ప్రకాశం

రగులుతున్న తెలుగుతమ్ముళ్ల అంతర్గత విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల అంతర్గత విభేదాలు రావణ కష్టాంలా రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను సమిసిపోయేటట్లు చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లాపార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు ప్రత్యేక దృష్టిసారించటం లేదన్న ఆరోపణలు పార్టీ నుండే వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుండి, ఇండిపెండెంట్‌గా ఉన్న శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో, గతంలో ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. పైకి మాటలాడుకుంటున్నప్పటికీ లోపల మాత్రం నేతలు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అద్దంకి, చీరాల, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల మధ్య బహిరంగంగానే పోరుసాగుతోంది. ఒకరు తూర్పు అంటే మరొకరు కాదు పశ్చిమం అనే పరిస్థితి ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జుల మధ్య నెలకొంది. వీరందరినీ ముఖ్యమంత్రి కాని, ఇన్‌చార్జి కాని పిలిచి గట్టిగా మందలించిన దాఖలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని బలోపేతం చేయటంతోపాటు అధికారంలోకి వచ్చేందుకు తాము శాయశక్తులా కృషిచేశామని, ఎన్నో కష్టనష్టాలకోర్చి పార్టీశ్రేణులను కాపాడుకున్నామని కొంతమంది ఇన్‌చార్జులు వాపోతున్నారు. వైకాపా నుండి తెలుగుదేశంపార్టీ గూటికి చేరిన శాసనసభ్యులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జులు పలుసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి దృష్టికి కూడా తీసుకువచ్చారు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గిద్దలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జి అన్నా రాంబాబు, చీరాలలో శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు ఆయన వ్యతిరేక వర్గం, కందుకూరులో శాసనసభ్యుడు పోతుల రామారావు, ఇన్‌చార్జి దివి శివరాంల మధ్య బహిరంగంగానే పోరు కొనసాగుతోంది. ఈ వర్గ విభేదాలు ఎన్నటికి పూర్తిఅయ్యేనా అన్న చర్చ తెలుగుతమ్ముళ్లల్లో నెలకొంది. జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల మధ్య పోరుసాగుతుండగా మరోపక్క నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు నిరుత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారపగ్గాలు చేపట్టి సుమారు రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కొంతమంది ముఖ్యనాయకులకు నామినేటెడ్ పదవులు దక్కకపోవటంతో వారు పార్టీతీరుపై గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను, పాలకవర్గాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. చైర్మన్ రేసులో జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకార్యదర్శి దాసరి వెంకటేశ్వర్లు ఉన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో దాసరి టిడిపి పురోభివృద్ధికి ఎంతోకృషిచేశారు. చైర్మన్‌రేసులో దాసరి ఉన్నప్పటికీ ఆయను పేరును అధికారికంగా ప్రకటించలేదు. చైర్మన్‌గా దాసరి పేరును జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తోపాటు జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులు అందరూ సూచించినా ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యనాయకుడు మాత్రం ఆ పేరును అంగీకరించకపోవటంతోనే దాసరి పేరు వెనక్కివెళ్లినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మంగళవారం జరిగే జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరితోపాటు, జిల్లాలోని శాసనసభ్యులు, ఇన్‌చార్జులతోపాటు ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. ఈసమావేశంలో తెలుగుదేశంపార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణపై కూడా చర్చ జరగనుంది. మొత్తంమీద జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య రావణ కాష్టంలా రగులుతున్న విభేదాలపై రాష్టప్రార్టీ ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు బాహాటంగానే వాఖ్యానిస్తున్నారు.