సంపాదకీయం

‘ఉత్తర’ వివాదం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరఖండ్‌లో రాష్టప్రతి పాలనను ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేయడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో రాజ్యాంగ విస్ఫోటనం. హైకోర్టు తీర్పు తుది నిర్ణయం కాకపోవచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు సర్వోన్నత న్యాయస్థానంలో ఈ తీర్పును సవాలు చేసే అవకాశం ఉంది. అందువల్ల గురువారంనాడు హైకోర్టు నిర్దేశించిన విధంగా ఏప్రిల్ 29వ తేదీన ఉత్తరఖండ్ శాసనసభలో బలాబలాల పరీక్ష జరుగుతుందా? అన్నది వేచి చూడదగిన ఉత్కంఠగ్రస్త మహా విషయం. మార్చి నెల 28వ తేదీన ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకొనవలసి ఉండింది. 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్టప్రతి పాలన విధించడంతో ఆ బల పరీక్ష జరగలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి నిర్ణయాన్ని హైకోర్టులో సవాలుచేసింది, శాసనసభలో బలపరీక్ష జరగాలన్న విచిత్రమైన ఆదేశాన్ని హైకోర్టు న్యాయమూర్తి యు.సి. ధ్యాని జారీ చేసారు. న్యాయమూర్తి ధ్యాని ఆదేశాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం వారు నిలిపివేయడంతో ఆ విచిత్రమైన తీర్పు అమలు జరగలేదు. రాష్టప్రతి పాలన ఉన్న సమయంలో శాసనసభలో బలపరీక్ష జరగాలన్నదే న్యాయమూర్తి యు.సి. ధ్యాని తీర్పులోని వైచిత్రి...మంత్రివర్గం లేని సమయంలో శాసనసభలో బలపరీక్ష ఎలా జరుగుతుందన్న సందేహం ఏర్పడింది. ధ్యాని రాష్టప్రతి పాలన రద్దుచేసి బలపరీక్ష పరీక్షను ఆదేశించి ఉండవచ్చు. రాష్టప్రతి పాలనను మార్చి 29వ తేదీన ఆయన రద్దు చేయలేదు, కేవలం బలపరీక్షను ఆదేశించి విచిత్ర రాజ్యాంగ స్థితిని సృష్టించాడు. ధర్మాసనం వారు ఈ న్యాయమూర్తి తీర్పును తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆ వైచిత్రి అప్పుడు తొలగిపోయింది! ఇప్పుడు ధర్మాసనాన్ని అధిష్టించి విచారణ జరిపిన ప్రధాన ఉన్నత న్యాయమూర్తి కె.ఎన్.జోసెఫ్, ఉన్నత న్యాయమూర్తి వి.కె.విష్ఠ స్పష్టమైన తీర్పు నిచ్చారు. రాష్టప్రతి పాలనను రద్దు చేసారు...శాసనసభలో బలపరీక్షకు ఆదేశించారు. సర్వోన్నత న్యాయస్థానం మరో విధంగా ఆదేశించకపోయినట్టయితే ఏప్రిల్ 29న శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది, ఇదంతా ఉత్తరఖండ్ రాజకీయ సంక్షోభానికి పరిమితమైన పరిణామం మాత్రమే కాదు, విస్తృత భారత రాజ్యాంగ ప్రక్రియను ప్రభావితం చేస్తున్న ప్రజాస్వామ్య వ్యవహారం కూడ! రాష్టప్రతి నిర్ణయాలను సమీక్షించగల అధికారం కూడ ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలకు ఉందని హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఈ విస్తృతికి ప్రాతిపదికలు. న్యాయస్థానాల మితిమీరిన క్రియాశీలతకు అడ్డకట్టవేయాలని రాష్టప్రతి ప్రణవ్ కుమార్ ముఖర్జీ పదహారవ తేదీన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరవైవ తేదీన ఉత్తరఖండ్ ఉన్నత ప్రధాన న్యాయమూర్తి ఉల్లేఖించిన ఈ సమీక్షాధికారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన న్యాయమూర్తుల ఇష్టాగోష్ఠి సమావేశంలో న్యాయ వ్యవస్థ తన పరిధులను అతిక్రమిస్తోందని రాష్టప్రతి వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తుండడం పట్ల ప్రశంసలు కురిపించిన ముఖర్జీ, ఆయన సమక్షంలోనే న్యాయక్రియాశీలత-జ్యుడిషియల్ యాక్టివిజమ్-మితిమీరిపోతోందని విమర్శించారు. సుప్రీంకోర్టు రూపొందించిన ప్రజాప్రయోజన న్యాయవివాద-పబ్లిక్ లిటిగేషన్ ప్రక్రియవల్ల అనేక సామాజిక అన్యాయాలు దూరమయ్యాయని రాష్టప్రతి అన్నారు. అయితే ఈ ప్రక్రియను మంత్రివర్గాల, చట్టసభల అధికారాలను నీరుకార్చడానికి సుప్రీంకోర్టు ఉపయోగించుకోరాదని ఆయన సలహా ఇచ్చారు. న్యాయవ్యవస్థ-జ్యుడిషియరీ-, కార్యనిర్వహణ విభాగమైన మంత్రివర్గం-ఎగ్జిక్యూటివ్-, శాసననిర్మాణం చేసే చట్టసభలు-లెజిస్లేచర్-మూడు స్వతంత్ర రాజ్యాంగ విభాగాలని రాష్టప్రతి గుర్తుచేసారు. ఒకదాని పరిధిలోకి మరో విభాగం చొచ్చుకురావడం వల్ల రాజ్యాంగపరమైన అధికార విభజన-సెపరేషన్ ఆఫ్ పవర్స్-అన్న ప్రజాస్వామ్య సిద్ధాంతానికి విఘాతం కలుగుతోందని ఆయన అన్నారు. మితిమీరిన క్రియాశీలతను ప్రదర్శించడం ద్వారా మిగిలిన రెండు విభాగాల అధికార పరిధిలోకి సుప్రీంకోర్టు ఇతర న్యాయస్థానాలు చొరబడుతున్నాయని ఈ చొరబాటును నిరోధించాలని రాష్టప్రతి పిలుపునిచ్చారు!
రాష్టప్రతి ఇలా పిలుపు నివ్వడం విస్మయకరమైన విపరిణామం. గతంలో ప్రధానమంత్రులు ఇలాంటి వ్యాఖ్యలను చేసారు. లోక్‌సభ స్పీకర్లు కూడ ఇలా తమ అధికారాలకు సుప్రీంకోర్టు భంగం కలిగిస్తోందని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ విభాగానికి, లెజిస్లేచర్ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయవేత్తలు ఇలా న్యాయ వ్యవస్థపట్ల ఫిర్యాదు చేయడం సహజం. ఆరోపణలలో వాస్తవం ఉందా లేదా అన్నది వేరే అంశం...కానీ మూడు విభాగాలకు సర్వోన్నత అధిపతి అయిన రాష్టప్రతి ఇలా మిగిలిన రెండు విభాగాల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా న్యాయ వ్యవస్థను నియంత్రించాలని కోరడమే విచిత్రం. రాష్టప్రతి మూడు విభాగాల మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించదగినవాడు. ఆయన ఇలా పక్షాలకు ప్రాతినిధ్యం వహించడం తగునా? అన్నది ప్రశ్న! ఈ ప్రశ్నకు సమాధానం ఉత్తరఖండ్ ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం వారు బుధవారం చెప్పారు. రాష్టప్రతి 356వ రాజ్యాంగ అధికరణం ప్రకారం చేసే నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉందన్నది ఈ సమాధానం. రాష్టప్రతి పాలన విధింపు న్యాయ సమీక్షకు అతీతమైన వ్యవహారమన్న రాజ్యాంగ సంప్రదాయాన్ని ఉత్తరఖండ్ న్యాయస్థానం బుధవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. గురువారంనాడు రాష్టప్రతి నిర్ణయాన్ని రద్దుచేసింది! రాష్టప్రతి నిర్ణయం కూడ తీవ్రమైన తప్పిదం కావచ్చు. అందువల్ల దాన్ని సమీక్షించడం న్యాయస్థానాల విధి. అలాగే న్యాయమూర్తుల నిర్ణయాలు కూడ తప్పిదాలు కావచ్చు. వాటిని కూడ న్యాయసమీక్ష చేయవచ్చు-అని ఉత్తరఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రాష్టప్రతి పాలనను న్యాయస్థానాలలో సవాలు చేయడం ఇది మొదటిసారి కాదు. అయితే 1980వ దశకం వరకు ఉన్నత న్యాయస్థానాలు కాని, సర్వోన్నత న్యాయస్థానం కాని ఆ వివాదాలను విచారణకు సైతం స్వీకరించేవి కావు! రాష్టప్రతి నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతం అన్నది అప్పటి అభిప్రాయం..కానీ క్రమంగా పిటిషన్‌లను విచారణకు స్వీకరించడం ఆరంభమైంది. 1992 బాబరీ కట్టడం కూలిపోయిన తరువాత భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యవంలోని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అప్పటి కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. రాష్టప్రతి పాలన విధించింది! ఈ నాలుగు రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ శాసనసభలను పునరుద్ధరించలేదు. ఈ న్యాయక్రియా విలాస క్రమంలో ఉత్తరఖండ్ హైకోర్టు తీర్పు మరో ముందడుగు. అయితే ఉత్తరఖండ్ హైకోర్టు నిర్ణయం తప్పిదమా, సమంజసమా అన్నది తేలవలసింది సుప్రీంకోర్టులో మాత్రమే...