ప్రకాశం

ఇంకా తప్పని చిల్లర కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 29: కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా పెద్దనోట్లను రద్దుచేయటంతో ఇంకా జిల్లావ్యాప్తంగా చిల్లర కష్టాలు తప్పటం లేదు.ప్రధానంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఖాతాదారులు ఉదయం నుండే క్యూలో నిలబడుతున్నప్పటికీ వారికి నగదు అందటం లేదు. జిల్లాలోని అన్ని ఎటిఎంలు, బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తమ పనులను మానుకుని సైతం ఎటిఎంలు, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి ఉంటున్నారు. జిల్లాకు సరిపడనంతా నగదు నిల్వలు రాకపోవటంతోనే ఈ సమస్య ఉత్పన్నవౌతుందని బ్యాంకర్లు చెబుతున్నప్పటికీ ఖాతాదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జిల్లాలో వరి, ఉప్పుసాగుతోపాటు, ఇతర పంటలను సాగుచేసుకునేందుకు నగదు కావాల్సి ఉంది. కాని రైతులవద్ద నగదు లేకపోవటంతో వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వ్యాపారుల వద్దకూడా నగదు లేకపోవటంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లాలోని వేటపాలెం,చినగంజాం, కనపర్తి, బీరంగుంట,పాతపాడు, కొత్తపట్నం, ఊళ్ళపాలెం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ఉప్పుసాగుకు వచ్చేనెలనుండి భారీగా ఉపక్రమిస్తారు. కాని వ్యాపారులవద్ద నగదు నిల్వలులేకపోవటం, ఉన్న ఉప్పు అమ్ముడుకాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికవడ్డీలకైనా నగదు ఇచ్చే పరిస్థితులు వ్యాపారులు లేకపోవటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా మోదీ తీసుకున్న నిర్ణయంతో వేలాదిబస్తాల ఉప్పు నిల్వలు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. రానున్నరోజుల్లో ఉప్పురైతులు మరింతగా ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది.ఇదిలా ఉండగా జిల్లాలోని ప్రతి కూరగాయల మార్కెట్ వెలవెలబోతుంది. ప్రధానంగా చిల్లర దొరక్క వ్యాపారులు,కూరగాయలు కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకుల్లో డబ్బుల్లేవు!
* చేతులెత్తేసిన బ్యాంకు సిబ్బంది
* పేదవారికి ఈసడింపులు.. పెద్దలకు ఆహ్వానాలు
మార్కాపురం, నవంబర్ 29: వరుసగా మూడురోజులు బ్యాంకులకు సెలవుదినాలు కావడంతో నాల్గవరోజైన మంగళవారం బ్యాంకులు తెరచుకున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకులకు పరుగులు తీశారు. తీరా బ్యాంకులకు వెళ్లిన తరువాత నగదు లేదంటూ అధికారులు చేత్తులెత్తేయడంతో నిరాశగా ఖాతాదారులు వెనుతిరిగారు. సెలవుదినాలు కావడంతో గత మూడురోజుల నుంచి ఎటిఎంలలో కూడా డబ్బులు పెట్టకపోవడంతో నాల్గవరోజు ఆశగా ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కొన్ని బ్యాంకుల్లో పేదలకు డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ఈసడింపులు వ్యక్తం చేస్తూ పెద్దలను మాత్రం సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీనికితోడు ప్రతి మండలంలో మంగళవారం రూపేకార్డులపై మండలస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో బ్యాంకు అధికారులు అక్కడ హాజరయ్యారు. దీనితో బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. కొన్ని ఎటిఎంలలో ఒకటి రెండు 2వేల రూపాయల నోట్లు ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. వాటిని తీసుకొనివెళ్ళినా ఫలితం ఏమిటని, ఎక్కడికి వెళ్లినా చిల్లర లేదంటూ తిప్పిపంపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు పేదలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతుందో తెలియదు కానీ అత్యవసర పరిస్థితుల్లో కూడా చేతుల్లో డబ్బులులేక పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు పంపిణీలో బ్యాంకు అధికారులు పేద, ఉన్నత వర్గాలుగా విభజించి ఉన్నవారికి కంచంలో, లేనివారికి విస్తరాకులో పెట్టే విధానానికి స్వస్తిచెప్పి సమన్యాయం పాటించాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యవ‘సాయం’లో అవినీతి సె(న)గలు
* సొత్తు దొరికిందని దొంగను వదిలేస్తారా..?
* పట్టుబడిన సబ్సిడీ శనగల కేసు అటకెక్కినట్లేనా..?
* విచారణలో ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు
కురిచేడు, నవంబర్ 29: మన సొత్తు మనకు దొరికింది. ఇక దొంగలతో మనకు పనేంటి..? అని ఎవరైనా అంటారా..! ఔననే అంటున్నారు దర్శి డివిజన్ వ్యవసాయ అధికారులు. ఇంతకు ఎవరిది సొత్తు, ఎవరా దొంగలు..? తెలుసుకోవాలంటే సారాంశంలోనికి వెళ్దాం. ఈనెల 23వతేదీన ఆంధ్రభూమి దినపత్రికలో కురిచేడులోని మనగ్రోమోర్‌లో అవినీతి శనగలు, రంగుమారి రూటుమారుతున్న సబ్సిడీ విత్తనాలు, ఆటోతో సహా పట్టుబడిన విత్తనాల బస్తాలు అని ఉపశీర్షికలతో ప్రకాశం ఎడిషన్ ప్రధానపేజీలో వార్త ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సబ్సిడీపై శనగ విత్తనాలు విడుదల చేసింది. కొందరు దళారులు స్థానిక అపరాల వ్యాపారులతో కుమ్మక్కై రైతులను అడ్డం పెట్టుకొని నల్లబజారుకు శనగలు తరలించేందుకు పథకం వేశారు. వ్యవసాయశాఖ ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయగా మనగ్రోమోర్ కేంద్రం నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. కురిచేడు గ్రోమోర్ కేంద్రం నుంచి ఈనెల 22వతేదీ రాత్రి 7గంటల సమయంలో బస్తాలు మార్చి నల్లబజారుకు తరలిస్తుండగా వ్యవసాయశాఖ సిబ్బంది జంగాల స్వరూప్ 9.25 క్వింటాళ్లను ఆటోతో సహా పట్టుకున్నారు. ఇక్కడికి వరకు బాగానే ఉంది. ఇక అక్కడి నుంచి కథను దర్శి డివిజన్ ఇన్‌ఛార్జి ఎడిఎ కురిచేడు ఎఓ టి జోత్స్నాదేవి దర్శకత్వంలో నడిచింది. వాస్తవానికి ఆటో పట్టుబడిన వెంటనే సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి బస్తాలతో సహా ఆటోను పోలీసులకు స్వాధీనపరచాలి. వ్యవసాయ అధికారులు దీనికి విరుద్దంగా ప్రవర్తించారు. ఆటోపట్టుబడిన వెంటనే ఎడిఎ ఆదేశాల మేరకు ఎంపిఇఓ స్వరూప్ ఆటోలోని శనగల బస్తాలను తమ కార్యాలయానికి తరలించి ఆటోను వదిలిపెట్టారు. మరునాడు 23వతేదీ ఎడిఎ, ఎఓలు అక్రమరవాణపై విచారణ ప్రారంభించారు. పట్టుబడిన శనగలు మండలంలోని నమశ్శివాయపురం గ్రామానికి చెందిన 14మంది రైతుల పేర్లతో కొనుగోలు చేశారు. శనగలు తీసుకువెళ్ళడానికి 14మంది రైతులు గ్రోమోర్ కేంద్రానికి రావాల్సి ఉండగా కేవలం ఇరువురు రైతులు వెంటరాగా ఒక అపరాల వ్యాపారి శనగల ధరను గ్రోమోర్ కేంద్రంలో చెల్లించారు. దీనిపై గ్రోమోర్ కేంద్రం సిబ్బంది నుంచి స్పష్టమైన వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించారు. యధాతధంగా రైతులకు విత్తనాల బ్యాగులు అందించాల్సిన గ్రోమోర్ సిబ్బంది గోతాలు మార్చి దళారులకు, అపరాల వ్యాపారులకు సహకరించారు. వ్యవసాయ అధికారులు విచారణలో పాటించాల్సిన ప్రాథమికసూత్రాలకు తిలోదకాలు ఇచ్చారు. దర్యాప్తు చేపట్టినవారు అనేక మల్లగుల్లాలుపడి ఆటో పట్టుబడిన 48గంటల తరువాత కురిచేడు ఎఓ జోత్స్నాదేవి విత్తనాల అక్రమ రవాణాపై కురిచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే పట్టుబడిన విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. పట్టుబడిన ఆటో లేదు,దొరికిన సొత్తులేకుండా 48గంటల తరువాత ఫిర్యాదు చేస్తే తాము ఎలా స్పందించాలని పోలీసులు ఎఓను ప్రశ్నించారు. పైగా ఫిర్యాదు అస్పష్టంగా ఉన్నందున కొన్నిమార్పులతో తాజాగా ఫిర్యాదుపత్రం రాసి ఇవ్వాలని ఎస్సై కిశోర్‌బాబు సూచించారు. ఈ తతంగం జరుగుతుండగానే ఎడిఎ సంగమేశ్వరరెడ్డి ఫోన్‌కాల్ ద్వారా ఎఓ జోత్న్సాదేవిని పోలీసుస్టేషన్ నుంచి వెనుకకు రప్పించారు. అలా వెనుతిరిగిన వ్యవసాయఅధికారి మళ్లీ నేటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై ఆసక్తి చూపలేదు. సొత్తు దొరికింది చాలులే, ఇక దొంగలతో పనేముందని వారికివారు సర్దుబాటు చేసుకున్నట్లుంది. జరిగిన సంఘటనలతో దాటవేత వైఖరిని అవలంభించిన వ్యవసాయ అధికారులపాత్రపై అన్ని సందేహాలుగా మిగిలిపోయాయి. మంగళవారం ఇదే విషయమై ఎఓ జోత్స్నాదేవిని ప్రశ్నించగా, తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. కురిచేడు ఎస్సై కిశోర్‌బాబును ఈ సంఘటనపై స్పందించమని కోరగా, తమకు స్పష్టమైన ఫిర్యాదు అందలేదని తెలిపారు. 2004లో కురిచేడు మండలంలో నకిలీ పర్మిట్లతో మండలంలో భారీఎత్తున సబ్సిడీ శనగవిత్తనాలు కొల్లగొట్టారు. అప్పట్లో ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. పదేపదే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన వ్యవసాయశాఖ అవినీతిపరుల కొమ్ముకాయడం చర్చనీయాంశమైంది.

దొనకొండలో టెక్స్‌టైల్ మెగాపార్కు
దొనకొండ, నవంబర్ 29: దొనకొండలో టెక్స్‌టైల్ మెగాపార్కు నిమిత్తం చెన్నైకి చెందిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీ బృందం మంగళవారం దొనకొండ పరిసరాల్లోని 1000 ఎకరాల భూములను పరిశీలించారు. కంపెనీ ప్రతినిధి జ్ఞానేశ్వర్ బృందం కంపెనీ ఏర్పాటు కోసం మండలంలో ఉన్న వౌలిక వసతుల గురించి ఎపిఐఐసి ఇంజనీర్ కుమార్‌ను, మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లును ప్రశ్నించగా వారు దొనకొండలో విమానాశ్రయం త్వరలో నిర్మాణం జరగబోతుందని, దొనకొండ - అద్దంకి, దొనకొండ - ఒంగోలు, దొనకొండ - అమరావతి నాలుగులైన్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, దక్షణమధ్య రైల్వేకు దొనకొండ సబ్‌డివిజన్‌గా ఉందని, ప్రస్తుతం బెంగుళూరు - విజయవాడ వయా హైదరాబాద్ వరకు ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయని, ఈప్రాంతంలో భారీ విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని వౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జపాన్, చైనా, సింగపూర్ తదితర దేశాలకు చెందిన అనేక కంపెనీల ప్రతినిధులు భూములను పరిశీలించారన్నారు. భారతప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం సమైఖ్యంగా 10వేల ఎకరాల్లో యుద్ధవిమానాల స్పేర్‌పార్ట్సు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిపారు. టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటు చేయడం వలన ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. త్వరలో ప్రభుత్వం ద్వారా అనుమతులు తీసుకునేందుకు యోచిస్తున్న కంపెనీ ప్రతినిధులు పాత్రికేయులకు తెలిపారు. వారి వెంట తహశీల్దార్ వెంకటేశ్వర్లు, సర్వేయర్ వెంకటరావు, విఆర్‌ఓ ఆనందరావు, రెవెన్యూ బృందం పాల్గొన్నారు. ఈప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు ఈప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని టిడిపి అధ్యక్షులు ఎన్ శివకోటేశ్వరరావు, వై యల్లారెడ్డి, కె సుబ్బారావు తదితరులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.