ప్రకాశం

మేం గుర్తున్నామా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 17: అధికారాలు లేవు, నిధులు లేవంటూ జిల్లాలోని పాలక, ప్రతిపక్ష పార్టీలకు చెందిన జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మేం వున్నామనే సంగతి ఎవరికైనా అసలు గుర్తుందా అంటూ వాపోయారు. జడ్‌పిటిసి సభ్యులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సైతం వంతపలికి వారికి మద్దతు ప్రకటించారు. జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం స్థానిక పాత జిల్లాపరిషత్ సమావేశమందిరం హాలులో చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జడ్‌పిటిసి సభ్యులు తమ బాధను వెళ్లగక్కారు. పంచాయతీ సర్పంచ్‌కు ఉన్న విలువ తమకు లేకుండాపోయిందని కొంతమంది జడ్‌పిటిసి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసర్పంచ్‌కు ఐదులక్షల రూపాయల వరకు ఖర్చు చేసే అధికారాన్ని కల్పించారని కాని మండలం మొత్తంమీద గెలిచిన తమకు మాత్రం ఎలాంటి అధికారాలు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థపోయి నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ రావాలని కొంతమంది జడ్‌పిటిసిలు పేర్కొన్నారు. తాము పనికిరాని వ్యక్తులుగా ఉన్నామని మండలాల్లో అసలు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైస్కూలు కమిటీలకు తాము చైర్మన్లుగా ఉన్నప్పటికీ అసలు నిధులు ఎంతవస్తున్నాయి, ఎంత ఖర్చుచేస్తున్నారన్న విషయమే తమకు తెలియకుండాపోయిందని కొంతమంది జడ్‌పిటిసిలు ఆవేదన వ్యక్తంచేశారు. అసలు మండలంలో ఏం జరుగుతుందో అనే అంశాలపై సమాచారమే ఇవ్వటం లేదన్నారు. అదే విధంగా తమకు సీటులేదు, నిధులు లేవంటూ కొంతమంది జడ్‌పిటిసిలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఈసందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు స్పందిస్తూ జిల్లాపరిషత్, మండల పరిషత్‌లు బైపాస్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ చావకుండా, బతకకుండా ఉందంటూ ఆందోళన చెందారు. జిల్లాకు 13,14 ఆర్థిక సంఘం గ్రాంటులు లేవన్నారు. జిల్లాకు 150కోట్లరూపాయలమేర సీనరేజ్ గ్రాంటు ప్రభుత్వం నుండి రావాల్సి ఉండగా కేవలం నాలుగు నుండి ఐదుకోట్లరూపాయలు మాత్రమే విడుదలచేశారన్నారు. రాజకీయ ఉపాధి కోసమే పదవులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసికి పదిలక్షల రూపాయలు ఫండ్ కేటాయించాలంటూ సమావేశం తీర్మానించింది. ఒక దశలో నిధుల కోసం యాచిస్తున్నామంటూ ఈదర తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జడ్‌పిటిసి,ఎంపిటిసిలకు నిధులు, విధులు అవసరమన్నారు. జిల్లాలోని 56మండలాల్లో జడ్‌పిటిసి, ఎంపిటిసిలకు గెస్ట్‌హౌస్‌లు ఉండే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికైన జడ్‌పిటిసి, ఎంపిటిసిలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన కోరారు.
గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అమరావతి రాజధానికి ఎన్‌టిఆర్ నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా పేరు పెట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడతు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. రాజధానికి ఎన్‌టిఆర్ పేరుపెట్టాలని ఆయన కోరారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్‌టిఆర్ పేరును నూతన రాజధానికి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒప్పుకోరేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు.అసెంబ్లీలో పాలకపక్షం సభ్యులు బలపరిస్తే తాము మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జిల్లాపరిషత్,ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు సెమి రెసిడెన్షియల్‌గా ఏర్పాటుచేయాలంటూ సమావేశంలో చైర్మన్ ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలిపారు. జిల్లాలోని మూడు డివిజన్లల్లో మూడింటిని ముందుగా ఏర్పాటుచేస్తే బాగుంటుందని జంకె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదిఇలాఉండగా సమావేశానికి హాజరుకాని ఎండోమెంట్ ఎసిపై చైర్మన్ ఈదర ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్చూరు ఎండోమెంట్‌లో కోట్లరూపాయల స్కాం జరిగిందని దీనిపై ఎసి రాకుండా ఆయన సహాయకుడు రావటంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై ఎంక్వయిరీ కమిటీని వేసున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కొంతమంది జడ్‌పిటిసిలు మాట్లాడుతూ అధికారులు ఫ్రొటోకాల్ పాటించటం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, జిల్లాపరిషత్ సిఇఒ బాపిరెడ్డి, ఇతర శాఖల అధికారులు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.
మొక్కుబడిగా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం
జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశం మొక్కుబడిగానే సాగింది. జిల్లాలోని అధికార,ప్రతిపక్షపార్టీలకు చెందిన శాసనసభ్యులు మొక్కుబడిగానే హాజరయ్యారు. పాలకపక్షానికి చెందిన శాసనసభ్యులు ఎనిమిది హాజరుకావాల్సి ఉండగా కేవలం యర్రగొండపాలెం, కొండెపిశాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామిలు హాజరుకాగా మిగిలినవారు డుమ్మాకొట్టారు. అదేవిధంగా జిల్లాసమస్యలపై ఏకరుపెట్టాల్సిన ప్రతిపక్షపార్టీకి చెందిన వైకాపాశాసనసభ్యులు నాలుగురు ఉండగా కేవలం గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు ముత్తుమల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి, శ్రీరాం మాల్యాద్రి హాజరుకాలేదు. మొత్తంమీద జిల్లాసమస్యలపై ఏకరువు పెట్టాల్సిన ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇద్దరు హాజరుకాకపోవటంపై ఆ పార్టీకి చెందిన వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం ముఖ్యమైన ప్రజాప్రతినిధులు లేకపోవటంతో వెలవెలపోయిందనే చెప్పవచ్చు.

*