ప్రకాశం

ప్రకాశం రెండు జిల్లాలు కానుందా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 12:తెలంగాణ ప్రభుత్వం పరిపాలన పరంగా పెద్దజిల్లాలను చిన్న జిల్లాలుగా చేసి పరిపాలన సాగిస్తున్న నేపధ్యంలో నవ్యాంధ్రదేశ్‌లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై తెరపైకి వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తీసుకొస్తే మాత్రం ప్రకాశం జిల్లా రెండుజిల్లాలుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లేదా కందుకూరు ప్రాంతాలను కొత్త జిల్లాగా ప్రకటించే అవకాశాలున్నాయి. గత కొంతకాలంనుండి జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం డివిజన్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటుచేయాలన్న అంశంపై తెరపైకి వచ్చింది. కొత్త జిల్లాగా మార్కాపురం డివిజన్ చేస్తే కందుకూరుడివిజన్‌లోని కొన్ని మండలాలను కలుపుతారా లేక మార్కాపురండివిజన్‌లోని అవే మండలాలను కొనసాగిస్తారా అన్న చర్చ సాగనుంది. కాగా కందుకూరును కొత్తగా జిల్లా చేస్తే మార్కాపురం డివిజన్‌లోని కొన్ని మండలాలు కందుకూరు జిల్లాలో కలిసే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఒంగోలుకు దగ్గరలోని చీరాల మాత్రం ప్రకాశం జిల్లాలోనే ఉండనుందా లేక చీరాలను కూడా కొత్త జిల్లా చేయాలని అక్కడి నేతలు ఉద్యమాలు చేస్తారా అన్న చర్చ ప్రస్తావన కూడా లేకపోలేదు.
1970 సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీన దివంగత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందారెడ్డి హాయంలో నెల్లూరు జిల్లానుండి కందుకూరు, పొదిలి, కనిగిరి,దర్శి తాలుకాలను, కర్నూలు జిల్లానుండి గిద్దలూరు, మార్కాపురం తాలుకాలను, గుంటూరు జిల్లాకు చెందిన ఒంగోలు తాలుకా, బాపట్లతాలుకానుండి 40గ్రామాలను కలిపి ఒంగోలు జిల్లాగా నామకరణం చేశారు. అనంతరం 1972సంవత్సరం మే రెండవతేదీ నుండి ప్రకాశం జిల్లాగా రాష్ట్రప్రభుత్వం నామకరణం చేసింది. జిల్లాకు ఉత్తరాన గుంటూరు జిల్లా, దక్షిణాన కడప,నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర కర్నూలు జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి. జిల్లాపరిధిలో ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి,దర్శి, కొండెపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాకు చెందిన సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవిన్యూడివిజన్లు ఉండగా వాటి పరిధిలో 56మండలాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 102కిలోమీటర్ల మేర కోస్తాతీరప్రాంతం విస్తరించి ఉంది.
నూతనంగా జిల్లాల ఏర్పాటు అయితే మాత్రం ప్రకాశం జిల్లా రెండు జిల్లాలుగా మారితే కొత్త నియోజకవర్గాలు కూడా తెరపైకి రానున్నాయి. ఈరెండు జిల్లాలో కొత్తగా రెండునుండి, మూడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా తగ్గనుంది. దీంతో పార్లమెంటు సభ్యులకు పరిపాలన పరంగా కూడా మెరుగ్గు ఉండనుంది. చిన్న జిల్లాల ఏర్పాటు మంచిదేనని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గతంలోనే ప్రకటించారు. అందులోభాగంగానే ముందుచూపుతో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఒకరిని అధ్యక్షుడిగా ప్రకటించారు. గతంలో వైకాపా జిల్లా అధ్యక్షుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండేవారు. ప్రస్తుతం కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా ఆయనే్న జగన్ నియమించారు. కాని తెలుగుదేశంపార్టీ తరుపున మాత్రం జిల్లాపార్టీ అధ్యక్షులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ఉన్నారు. అదేవిధంగా మిగిలిన పార్టీలైన బిజెపి, సిపిఎం,సిపిఐతోపాటు ఇతర పార్టీల అధ్యక్షులు కూడా జిల్లా మొత్తానికే ఉన్నారు.
ఇదిఇలాఉండగా ప్రకాశం జిల్లాను రెండుగా విభజించి మార్కాపురం లేదా కందుకూరులను చేస్తే మాత్రం పరిపాలన పరంగాను అభివృద్దిపరంగానే మరింత అభివృద్ది చెందే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా తయారైంది. ప్రధానంగా జిల్లాకు తలమానికంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కి అన్నచందంగా తయారైంది. అదేవిధంగా రామాయపట్నం పోర్టుకాని, దొనకొండ పారిశ్రామిక హాబ్, కనిగిరిలో నిమ్జ్, జిల్లాకు కొత్తపరిశ్రమలు కాని ఒక్కటి కూడా రాలేదు. రాష్ట్రప్రభుత్వం మాత్రం ఆర్బాటపు ప్రచారాలు చేస్తుందే తప్ప ఏఒక్క నూతన ప్రాజెక్టుకు శంఖుస్ధాపనలు చేసిన పరిస్ధితి లేదు. దీంతో కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే అక్కడి నాయకులు అభివృద్దిపై దృష్టిసారించే అవకాశాలున్నాయన్న వాదన కూడా ఆయారాజకీయపార్టీల నాయకులనుండి వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద కొత్తజిల్లాల ఏర్పాటు చేస్తే మాత్రం ప్రకాశం జిల్లా బౌగోళికంగా స్వరూపమే మారిపోనుంది.