ప్రకాశం

ఎటిఎంల్లో నోక్యాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 10:బ్యాంకులకు మూడురోజులు సెలవులు కావటంతో ఆయాశాఖల పరిధిలోని ఎటిఎంలన్నీ నోక్యాష్‌బోర్డులు పెట్టేశాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు నగదుకోసం పడిగాపులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుండే కొన్ని ఎటిఎంల వద్ద ఖాతాదారులు క్యూకట్టినప్పటికీ గంటల వ్యవధిలోనే నగదు అయిపోయి నోక్యాష్ అంటూ బోర్డులు దర్శనమివ్వటంతో ప్రజలు ఏమిచేయాలో అర్ధంకాక కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల తీరుపై తూర్పురపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోట్లను పంపిణీచేయాలని ఒక పక్క కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు బ్యాంకర్లకు ఆదేశాలు జారీచేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఆర్‌బిఐ నుండి తక్కువగా నగదు వస్తుండటంతో ఈ పరిస్థితి వస్తుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఒక వ్యక్తికి బ్యాంకు ఎటిఎంల్లో రెండువేల రూపాయల కొత్తనోటు, అదేవిధంగా బ్యాంకుల్లో నాలుగువేల రూపాయలకంటే ఎక్కువుగా ఇవ్వలేని స్థితి నెలకొనగా బయట మాత్రం నల్లకుబేర్ల దగ్గర మాత్రం కోట్లాది రూపాయల కొత్తకరెన్సీ దర్శనమిస్తుండటంతో అన్నివర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. ఇదిఇలాఉండగా ఈనెల 13వతేదీ మంగళవారం నాటికి జిల్లాకు రెండువేలరూపాయలు, వంద, 50రూపాయల నోట్లకు సంబంధించి 86కోట్లరూపాయలు బ్యాంకులకు రానుంది. అదేవిధంగా ఈనెలాఖరుకు విడతల వారీగా చిల్లరనోట్లు బ్యాంకులకు వస్తాయని అందువలన ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈ నేపధ్యంలో ఈనెలాఖరువరకు జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు నోట్లకోసం కష్టాలు పడాల్సి ఉంది. ఇదిఇలాఉండగా వార్ధాతుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే మాత్రం నగదుకోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. వర్షాలుపడితే రైతులు సాగుచేసిన పంటలకు ఎరువులను కొనుగోలు చేసేందుకు, వరినాట్లు వేసేందుకు దక్కులు దునే్నందుకు నగదు అవసరం ఉంటుంది. దీంతో నగదుకోసం ఇప్పటివరకు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టని రైతులు వర్షంపడితే మాత్రం బ్యాంకుల వద్దకు పరుగులు తీయనున్నారని బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు. మొత్తంమీద సెలవుదినాలైన తొలిరోజునే బ్యాంకు ఎటిఎంలు నగదులేక బోసిపోతే రానున్న రెండురోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఆ దేవుడికే తెలియాల్సిఉంది. ఇప్పటివరకు ఆర్‌టిసి బస్సుల్లో, కౌంటర్లల్లో పాత కరెన్సీ చెల్లుబాటు అయ్యేది,కాని శుక్రవారం అర్ధరాత్రినుండి ఆర్‌టిసిబస్సుల్లో కూడా నగదు చెల్లుబాటు కాకపోవటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరెండురోజులుపాటు ప్రయాణాలు చేసేవారు వాయిదావేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంమీద కరెన్సీ కష్టాలు అందరిని చుట్టుముట్టాయి.

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
* 18నెలల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణం
* ఆరోగ్యశ్రీపై జగన్‌కు అవగాహన లేదు
* రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ

ఒంగోలు,డిసెంబర్ 10:రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.20లక్షల ఉన్నత నాణ్యతాప్రమాణాలతో కూడిన గృహాలను రానున్న 18నెలల్లో నిర్మించి అందచేస్తామని వెల్లడించారు. శనివారం నారాయణ, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, పలువురు అధికారులతో కలిసి ఒంగోలు నగరాన్ని సందర్శించి గృహనిర్మాణం కోసం నగరంలోని చింతల గ్రామం, కర్నూలురోడ్డు మార్గంలోని పెట్రోలు బంకు వద్ద ఉన్న ఖాళీ స్థలాలను మ్యాపులను వారు పరిశీలించారు. చింతలలోని నాలుగు ఎకరాల స్థలాన్ని, కర్నూలురోడ్డు మార్గంలో పదిఎకరాల స్థలాన్ని మంత్రి తనిఖీచేసి అన్నింటికి అనువుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బలహీనవర్గాల ప్రజలకు నాణ్యమైన గృహాలను నిర్మించి ఇవ్వాలన్నది రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడ ఆశయమన్నారు. గృహాల నిర్మాణంకోసం ఆరు నుండి 6.50లక్షలరూపాయల ఖర్చు అవుతుందన్నారు. ప్రతిగృహంలో మంచినీరు, విద్యుత్ వంటి వౌలిక సదుపాయలతో మంచి టైల్స్ ఏర్పాటుచేస్తామని, గృహసముదాయంలో పాఠశాల, పార్కు, కమ్యూనిటిహాలు, ఆసుపత్రి, జనాభాను బట్టి కాలేజి ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ గృహనిర్మాణ ప్రక్రియ చేపట్టి ఈనెలలో టెండర్లను పిలుస్తామని అందులో భాగంగానే స్ధలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. జిల్లాలో 5069 గృహాలు నిర్మిస్తామన్నారు. ఒంగోలు నగరంలో 20వేల గృహాలకుగాను ఐదువందల గృహలు అక్కడక్కడ మిగిలిన 15వందల గృహాలు జిప్లస్ తరహాలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తామన్నారు. నగరానికి దూరంగా ఉండే పేదప్రజల రవాణాకు అదనపు ఖర్చు అవుతున్నందున నగరానికి సమీపంలోనే గృహాలను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా మార్కాపురం పట్టణంలో 1020గృహాలు,కందుకూరులో 1437గృహాలు, చీరాలలో 612గృహాలను నిర్మించనున్నామన్నారు. వచ్చే 18నెలల్లో గృహాల నిర్మాణం కచ్చితంగా పూర్తిచేస్తామన్నారు. తిరుపతి, విజయవాడ, గుడూరు పట్టణాల్లోని మురికివాడల్లో చిన్న,చిన్న ఇళ్లల్లో నివసిస్తున్న స్కావెంజర్లు తదితర పేదప్రజలకు మంచి నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో ఎస్‌సిలు అధికంగా ఉన్నందున ఎస్‌సి,ఎస్‌టి ఉపప్రణాళిక కింద ప్రత్యేకంగా నిధులను మంజూరుచేశామన్నారు. జిల్లాలోని ఒంగోలు నగరానికి 60కోట్లరూపాయలను ఎస్‌సి కాలనీల అభివృద్ధి కోసం కేటాయించామన్నారు. రహదారుల విస్తరణ కోసం మరో 22కోట్లరూపాయలను మంజూరు చేశామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీపథకానికి నేడు ఎన్‌టిఆర్ వైద్యం పేరున మరో 109 జబ్బులకు అదనంగా సేవలను అందిస్తున్నామన్నారు. ఈ విషయంలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయం కోసం కాకుండా వాస్తవాలు తెలుసుకుని జగన్ మాట్లాడాలని ఆయన హితవుపలికారు.
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి కోర్టుకేసు నడుస్తుందని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకేసు పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడిందని, మొక్కల పెంపకంతో ఆహ్లాదకరమైన నగరంగా మారిందన్నారు. మంత్రి వెంట మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు.

వార్ధా తుపాన్ వల్ల కలిగే విపత్తులను ఎదుర్కొనేందుకు
సిద్ధంగా ఉండాలి
- జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ -

ఒంగోలు,డిసెంబర్ 10: వార్ధా తుపాన్ కారణంగా ఎలాంటి విపత్తులొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్ నుండి కోస్తాతీరప్రాంత మండల ప్రత్యేకాధికారులతో కలిసి తహశీల్దార్లు, మండల ఎంపిడిఒలు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్ధా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైందని అందుకు అనుగుణంగా మండల,గ్రామస్థాయి అధికారులు విపత్తు సమయంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. వాతావరణ శాఖ జారీచేసే హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టుప్రాంత ప్రజలను సురక్షితప్రాంతానికి తరలించేందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని సిద్ధంగా ఉండాలన్నారు. తుపాన్ కారణంగా ముందస్తు చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించాలన్నారు. వార్ధా తుపాన్‌కారణంగా తీవ్రమైన గాలి ఉంటే చెట్లు, విద్యుత్‌స్తంబాలు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ సౌకర్యం లేని కారణంగా తాగునీటి సమస్య తలెత్తేఅవకాశం ఉందని ముందుగానే ఒహెచ్‌ఎస్‌ఆర్‌ను తాగునీటితో నింపుకోవాలని సూచించారు. తుపాన్‌కారణంగా అధికవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చెరువులు, కుంటలు పొంగే అవకాశం ఉందని, చెరువుకట్టలు బలహీనంగా ఉన్నచోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులకు గండ్లుపడినప్పుడు వాటికింద గ్రామాలు, పంటపొలాలు మునిగే పరిస్థితులు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయాగ్రామాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాల్సి ఉందన్నారు. వర్షపునీరు నిల్వకారణంగా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖాధికారులు అవసరమైన మందులను, డాక్టర్లను, సిబ్బంది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి సూచించారు. సముద్రతీరప్రాంత గ్రామప్రజలను తుపాన్‌సమయంలో తుపాన్‌షెల్టర్స్‌లో రక్షణ కల్పించి వారికి అవసరమైన తాగునీరు, ఆహారం అందించాలని చిన్నపిల్లలకు, గర్భిణులకు పాలు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. తుపాన్ సమయంలో లోకాజ్‌వేల వద్ద విఆర్‌ఒ, పోలీసు సిబ్బందిని 24గంటల పాటు పర్యవేక్షణలో ఉంచి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా పెట్టాలన్నారు. జిల్లాకు 33మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వచ్చిందని వారు మూడుబ్యాచ్‌లుగా విధులను నిర్వహిస్తామన్నారు.జిల్లాకేంద్రంలో విపత్తుకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ఫ్రీనెంబరు 1077, అదేవిధంగా 08592- 281400 కు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌కు ఫోన్‌చేయాలన్నారు. మూడు షిప్టుల్లో కంట్రోలు రూం పనిచేస్తుందని అవసరమైతే ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభమైన
అంతర్‌జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
ఉత్తమపౌరులకు మార్కులే ప్రామాణికం కాదు : ఈదర
అద్దంకి నియోజకవర్గంలో కోటి రూపాయలతో క్రీడాప్రాంగణాల నిర్మాణం : గొట్టిపాటి
అద్దంకి, డిసెంబర్ 10: అంతర్‌జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వల్వనతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జడ్‌పి చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. భావిభారత పౌరులుగా ఎదిగేందుగు విద్యలో మంచి మార్కులే ప్రామాణికం కాదన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక ధారుడ్యం, మానసికోల్లాసం కలుగుతాయని తెలిపారు. ఎన్‌టిఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి పురుషుల, మహిళల ఎంపిక చేయబడిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీల్లో గెలుపోటములు లెక్కచేయకుండా తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఎన్‌టిఆర్ పేరు మీదగా అంతర్‌జిల్లాల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అద్దంకి నియోజకవర్గంలో కోటి రూపాయలతో క్రీడాప్రాంగణాల నిర్మాణం
అద్దంకి నియోజకవర్గంలో 50లక్షల రూపాయలతో శింగరకొండ వద్ద స్టేడియం నిర్మాణం పూరె్తైందని, దానిలో మరో 25లక్షలతో షటిల్‌బ్యాడ్మింటెన్ ఆట కోసం ఉడెన్‌కోర్టు నిర్మాణానికి ప్రభుత్వానికి నివేధించామన్నారు. అదేవిధంగా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో 50లక్షలతో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో స్టేడియం నిర్మాణానికి కూడా అంచనాలు ప్రభుత్వానికి పంపించామని, త్వరలో అక్కడ కూడా స్టేడియం నిర్మాణం జరుగుతుందన్నారు. అద్దంకిలో అంతర్‌జిల్లాల పోటీలు నిర్వహిస్తున్న జిల్లా బాల్‌బ్యాడ్మింటెన్ అసోసియేషన్ అధ్యక్షులు తోపూరి సుబ్బారావు, చెరుకూరి సుబ్బారావు ఇతర కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
పోటాపోటీగా బ్యాడ్మింటన్ పోటీలు
13 జిల్లాల నుండి వచ్చిన బ్యాడ్మింటెన్ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒకరిని మించి మరొకరు పోటీల్లో తమ ప్రతిభను కనబర్చారు. సుమారు 300 మంది క్రీడాకారులు తమతమ జట్ల విజయం కోసం పోరాడారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో శనివారం కొన్ని జట్లకు లీగ్‌మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదివారాల్లో కూడా లీగ్‌మ్యాచ్‌లు కొనసాగించి, సోమవారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేశారు.

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభం
ఒంగోలు అర్బన్,డిసెంబర్ 10:జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ 39వ మహాసభలు శనివారం స్థానిక యుటిఎఫ్ జిల్లాకార్యాలయంలో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం విద్యార్థుల ప్రదర్శన జరిగింది. స్థానిక పివిఆర్ బాలుర హైస్కూలు నుండి వందలాది మంది విద్యార్థులతో హెచ్‌సిఎం కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమహాస్టళ్లను,పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో జిల్లావ్యాప్తంగా 228 పాఠశాలలు, 44హాస్టళ్లను మూసివేసిందన్నారు. పేదవిద్యార్థులు చదువుకునే విద్యాసంస్థలపై రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లాకు కేటాయించిన యూనివర్శిటీ గురించి పట్టించుకునే నాధుడేలేరన్నారు. విద్యార్థుల సమస్యలపై మండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. విద్యాశాఖమంత్రి విద్యారంగ అభివృద్ధి పట్ల విద్యావేత్తలను, మేధావులను పిలిపించి చర్చించేందుకు సమయం కూడా కేటాయించకుండా వ్యాపారపనుల్లో నిమగ్నమయ్యారన్నారు. కేంద్రప్రభుత్వం సిబిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు ఎవి పుల్లారావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్, రఘరాం, వినోద్ పాల్గొన్నారు.

కరవుపై తక్షణమే స్పందించాలి
* వెలుగొండకు రూ. 1500 కోట్లు కేటాయించి
పూర్తిచేయాలి
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిద్ధయ్య డిమాండ్
పెద్దదోర్నాల, డిసెంబర్ 10: దశాబ్దాలుగా కరవు కాటకాలతో అవస్థలు పడుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకునేందుకు నిర్మించతలపెట్టిన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలు మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై సిద్ధయ్య డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పాదయాత్ర పెద్దదోర్నాల వ్యవసాయ మార్కెట్ వద్దకు రాగానే మండల సిపిఎం కార్యదర్శి కందుల కాశిరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా నటరాజ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిద్ధయ్య మాట్లాడుతూ మండలం వెనుకబడి ఉందని, నీటి సమస్యతో అల్లాడుతోందని, భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీరు రాక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను విస్మరించి రైతులను మోసం చేశారన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నామని, ఈనెల 23వ తేదీన కరెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి ఆంజనేయులు, మార్కాపురం డివిజన్ కార్యదర్శి సోమయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు గాలి వెంకటరామిరెడ్డి, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కళావతి, రాజ్యలక్ష్మీ, వెంకటేశ్వర్లు, రమేష్, దావిద్, కార్యకర్తలు పాల్గొన్నారు.