మహబూబ్‌నగర్

రెండేళ్లలో పాలమూరు ఎత్తిపోతలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని యుద్దప్రాతిపాదికన రెండేళ్లలోపు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో రెడ్డిసేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి రెడ్డి కులస్థులు సహాయ సహకారాలు అందించే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. కృష్ణానది నీటితో జిల్లాను సస్యశ్యామలం చేయడమే ద్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వర్షాభావంతో తల్లడిల్లుతున్న జిల్లా రైతాంగానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ వరం లాంటిదని ఆయన అన్నారు. ఈ బృహాత్తర పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లా రూపు రేఖలను మారుస్తామని తెలిపారు. భవిష్యత్ తరాలకు తాగు, సాగునీటి సమస్య ఎట్టిపరిస్థితుల్లోను ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని కూడా యుద్దప్రాతిపాదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పాలమూరు జిల్లాను విద్య, వైద్య రంగాలలో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. యువకులు విద్యాబ్యాసాన్ని సక్రమంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు విద్యాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉపాధి పొంది దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రెడ్డిసేవాసమితి ఆధ్వర్యంలో కళ్యాణమంటపం నిర్మించేందుకు తన వంతు సహయంగా రూ.5 లక్షలు విరాళంగా అందిస్తానని మంత్రి హమీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సబ్సిడిలను ఉపయోగించుకుని రైతులు వ్యవసాయ పంటలు సాగుచేసుకుని అధిక దిగుబడులను పొందాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు పరుస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కుటుంబాలలో విద్యార్జనను పెంపొందించేందుకు రెడ్డి హస్టళ్లలో కృషి చేయాలని అన్నారు. ఇంకా చాలా రెడ్డి కుటుంబాలు వెనకబడి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కులాల సర్వేను నిర్వహింపజేసి ఆదుకోవాలని కోరారు. కళ్యాణమంటపం ఏర్పాటు కోసం రూ. లక్ష విరాళం చెక్కును ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నిర్వాహకులకు అందజేశారు. అలాగే రాజాబహుదూర్ వెంకట్రామారెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి రూ.25వేల చెక్కును విద్యానిదికి అందజేశారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలకు రెడ్డి సేవాసంఘం నాయకులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవాసమితి నాయకులు బసిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చెన్నారెడ్డి, రాజేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గద్వాల జిల్లా సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం
* నిరవదిక దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరుణ
గద్వాల, ఫిబ్రవరి 14: అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాజీవ్‌సర్కిల్‌లో నిరవదిక నిరాహార దీక్షలను గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల జిల్లా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన రిలే దీక్షలకు అన్నివర్గాల ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. గద్వాలకు జిల్లా కావడానికి కావాల్సిన అర్హతలు లేవని ముఖ్యమంత్రి కెసిఆర్ జోగుళాంబ సాక్షిగా చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నడిగడ్డకు జరిగిన అన్యాయాన్ని ముందుపెట్టిన కెసిఆర్ జిల్లా విషయంలో న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఎస్‌కు నీరు రావడం లేదని ఇక్కడి కృష్ణా నీటిని సమైఖ్య పాలకులు తరలించుకుపోతున్నారని చెప్పిన మీరు నడిగడ్డకు ఏమి న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. 1956లో రాయచూరు జిల్లా నుంచి వేరుపడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపిన నడిగడ్డ నష్టపోయిన విషయం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా ఉద్యమం రాజకీయ లబ్దికోసమేనని చెబుతున్న అధికార పార్టీ నాయకులు ముందుండి ఈ ఉద్యమాన్ని వారే ముందుండి నడిపిస్తే తాము వారి బాటలో నడిచేందుకు సిద్దమని ఆ నాటి నుంచే స్పష్టం చేయడం జరిగిందన్నారు. జిల్లా కోసం హైదరాబాద్ కొరకు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రణాళిక రూపొందిస్తే తాము వారి వెంట నడిచేందుకు సిద్దమని స్పష్టం చేశారు. ఎన్నో విధాలుగా నడిగడ్డ ప్రాంతం నష్టాలపాలైందని, జూరాల, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులతో రైతులు భూములు, ఇండ్లు కోల్పోయి తెలంగాణ రాష్ట్రానికి సాగు, తాగునీటిని అందిస్తున్నారని జిల్లా ఏర్పాటు విషయంలో న్యాయం చేయాలని కోరారు. దక్షిణ తెలంగాణ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చిన్నచూపు తగదని, దక్షిణకాశిగా పేరుగాంచిన జోగుళాంబ అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడం శోచనీయమన్నారు. గద్వాల జిల్లా చేయాలని ముఖ్యమంత్రి మనస్సు మారే విధంగా జోగుళాంబ అమ్మవారు ఆదేశించాలని వేడుకున్నట్లు డికె అరుణ వెల్లడించారు. మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొదటిరోజు దీక్షకు భారీ స్పందన లభించింది. జిల్లా ఏర్పాటు చేసేంత వరకు అన్నివర్గాల ప్రజలు కలుపుకొని నిరవదిక దీక్షలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ రమాదేవి, వైఎస్సార్ సిపి నేత అతికుర్హ్రెమాన్ తదితరులు సందర్శించి మద్దతు ప్రకటించారు.

హిందూ ధర్మమే గొప్ప జీవన విధానం
* విహెచ్‌పి జాతీయ కార్యదర్శి అరవింద్ బ్రహ్మబట్
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14: ప్రపంచంలో హిందూ ధర్మమే గొప్ప జీవన విదానమని, హిందూ దర్మానుసారంగా ప్రతి హిందువు జీవించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి అరవింద్ బ్రహ్మబట్ ఉద్బోదించారు. ఆదివారం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విభాగ్‌స్థాయి కార్యకర్తల వర్గ సమావేశంలో పాల్గొన్న బ్రహ్మబట్ మాట్లాడుతూ మనిషి బ్రతకడానికి హిందూ దర్మం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. హిందూ ధర్మాన్ని అలవర్చుకుని జీవనం కొనసాగించే వ్యక్తి సమాజంలో గౌరవంగా బతకగలుగుతారని అన్నారు. హిందువుగా పుట్టినందుకు హిందువులంతా గర్వపడాలని ఆయన పెర్కొన్నారు. పార్టీలు, వర్గాలు వైరైనా హిందువులంతా ఒక్కటేనని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరు ఏకంగా కృషి చేయాలని కోరారు. రాబోయే ఉగాది, శ్రీరామనవమి వేడుకలు దేశంలో హిందుత్వాన్ని ప్రతిబింబించేలా గ్రామా గ్రామాన ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రతి హిందువు ఇంటిపై ఈ సందర్భంగా కాషాయ ద్వజాలను ఎగుర వేయాలని తెలిపారు. దేవాలయాల్లో సత్సంగాలను ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని గురించి, దేవతారాదణ గురించి, దేశ భక్తిని గురించి అందరికి అర్థం అయ్యేరీతిలో వివరింప జేయాలని కోరారు. ప్రతి ప్రఖండలో విశ్వహిందూ పరిషత్ పేరిట అకౌంట్లు తెరవాలని సూచించారు. దేశంలో కొన్ని ఇతర మత సంస్థలు హిందూ ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి హిందువు జాగృతమై ఎప్పటికప్పుడు హిందు ధర్మ సంరక్షణకు కంకణ బద్దులై ఉండాలని పిలుపునిచ్చారు. మతమార్పిడీలను ప్రోత్సహించేవారిని ఉపేక్షించకూడదని తెలిపారు. గ్రామాలలో నిరక్షరాస్యత కారణంగా మత మార్పిడీలను ప్రోత్సహించే వారి సంఖ్య ఎక్కువగా అయిందని అలాంటి వారు కనిపిస్తే వారిని చట్టానికి అప్పగించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే సంసృత్తిని పిల్లల్లో అలవర్చాలని తెలిపారు. విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించి వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి దేశ శ్రేయస్సు కొరకు పాటుపడేలా తయారు చేయాలని అన్నారు. దేశంలో సంఘ విద్రోహ శక్తులకు మద్దతు తెలుపుతున్నవారు ఓ సారి ఆలోచించాలని దేశ ప్రజల కోసం కాకుండా మత చాందసవాదుల కోసం, దేశంలో అల్లర్లు సృష్టించే వారి కోసం మద్దతు పలకడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే పరిషత్ కార్యకర్తల శిక్ష వర్గకు ఇప్పటి నుండే కార్యకర్తలను సిద్దం చేయాలని ఆయన పెర్కొన్నారు. ఈ శిక్షా వర్గకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో విహెచ్‌పి నాయకులు జగదీశ్వర్, యాదిరెడ్డి, రమేష్, సంఘవిశ్వనాథ్, బిక్షమయ్య, బుచ్చారెడ్డి, నరేంద్ర, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రకుంట చెరువు మరమ్మత్తులకు కోటి నిధులు మంజూరి
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 14: జిల్లా కేంద్రంలోని కురిహినిశెట్టి కాలనీలో గల ఎర్రకుంట చెరువు అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరి అయ్యావని, చెరువు మరమ్మత్తులను పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని కురిహిని శెట్టి కాలనీలో జాండ్ర కమ్యూనీటి హాల్ ప్రహరిగోడతో పాటు అక్కడ నూతనంగా నిర్మించనున్న ముఖద్వారంకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గసడ్ మాట్లాడుతూ పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య ఉందని అందుకోసం ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డులో మంచినీటి సమస్య లేకుండా బోర్లు వేయించడం జరుగుతుందని అదేవిధంగా ట్యాకంర్లతో నీటిని సరఫరా చేస్తామని అన్నారు. పట్టణంలో పేద ప్రజలకు దాదాపు 14వేల పించన్లు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఇంకా మూడు వందలకు పైగా లబ్దిదారులు ఉన్నారని వారిని గుర్తించి అందరికి పించన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుందని అభివృద్ధే ద్యేయంగా తాము పని చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. పట్టణాభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని అన్నారు. ప్రజల దాహార్థిని తీర్చిడానికి నిధులు పుష్కలంగానే ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా మంచినీటి బాదలు తప్పాలంటే మరో ఏడాది తర్వాత వచ్చే వాటర్‌గ్రిడ్‌తో శాశ్వత పరిష్కారం లబించనుందని ప్రజలకు ప్రస్తుతం ఇబ్బందులను తీర్చడానికి కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా బాలాజీనగర్‌లో స్వచ్‌భారత్ కార్యక్రమంలో భాగంగా లైన్స్‌క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాదాఅమర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్ పద్మ, నాయకులు శివరాజ్, శాంతయ్య, అంజయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలి
* ప్రొఫెసర్ హరగొపాల్
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 14: విద్యారంగంలో సంక్షోభం సృష్టించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి విద్యారంగాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ కళాభవన్‌లో డిటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సంక్షోభం, తక్షణ కర్తవ్యాలపై నిర్వహించిన జిల్లా విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ప్రతి విద్యావెత్త చైతన్య వంతులై విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ముప్పై సంవత్సరాలుగా డిటిఎఫ్ ప్రభుత్వ విద్యారంగంలో చెపట్టాల్సిన సంస్కరణల గురించి ప్రభుత్వ దృష్టికి తెచ్చిన వాటిని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థల, కార్పొరేట్ విద్యాసంస్థల తొత్తులుగా ప్రభుత్వ ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన దుయబట్టారు. ఎన్నికల సమయంలో కార్పోరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సహాయ సహకారాలు తీసుకుని అధికారంలోకి వస్తున్న ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ విద్యా రంగానికి కొమ్ముకాస్తున్నారని ఎద్దేవా చేశారు. బీద బడుగు బలహిన వర్గాల ప్రజలకు విద్యా వ్యవస్థను దూరం చేసేందుకు కొంతమంది దనవంతులు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతున్నారని ఈ కుట్రలను అర్థం చేసుకుని ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పాలమూరు జిల్లాలో గిరిజనులు చెంచులు నివాసం కోల్పోయే ప్రమాదం నెలకొన్నదని అన్నారు. అటవీ భూములను కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అప్పగించి, అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉపాధిలేకపోవడం వల్ల ఎటా 18 లక్షల మంది ముంబాయి, పుణలాంటి పట్టణాలకు వెళ్లి దుర్భర దారిద్రంతో బతుకులు వెలదీస్తున్నారని అన్నారు. ఈ సదస్సులో పౌరహక్కుల నేత వరవరరావు, రాఘవాచారి, డిటిఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో
ముగ్గురు మృతి
వంగూరు, ఫిబ్రవరి 14: రోడ్డు ప్రమాదంలో మండలంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని కోనేటిపూర్ గ్రామ గేట్ దగ్గర కారు, ద్విచక్ర వాహనంను ఢీ కొనడంతో ముగ్గరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైనాయి. సర్వారెడ్డిపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనుల నిమిత్తం నల్గొండ జిల్లా నుంచి వచ్చిన రమేష్(35), పాపులు(30), సారయ్య(28) కూలీలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, హైదరాబాద్ నుంచి మండల పరిధిలోన నిజంబాద్ గ్రామానికి శుభకార్యం నిమిత్తం మల్లయ్య, కృష్ణయ్య, రమేష్ రాథోడ్‌లు వస్తుండగా ప్రమాదవశాత్తుకోనేటిపూర్ గేట్ వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న రమేష్, పాపులు అక్కడిక్కడే మృతి చెందగా, సారయ్య ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారు డ్రైవర్ రమేష్‌కు తీవ్ర గాయాలై కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రమేష్ మునుగోడు మండలం ఊకొండి గ్రామంకాగా, పాపులుది నకిరెకల్ మండలం తాటికల్ గ్రామం, సారయ్య సూర్యపేట మండలం సురాజ్‌పల్లి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి సిఐ వెంకట్ వంగూరు, వెల్దండ ఎస్సైలు నరేష్, జానకిరాంరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.