విజయనగరం

రైవాడ రైతుల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేపాడ,్ఫబ్రవరి 14: రైవాడ ప్రాజెక్టు రైతులకే పునరంకితం కావాలన్న డిమాండ్‌తో రైవాడ సాధన కమిటీ ఆదివారం సాగునీటి సాధనకు కమిటీ సభ్యులు సారధ్యంలో మొదటి రోజు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతం అయ్యింది. రైవాడ జలశాయం దగ్గరనుంచి ప్రారంభమైన పాదయాత్ర విశాఖ జిల్లాకు చెందిన సీతంపేట, నాగయ్యపేట గ్రామాలతో పాటు విజయనగరం జిల్లా వావిలాపాడు, చామలాడివి, వీలుపర్తి తదితర గ్రామాల్లో సుమారు 17 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించి రైతాంగాన్ని సాగునీటి బోరుకు సిద్ధం చేసారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు సిహెచ్ రామునాయుడు మాట్లాడుతూ రైతుల కోసం నిర్మించిన జలాశయం నీటిని రైతుల సాగు భూములకు ఇవ్వకుండా విశాఖ నగరానికి తరలించుకు పోవడం దారణమన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు, ఎపి రైతు సంఘం కార్యదర్శి నర్సింహరావులు మాట్లాడుతూ సాగునీటి సాధన కోసం రైవాడ సాధన కమిటీ చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే ఇరిగేషన్ శాఖ రిటైర్డు చీప్ ఇంజనీర్ సాగునీటి వనరుల ప్రభుత్వ సలహాదారుడు సత్యనారాయణ మాట్లాడుతూ రైవాడ నీటిని 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న 15 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తు అదే అయకట్టు ఆరువేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. రైవాడ ప్రాజెక్టు సామర్థ్యం 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అనువుగా ఉందని అన్నారు. నిర్మాణ దశలో దీని సామర్థ్యాన్ని కల్పించారని అన్నారు. అయినా ప్రభుత్వ పాలకులు సాగునీరు అందించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని అర్థం కాకుండా ఉందని అన్నారు. సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, పైపులైను నిర్మాణాన్ని శాశ్వతంగా విరమించుకోవాలని, జివిఎంసి బకాయి పడ్డ రూ.112 కోట్లు వసూలు చేయాలని, తక్షణం సాగునీటి పంటకాలువలను ఏర్పాటు చేసి సాగునీరు అందించాలి అన్న డిమాండ్లతో సాధన కమీటి పాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు బాబ్జీ వెంకన్న, దండునాయుడుబాబు,విశాఖ రైతు సంఘ నాయకుడు అప్పరావు, సతీష్,శ్రీను,పెదనాయుడు, తదితరులతో పాటు వందలాది మంది రైతులు, రైతునాయకులు పాల్గొన్నారు. ఈ రాత్రికి నాయుడుపేట గ్రామంలో బస చేస్తున్నట్లు తెలిపారు.
==================

మహిళపై అత్యాచారం కేసులో
నలుగురు నిందితుల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: సంచలనం కలిగించిన మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో నాలుగు రోజుల కిందట జరిగిన దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ తెలిపిన వివరాల ప్రకారం మూలపాడు గ్రామానికి చెందిన వివాహిత మహిళ కూలీపనుల కోసం చెన్నై వెడుతున్న తన భర్తను పంపించేందుకు గత బుధవారం రాత్రి ఆండ్ర గ్రామానికి వచ్చి తిరిగి వెడుతున్న సమయంలో నలుగురు యువకులు ఆమెను సమీపంలోని జనసంచారం లేని పొదల ప్రాంతానికి బలవంతంగా తీసుకువెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేసారు. దాంతోపాటు ఆ మహిళ వద్ద ఉన్న మూడువేల రూపాయల నగదును కూడా బెదిరించి తీసుకున్నారు. ఇదే సమయంలో ఆ మార్గంలో ఎవరో రావటం గమనించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి చేరుకున్న వివాహిత మహిళ తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహాయంతో మరుసటి రోజు రాత్రి పెదమానాపురం పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆండ్ర పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డిఎస్పీ రమణమూర్తి విచారణాధికారిగా కేసు దర్యాప్తు చేపట్టారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం మేరకు ఆండ్ర గ్రామానికి చెందిన సవరిల్లి లక్ష్మణ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తనతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. లక్ష్మణ ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు నిందితులు యెలుసూరి ఆదినారాయణ, సవరిల్లి శంకర్‌రావు, రాయుడు చిన్నారావు ఇప్పలవలస-కొండ లింగాలవలస గ్రామాల మధ్య ఉన్న మామిడితోటలో దాక్కుని ఉండగా డిఎస్పీ రమణారావు, గజపతినగరం సిఐ విజయనాథ్, ఎస్సైలు మహేష్, వరప్రసాద్, తారకేశ్వర్‌రావు తమ పోలీసు సిబ్బందితో శనివారం సాయంత్రం దాడిచేసి పట్టుకున్నారు. నిందితులను ఆదివారం గజపతినగరం కోర్టుకు రిమాండ్ చేస్తున్నామని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు రమణమూర్తి, త్రినాథ్, గజపతినగరం సిఐ విజయనాథ్ తదితరులు పాల్గొన్నారు.
==================

ఫెర్రో పరిశ్రమను ఆదుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలతోపాటు వివిధ సమస్యలతో మూతపడిన ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను తిరిగి తెరిపించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల యజమానుల సంఘం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. తక్షణ చర్యగా విద్యుత్ చార్జీలను తగ్గించి ఆదుకోవాలని సంఘం కోరింది. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎస్‌ఆర్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 35 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 29 పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. విజయనగరం జిల్లాలోనే 16 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉండగా అందులో కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. ఫెర్రో పరిశ్రమలు మూతపడటానికి ప్రధాన కారణంగా విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలని తెలిపారు. ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసిన ప్రారంభంలో అవసరమైన విద్యుత్ ఎన్టీపిసి నుంచి సరఫరా జరిగేదని, కానీ నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు సరసమైన ధరలకే విద్యుత్ అందిస్తామని 2002లో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపిసితో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని తెలిపారు. మొదటి పదేళ్లలో 53పైసల ధర పెరిగితే, కేవలం ఈ నాలుగేళ్లలో యూనిట్ విద్యుత్ ధరను రెండు రూపాయలకుపైగా పెంచారని ఆందోళన వ్యక్తం చేసారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఫెర్రో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్తు యూనిట్ ధర 2.65రూపాయలు ఉండగా ప్రస్తుతం ఈ ధర 4.81రూపాయలకు పెరిగిందని చెప్పారు. దీనికితోడు విద్యుత్ సెస్సు పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. దీనికితోడు ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకు కొనుగోలు ధరలు, ఉత్పత్తుల తయారీ అనంతరం అమ్మకం ధరలు ప్రపంచ మార్కెట్‌తో ముడిపడి ఉండటంతో ఈ పరిశ్రమలు విపత్కర పరిస్థితులు ఎదర్కుంటున్నాయని అన్నారు. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తుల అమ్మకాలు, విదేశాలకు ఎగుమతి విషయంలో వెనకబడిపోతున్నామని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసారని, మంత్రులు పలు దఫాలుగా సమావేశమై ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను ఆదుకునే చర్యలో భాగంగా ఈ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌పై ఒక రుపాయి ధర తగ్గించాలని సిఫారసు చేస్తున్నట్లు సమాచారం ఉందని, కానీ ఈ తగ్గింపు ఫెర్రో పరిశ్రమలకు ఏ మాత్ర ఊరట కలిగించేది కాదన్నారు. కనీసం యూనిట్‌కు 1.80రూపాయలు తగ్గిస్తేనే నష్టాలను పూరించుకోవటంతోపాటు పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విలేఖరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు ఎంఎస్‌ఎస్ శర్మ, ఎఎస్‌వి ప్రసాద్, గోపి, ఎస్‌వి రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకపఠనం తప్పనిసరి
*కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: ప్రస్తుత పోటీప్రపంచంలో విద్యార్థులకు పుస్తకపఠనం తప్పనిసరిగా మారిందని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ రవికుమార్ అన్నారు. ఆదివారం సైనిక్ పాఠశాలలో ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్టణానికి చెందిన ఒక పుస్తక ప్రచురణ సంస్థ ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్ధేశించి ప్రిన్సిపల్ కెప్టెన్ రవికుమార్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడంవల్ల మేధోశక్తి పెరుగుతుందని, విద్యార్థుల మధ్య పోటీని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో పాఠశాల మ్యాగజైన్‌ను కెప్టెన్ రవికుమర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రవీణ్‌కుమార్, పరిపాలన అధికారి స్క్వాడ్రన్ లీడర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూళ్లను వినియోగించుకోవాలి
గజపతినగరం, ఫిబ్రవరి 14: అర్హులందరు ఓపెన్ సూళ్లను వినియోగించుకోవాలని ఓపెన్ స్కూల్ రాష్ట్ర సమన్వయ కర్త రవికుమార్ కోరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్‌ను రాష్ట్ర కో- ఆర్డినేటర్ రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అందిస్తున్న విద్యా అవకాశాలను అర్హులు వినియోగించుకోవాలని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ ఆరునుండి 19 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు ఈనెల 17వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎనిమిదవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసామని తెలిపారు. 14 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరు నేరుగా ప్రవేశం పొందవచ్చని చెప్పారు. గ్రామ సర్పంచ్, విద్యాకమిటీలు, అంగన్వాడి, డ్వాక్రా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు గ్రామాల్లోని అర్హులను గుర్తించి విద్యయొక్క ప్రాముఖ్యత తెలిపి ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని మండల సమన్వయ కర్తను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థుల హాజరు శాతం, వివిధ రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త రమేష్‌నాయుడు, మండల సమన్వయ కర్త సూర్యారావు, ఉపాధ్యాయులు రమేష్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రథసప్తమి వేడుకలు
విజయనగరం (పూల్‌బాగ్), ఫిబ్రవరి 14: పట్టణంలో ఆదివారం పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.బాబామెట్టలో ఉన్న శివపంచాయతన ఆలయం రథసప్తమి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం ,అర్చనలు, అభిషేకపూజలు జరిపారు.అనంతరం స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. పట్టణంలోని టిటిడి కళ్యాణమండపంలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో టిటిడి, హిందూధర్మ ప్రచారపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రధసప్తమి వేడుకలను నిర్వహించారు. యోగా ఉపాధ్యాయులు రవికుమార్ ఆధ్వర్యంలో వందమంది బాలబాలికలు సూర్యనమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం చేసారు. ఈసందర్భంగా టిటిడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్యామసుందరం మాట్లాడుతూ రథసప్తమి రోజున సూర్యుని ఆరాధిస్తే మానసిక రుగ్మతులు, కంటివ్యాధులు తగ్గుతాయని పేర్కొన్నారు.తిరుమల తిరుపతి దేవస్ధానములు ఆదేశానుసారం ఈకార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు నరసింహాచార్యులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాల్సిందే..
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం, కంటింజెంట్, డైలీవేజ్ తదితర ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఉద్యోగుల సమాఖ్య జిల్లాకమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ టిడిపి, బిజెపి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తమ స్థితిగతులు మారుతాయని అశించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం, ఇప్పటికే వివిధ పద్దతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడం అటుంచి ఉన్న ఉద్యోగాలనే పీకివేసే పరిస్థితులు ఏర్పడటంపట్ల ఆందోళన వ్యక్తం చేసారు. కొన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులకు నెలల తరబడిగా వేతనాలు చెల్లించడం లేదని, దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రాష్ట్రప్రభుత్వ ఉగ్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పైసాకూడా పెంచకపోవడం శోచనీయమని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన మాదిరిగా వేతనాలను ప్రారంభ తేదీనుంచి అమలు చేయాలని కోరారు. తొలగించిన హౌసింగ్ వర్కు ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యమిత్రలను ఉద్యోగాలలో కొనసాగించాలని డిమాండ్ చేసారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన మాదిరిగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలోని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాలని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, హెచ్‌ఆర్‌ఎ, కరువుభత్యం తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో ఎపిఎన్‌జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణమూర్తి, వివిధ సంఘాల ప్రతినిధులు కాంతారావు, మాధవి, శంకర్‌రావు, విజయ్‌కుమార్, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

రాత మారని గిరిజనం
గంట్యాడ, ఫిబ్రవరి 14: నాగరిక ప్రపంచానికి దూరంగా తాటిపూడి జలాశయం అవతల కొండకోనల్లో నివసిస్తున్న గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ గ్రామంలో తిష్టవేసిన సమస్యలకు దశాబ్ధాల నుంచి మోక్షం కరవయింది. ఎందరో నేతలు మారుతున్నా గిరిజనుల రాతలో మాత్రం మార్పులు కానరావడంలేదు. జలాశయం ఆవల ఉన్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఐటిడిఎలో విలీనం కాలేదు. సబ్‌ప్లాన్ ఏరియాగా గిరిజన గ్రామాలకు గుర్తింపు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు ఎన్నికల వాగ్ధాన బంతిగానే మిగిలాయి. మండలం పరిధిలో తాటిపూడి జలాశయం ఆవల ఎగువ కొండపర్తి, జడ్డేర్, దిగువ కొండపర్తి,వ భీమవరం, అడ్డతీగ, మొసలిఖండి తదితర గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి డికె పర్తి కేంద్రంతో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఈ గిరిజన గ్రామాలు ఐటిడిఎలో విలీనం కానందున ఆ సంస్థనుంచి నిధులు అందక అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. గిరిజన ప్రజలు మైదాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు పక్కా రహదారి లేదు. చిన్నపాటి మట్టిరోడ్డు మీదుగా కాలినడకన మైళ్లదూరం నడిచి బౌడేర జంక్షన్‌కు చేరకుని అక్కడ వాహనల్లో మండల కేంద్రానికి, మైదానప్రాంత గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రోడ్డుమార్గంలో మధ్యలో పెద్ద ఏరు ఉంది. వర్షాకాలంలో ఆ ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనుల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీనిపై వంతెన నిర్మించాలని గిరిజనులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికి సమస్య షరిష్కారం కాలేదు. తాటిపూడి నుంచి గిరిజన గ్రామాలకు గిరిజన బోటు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే రోజుకు రెండుసార్లు తిప్పుతున్నారు. గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం లేనందున గిరిజనులకు అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందడం లేదు. విద్యుత్ సౌకర్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు తరుచూ మొరాయించడంతో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు గిరిజన గ్రామాల్లోని గిరిజనులు ఇప్పటికే పూరిపాకల్లో నివాసం ఉంటున్నారు. గతంలో కొందరు గిరిజనులకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు మూన్నాళ్లకే శిథిలం అయ్యయి. గిరిజనులకు ప్రభుత్వం పక్కాఇళ్లు మంజూరు చేసినా వాటిని నిర్మించడం తలకు మించిన భారం అయ్యింది. పక్కారోడ్డు సౌకర్యం లేని కారణంగా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇనుము, సిమెంటు తదితరాలను గిరిజన బోటులో అడ్డతీగకు తరలించేందుకే రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. అడ్డతీగ నుంచి లభ్ధిదారులు గ్రామాలకు గిరిజన కూలీలతో తరలించడానికి మరికొంత ఖర్చు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులో సామాగ్రి రవాణ ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి గిరిజనులు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని గిరిజన గ్రామాల్లో అదనంగా రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు నిర్మించి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ గ్రామాలకు సబ్‌ప్లాన్ గుర్తింపు తీసుకువచ్చి తిష్టవేసిన సమస్యలను పరిష్కరం ఏ నాయకుడు చూపుతారా అని గిరిజనులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు పూడిక తొలగించారు!

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 14: ఉడాకాలనీ, ఆర్టీసీ కాలనీల సరిహద్దులోని మురికి కాలువలోపేరుకుపోయిన చెత్తను ఎట్టకేలకు మున్సిపల్ శానిటరీ సిబ్బంది తొలగించారు. ఆంధ్రభూమిలో ఈమురికి కాలువ దుస్థితి గురించి వెలువరించిన కథనానికి స్పందించిన యంత్రాంగం ఆదివారం ఉదయం పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. శానిటరీ ఇనస్పెక్టర్ రామారావు దగ్గరుండి కాలువలోని చెత్తను జెసిబితో తొలగింపచేసారు. దాదాపు నాలుగు లారీల చెత్త ఈకాలువనుండి వెలికితీసారు. కాలువలో పేరుకు పోయిన మురికి కారణంగా సమీపంలో నివాపం ఉంట్ను వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , దుర్గంధంతో ముక్కులు మూసుకుంటున్నారని వచ్చిన వార్తా కథనం వారి కళ్లు తెరిపించింది. ఎట్టకేలకు కాలువ ను కింద వరకు శుభ్రం చేసారు. దీంతో ఆయా ఆకాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.