Others

కూడదు అహం.. అది అపకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు
సంతోషికెప్పుడు జరుగు సుఖము
సంతోషిగాకుంట సంసారహేతువు
సంతసంబున ముక్తిసతియు దొరకు
పూట పూటకు జగంబున యదృచ్ఛాలాభ
తుష్టిని తేజంబుతోన పెరుగు
పరితోషహీనత ప్రభచెడిపోవును
జగలధార ననలంబు సమయునట్లు
నీవు రాజవనుచు నిఖలంబునడుగుట
తగవు గాదు; నాకు తగిన కొలది
యేను వేడికొనిన రుూ పదత్రయమును
చాలదనక యిమ్ము చాలు చాలు’’
ఈ పద్యం బమ్మెరపోతన రచించిన ఆంధ్ర భాగవతంలోని వామనావతార చరిత్రలోనిది. బలి-రాక్షస రాజు- గొప్పదాత- ఇంద్రాది దేవతల కోరిక మేరకు బలినణచడానికై విష్ణువు వామనుడై అవతరించాడు. యజ్ఞం చేస్తున్న బలివద్దకు వచ్చాడు. ఆ చక్రవర్తి ఆ పొట్టి వడుగు నాదరించి, తనకున్న సంపదల ఔన్నత్యాన్ని చెబుతూ ‘‘వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రతంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో..’’ ఏవి కావాలో వాటిని కోరుకోమన్నాడు.‘‘నాకు మూడడుగుల నేల చాలు- బ్రహ్మకూకటిని ముడతాను’’ అన్నాడు వామనుడు. అలా కాదు.. దాత పెంపు సొంపును గమనించి మరీ అడగమన్నాడు బలి. అంతట వామనుడు ‘‘గొడుగో, జన్నిదమో, కమండలువో, నాకున్ ముంజియో దండమో’’ అవసరం కానీ- ఆ సంపదల్ని నేనేం చేసుకుంటాను? నీవు మూడడుగుల నేలనిస్తే అదే నా పాలిట బ్రహ్మాండమంటూ, మనిషికి సంతుష్టి అనేది ఉండాలి. సంతుష్టుడే ఈ ముల్లోకాల్లోనూ పూజింపబడతాడు. సంతోషికే ఎప్పుడూ సుఖం ఉంటుంది. సంతసం వల్లనే ముక్తికూడా లభిస్తుంది. వున్నదానితో తృప్తిపడితే- పూట పూటకూ మనిషికి తేజస్సు కూడా పెరుగుతుంది. సంతోషం లేకపోతే వాడి ప్రభ చెడిపోతుంది. నీవు రాజువని నీకున్నదంతా ఇయ్యమని కోరడం నాకు ఔచిత్యం కాదు అన్నాడు. నిజమే. ఇది ప్రతివానికీ ఆచరణయోగం- సంతుష్టి ఎక్కువగా లేకపోవటంవల్లనే సంపాదనకామియై ఉద్వేగంతో పరుగులు తీస్తూ, మానసికంగా శారీరకంగా తన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాడు నేడు మనిషి. చివరకు ఆ వామనుని కోరికను తీర్చడానికి బలి సన్నద్ధుడైనాడు. కానీ గురువు శుక్రాచార్యుడు - ‘‘ఈ వామనునికి దానం ఇయ్యవద్దు. ఇతడు సామాన్యుడు కాడు’’ అని అడ్డుపడ్డాడు. కానీ బలి వినలేదు. కడకు మూడడుగుల నేలనియ్యడానికి పూనుకున్నాడు. వామనుడు రెండడుగులతో భూమ్యాకాశాలను నాక్రమించి మూడో అడుగును ఆ బలి మాటపైననే వాని తలపై ఉంచి త్రివిక్రముడై అణచివేశాడు.
వామనచరిత్రలో మన చరిత్ర ఉంది. ఇందులో బలి మితిమీరిన అహంకారిగా కనిపిస్తాడు. వామనుడు వచ్చి అడిగితే ‘‘వసుధా ఖండము వేడితో, గజములన్, వాంఛించితో, వాజులన్ వెపనూహించితో, కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో’’ అని అంటాడేమిటి బలి. అవన్నీ ఈ వటుడు ఏం చేసుకుంటాడు? మాట్లాడడంలో ఔచిత్యం ఉండనక్కర్లేదా? మహాదాతనన్న గర్వం బలికి పనికిరాదు గదా! అసలు ఎవరికీ గర్వం పనికిరాదు. అది మనోవామనత్వాన్ని చాటుతుంది. అంటే మనోగతమైన మరుగుజ్జుతనాన్ని వ్యక్తంచేస్తుంది. దానిలోనుండి బయటపడితేనే ప్రహ్లాద రూప జ్ఞాన ప్రభ మనిషికి కలిగేది. లోకంలో జరిగే ధర్మరక్షణ మన్న యజ్ఞంలో ప్రతి మానవుడూ తన అహంకార, మమకార, అజ్ఞానాలనే గుణాల్ని హవిర్ద్రవ్యాలుగా బలిచేయగలగాలి. మనిషి తనలోని మనోవామనత్వాన్ని తొలగించుకోవడానికి ఔచితీమహితంగా ఋషితుల్యుడై కృషి చేస్తూ ఆనాడు వామనుడు త్రివిక్రముడై పరాక్రమించినట్లుగా- త్రివిక్రమ కీర్తి స్ఫూర్తిని పొందాలి. మనం చేసే మంచి పనులకు ఒక్కొక్కప్పుడు పానకంలో పుడకల్లాగా కొందరు శుక్రులు అడ్డుపడుతూ ఉంటారు. ఆ ఆటంకాలను కూడా ధైర్యంగా, సౌమ్యంగా అతిక్రమించగలగాలి. ఈ విషయాలను గమనిస్తూ, ఔచిత్యంతో జీవిస్తే అందరికీ మేలు.
(ఆకాశవాణి విజయవాడ కేంద్రం ‘సూక్తిసుధ’లో ప్రసారితం)

-డా రామడుగు వేంకటేశ్వరశర్మ 9866944287