ప్రకాశం

జిల్లాలో హోరెత్తిన ధర్మపోరాట దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 20: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు నినాదాల హోరెత్తించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తెలుగుతమ్ముళ్లు రోడ్డెక్కి ప్రత్యేకహోదా సాధించేవరకు ఏలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ నినాదాలు చేశారు. జిల్లాలోని 12నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ దీక్షలను చేపట్టారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీనాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొన్నవారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
జిల్లాకేంద్రమైన ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సారథ్యంలో ధర్మపోరాట దీక్ష జరిగింది. ఈ దీక్షలో రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్దకు ఆయా సంఘాల నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. మొదట జిల్లా టీడీపీకార్యాలయంలో ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తరువాత ర్యాలీగా దీక్షాస్థలికి చేరుకున్నారు.
ధర్మపోరాట దీక్ష సందర్బంగా మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలు జరిగాయని తెలిపారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలు అమలు చేయక రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహానికి సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్టవ్రిభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఉదారంగా ఆదుకుంటారని నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూశామని, కానీ బీజేపీ మాత్రం రాష్ట్రప్రజలకు రిక్తహస్తమే మిగిల్చిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పార్లమెంటులో అవిశ్వాసాన్ని ముందుకు రానివ్వకుండా కేంద్రప్రభుత్వం పారిపోయిందన్నారు. టీడీపీతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడిన సందర్భాలు లేవన్నారు. రాష్ట్రప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్య తేడాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఐదుకోట్లమంది ప్రజల ఆగ్రహానికి దేశప్రధాని నరేంద్రమోదీ బలవకతప్పదని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ధర్మపోరాటం చేస్తుంటే ప్రభుత్వంపై, పాలకులపై విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. దేశప్రధాని మోదీ కనీసం పార్లమెంటు సమావేశాలను నడపటం చేతకాని అసమర్థుడిగా మిగిలిపోయారన్నారు. ప్రత్యేకహోదా కోసం ఇకనుండి టీడీపీతోపాటు ప్రభుత్వం కూడా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. శనివారం నుండి రాష్టవ్య్రాప్తంగా 15రోజులపాటు సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఈ సందర్బంగా ధర్మపోరాటం దీక్షకు రెవిన్యూ, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు, డెంటల్ అసోసియేషన్, వడ్డెరసంఘం, వైద్యాధికారులు, రేషన్‌డీలర్స్ అసోసియేషన్ సభ్యులు సంపూర్ణ మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్‌చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, జిల్లాపార్టీ కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగరపార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నాయకులు బొమ్మినేని మురళీకృష్ణ, మారెళ్ల వివేకనందా, టీవీ శ్రీరాంమూర్తి, మహిళా నాయకులు అరుణ, తమ్మినేని మాధవి, ఆర్ల వెంకటరత్నం, గంగవరపు పద్మావతి, నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరు ప్రకాశం పంతులు మనుమడు టంగుటూరి గోపాలకృష్ణ దీక్షా ముగింపు సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావుకు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌కు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఇదిలా ఉండగా మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి శిద్దా లక్ష్మీపద్మావతి దీక్షకు సంఘీభావం ప్రకటించి దీక్షలో కూర్చోన్నారు.