ప్రకాశం

దళారుల గుండెల్లో దడపుట్టిస్తున్న పోలీసుల దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, నవంబర్ 14: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కురిచేడుశాఖ పూర్వ మేనేజర్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మహాదేవగౌతమ్‌పద్మరాజు అరెస్టుతో గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఆయనతో ఆర్థిక లావాదేవిల్లో పాలుపంచుకోవడంతోపాటు బ్యాంకు రుణాల మంజూరులో ప్రముఖ పాత్ర పోషించిన సుమారు పదిమంది దళారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గౌతమ్‌పద్మరాజు బ్యాంకు నిధుల దుర్వినియోగంపై మంగళవారం దర్శి డివైఎస్పీ నాగేశ్వరరావు నేతృత్వంలో కురిచేడు ఎస్సై బి ఫణిభూషణ్ అరెస్టుచేసి దర్శి కోర్టులో హాజరుపరచిన విషయం పాఠకులకు విదితమే. అయితే మేనేజర్ అరెస్టుతో దర్యాప్తు పూర్తికాలేదని, రుణాల మంజూరు విషయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన దళారుల పాత్రపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని దర్శి డివైఎస్పీ చేసిన ప్రకటన ఇప్పుడు దళారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. గౌతమ్‌పద్మరాజు 2014-16లో కురిచేడు ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు మేనేజర్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన త్రిపురాంతకం శాఖ మేనేజర్‌గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఉద్యోగ రీత్యా లభించే జీతభత్యాలతో సంతృప్తి చెందని ఆయన తన చిరకాల మిత్రుడు గుంటూరుజిల్లా వినుకొండకు చెందిన వజ్రాల రాఘవేంద్రరెడ్డితో కలిసి త్రిపురాంతకంలో ఇతర వ్యాపారాలు నిర్వహించి నష్టాల్లో కూరుకున్నారు. కురిచేడు మేనేజర్‌గా చేరిన పిదప ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు రుణాల మంజూరులో నిబంధనల ఉల్లంఘనకు శ్రీకారం చుట్టారు. నకిలీ ఖాతాలు సృష్టించి 47మంది వ్యక్తుల పేరిట 47లక్షల రుణాలు మంజూరు చేసి ఇతరుల ఖాతాలకు ఆయా నిధులు మళ్ళించి వారి ద్వారా నిధులు డ్రా చేసుకున్నారు. ఆయా ఖాతాల లావాదేవీలకు సంబందించి ఎలాంటి రికార్డులు లేవు. అంతటితో ఆయన ధనదాహం తీరలేదు. వ్యాపార, డైరీ, వ్యక్తిగత రుణాలను విచ్చలవిడిగా మంజూరుకు తెరతీశారు. పలుగ్రామాల్లో దళారులను ఏర్పాటు చేసుకొని లక్ష రూపాయల రుణం మంజూరు చేస్తూ లబ్ధిదారుల నుంచి 10 నుంచి 25 శాతం వరకు కమీషన్ వసూలు చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణం నెలవారి వాయిదాల్లో చెల్లించలేకపోయారు. గౌతమ్‌పద్మరాజు కురిచేడుశాఖ మేనేజర్‌గా చేరినప్పుడు బ్యాంకు బకాయిలు 18 లక్షల రూపాయలు కాగా ఆయన బదిలీపై వెళ్ళిన నాటికి మొత్తం బకాయిలు రెండున్నర కోటికి చేరుకున్నాయి. బకాయిలను రాబట్టుకునేందుకు నంద్యాల రీజనల్ మేనేజర్ విజిలెన్స్ బృందం ద్వారా దర్యాప్తు జరిపించారు. వారి దర్యాప్తులో ఈ కమీషన్ల పరంపర, దళారుల బాగోతం వెలుగుచూసింది. దీనితో నంద్యాల ఆర్‌ఎం వి కోటేశ్వరరావు బ్యాంకులో జరిగిన అవకతవకలపై కురిచేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దరిమిలా ప్రాధమిక దర్యాప్తులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపించారు. కాగా రుణాల మంజూరులో దళారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని డివైఎస్పీ ప్రకటించిన నేపధ్యంలో నేరుగా లబ్ధిదారులను విచారించినట్లైతే అసలు నిజాలు వెలుగులోనికి వస్తాయని భావిస్తున్నారు. అలాగే లబ్ధిదారుల నుంచి కమీషన్ రూపంలో మేనేజర్‌కు దళారులు దండుకున్న సొమ్మును తాము ఎందుకు చెల్లించాలని పలుగ్రామాల్లోని లబ్ధిదారులు బ్యాంకు రికవరీ అధికారులకు ఎదురుతిరుగుతున్నారు. పోలీసుల సమగ్ర విచారణలో దళారుల పాత్ర వారు కాజేసిన సొమ్ము వివరాలు వెలుగులోనికి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.