపోబోతాను/ ఇతడు నవ్వించి/ ఏడిపించి/ క్షణక్షణానికీ/ రంగులుమార్చీ/ ఏమారీ ఏమార్చీ/ ఎండాకాలం/ పెళుసుగాలిలా/ పారిపోతాడు/ నేనే/ ఆ పరిష్వంగాన్ని/ వదిలించుకుని/ పిట్టలా పారిపోతే/ ఇతడు/ విరహగీతాలు/ ఆలపిస్తాడు/ విషాదపు నిషా/ నిండిన కవితలు రాసి/ చచ్చిపోయాక కూడా/ తన పేరు మారుమోగేలా/ సమాధి నుంచే/ చప్పట్లు కొట్టించుకుంటాడు’ అని అతని స్వార్థాన్ని ఎండగడతారు.
‘కవి’ కవితలో ‘దేవుడు/ వీడిని/ గాలి తిని బతికే/ ఆనందకుమారుడిని/ విషాదప్పవుడరు/ పూసుకున్న/ మోహనమూర్తిని/ గులకరాళ్లని/ రత్నాలుగా/ దాచుకొనే/ వెర్రివాడిని/ లోకసంచారిని/ బికారిని చేసి/ అప్పుడు/ నెత్తిమీద/ కుండపెట్టి/ కుండలో/ అమృతంపోసి/ అడిగిన వారిని/ దాహం ఇస్తూ/ తిరుగుతునే ఉండమంటాడు’ అని కవి తన కవితామృతాన్ని అందరికీ పంచిపెట్టడాన్ని ఆవిష్కరిస్తారు.
కవిత ఎత్తుగడ, ముగింపు తెలిసిన కవయిత్రి ఇంద్రాణి. ‘వానకు తడిసిన పువ్వొకటి’ ‘అడవి దారిలో గాలిపాట’ కవితా సంపుటులతో లబ్ధప్రతిష్టులైన వీరు మరిన్ని కవితా సంపుటులు ప్రచురించి కవిత్వ ప్రేమికుల దాహాన్ని తీర్చాలని ఆశిస్తున్నా.

-మందరపు హైమవతి 9441062732