Others

రంధ్రానే్వషణలు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి ధర్మరాజును భీష్ముడు తమ రాజ్యంలో వెతికి ఎక్కడైనా చెడు గుణాలతో ఉన్న వాడు ఉంటే తీసుకొని రా అని పంపించాడట. ధర్మరాజు రోజంతా తిరిగితిరిగి ఉత్తిచేతులతో వచ్చాడట. ఏమిటి అని అడిగితే ఎవరినీ చూసినా వారిలో ఏదో ఒక మంచిగుణమే కనిపిస్తోంది. నాకు చెడ్డవాళ్లు అనే వాళ్లు నాకు కనిపించలేదు అని చెప్పాడట. అట్లానే ఈసారి దుర్యోధనుడిని పిలిచి నీకు ఎవరైనా మంచివాళ్లు అని అనిపిస్తే తీసుకొని రా అని చెప్పి పంపించాడట. దుర్యోదనుడూ సాయంత్రానికి ఉత్తిచేతులతో వచ్చాడట. ఏంటి సంగతి అని అడిగితే నాకు మంచి ఎక్కడా కనిపించలేదు. అందరిలోను ఏదో ఒక చెడుగుణం ఉండనే ఉంది. చివరకు అంగరాజు అని నేను స్నేహం చేస్తున్న కర్ణుడిలోకూడా కేవలం నేను అంగరాజును చేసానని నాతో స్నేహం చేయాలనుకొంటున్నాడు కానీ లేకపోతే నేను చేసేపనుల్లో ఇది తప్పు అదితప్పు అని ఎంచుతున్నాడు. పరుల్లో తప్పులు వెతకటం అంటే మంచితనం కాదు కదా అందుకే ఎవరినీ తీసుకొని రాలేదు అన్నాడట.
వస్తువులోను ఈ ప్రకృతిలోను, అసలు పరమాత్మ సృష్టించిన సృష్టిలో మంచి చెడు అనే వ్యత్యాసాలు ఏమీలేవు. అందరినీ సమానంగానే సృష్టించాడు. కానీ చూసే వారి దృష్టిలో తేడాలుండడం వల్ల మనుష్యుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది. ప్రతి మనిషి సంపూర్తిగా ఏ ఒక్కగుణాన్ని మాత్రమే కలిగి ఉండడు. అన్ని గుణాలు అందరిలోను ఉంటుంటాయి. కానీ విచక్షణతో ఏ గుణాన్ని ఏ సందర్భంలో వెలికి తీయాలో దాన్ని మాత్రమే తీసేనేర్పును కలిగిఉండాలి.
ఆధునిక కాలంలో మనిషి సాకేతికంగా, ఆధ్యాత్మికంగాను ఎంతో ఎదిగాడు. మనిషి ఎదుటి జీవులను కొట్టి తినేస్థాయి నుంచి శాకాహారమే మంచిది అది తన జీవన స్థాయిని పెంచుతుంది అని నమ్మేస్థితికి ఎదిగాడు. పూర్వకాలంలోనే కాదు ఈకాలంలోను మనిషి నిరంతరమూ అనే్వషణ, పోరాటం జరుపుతూనే ఉంటాడు.
పోరాటం అనేది మనుగడ కోసం చేస్తారనేది అందరికీ తెలుసు. ఇప్పుడున్న ఈ ఆధునిక వ్యవస్థలో మనుగడకోసం పోరాటం ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం అంతగా లేదు. కానీ మనిషి లోని మరో మనిషి నిరంతరం పోరాటదృష్టితోనే చూస్తుంటాడు. పోరాటం చేస్తేనే కొత్త కొత్త విషయాలు కనుగొంటారు. నిజమే. ఏ విషయంలోనైనా పోరాటం చేస్తే విజయం కలుగుతుంది. ఒకవేళ ఓటమి పాలైనా దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. కనుక పోరాటం ఒక విధంగా మంచిదే అని చెప్పవచ్చు.
కానీ వృథాప్రయాసతో కొందరు పోరాటాలు జరుపుతుంటారు.
వారి గురించి మాట్లాడుకుందాం.
జీవన మనుగడకోసం ఇతరులేమన్నా తన వృత్తికి కానీ, తన ప్రవృత్తికి గానీ అడ్డువస్తారనుకొంటే వెంటనే వారిమీద యుద్ధాన్ని ప్రకటించవచ్చు. దీన్ని ఎవరూ కాదనలేరు. పాండవులు కూడా తమకు నిలవడానికి ఐదు ఊళ్లుకూడా ఇవ్వని వారిమీద పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ యుద్ధ్భూమిలో తన వారినందరినీ చూసేసరికి అర్జునుడు అయ్యో వీరంతా నావారే కదా. వీరిని చంపి నేను ఈ భూమిని గెలుచుకోవాలా? ఇది అవసరమా? అని ఆలోచనలో పడ్డాడు. ఎవరైనా ఈ భూమిమీదకు వచ్చినపుడు తిరిగి తిరిగిరాని లోకాలకు వెళ్లవలసిందే. అటువంటపుడు ఈ నాల్గురోజుల జీవితానికై ఐన వాళ్లను అంతం చేసి భూమిని ఏలాల్సివచ్చిందే అని బాధపడి పోరు వద్దు గీరు వద్దు అనేశాడు తన గాంఢీవాన్ని జార్చేశాడు. అపుడు కృష్ణుడే లేదులేదు మనిషి అనునిత్యమూ మనుగడ కోసం పోరాటం చేయాల్సిందే ఇందులో తప్పు లేదు అని చెప్పి మరీ యుద్ధం చేయించాడు. ఇది యుద్ధనీతి లేక రాజనీతి అని కూడా కృష్ణుడే చెప్పాడు.
ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో కార్యాలయాల్లోకానీ, నివస్తున్న ఇండ్లల్లో కానీ కనబడని యుద్ధాన్ని చాలామంది చేస్తున్నారు. ఇట్లాంటి యుద్ధాలు చేయడం అవసరమనే వారు ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఏమిటీ కనబడని యుద్ధం అనుకొంటున్నారా... ఆగండి మీకు సందేహ నివృత్తి చేస్తాను.
ఒక కార్యాలయాన్ని తీసుకొన్నాం అనుకోండి. అక్కడొక అధికారి. ఆ అధికారి కింద మరికొందరు ఉద్యోగులు ఉంటారు కదా. ఈ ఉద్యోగుల్లో ఎవరి పని వారికి అప్పగించినా సరే, వీరందరూ తమ పక్కవారు పని చేస్తున్నారా లేదా, లేక వారికేమైనా నాకన్నా ఎక్కువ వెసలుబాటు ఉందా? వారు ఎక్కువేమైనా సంపాదించేస్తున్నారా? లేదా వారు నాకన్నా ఎక్కువ లాభాలను ఇంకే విధంగా నైనా గడిస్తున్నారా అనే దుగ్ధను మనసున ఉంచుకుంటున్నారు. దానివల్ల వారి చూపులు, వారు చేసే పనులపైన కన్నా ఇతరుల పైన ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఒకవేళ ఆ మరొకరు కూడా ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనుకోండి. ఇక వారి మధ్య కనబడని యుద్ధం జరుగుతుందన్నమాటే కదా.
అట్లా కాదు అవతలివారు యుద్ధోన్ముఖులు కారనుకోండి. కానీ వీరి చూపుల వల్ల వారేదో సుఖ పడుతున్నారు తామేదో కోల్పోతున్నారనో లేక ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తూ తక్కువ ఫలాన్ని పొందుతున్నారనుకుంటూ కయ్యానికే కాలు దువ్వుతుంటారు. ఇటువంటి వారు ఇతరులపైన నిత్యమూ చాడీలు, అవతల వారిని భూతద్ధంతో పరిశీలించి చూసి చిన్న తప్పులను పెద్దతప్పులుగా పదిమందికీ చెప్పడమూలేదా ఆ అధికారి దృష్టికి తీసుకొని వెళ్లడం, వీలైతే వినేవాళ్లు ఉంటే అబద్ధాలను నిజాలుగాను, నిజాలను అబద్ధాలుగాను చెబుతుంటారు. వీరి మదిలో జరిగే అల్లకల్లోలాన్ని నిజంగా అక్కడ జరుగుతున్నట్లుగా ఊహించి చెప్పడమూ చేస్తుంటారు. దీనివల్ల ప్రశాంతంగా పనులు జరిగిపోయే కార్యాలయాల్లో అసహజ వాతావరణం నెలకొంటుంది కదా. దీనివల్ల పనులు చేసుకొనే వారి దృష్టి చెదరి అనుకొన్న ఫలితాలను పొందడంలో వెనుకబాటుతనంలోకి వెళ్లిపోతారు కదా. ఇట్లాంటి వాతావరణాలు, ఇట్లాంటి కనబడని యుద్ధాలు అవసరమా? ఆలోచించండి.
మరికొంతమంది అధికారులు తమ దగ్గర పనిచేసేవారు నిజాయితీతో చేస్తున్నారా? లేక తమకిందకు నీరు తీసుకొని వచ్చే పనులేమన్నా చేస్తున్నారా అని ఆలోచించి ఆ అనే్వషణలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాము అనుకొని లేనిపోని అపోహలను పెంచుకుని కిందవాళ్లని నానాయాతనలకు గురి చేస్తుంటారు. ఇట్లాంటి పనులు ఎంతవరకు అవసరమో ఆలోచించాలి కదా. ధర్మాగ్రహం అందరిలో ఉండాల్సిందే కానీ అనవసర అపోహలు అనుమానాలు అవసరం లేదు కదా.
ఇవి ఇలా ఉంటే ఇంట్లో ఉండే సభ్యులల్లో కూడా అనుమానాలు, అభిజాత్యాలు ఏర్పడి ఉంటున్నాయి. వారు కూడా సహజంగా అప్యాయతా అనురాగాలను వ్యక్తంచేయడం లేదు. ఎవరైనా చూడడానికో లేక ఇతరులను వారిని గొప్పగా అనుకోవాలనో ఆప్యాయతలను చూపిస్తుంటారు. మరికొంతమంది అపోహలతోనే గోటితో పోయే దానికి గొడ్డళ్ల దాకా తెచ్చుకుని జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటూ ఉంటారు. వూహాపోహలకు తావివ్వకుండా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తే ఎవరికీ ఎవరిమీద అనుమానం రానక్కరలేకుండా జీవనం సాగించవచ్చు. వృథా ప్రయాసలు, ఎవరికో చెరుపు చేద్దామనో లేక ఎదుటివారిని చెరిపి మనం బాగుపడుదామనే ఆలోచనతో ఉంటే అట్లాంటి వారికి తప్పని భంగపాటు కలిగి తీరుతుంది. తాను తీసుకొన్న గోతిలో తానే పడ్డాడు అని అనుకొనేలా భగవంతుడు చేసి చూపిస్తాడు. కనుక ఎప్పుడైనా ఇతరుల గురించి కాక తన గురించి తాను తెలుసుకుంటే చాలు. గీతా బోధన చేసేటపుడు భగవంతుడు కూడా ఇదే చెప్పాడు. ఎవరినో ఉద్దరించుదామని కాకలేదా తనను ఇంకెవరో వచ్చి ఉద్దరిస్తారనీ కాక నీకు నీవే ఉద్ధరించుకోఅని చెప్పాడు. మన ఇతిహాసాలు, పురాణాలు, కథలు, కావ్యాలు ఏవైనా మనిషిలోని మంచితనాన్ని ఏవిధంగా పెంచుకోవాలో చెప్తాయ. కనుక అందరూ పురాణాల్లాంటి వాటిని ఇతిహాసాల్లాంటి వాటిని చదివి తెలుసుకోవాలి. కాల్పానిక గాథలు అల్లే కవి సైతం మనిషికి ప్రయోజనకారి అయన మంచితనం గురించే చెప్పుకొస్తాడు కనుక సాహిత్యం అనేదానిని తప్పక మనిషి చదివి తీరాలి. తెలుసుకొన్న దానిని ఇతరులకూ చెప్పాలి. అంతేకాదు మనిషి ప్రశాంతంగా జీవించాలంటే వానిలో ముందు తన గురించి తాను తెలుసుకుంటూనే ఉండాలి. మహాత్ములందరూ నీలోకి నీవు చూడు అన్నారు. అటు ఆధ్యాత్మికమైనా, లేదా భౌతికమైనా నిన్ను నువ్వు తెలుసుకొంటే ప్రపంచం తెలుసుకున్నట్టే అవుతుంది. ముందుగా ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఆరాటాన్ని మానేయాలి. ఇతరుల్లో చెడ్డవాళ్లు ఉంటారన్న ఆలోచనను వదిలేయాలి. ఇతరులు ఏమన్నా అనుకోనివ్వండి. నేను చేసే పనుల్లో మంచి ఉందా లేదా. ఆ మంచి తనకు మాత్రమే మేలు చేస్తుందా లేదా నలుగురికీ మంచిని కలిగిస్తుందా అని ఆలోచించుకుని ఎవరికి వారు పనులు చేస్తే రంధ్రానే్వషకులు తోకలు ముడుచుకునిదూరంగా పోతారు. మరి మీరు రంధ్రానే్వషకులు అవుతారా లేక హితకారులవుతారా అన్నది మీరే తేల్చుకోవాలి సుమా.
పాలివ్వని గోవు, కొయ్య గుర్రం, కురవని మేఘం, పులితోలు కప్పుకున్న మేక ఇవేవీ అక్కరకు రావు అంటారు. అక్కరకురాని గుఱ్ఱాన్ని గ్రక్కున విడువంగ వలయు నంటారు మరికొందరు. వీరిద్దరూ చెప్పేదే ఒకటే పనికిరానివి ఎన్ని మన దగ్గర ఉన్నా అవన్నీ వృథానే. కనుక మనలో పనికి వచ్చే గుణాలు ఉన్నాయా లేదా అని విచక్షణతో ఆలోచిం చి అనే్వషించి మంచిమనుషులుగా మారుదాం. మానవత్వాన్ని ప్రోగు చేద్దాం.

- డా. ఆర్. లక్ష్మి