ప్రకాశం

వైకాపా ప్లీనరీ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 20:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లాపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఒంగోలు మొత్తం వైకాపా నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది. దీంతో జిల్లాలోని వైకాపా శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ప్లీనరీ మంగళవారం స్థానిక సీతారామ ఫంక్షన్‌హాలులో వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని 12నియోజకవర్గాల నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం నుండే సుదూర ప్రాంత నియోజకవర్గాల నుండి వైకాపా నాయకులు తరలివచ్చి భారీ మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా బాలినేని స్వగృహం నుండి భారీ మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ భారీ ర్యాలీ స్థానిక జయరాం హాలుసెంటరు, కోర్టుసెంటరు, సివిఎన్ రీడింగ్ సెంటరు, చర్చిసెంటరు, కలెక్టరేట్‌సెంటరు,నెల్లూరు బస్టాండు సెంటరు మీదుగా సభాస్థలి అయిన సీతారామఫంక్షన్‌హాలు వద్దకు చేరింది. ఈ ర్యాలీలో అగ్రభాగాన వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, వైకాపా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌కె రోజాలు ఉన్నారు. ఈ మోటారు సైకిల్ ర్యాలీలో యువత పెద్దఎత్తున పాల్గొని కేరింతలు కొట్టింది. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ యువత పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటివరకు జిల్లా ప్లీనరీ సమావేశం ఒంగోలులో జరగలేదు. దీంతో జిల్లా ప్లీనరీని బాలినేని, వైవిసుబ్బారెడ్డిలు ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారు. దీంతో ప్లీనరీ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. జిల్లాలోని 12నియోజకవర్గాలనుండి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలిరావటంతో ఒంగోలు ప్రాంతంమొత్తం వైకాపా జెండాలతో నిండిపోయింది. ఒంగోలు మొత్తం వైసిపి ప్లెక్సీలతో నిండిపోయింది.
ఇదిలాఉండగా ఎప్పుడు ఉప్పు,నిప్పులా ఉండే ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొనటం, ఒకేవేదికపై మాట్లాడుకోవటంతో ఆ రెండు శిబిరాల్లోని నేతల్లో ఆనందం వెల్లువెత్తింది. గతంలో వీరిద్దరు ఒకే వేదికపై వచ్చి మాట్లాడుకోవటం అరుదు. కాని జిల్లాలోని అశేష జనవాహిని మధ్య మేమిద్దరం ఒకటే అన్న సంకేతాన్ని ఇచ్చి అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలు చెప్పి పబ్బంగడుపునే నేతలకు షాక్ ఇచ్చినట్లైంది. ఇకమీదట ఇద్దరితోనూ మాట్లాడాలన్న సంకేతాలను జిల్లానేతలకు ఇవ్వటంతో రానున్న ఎన్నికల్లో ఇద్దరు కలిసి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తారన్న వాదన పార్టీశ్రేణుల్లో వ్యక్తవౌతుంది. ఈ వేదికలో వైకాపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌కె రోజా, రాష్టప్రార్టీ నాయకులు అంబటి రాంబాబులు హైలెట్‌గా నిలిచారు. ప్రధానంగా ఈ ప్లీనరీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి పేర్లను నాయకులు ఎత్తగానే కార్యకర్తలు, నాయకులు ఈలలు, అరుపులు, కేకలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ప్లీనరీలో పాల్గొన్న ప్రతిఒక్కనేత విమర్శలతో దుమ్మెత్తిపోశారు.
కాగా ఇటీవల దర్శి నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం సైతం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఈ ప్లీనరీకి సుమారు 12నుండి 13వేలమంది వైకాపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నట్లు పార్టీ నాయకులు అంచనావేశారు. దర్శి ప్లీనరీ పూర్తిస్థాయిలో విజయవంతం కావటంతో తమ గెలుపు ఖాయమన్న ధీమాలో మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి ఉన్నారు.
కాగా రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్లీనరీని పూర్తిస్థాయిలో విజయవంతం చేసి తమ సత్తాను చాటారు. మొత్తంమీద ఈ ప్లీనరీ పూర్తిస్థాయిలో విజయవంతం కావటంపట్ల పార్టీశ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉరకలేస్తుందనే చెప్పవచ్చు.