ప్రకాశం

ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్ రూపంలో తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంటు రూపంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సిఇఒ అమితాబ్ సింగ్ జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుండి జిల్లాకలెక్టర్లతో డిజిటల్ చెల్లింపులపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలన్నారు. సామాన్యప్రజానీకం అందరూ ఏ బ్యాంకుకు సంబంధించిన యాప్‌నైనా డౌన్‌లోడ్ చేసుకుని నగదు రహిత లావాదేవీలు జరిగేలా చూడాలన్నారు. వినియోగదారులందరూ నగదు రహిత కొనుగోళ్లకు అలవాటుపడేలా వివిధ రకాల బ్యాంకింగ్ వ్యవస్థలను వినియోగించుకునేలా విస్తత్రంగా ప్రచారం చేపట్టాలన్నారు. గ్రామీణప్రాంత ప్రజల బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేపట్టాలని, గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారస్తులు ఈపాస్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ, గ్రామపంచాయితీ అధికారుల ద్వారా గ్రామీణప్రాంత ప్రజల్లో నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధిహామీపథకంలో వేతనకూలీలపై దృష్టిసారించి నగదురహిత లావాదేవీలు జరిపేందుకు అవసరమైన శిక్షణ ఇప్పించాలన్నారు. 2017 మార్చి నాటికి దేశం మొత్తం నగదురహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ప్రధానంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా, స్మార్ట్‌ప్యూచర్ మొబైల్స్, ఆధార్‌నెంబరుతో లావాదేవీలు, స్మార్ట్ఫోన్‌లేని వారిని సర్వీసుడేటా విధానంతో, మైక్రో ఎటిఎంల ద్వారా, యుపిఐ రిజిస్ట్రేషన్, స్మార్ట్ఫోన్ ఇంటర్‌నెట్ సౌకర్యంద్వారా, ఈ వాలెట్ స్మార్ట్‌పోన్ ఇంటర్‌నెట్ సౌకర్యంకలిగిన యాప్‌ల ద్వారా లావాదేవీలను జరపవచ్చునని, వీటిపై విస్తత్రంగా ప్రచారం చేపట్టాలన్నారు. డిజిటల్ చెల్లింపుల అంశానికి సంబంధించిన యాప్‌ల వినియోగంపై ప్రజెంటేషన్ అందించారు. సామాన్యప్రజలకు అందుబాటులో ఉన్న యాప్‌లను తెలియచేసి వాటిద్వారా కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా తెలియచేయాలన్నారు. రేషన్‌షాపుడీలర్లు బిజినెస్ కరస్పాండెంట్లుగా సేవలు అందించాలన్నారు.నగదురహిత లావాదేవీలు జరిపేవిధానాలపై స్థానిక భాషలో కరపత్రాలను ముద్రించి పంపిణీచేపట్టాలన్నారు. ప్రతిగ్రామంలో 20మంది వ్యాపారస్తులు నగదురహిత లావాదేవీలు జరిపే ఈపాస్ మిషన్లు అందుబాటులో ఉంచుకునేలా చూడాలన్నారు. ఒక్కొక్క వ్యాపారస్తుడికి వందమంది వినియోగదారులను ఆటాచ్‌చేసి నగదురహిత లావాదేవీలు జరిపేలా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ఈసమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శితోపాటు జిల్లాకలెక్టర్ సుజాతశర్మ తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.

ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 1: జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి సూచించారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పాత రిమ్స్ ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల వద్ద వైద్య ఆరోగ్యశాఖాధికారులు, నర్సింగ్, ఇంజనీరింగ్ కాలేజిల విద్యార్థులతో ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లాజాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌లు ప్రారంభించారు. ఈర్యాలీ చర్చి సెంటరు నుండి ఎనుగుచెట్టుమీదుగా తిరిగి అంబేద్కర్ భవనం వరకు సాగింది. అనంతరం అంబేద్కర్ భవన్‌లో జరిగిన సభలో రాజా వెంకటాద్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎయిడ్స్‌వలన లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఎయిడ్స్‌వ్యాధికి మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. యువతీ యువకులు క్షణికావేశానికి లోనై ఎయిడ్స్ వ్యాధికి గురికాకూడదన్నారు. సాధారణంగా 15సంవత్సరాల నుండి 49 సంవత్సరాల్లోపు వయస్సు కలిగినవారు ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారన్నారు. యువతీ, యువకులు ఎయిడ్స్‌వ్యాధికి గురికావటంవలన వారి కుటుంబాలమీద, సమాజంమీద ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఆఫ్రికాలో అత్యధికంగా ఎయిడ్స్ గ్రస్తులు ఉన్నారన్నారు. మూడవస్థానంలో భారతదేశం ఉందన్నారు. ఈసందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి మందులు లేవన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ఎఆర్‌టి మందులు వినియోగిస్తూ జీవితాన్ని కొనసాగించాలన్నారు. ఎయిడ్ వ్యాధికి గురై మృతిచెందిన పిల్లలు అనాథలుగా మారుతున్నారని, ఎన్‌జివో సంస్థల సహకారంతో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నగదు కోసం బారులు తీరిన ఖాతాదారులు
* ఎటిఎంలు, బ్యాంకుల వద్ద పెరిగిన రద్దీ

ఒంగోలు, డిసెంబర్ 1: నగదు రహిత లావాదేవీలని ఒకపక్క, మరొకపక్క బ్యాంకుల్లో నగదు ఉందని జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నగదు కోసం ఖాతాదారులు బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూకడుతూనే ఉన్నారు. ఈనెల 9వతేదీ నుండి ఖాతాదారుల బాధలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. డిసెంబర్ నెల మొదలుకావటంతో గురువారం నగదు కోసం అన్నివర్గాల ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్దకు పరుగులుతీసారు. దీంతో ఎటిఎంలన్నీ ఖాతాదారులతో నిండిపోయాయి. గతంలో కొత్త సినిమావస్తే ప్రేక్షకులు టిక్కెట్లు కోసం క్యూలో ఉన్నట్లు ప్రస్తుతం నగదు కోసం ఆ విధంగా క్యూలో నిలబడి తమవాటా ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుతెన్నులు చూస్తున్నారు. నెల మొదటిరోజు కావటంతో అద్దెగృహాల్లో ఉన్నవారికి అద్దెలు, పాలు, పేపరు, నిత్యావసర సరుకులకు, డిష్‌బిల్లులతోపాటు ఇతర బిల్లులు చెల్లించేందుకు నగదు అవసరం ఉంది. అద్దె గృహాల యజమానులు ఇదే అదనుగా నెల రెండు, మూడు తేదీల్లోనే తమకు అద్దె కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గృహాల్లో అద్దెకు ఉన్నవారు చేసేదిలేక నగదుకోసం ఎంతసేపైనా క్యూలోనే నిలబడి ఉంటున్నారు. ఇదిలాఉండగా ప్రైవేటు ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి సైతం బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు పంపిణీచేస్తున్నారు. దీంతో వారు కూడా క్యూలోనే నిలబడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫ్యాక్టరీలు, కాలేజిలు, స్కూలు యజమాన్యాలతోపాటు, ఇతర సంస్థల్లోపనిచేసే వారికి నేరుగా నగదు అందచేసేవారు. ప్రస్తుతం బ్యాంకుల్లో తీసుకునేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పాత ఐదువందలు, వెయ్యి రూపాయలనోట్లను ఎక్కువశాతంమంది యజమాన్యాలు కార్మికులకు అందచేస్తున్నారు. దీంతో వారివద్ద ఉన్న నల్లధనాన్ని కార్మికుల వేతనాల రూపంలో బయటకు పంపిస్తున్నారు. పాత నోట్లనే కార్మికులు, వివిధవర్గాల ప్రజలు తీసుకుని వారి అకౌంట్లల్లో నగదును జమచేసుకుని ఆ తరువాత తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో కొత్తకరెన్సీ కోసం ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు.
ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోవటంతో అన్నిరంగాలు నిర్వీర్యమయ్యాయి. జిల్లాలోని ప్రతి ఒక్క షాపు వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి. ఇంకా కొత్త ఐదువందల రూపాయల నోట్లు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవటంతో చిల్లర కోసం అన్నివర్గాల ప్రజలు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చిల్లర వర్తకం వ్యాపారుల బేరాలు పూర్తిగా పడిపోయాయి. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే బాపూజీ కాంప్లెక్స్‌వెలవెలబోయి దర్శనమిస్తుంది. మొత్తంమీద గురువారం ఉదయం నుండే ప్రజలు ఎటిఎంలు, బ్యాంకులవద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ వారికి నగదు అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. మరోరెండు, మూడురోజుల్లో నగదు ఆర్థికలావాదేవీలు సర్దుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక ఉన్నతాధికారి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.

అణు విద్యుత్ కేంద్రం వద్దు
* రామాయపట్నం కోసం అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమం
* సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ డిమాండ్
ఒంగోలు, డిసెంబర్ 1: ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దు సముద్ర తీరప్రాంతం (చెన్నాయపాలెం, రుద్రకోట)లో దేశంలోనే అతిపెద్ద ఆరువేల మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న పాలకుల నిర్ణయాన్ని సిపిఐ జాతీయ సమితి వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకుడు కె నారాయణ వెల్లడించారు. రామాయపట్నం ఓడరేవు సాధనసమితి జిల్లాకమిటీ ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలను తీసే అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిద్దాం, ప్రజలకు ఉపాధి చూపే రామాయపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేద్దామనే నినాదంతో గురువారం ఛలో ఒంగోలు కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామాయపట్నం ఓడరేవు సాధనసమితి కన్వీనర్ కె వీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని అమెరికా, రష్యాలాంటి ప్రపంచ దేశాలే తమవద్ద వద్దని వ్యతిరేకిస్తున్నాయన్నారు. మన దేశంలోని గుజరాత్, పశ్చిమబెంగాల్‌లో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించగా అక్కడిప్రజలు కూడా తిరగబడ్డారని, ప్రజల పోరాటాలకు తలొగ్గి అక్కడ అణువిద్యుత్ కేంద్రాన్ని ఉపసంహరించుకోవటం జరిగిందన్నారు. దాంతో మనరాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు రష్యాతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అణువిద్యుత్ కేంద్రమంటే వేలాది బాంబుల కుంపటని, అనుకోని ప్రమాదం జరిగితే లక్షలాది మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అణుకేంద్రం నుండి వచ్చే అణుధూళి వలన సుమారు 170 కిలోమీటర్ల పరిధిలో మనుషులకు అనేకరకాల వ్యాధులు వస్తాయని, మత్స్యసంపద నాశనమవుతుందన్నారు. పంటభూములు ఎడారిగా మారతాయని పేర్కొన్నారు. రెండవప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలపై వేసిన అణుబాంబుల ఫలితంగా వేలాదిమంది ప్రజలు చనిపోగా 70సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ అంగవైకల్యంతో పుడుతున్నట్లు తెలిపారు. 1986లో రష్యాలోని చెర్నోబిల్‌లో, 2011లో జపాన్‌లో ఉకిషియాలో, మనదేశంలో బోపాల్ దుర్ఘటనలో వేలాదిమంది మృతిచెందినట్లు తెలిపారు. తమిళనాడులోని కుడుంకలం అణువిద్యుత్ కేంద్రం, శ్రీకాకుళం జిల్లా సోంపేటల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలు పెద్దఎత్తున పోరాటాలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో అణువిద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలోని శ్రీకాకుళం లేదా ప్రకాశం జిల్లాలోని తీరప్రాంతమైన చెన్నాయపాలెం, రుద్రకోట వద్ద ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రయత్నించటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవసరమైతే ప్రజలను కూడగట్టి అణువిద్యుత్ కేంద్రాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఒంగోలు నగర కార్యదర్శి యు ప్రకాశరావు, సిపిఐ జిల్లాసహాయకార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ మాజీ జిల్లాకార్యదర్శి ఎం వెంకయ్య, సిపిఐ నాయకులు బాలకోటయ్య, రాఘవులు, ఆర్ వెంకట్రావు, వి హనుమారెడ్డి, రామకృష్ణ, నాగేశ్వరరావు, శింగరకొండ, పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, కుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం మెమోరాండాన్ని జిల్లా కలెక్టరేట్‌లో అందచేశారు.

మాగుంట సుబ్బరామిరెడ్డి మహోన్నత వ్యక్తి
* కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శైలజానాధ్ వెల్లడి
* సుబ్బరామన్న ఆశయాలు కొనసాగిస్తాం: ఎమ్మెల్సీ మాగుంట
* వర్ధంతి సభలో సుబ్బరామిరెడ్డికి ఘననివాళులర్పించిన నాయకులు* భారీ స్థాయిలో అన్నదానం
ఒంగోలు, డిసెంబర్ 1: ఒంగోలు మాజీ పార్లమెంటుసభ్యుడు, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి మహోన్నతమైన వ్యక్తి అని కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ మంత్రి సాకె శైలజానాథ్ కొనియాడారు. దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి 21వ వర్ధంతి సభ గురువారం స్థానిక పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సభకు మాగుంట సోదరుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభకు హాజరైన మాజీ మంత్రి శైలజానాధ్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి సేవాగుణం, మంచితనం మానవత్వం, దయాగుణం, త్యాగగుణం, దాతృత్వం కలిగిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అప్పట్లో సుబ్బరామిరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రవేశించిన అతి కొద్దికాలంలోనే ఒంగోలు పార్లమెంటుసభ్యునిగా ఎన్నిక కావటం, ఆ తరువాత జిల్లాలో అనేక విద్యాసంస్థలు స్థాపించటంతోపాటు, పశ్చిమప్రాంత ప్రజలకు సైతం తాగునీరు అందించి వారి మన్నలను పొందినట్లు తెలిపారు. అలాంటి సుబ్బరామిరెడ్డి గురించి 21 సంవత్సరాలేకాదు, మరో వంద సంవత్సరాలు చెప్పుకున్నా కూడా తప్పులేదన్నారు. సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్‌పార్టీ మార్కు అని, ఆయన మరికొంతకాలం జీవించి ఉంటే రాష్ట్రంలోనే ఒక గొప్ప నేతగా మిగిలేవారన్నారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తన సోదరుడైన సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం ఆయనపై ఉన్న అభిమానంతో పెద్దఎత్తున ప్రజలు వచ్చి జయప్రదం చేయటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సుబ్బరామిరెడ్డి ఆశయాలను తాను, పార్వతమ్మలు కొనసాగిస్తామని తెలిపారు. జిల్లాప్రజలు మాగుంట కుటుంబం పట్ల చూపిస్తున్న ఆదరణను ఎన్నటికీ మరవలేమన్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ జిల్లాలో మాగుంట కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. మాగుంట కుటుంబం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, వారి కార్యాలయాలకు వెళ్లే ప్రతి ఒక్కరినీ కూడా తమ ఇంటి బంధువులుగా చూసే గుణం మాగుంట కుటుంబానికి ఉందని ఆయన పేర్కొన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలోని అందరి బంధువుని కూడా కొనియాడారు. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి మనిషి పుట్టడం, గిట్టడం సహజమని, అయితే కొంతమంది తమ దగ్గర ఉన్న డబ్బులతో సేవ చేసి ప్రజల మన్నలను పొందుతారని, అలాంటి వారిలో ప్రథముడు మాగుంట సుబ్బరామిరెడ్డి అని కొనియాడారు. తనలాంటి రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. సుబ్బరామిరెడ్డి మరో పది సంవత్సరాలు బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతిసభలో తొలుత హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పుస్తక పఠనం చేశారు. అనంతరం ప్రకాశం జిల్లా రచయితల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి హనుమారెడ్డి, పొన్నూరు వేంకటశ్రీనివాసులు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. తొలుత నాగేశ్వరమ్మ తదితరులు ఆధ్వర్యంలో గీతాలాపాన కూడా జరిగింది. అనంతరం ఎంఎస్‌ఆర్ కాలేజిల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు మెడల్స్‌ను అందచేశారు. ఇదిలాఉండగా ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదుగంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ సుజాతశర్మ, జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ, జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, డిఎస్‌పి జి శ్రీనివాసరావు, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, మాజీ ఎమ్మెల్యే దిరిశాల రాజగోపాల్‌రెడ్డి, నారపశెట్టి పాపారావు, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డి, సూపర్‌బజారు చైర్మన్ తాతా ప్రసాదు, మునిసిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఎఎంసి చైర్మన్ శింగరాజు రాంబాబు, ఎఎంసి మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, కాంగ్రెస్‌పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, గాదె లక్ష్మారెడ్డి, వేమా శ్రీనివాసరావు, జి రాజ్‌విమల్, వి రాజగోపాల్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొని మాగుంట చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాగుంటకు పోలీసు బ్యాండ్ మేళంతో ఘననివాళులు అర్పించారు. ముందుగా రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్‌లు మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయం వద్దకు వెళ్లి సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఒంగోలులో పారిపోవడానికి ప్రయత్నించిన రిమాండ్ ఖైదీ
ఒంగోలు, డిసెంబర్ 1: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో రిమాండ్ ఖైదీ ఒకరు గురువారం పారిపోయేందుకు ప్రయత్నించాడు. తూర్పుగోదావరి జిల్లా కరప ప్రాంతానికి చెందిన వెంకటరమణ అనే రిమాండ్ ఖైదీ ఒంగోలులోని సబ్‌జైలులో ఉన్నాడు. అయితే ఇతనిపై కడప కోర్టులో ఒక కేసు ఉండడంతో ఒంగోలు సబ్ జైలునుంచి కడపకు చెందిన ముగ్గురు పోలీసులు బస్సులో తీసుకువెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరారు. ఈలోగా తన చేతికి ఉన్న బేడీలతో పారిపోయేందుకు రిమాండ్ ఖైదీ ప్రయత్నించగా, కడప పోలీసులతోపాటు అక్కడ ఉన్న ఆర్టీసీ సెక్యూరిటీ పోస్ట్ పోలీసులు కూడా అతడిని పట్టుకుని కడపకు బస్సులో తీసుకెళ్లారు. ఈ విషయమై సబ్‌జైలు సూపరింటెండెంట్ రామచంద్రన్‌ను వివరణ కోరగా, ఈరోజు కడప పోలీసులు కేసు విషయమై రిమాండ్ ఖైదీని తీసుకెళ్లారని, బయట ఏం జరిగిందో తమకు తెలియదని పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఒంగోలు, డిసెంబర్ 1: ఒంగోలు నగరంలోని ఇందిరమ్మకాలనీ 3వ లైన్‌లో గురువారం చిట్టి రమాదేవి (30) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ జి వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు. ఇందిమ్మకాలనీనికి చెందిన రమాదేవి తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిపారు. రమాదేవి భర్త చక్రవర్తియే ఈమెను హత్యచేసి ఉంటాడని భావిస్తున్నట్లు సిఐ తెలిపారు. రమాదేవికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రమాదేవి భర్త చక్రవర్తి పోలీసు స్టేషన్‌లో లొంగిపోగా, చక్రవర్తిని జరిగిన సంఘటనపై విచారిస్తున్నట్లు సమాచారం .

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు రిమాండ్
కారంచేడు, డిసెంబర్ 1: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు రిమాండ్ విధించినట్లు రూరల్ సిఐ అల్త్ఫా హుస్సేన్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఈ సంవత్సరం మార్చి 6వ తేదీన కారంచేడు వాటర్ ట్యాంకు సమీపంలో వివాహిత డి సునీత ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానిత కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే శవపరీక్షల ఆధారంగా ఆమె దాడి చేయడం వల్లే మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. విచారణలో భాగంగా మృతురాలి భర్త కోటయ్యచౌదరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు.

నో క్యాష్.. ఔట్‌ఆఫ్ సర్వీస్
* నగదు అందక ప్రజల అవస్థలు
మార్కాపురం, డిసెంబర్ 1: కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసిన తరువాత ప్రజలు తమ డబ్బు తాము తెచ్చుకునేందుకు కూడా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మాత్రం 15రోజుల్లో ప్రజల కష్టాలు తీరుతాయని హామీలు ఇచ్చినప్పటికీ అవి నీటిమీద రాతలా తయారయ్యాయి. 21రోజులు గడచినప్పటికీ బ్యాంకులకు పూర్తిస్థాయిలో నగదు చేరిన దాఖలాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే వారంలో 24వేల రూపాయలు నగదు డ్రా చేసుకోవచ్చునని ఆర్‌బిఐ చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం రెండున్నర వేలకు మించి నగదు ఇవ్వకపోవడంతో తీసుకున్న డబ్బులు ఏ అవసరాన్నీ తీర్చడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ బ్యాంకు వద్దకు వెళ్ళినా నో క్యాష్.. ఏ ఎటిఎం వద్దకు వెళ్ళినా ఔట్‌ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఖర్చులకు డబ్బు ఎలా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో బ్యాంకు అధికారులు అసలు ఎటిఎంలలో డబ్బులు పెట్టకపోవడం విశేషం.
ప్రభుత్వం తీరుతో పనిభారం పెరిగిందంటున్న బ్యాంకు ఉద్యోగులు
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం భావించి అందరికీ బ్యాంకులో అకౌంట్లు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఖాతాదారులు తండోపతండాలుగా బ్యాంకులకు వస్తున్నారని, ఓవైపు సిబ్బంది కొరత కారణంగా నిత్యం చేయాల్సిన పనే చేయలేని పరిస్థితుల్లో అదనపు భారంతో అల్లాడిపోతున్నామని తెలిపారు. ఓవైపు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ కోసం అకౌంట్లు ప్రారంభించాలని, మరోవైపు రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కోసం అకౌంట్లు ప్రారంభించడం, అలాగే రూపే కార్డులు మంజూరు చేయడం లాంటి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బ్యాంకు అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు ఉన్న నగదులో కొంతభాగాన్ని ఎటిఎంలలో పెడితే బ్యాంకుల్లో కొంతైనా రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని, దీంతో బ్యాంకులకు వచ్చే ఖాతాదారులకు కొంతైనా సేవ చేసే అవకాశం ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఏదిఏమైనా కేంద్రప్రభుత్వం నోట్ల రద్దుతో, రాష్ట్రప్రభుత్వం నగదు రహిత లావాదేవీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని బ్యాంకు అధికారులు అంగీకరిస్తున్నారు.

మరోసారి తప్పుచేసి నష్టపోవద్దు
* ప్రజలకు జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షులు వక్కలగడ్డ పిలుపు
మార్కాపురం టౌన్, డిసెంబర్ 1: మరోసారి తప్పుచేసి నష్టపోవద్దని జనచైతన్య యాత్రలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వక్కలగడ్డ మల్లికార్జున్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి స్థానిక అమ్మవారిశాల ప్రాంతంలో జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కందుల నారాయణరెడ్డి ఓడిపోవడం వలన పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టడం ఖాయమని, అందువలన మార్కాపురం నియోజకవర్గం నుంచి కందుల నారాయణరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఎమ్మెల్యే కాకున్నా మార్కాపురం పట్టణంలో రోడ్ల అభివృద్ధికి 10కోట్ల రూపాయలు, కూరగాయల మార్కెట్ నిర్మాణానికి 4కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ ఆస్తులు దుర్వినియోగం కాకుండా స్వాధీనం చేసుకొని 40లక్షల రూపాయలతో రెండు పార్కులను, ఆరు సులభ కాంప్లెక్స్‌లను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అధికారం లేకున్నా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తిమేరకు నిధులు తీసుకువస్తానన్నారు. మరోసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టంకట్టడం ఖాయమని అన్నారు. శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం మాట్లాడుతూ తాను చైర్మన్‌గా ఎన్నికైన నాటి నుంచి నేటివరకు ఆలయ అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి కందుల సహకారం అందిస్తున్నారని అన్నారు. రథసప్తమి నాటికి వెండిరథం చేయించాలని సలహా ఇచ్చారని, ఆమేరకు నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ డివి కృష్ణారెడ్డి, టిడిపి నేతలు ఇమ్మడి కాశీనాథ్, శాసనాల వీరబ్రహ్మం, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి చెరుకూరి శ్రీనివాసచౌదరి, జక్కా లక్ష్మీప్రకాశరావు, తడికమల్ల బాలసుబ్బారావు, పోరుమామిళ్ళ విజయలక్ష్మీ, పి లక్ష్మీప్రసాద్‌యాదవ్, కౌన్సిలర్లు, మార్కెట్‌యార్డు డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.