ప్రకాశం

అందరికి సామాజిక, ఆర్థిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 30:దేశంలోని అందరికి సామాజిక, ఆర్థికన్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్‌పార్టీ వలనే సాధ్యవౌతుందని కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం పేర్కొన్నారు. బాబాసాహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్‌పార్టీ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి చేపట్టిన దళిత, ఆదివాసి, బిసి, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారిత బస్సు యాత్ర బుధవారం ఒంగోలుకు చేరుకుంది. ఈసందర్భంగా స్థానిక అంబేద్కర్ బొమ్మ వద్ద ఏర్పాటుచేసిన సభలో శీలం మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్‌పార్టీ తూచా తప్పకుండా అమలుచేసిందన్నారు. అయితే దేశంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు ఈవిధానాలను అమలుచేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారా అమలుచేయాల్సిన సంక్షేమపథకాలు పాలనను అందరికి సమానంగా అందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌పార్టీప్రభుత్వ పథకాల్లో అనేక సవరణలను చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా విద్యాహక్కు చట్టం, మహిళలకు గృహహింసచట్టం, సామాజిక భద్రత చట్టం, శ్రామికులకు రక్షణ చట్టం, ఎస్‌సి,ఎస్‌టిలకు సబ్‌ప్లాన్ చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహారభద్రత చట్టం, దళితులకు రక్షణ కల్పించే అనేక సవరణ చట్టాలను కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలో చేసినవేనని తెలిపారు. సవరణ చేసిన చట్టాలు సంక్షేమ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్నప్పటికీ అవి సక్రమంగా అమలుజరగటం లేదని దీంతో ఆ చట్టాలను అమలుచేయాలని కోరుతూ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీపిలుపుమేరకు ఈ బస్సుయాత్ర జరిగిందని దీనికి మంచిస్పందన వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనేక ప్రతిపాదనలు క్యాబినేట్‌లో బహిరంగంగా ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్రం కల్పించాలని బహిరంగంగా ప్రకటించిన సమయంలో ఎం వెంకయ్యనాయుడు కూడా ఆమోదించారన్నారు. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ద్రవ్యలోటు 16వేలకోట్లరూపాయలు ఉందన్నారు. ఆర్థిక లోటుకు సంబంధించిన విషయాలు అసెంబ్లీ భవననిర్మాణాలు విద్య, వైద్య, పారిశ్రామిక కారిడార్‌లు,పోర్టులు, విమానాశ్రయాలు అనేక విషయాలను రాష్ట్రానికి ఇవ్వాలని బహిరంగంగా రాష్ట్ర విభజన సమయంలో మోదీ ప్రకటించటం జరిగిందని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోదీప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయాన్ని పొందుపర్చలేదన్నారు. ఈ బహిరంగ సభలో కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు సాధికారిత సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌పార్టీబస్సు యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధిహామీ పథకాన్ని కాంగ్రెస్‌పార్టీప్రవేశపెట్టిందని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద,బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి కృషిచేసిందన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో వారు చెప్పిన వారికే పధకాలు అందాలన్న విధానాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్, రాష్ట్ర ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కె వినయ్‌కుమార్, బిసి సంఘం రాష్టన్రాయకులు ఎం వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ రాష్టన్రాయకులు ఆలీఖాన్, ఎస్‌సిసెల్ రాష్టన్రాయకులు సుధాకర్‌బాబు, కాంగ్రెస్‌పార్టీనాయకులు సూర్యనాయక్, సతీష్, గఫూర్‌తోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, ఒంగోలు నగర పార్టీఅధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, రాష్టప్రిసిసి నాయకులు జి లక్ష్మారెడ్డి, వై శశికాంత్‌భూషణ్, నాయకులు యాదాల రాజశేఖర్, పి నవీన్‌రాయ్, వేమా శ్రీను, రాజ్‌విమల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కాగా మాజీ మంత్రి శైలజానాథ్ డప్పుకొట్టి అందరిని ఆకట్టుకున్నారు.

గ్రాసం కొరతతో మూగజీవాల రోదన
* కోత మిషన్ల వినియోగంతో సమస్య జఠిలం
* పత్తాలేని పశుగ్రాస అభివృద్ధి పథకం
* ఇతర ప్రాంతాలకు వలస పోతున్న గొర్రెల కాపరులు
కందుకూరు, మార్చి 30: వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరతతో పశుపోషకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా కందుకూరు డివిజన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం కొంతమేర పెరిగినప్పటికీ వరికోతకు కూలీల సమస్య అధికంగా ఉండటంతో రైతులు యంత్రాలను ఉపయోగించారు. యంత్రాల ద్వారా వరికోతలు చేపట్టడంతో 45శాతం గడ్డి పనికిరాకుండా పోయింది. చేతికి వచ్చిన 55 శాతం కూడా గడ్డి కూడా పశువుల మేతకు ఉపయోగపడడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుండి పశుగ్రాసాన్ని కొనుగోలుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పశుగ్రాసానికి డిమాండ్ ఏర్పడడంతో ధర కూడా పెరిగింది. ప్రభుత్వ పశుగ్రాస అభివృద్ధి పథకాలు అమలుకావడంలేదు. దీంతో ఆర్థిక స్థోమత గల రైతులు సుదూర ప్రాంతాల నుంచి పశుగ్రాసం కొనుగోలు చేస్తుండగా, శక్తిలేని వారు మైలుదూరం నడిచి గడ్డి కోసుకుని వచ్చి పశువులను మేపుతున్నారు. ముఖ్యంగా కనిగిరి, పిసిపల్లి, హెచ్‌ఎంపాడు, సియస్‌పురం తదితర ప్రాంతాల పశుపోషకులు, గొర్రెలు, మేకల కాపరులు పశువుల పెంపకమే జీవనాధారంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రం కావడంతో పశువులతో పశువుల కాపరులు వలసలు పోతున్నారు. మరికొందరు మాత్రం సుదూర ప్రాంతాలైన బాపట్ల, దర్శి, వినుకొండ తదితర ప్రాంతాలకు వెళ్లి వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ వరిగడ్డి 12వేల నుంచి 15వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. దీంతో పశుపోషకులు అంత ధర చెల్లించడం కష్టంగా మారింది. దీంతో పశువులను వచ్చిన ధరకు అమ్మేస్తున్నారు. ఇక పేదలు పశువులు, గొర్రెలు, మేకలతో సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. పశుగ్రాసం కొరతకు ప్రధాన కారణం కోతమిషన్ల రాక కారణమైంది. కూలీల కోత ద్వారా వచ్చే గడ్డి కంటే 45శాతం తక్కువగా ఉంటుంది. కొడవలితో కోసేదాని కంటే యంత్రం కోత అడుగు ఎక్కువ ఉంటుంది. కోత సమయంలో ఇది వృథాగా పోతోంది. అదేవిధంగా గడ్డి నుజ్జునుజ్జు అవుతోంది. నేలపై కొంత, మిషన్లో కొంత ఆగిపోతుంది. చేతికి 55 శాతం గడ్డి మాత్రమే వస్తుంది. దీనిని పశువులు సక్రమంగా తినవు. దీంతో గడ్డి సమస్య తీవ్రం అవుతోంది. పశుపోషకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశుగ్రాస అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలుకావడం లేదు. దీంతో పశుపోషకులు నానా అవస్థలు పడుతున్నారు. పశుపోషకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని పశువుల కాపరులు కోరుతున్నారు.

దొనకొండలో డీలాపడిన రియల్ ఎస్టేట్
* అమ్మేవారు ఉన్నా.. కొనేవారు కరువు..
* ధరలు పెంచడమే ఇందుకు కారణం
మార్కాపురం, మార్చి30 : దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చేదిద్ది హబ్‌గా మారుస్తామని, మినీ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడంతో వాణిజ్యవేత్తల చూపు దొనకొండ భూములపై పడింది. అయితే ఇదే అవకాశంగా తీసుకున్న భూ యజమానులు ఎకరా 40 నుంచి 60లక్షల రూపాయలకు పెంచడంతో భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో నవ్యాంధ్ర రాజధాని దొనకొండ అవుతుందని భావించిన సందర్భంలో ఎందరో వ్యాపారులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈప్రాంతంలో భూములను కొనుగోలు చేశారు. రాజధాని నిర్మాణం అమరావతికి మారడంతో సదరు భూ కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోయారు. తిరిగి దొనకొండను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విజయవాడ, హైదరాబాద్, కర్నూల్, కడప, ఒంగోలు ప్రాంతాలకు చెందిన బడా వ్యాపారులు ఈప్రాంతంపై దృష్టి సారించి భూములు కొనుగోలుచేసి పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పారిశ్రామిక హబ్‌గా మారుతుందని వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పదేపదే ఈప్రాంతంలో సందర్శించడంతో భూముల ధరలు పెరిగి తాము గట్టెక్కుతామని వ్యాపారులు భావిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న రైతులు ధరలు భారీగా పెంచి అత్యాశకు పోతుండటంతో కొనుగోలు చేసేవారు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం డీలా పడిపోయింది. తాగేందుకు నీరు లేని ఈప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఆర్థికంగా స్తంభించిపోవడం కంటే రాజధాని నగరంలో ఉన్నంతలో కొంత వెచ్చిస్తే భవిష్యత్తు ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు.

తండ్రే కాలయముడు
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమారుడిని చంపిన వైనం
పంగులూరు, మార్చి 30: లాలించి పెంచిన తండ్రే కన్న కొడుకు పాలిట కాలయముడిగా మారిన ఘటన మండలంలోని రామకూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రామకూరు గ్రామానికి చెందిన పొట్లూరి కృష్ణ, సువార్తమ్మకు సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడు సంవత్సరాల కుమారుడు కళ్యాణ్‌బాబు ఉన్నాడు. కాని భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో తరచూ గొడవలు పడుతుండే వారు. ఈ క్రమంలో భర్తతో గొడవ పడి సువార్తమ్మ గత పది రోజుల క్రితం గ్రామంలోని వారి బంధువుల ఇంటికి కుమారుడిని తీసుకుని వెళ్లింది. బుధవారం సాయంత్రం కృష్ణ తన బిడ్డ తనకే కావాలంటూ కళ్యాణ్‌బాబును తన ఇంటికి తీసుకుని వచ్చాడు. బిడ్డకు ప్రేమగా తాగిస్తున్నానంటూ థమ్స్‌అప్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. దీంతో బిడ్డ కడుపు విషమంగా మారింది. కళ్యాణ్‌బాబు పరిస్థితిని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మానవ సంబంధాలు ఇలాంటి ఘటనలతో మానవ సంబంధాలు ఎంత నాశనమవుతున్నాయో అర్ధమవుతుంది.
చైన్ దొంగలు అరెస్టు
35 సవర్ల బంగారు నగలు స్వాధీనం : డిఎస్‌పి
మర్రిపూడి, మార్చి 31 :మర్రిపూడి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానం ప్రాంతంలో బంగారు చైన్లు దొంగలించిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరిచి వారి వద్ద నుండి 35 సవర్ల బంగారు నగలు, ఒక మోటార్ బైకు రికవరీ చేసినట్లు దర్శి డిఎస్‌పి వి శ్రీరాంబాబు తెలిపారు. బుధవారం మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మండలంలోని అంకేపల్లి గ్రామంలో ఓ అజ్ఞాత వ్యక్తి సెల్‌టవర్ కట్టిస్తానని గ్రామస్థులను కొందరిని చీటింగ్ చేసి డబ్బులు వసూలు చేసిన విషయాన్ని అంకేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి మర్రిపూడి ఎస్ ఐ సుబ్బారావు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలో ఆ దొంగను ఛేధిస్తామని డియస్‌పి అన్నారు. చైన్ దొంగలించిన ముగ్గురు దొంగల్లో ఒకరిని అదే రోజు ఎస్‌ఐ సుబ్బారావు వెంబడించి పట్టుకున్నారని, మిగతా ముగ్గురు దొంగలను వారం రోజుల్లో రెక్కి నిర్వహించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఆ ముగ్గురు దొంగలైన నరసింహా, నర్సయ్య, శ్రీను లపై ప్రత్యేక నిఘా పెట్టామని , ఆ ముగ్గురు దొంగల ద్వారా పది కేసులను ఛేదించామన్నారు. చీమకుర్తి, అద్దంకి, దొనకొండ, బల్లికురవ, మర్రిపూడి మండలాల్లోని పెండింగ్‌లో ఉన్న పది కేసులను ఛేదించడం జరిగిందన్నారు. ఈ పది కేసులను ఆ ముగ్గురు దొంగలు ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముగ్గురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఆ దొంగలకు సంబంధించి కనిగిరి పోలీస్‌స్టేషన్‌కు పూర్తి సమాచారం అందజేస్తామని, అక్కడ ప్రతిరోజూ ఆ పరిధిలో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని సాగర్ కెనాల్‌కు సాగర్ నీరు వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దర్శి, అద్దంకి బ్రాంచ్ కెనాల్‌పై పెట్రోలింగ్ ను 60 మంది సిబ్బందితో ఏర్పాటు చేశామని, తాగునీటికి మాత్రమే ఆ నీటిని వాడుకోవాలన్నారు. ప్రధానంగా ఉచితంగా ఇసుక రీచ్‌ల నుండి ఉచితంగా ఇసుక ను తీసుకు వెళ్ళాలని, ఇసుక రీచ్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని డియస్‌పి హెచ్చరించారు. అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎస్‌ఐ సుబ్బారావు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.