Others

ఆండాళ్ పాశుర వైభోగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆండాళ్ తల్లి పాడిన పాశురాలను అనుసంధానించుకుంటూ ప్రతి వైష్ణవ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సాయంత్రం వేళలో ఆ పాశురాలకు అర్థతాత్పర్యాలను చెబుతూ శ్రీకృష్ణుని రమ్యమైన జీవిత కథావిశేషాలను చెప్పే భాగవతులతో కూడా కోవెలలు కళకళలాడుతుంటాయి. అటువంటి దేవాలయమే ఈ హైదరాబాదు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న సౌభాగ్యపురంలోని ‘‘ శ్రీ అలివేలు మంగ పద్మావతి గోదా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం’’. శ్రీకంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టువారి సౌజన్యంతో వేకువ జామునే గోదాదేవి ఎదుట అర్చకులు, భక్తులు కలసి ఆండాళ్ తల్లి పాడిన పాశురాలను అనుసంధానించుకుంటారు. ఆవేళలోనే గోదాతల్లిని స్తుతి చేస్తూ చక్కని వైష్ణవగీతాలాపనలు కూడా చేస్తుంటారు. అర్చకులు పాశురాలను చెబుతుంటే భక్తులంతా కూడా పలుకుతూ గోదాతల్లిని స్మరించుకుంటారు. ఇరుప్రక్కలా వేంచేసి ఉన్న పద్మావతీ అమ్మవారు, గోదాదేవులతో కూడిన వేంకటేశ్వరుడు చిరునవ్వులు రువ్వుతూ తన భక్తుల భక్తికి ఆనందిస్తూ ఉంటాడు.
ఆ ఆనందనిలయుడైన ఆ శ్రీనివాసుని స్మరిస్తూ సాయంత్రం వేళలో విదూషీమణి, ప్రముఖ ఉపన్యాసకురాలైన కొమాండూరి అరుంధతి తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున ఈ సౌభాగ్యపురం శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో తిరుప్పావై పాశురాలకు అర్థతాత్పర్యాలను ఈ పండుగనెలంతా ధనుర్మాసం అంతా చెబుతుంటారు.
‘‘కోదై తమిళ్ అయైన్దుమైందుం అరియాద మానిడరై వైయం శుమప్పదుం వంబు’’ అనగా ఆనాడుశ్రీగోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై తెలియని మానవులు భూమికి భారమే కానీ అన్యం కాదని చెప్పిన పూర్వాచార్య శ్రీసూక్తిని అనుసరించి ప్రతివారు ఆ తిరుప్పావైను ఆమూలాగ్రం తెలుసుకోవాలని, ఆ పాశురాలల్లో ఆండాళ్ తల్లి చూపిన మోక్షమార్గాన్ని అందరూ అందుకోవాలన్న ఆశతో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టువారి సౌజన్యంతో కొమాండూరి అరుంధతిగారు పాశురాలను అర్థం చెబుతూనే సందర్భోచితంగా ఆ శ్రీమన్నారాయణుని దశావతార విశేషాలను కూడా కడురమణీయంగా వినసొంపుగా చెబుతుంటారు.
నాడు ప్రహ్లాదుడు తన తండ్రి చేత ఎన్నో కష్టాలు పడుతూ చివరకు తన తండ్రి ‘ఎక్కడరా? ఎక్కడా నీవు చెప్పే ఆ శ్రీహరి ఎందున్నాడో చూపించు’అని ప్రహ్లాదుడిని గద్దించినపుడు తన భక్తుడిని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీహరే చరచరా జగమంతా అణువణువులోను నిండిపోయి ఉండి ఆ హిరణ్యకశిపుడు స్తంభాన్ని చరిచి ఇదిగో ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా ఆ హరియు గిరియు అన్నవెంటనే పెళపెళరావములతో దిక్కులు పిక్కటిల్లేవిధంగా స్తంభాన్ని చీల్చుకుని తెల్లని కోరలు దగదగా మెరుస్తుండగా పట్టుపీతాంబరాల కాంతి దిక్కులనిండగా, వేయి సూర్యులు ఒక్కసారిగా వెలిగినట్టు ఆ కన్నుల కాంతి మిరుమిట్లు గొలుపగా ఆ నరమృగావతారుడై మహావిష్ణువు ఆవిర్భవించి బ్రహ్మ దగ్గర తానుకోరుకొన్నవరాల్లో ఏ ఒక్క వరం మిగిలిపోకుండా లోపలకాక బయటా కాక , సాయం కాక పొద్దున కాక ఇలా ఆ హిరణ్యకశిపుని తన తొడలపై వేసుకొని ఉదరాన్ని చీల్చి పేగులను మెడలో ధరించిన ఆ నరసింహుని అవతార విశేషాన్ని, ఆ మహావిష్ణువు ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కనులకు కట్టించేవిధంగా ఉపన్యసించడం కొమాండూరి అరుంధతి గారి పూర్వజన్మ విశేషమే కానీ మరియొక్కటి కాదని అక్కడ వింటున్న శ్రోతలంటున్నారు.
ఆనాడు శ్రీకృష్ణ పరంధాముడు గీతలో వేదైశ్చసర్వైః అహమేవ వేద్యః అంటే వేదాలన్నింటి చేత నేను మాత్రం తెలుపబడుతున్నాను అని చెప్పారు కదా. కానీ నేటి కలియుగంలో వేదాధ్యయనం చేయడం ఎందరికి సాధ్యం? పొట్టగడపటం కోసం నానాఅగచాట్లు పడే ఈ మానవులకు భక్తితో భగవంతుడిని హృదయంలో కట్టిపడవేయవచ్చు. భక్తిని మించిన తాడు భగవంతుడిని కట్టడానికి లేదు అనే చెప్తూ ఆనాడే గోదాదేవి వేదవృక్షానికి బీజం వలె ఈ తిరుప్పావైను ప్రసాదించారు. ఈ ఒక్క తిరుప్పావైను అనుసంధానించుకుంటా ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఉంటే చాలు ఇహలోకంలో సంపదలు అంత్యమున శ్రీమన్నారాయణుని సన్నిధి ప్రాప్తిస్తాయని కంఠోపాఠంగా ఈ కొమాండూరి అరుంధతి శ్రీకృష్ణుని కృపాళుతనాన్ని ఎంతగానో వివరిస్తారు. తిరుపతిలో కొలువైన ఆ ఆనందనిలయుడిని సౌభాగ్యపురంలోకొలిస్తే కోరిన కోర్కెలీడేరుతాయని నమ్మబలికే అరుంధతి ఉపన్యాసం విని ఆనందించాలే కానీ దానిని మరలా అక్షరరూపు నివ్వడం అంటే అది దుస్సాధ్యమే అవుతుంది సుమా. అందుకే భక్తులంతా ఈ ధనుర్మాస వేళలో ఆండాళ్ తల్లి పాశుర విశేషాలను వినడానికి సౌభాగ్యపురానికి తరలిరండి. తరగని చెదరని వేంకటేశ్వరుని కృపను పొందండి.

- ఆర్. పురంధర్