విజయనగరం

అంబరాన్నంటిన సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలు విజయనగరం పట్టణంలో సంబరంగా జరిగాయి. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయిన కొత్త సంవత్సర వేడుకలు శుక్రవారం జోరందుకున్నాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల ఇళ్లు, కార్యాలయాల వద్ద నూతన సంవత్సర వేడుకల కోలాహలం కనిపించింది. గురువారం అర్ధరాత్రి 12కావటంతోనే నూతన సంవత్సరం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న యువత రోడ్లపైకి అంబరాన్నంటేలా సంబరాలు ప్రారంభించారు. బాణాసంచా కాల్చటం, రంగులు చల్లుకోవటం ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం ఆనందంతో యువకులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ద్విచక్రవాహనాలపై చక్కర్లు కొడుతు శుభాకాంక్షలు చెప్పుకోవటం కనిపించింది. నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు పలికేలా మహిళలు అర్ధరాత్రి నుంచి రంగురంగుల ముగ్గులు వేయటంతో తలమునకలుగా కనిపించారు.
ఇక ఉదయం నుంచే కొత్త సంవత్సర హడావుడి కనిపించింది. పట్టణంలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు, జిల్లా అధికారుల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ధ నూతన సంవత్సర వేడుకలు హడావుడి కనిపించింది. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు స్వగృహం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, అధికారులు మంత్రి అశోక్‌గజపతిరాజును కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బొకేలు అందచేసారు. అదే విధంగా వివిధ పార్టీల నాయకులు కేంద్రమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలో ఉన్న మంత్రి మృణాళిని ప్రజాప్రతినిధులు, అధికారులు కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఎంఎం నాయక్‌ను వివిధ శాఖల జిల్లా అధికారులు కలుసుకుని బొకేలు, పండ్లు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌ను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోలగట్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్‌కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క సత్య లాడ్జిలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మద్దతుదారులు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మన్ తులసి, పార్టీ నాయకులు పిల్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తి, అవనాపు విజయ్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేసారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదిరాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసారు. జిల్లా బిజెపి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పార్టీ గుర్తు ఉన్న భారీ కేక్‌ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇకపోతే నూతన సంవత్సర సందర్భంగా పట్టణంలోని వివిధ దేవాలయాలు భక్తుల సందర్శనతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయాల వద్దకు చేరుకుని దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం బంధువులు, స్నేహితుల వద్దకు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటు స్వీట్లు, కేక్‌లు పంచుకున్నారు. ప్రత్యేక పూజలు, వాహన పూజలతో దేవాలయాల వద్ద సందడి కనిపించింది. కొత్త సంవత్సరం సందర్భంగా యువత సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఉదయం నుంచే మిత్రుల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకోవటం, స్వీట్లు పంచుకోవటం కనిపించింది. కొనుగోలుదారులతో బొకేలు, స్వీటు షాపులు కిటకిటలాడాయి.